Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రహస్య విషయ విజ్ఞానం – ‘విలయ విన్యాసం’

[కోవెల సంతోష్‍ కుమార్ గారు వ్రాసిన ‘విలయ విన్యాసం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]

సృష్టి నిర్మాణం, నిర్మాణక్రమం అప్పటికీ, ఇప్పటికీ అంతుపట్టని నిగూఢ రహస్యమే. ఛాందసవాదమని వ్యతిరేకించినా, మూఢ విశ్వాసమని కొట్టిపారేసినా, పూర్వీకులు బలవంతంగా మన మనస్సులలో నాటిన విషబీజమని నానారకాలుగా హేళన చేసినా ఈనాటికీ మానవుని మేధస్సుకు అందని ఒక అంతర్గత, అతీంద్రియ శక్తి ఏదో ఉన్నదని పరిశోధకులు ఒప్పుకోక తప్పడం లేదు. దాన్ని కనుగొనడానికి, మూలాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అద్భుతమైన విషయాలు శాస్త్రవేత్తలకు సవాలుగానే నిలుస్తున్నాయి. ఇటువంటి కొన్ని విశేష విషయాలను వ్యాసాలుగా రచించి ‘విలయవిన్యాసం’ పేరుతో ప్రకటించారు కోవెల సంతోష్ కుమార్ గారు.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల గారి కుమారులైన సంతోష్ గారు అనువంశికంగా వచ్చిన సాహిత్యాభిలాష, జిజ్ఞాసలతో పాటు తనకు తానుగా పరిశీలనాత్మక, పరిశోధనాత్మకమైన ఆలోచనలతో అనేక విషయాలపైన దృష్టి సారించి సాహిత్యరంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ‘విలయ విన్యాసం’ లోని ఒక్కో వ్యాసం పాఠకులకు తెలియని ఎన్నో అద్భుతాలను పరిచయం చేస్తుంది. వాటిమీద అవగాహనతో పాటు ఆలోచింపజేస్తుంది. ఏదో ఒక మతాన్ని గొప్పదిగా చేయడమో, హేతువాదులకు భగవంతుని ఉనికిని స్పష్టం చేయడమో ఆయన ఉద్దేశ్యం అనుకుంటే పొరపాటు. కొన్నిసార్లు ఊహలు నిర్ధారించబడకుండానే వాస్తవాలుగా నిలిచిపోతాయి. తరతరాలకు అది ప్రసరిస్తూనే ఉంటుంది. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించుకొని దానిమీద సమగ్ర పరిశోధన జరిగితే తప్ప నిజానిజాలు నిగ్గు తేలవు. కొన్ని సందర్భాల్లో ఈ అవగాహనారాహిత్యం లోతైన అంశాన్ని, విశేషాన్ని మరుగున దాచి దురభిప్రాయాన్ని చిత్రిస్తుంది.

ఇటువంటి కొన్ని అసాధారణ అంశాలను తీసుకొని కోవెల సంతోష్ గారు వాటి పూర్వాపరాలను తెలిపే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఎవ్వరైనా ఆయన కృషిని ప్రశంసించకుండా ఉండలేరు. దీని కోసం ఆయన ఎంత తపన పడ్డారో, ఎన్ని పుస్తకాలను చదివారో అర్థం చేసుకోవచ్చు. మనిషికి సాధ్యం కానిదేదీ లేదన్న విషయాన్ని ఋజువు చేస్తూ, మానవమేధస్సు ఎల్లలు లేకుండా వటవృక్షంలా పాకుతున్న ఈనాటి కాలంలో కూడా ఇందులో ఆయన ఉటంకించిన విషయాలు ప్రపంచ విజ్ఞానానికే పెను సవాళ్ళుగా మారడంలోని అంతరార్థాన్ని పాఠకుల విజ్ఞతకే ఆయన వదిలేశారు.

‘విలయవిన్యాసం’ అనడంలోనే సృష్టి అమరిక, వినాశనం రెండూ చూపించాలన్న ఆయన ఉద్దేశ్యం పాఠకునికి తేటతెల్లమవుతుంది. ఊహాతీతమైనదిగా, అద్భుతమైనదన్న ఒక ఆలోచన అక్కడే మనలో అంకురిస్తుంది. పుస్తకం ప్రారంభంలో శ్రీ రామా చంద్రమౌళి గారు ముందుమాట రాస్తూ ఈ పుస్తకం సంతోష్ గారి ఆత్మానుగత అంతర్యానంగా తెలుపుతూ “రహస్యాలు చెప్పబడవు. తెలుసుకోబడతాయి” అన్న వాక్యం ఇందులోని వ్యాసాలన్నిటికీ ఏకసూత్రంగా  భావించవచ్చు.

ప్రపంచంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన పది దేశాల్లో భారతదేశం ఒకటి. మొదటి నుండీ దేవుడున్నాడని విశ్వసిస్తున్న దేశం. దీన్ని హేతువాదులు ఖండించినా పాశ్చాత్య దేశీయులు గ్రహాంతర వాసులున్నారని నమ్ముతూ పరిశోధనలు చేయడం మన విశ్వాసాలను మరో విధంగా అంగీకరించడమే. దానికి సంబంధించిన అనేక ఋజువులు ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. పంచమవేదంగా చెప్పబడిన మహాభారతంలో ఎగిరే విమానాల ప్రసక్తి ఉంది. రామాయణంలో రావణుడు విమాన మరమ్మత్తు కేంద్రం, విమానాశ్రయాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికీ లంకలో దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండడం అవి నిజమేనని ఋజువు చేస్తున్నాయి. వీటి తయారీ గురించి వైమానిక శాస్త్ర గ్రంథమే రాయబడింది. చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయ నిర్మాణం ఎప్పటికీ అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది.

అనంతమైన మంచితనానికి, అసాధారణమైన వినాశనానికి కారకుడు శివుడు. త్రినేత్రం, త్రిశూలం, కైలాస నివాసం, లింగరూప పూజలు, ప్రళయకాల విన్యాసం, అర్ధనారీశ్వర తత్త్వం అన్నీ శివునిలోని ప్రత్యేకతలు. ఆయన స్వరూప స్వభావాల వెనుక గొప్ప తత్త్వం ఉంది. విశ్వంలోని ఎలిమెంట్స్ అన్నీ ఆయనలో కనిపిస్తాయి కాబట్టి మహాదేవుడయ్యాడు. శివుని డమరుకనాదంతో సృష్టి నిర్మాణం జరుగుతుందని భారతీయ ధర్మం చెబుతుంది. భగవంతుని నుండి సమాచారాన్ని మానవులకు అందించడానికి దేవదూతలు భూమ్మీదకు వచ్చి మానవునికి అసాధారణమైన విజ్ఞానాన్ని అందించారు. ఇది నిజమా? అంటే నిజమేనని ఆధారాలు చెబుతున్నాయి.

ఎల్లోరా గుహల్లోని కైలాస ఆలయాన్ని పురాతత్త్వ శాస్త్రజ్ఞుల ప్రకారం 18 సంవత్సరాలు నిర్మించారు. కానీ ఆ ఆలయనిర్మాణానికి నాలుగు లక్షల టన్నుల రాతిని పగులగొట్టి తొలగించాల్సి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంత రాతిని కేవలం 18 సంవత్సరాలలో  పూర్తిచేయడం మానవమాత్రునికి అసాధ్యం. పగులగొట్టిన శకలాలు కూడా ఎక్కడా లేవు. వేదాలలో ఇటువంటి వాటిని ఛేదించే ‘భౌమాస్త్రం’ గురించి చెప్పబడింది. మహాభారతకాలంలో కూడా దీని వినియోగం జరిగింది. ఇది రాతిని డ్రిల్ చేస్తున్నప్పుడే ధూళిగా మార్చి గాలిలో కలిపేస్తుంది. అంతేకాక రాతిని గమనిస్తే పైనుండి డ్రిల్ చేయడం జరిగింది. వేల సంవత్సరాల క్రితమే కైలాస ఆలయ నిర్మాణం జరిగిందని ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు నిర్ధారించారు. దీని కింద ఉన్న రహస్య సొరంగాన్ని మూసివేశారు. ‘ఘోస్ట్ ల్యాండ్’ అన్న పుస్తకంలో ఈ సొరంగంలో వ్యక్తులు నివసించినట్లు పేర్కొన్నారు. వేల సంవత్సరాల క్రితమే గ్రహాంతరవాసులున్నారా? ఇతర మతాల్లో కూడా ప్రళయం వచ్చినప్పుడు నోవా వచ్చి మంచి మనుషులను రక్షిస్తాడనే నమ్మకం ఉంది. ఇటువంటి ఆలయాలు, సొరంగాలు ప్రపంచ దేశాల్లో చాలాచోట్ల కనిపిస్తాయి.

శివలింగ రూపం సృష్టి కార్యానికి చిహ్నంగా చెప్పడం దురదృష్టకరం. ఆధ్యాత్మికవేత్తలు, పండితులు కూడా అదే అభిప్రాయాన్ని అనుసరించడం శోచనీయమంటారు కోవెల సంతోష్ గారు. సందర్భానుసారంగా వివేకానందుని విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. గుస్తన్ ఒప్పర్ట్, రాబర్ట్ క్లాడ్ వెల్ వీళ్లిద్దరూ చేసిన  వక్రభాష్యాలను వివేకానందుడు తోసిపుచ్చాడు. తర్వాతికాలంలో గుస్తన్ తాను తప్పు చేశానని అంగీకరించినా ఈ విషయం వెలుగులోకి రానీయకుండా అంతకుముందు విషయాలనే అనుసరించారు చరిత్రకారులు. ఒక సదస్సులో లింగ రూపాన్ని గురించి గుస్తన్ చేసిన అసహజమైన వ్యాఖ్యానాన్ని వివేకానందుడు తీవ్రంగా స్పందించి అథర్వ వేదంలో చెప్పిన యూపస్తంభాన్ని ఉటంకిస్తూ ఆద్యంతాలు లేని, అత్యంత శక్తివంతమైన రూపంగా శివలింగాన్ని గురించి వివరించారు. మనం మహామేధావిగా భావిస్తున్న మాక్స్ ముల్లర్ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని కూడా తప్పని వివేకానందుడు సహేతుకంగా నిరూపించడాన్ని సంతోష్ గారు వివరించారు. శివలింగం అణుశక్తికి ప్రతీకగా చెబుతూ న్యూక్లియర్ రియాక్టర్‌కూ, శివలింగానికి ఉన్న సామ్యాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. భారతీయ ధర్మంలో ఉన్న త్రిమూర్తి తత్త్వాన్ని తెలుపుతూ పాలసముద్రంపై శేష శయనుడుగా విష్ణువు, ఆయన నాభికమలం లోంచి బ్రహ్మ ఉండగా, శివుడు విడిగా ధ్యానముద్రలో ఉండడాన్ని పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లకు ప్రతీకగా భావించవచ్చేమో పరిశోధకులు చెప్పాలి అంటారు.

పశ్చిమ టిబెట్‌లో దాదాపు 22 వేల అడుగుల నిలువెత్తు పర్వతం కైలాస పర్వతం, శివునికి ఆవాసం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు ఆధ్యాత్మిక కేంద్రం. ఈ శిఖరం ఒకవైపు శంఖాకారంలో మరోవైపు పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. ఎర్నెస్ట్ ముల్దషేవ్ అనే రష్యాకు చెందిన కంటి సర్జన్ ప్రపంచంలోని 21 పర్వతాలను అధిరోహించాడు. కైలాస పర్వత శిఖరం సహజంగా ఏర్పడింది కాదని అభిప్రాయపడ్డారు. పైన ఏముందో ఎవరికీ తెలియని రహస్యం. ఇక్కడ న్యూక్లియర్ రేడియేషన్‌కు శక్తినిచ్చే ఎనర్జీ ఉందని ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు చెప్తారు. రేడియేషన్ అంటే పాయిజన్. శివుని పరంగా హాలహలం. దీన్నిబట్టి శివుని ఆవాసం నిజమేనని, భూమిమీద అత్యంత ప్రాచీన నాగరికతకు, అణ్వస్త్ర శక్తికి ఇంతకంటే ఋజువు అవసరం లేదంటారు సంతోష్ గారు. దీనినే పాశ్చాత్యులు మానవులకు శక్తిని గ్రహాంతరవాసులు ఇచ్చారని చెబుతున్నారు. కైలాసయాత్రకు వెళ్లిన చాలామందికి యుఎఫ్‌ఓ లను చూసిన అనుభవం కూడా ఉండడం ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

శివుడు లయకారుడుగా మనం నమ్ముతున్నాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 సంస్కృతులు ఇంతకు మునుపు ప్రళయం వచ్చిందని, వస్తుందని నమ్ముతున్నాయి. ప్రముఖ గ్రీకు తత్త్వవేత్త ప్లేటో తన రచనల్లో ఈ ప్రళయాన్ని గ్రీకు దేవుడు జ్యూస్ సృష్టించినట్లు చెప్తాడు. వాస్తవానికి ప్రళయం సంభవించిందా? అంటే దానికి ఎన్నో ఆధారాలున్నాయి.

హోలోసిక్ ఇంపాక్ట్ (అత్యంత నూతన యుగం)పై ఐదుగురు శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో పరిశోధన చేసి వేల సంవత్సరాల క్రితమే భూమిపై ఆస్టరాయిడ్స్ దాడి జరిగినట్లు కనుగొన్నారు. అనేక చోట్ల లభ్యమైన శిలాజాలు, అవక్షేపాలను బట్టి మహాదేవుని కాస్మిక్ వార్ వల్ల ప్రళయం సంభవించిందని వీరు చెప్పారు. బెల్జియంలో భూమిపై కనిపించిన నల్లని పొర 13వేల సంవత్సరాల క్రితం నాటిది. 2014లో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తలు అమెరికాలో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆస్టరాయిడ్స్ గురించి చర్చించి, ఇది ఏకే 47 బుల్లెట్ కంటే 9 రెట్లు ఎక్కువుంటుందని చెప్పారు. ఇట్లాంటి అనేక ఆధారాల వల్ల మహాప్రళయం సంభవించిన తరువాత సుమారు పదివేల సంవత్సరాల క్రితం మళ్ళీ మానవ నాగరిక సమాజాలు అభివృద్ధి చెందేవరకు భూమిపై ఏదీ లేదని తెలుస్తుంది. అందుకే శివుడు మిథ్య కాదు. అనంతసత్యం. ఇప్పటికీ భూకంపాలు, సునామీలు మొదలైన ప్రళయాలను మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం.

దేవదూతలు మానవులకు శక్తి యుక్తులను, విజ్ఞానాన్ని, ఆయుధాలను ఇచ్చి వెళ్లారని ప్రపంచంలోని అన్ని మతాలు, జాతులు, ప్రాంతాలు నమ్ముతున్న వాస్తవం. వారు భూమ్మీదకు వచ్చి మనుష్యులతో సంబంధాలు పెంచుకున్నారు. అన్ని మతగ్రంథాలలో దేవదూతలకు రెక్కలు ఉంటాయన్న విషయం నిర్ధారణగా చెప్పబడింది. ఖగోళ మండలం నుండి వీళ్ళు వచ్చేవాళ్ళని ఏన్షియెంట్ ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలే చెబుతున్నారు. ప్రపంచంలో అగ్రగామిగా పేరొందిన అమెరికాలోనూ 70 శాతం ప్రజలు దేవదూతలను నమ్మడం గమనార్హం. మన పురాణాలు, ఇతిహాసాలు, భారతీయ సనాతన ధర్మం దీనినే వక్కాణిస్తున్నది. గ్రీకు, లాటిన్, బాబిలోనియన్ సంస్కృతిలో కూడా ఈ ప్రస్తావన ఉంది. వీరికి రెక్కలు ఉండడంపై లండన్ యూనివర్సిటీలో రీసెర్చ్ కూడా జరిగింది. మానవ అభివృద్ధిలో దేవదూతలు కీలకపాత్ర పోషించారని ప్రపంచంలో 80 శాతం మంది నమ్ముతున్నారు.

1947 జూలై 2వ తేదీన అమెరికా రాడార్‌కు ఎగిరే పళ్ళాలు చిక్కడం, గ్రహాంతర వాసుల శవాలు లభించడం జరిగింది. 61 ఏళ్ళ క్రిందట మూడు యుఎఫ్‌ఓలు అమెరికా రాడార్‌కు చిక్కి కుప్పకూలడాన్ని ఎఫ్.బి.ఐ.కి చెందిన అధికారి కళ్ళారా చూసి పత్రికా ప్రకటన చేసి కూడా 24 గంటల్లో మాట మార్చడం ఆలోచించదగింది. ఏలియన్స్ ఉనికిని కనుగొనడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను అమెరికా ఏర్పాటు చేసింది. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కాలు మోపినప్పుడు చంద్రునిపై పెద్ద బేబీలు కనిపించి వెనక్కి పొమ్మని హెచ్చరించిన సంభాషణలను రష్యా ఖండించడం, అమెరికా మౌనం వహించి డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయని చెప్పడం అర్థం కాని విషయం. మౌంట్ ఒలింపస్ పర్వతం 12 మంది గ్రీకు దేవుళ్ళకు ఆవాసంగా చెప్తారు. కాలక్రమంలో గ్రీకు దేవతలు రష్యా దేవతలుగా పరిణామం చెందారు. అంటే విశ్వంలో మిగతా ప్రాంతాలలోని దేవుళ్ళ ఉనికిని గురించిన వాస్తవాలు తెలియాలంటారు సంతోష్ గారు.

అంతేకాదు. మనుషులు ప్రవేశించని ప్రాంతాలకు ఏలియన్స్ వచ్చి వెళ్తున్నారని, హ్యూమన్ డిఎన్.ఏ.పై ప్రయోగాలు చేస్తున్నారని ఏలియన్ సైంటిస్టుల అనుమానం.

మన దేశంలో ఆలయాలు, ఈజిప్టులో పిరమిడ్లు వంటి అద్భుత సృష్టి అంతా భారీ రాళ్ళతోనే జరిగింది. వీటి నిర్మాణం ఎట్లా జరిగిందన్నది అంతుపట్టదు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలానికే ఆశ్చర్యం కలిగించే వాటి నిర్మాణాలను ఎట్లా చేసేవారు? వీటికి కూడా  ఆధారాలు లభ్యమైనాయి. రాతి రంపాలతోనే రాతిని కోసి వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా, పడిపోకుండా అత్యంత భారీ నిర్మాణాలు ఎట్లా చేయగలిగారు? గిజా, మాచుపిచు, బామియాన్, ఇండియన్ టెంపుల్స్ అన్నీ ఈ విధంగా నిర్మింపబడినవే. తంజావూరులోని బృహదీశ్వరాలయానికి 81 టన్నుల గోపుర కలశాన్ని ఎట్లా అమర్చగలిగారు? దీనికోసం ఆరున్నర కిలోమీటర్ల దూరం నుండి గోపుర శిఖరం వరకు వాలుతలం ఏర్పాటు చేశారంటే నమ్మగలమా? ఈనాటి ఇంజనీర్లకు ఊహకు కూడా అందని నిర్మాణం. ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించే ఇలాంటి నిర్మాణాలు లెక్కకు మించి ఉంటాయి. టియోటి హుకాన్ నిర్మాణంలో మైకాను అధికంగా వాడడం ఒక ఆశ్చర్యం. అది కూడా వేల కిలోమీటర్ల దూరంలో బ్రెజిల్‌లో దొరికే మైకాను వాడడం. దీనికి కారణాలను అన్వేషిస్తే వీటి కింద ఉన్న సొరంగం పవర్ ప్లాంట్ గా పనిచేసేదని, మైక్రో వేవ్‌ను సృష్టించేదని తెలిసింది. మైకాను వాడడం వల్ల అంతరిక్షం నుండి వచ్చే రేడియేషన్‌ను నియంత్రించవచ్చు. ఇటలీకి సమీపంలో ఉన్న దీవిలో రాళ్ళను తరలించడానికి కార్ట్ ట్రాక్స్ను వాడినట్లు తెలుస్తున్నది.

క్రీ.పూ.300లో ఈజిప్టులో గ్రీకులకు దేవుడైన సెరాపిస్ కోసం నిర్మించిన గుడిలో ఎటు చూసినా మాయాద్వీపంలా కనిపిస్తుంది. ఇది వారికి ఎట్లా సాధ్యమైంది? మెషిన్స్‌ను డిజైన్ చేయడంలో ఈ ఆలయాన్ని మించింది లేదు. అట్లాగే సముద్రగర్భంలో దాగి ఉన్న పురాతన కట్టడాలు, మానవుల ఉనికి విస్మయాన్ని గొలుపుతాయి. ప్రపంచంలోనే అత్యంత రహస్యవంతమైనదిగా చెప్పబడుతున్న బెర్ముడా ట్రయాంగిల్‌కు, సముద్రదేవుడు పొసైడాన్ నిర్మించిందిగా చెప్పబడుతున్న అట్లాంటిస్ నగరానికి ఏదో సంబంధం ఉందని ఏన్షియెంట్ ఆస్ట్రోనాట్స్ చెప్తున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతానికి వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగిరారు. భూమి మీద ఎక్కడా కనిపించని శక్తివంతమైన వ్యవస్థ ఇక్కడ పని చేస్తోంది. అక్కడికి వెళ్లిన వారిని ఏదో ఒక శక్తి అమాంతం లాగేస్తుంది. దీనిపైన అమెరికా ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసినా లాభం లేకపోయింది. మానవేతరులకు మాత్రమే ఇది స్థావరం.

ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అత్యంత గొప్ప నాగరికత విలసిల్లిన నగరంగా చెప్పబడిన అట్లాంటిస్ నగరాన్ని ఒకవైపు సునామీలు, మరో వైపు అగ్నికీలలు ఏకకాలంలో చుట్టుముట్టి నామరూపాలు లేకుండా చేశాయి.

పెరు లోని నాజ్కా ఎడారిలో 1930 ప్రాంతంలో విచిత్రమైన రాతలను గుర్తించారు. మానవులు గీసినవి అయితే జియోగ్లిఫ్ లంటారు. ఇవి నాలుగైదు మీటర్లకు మించి ఉండవు. కానీ ఈ ఎడారిలో కనిపిస్తున్న రాతలు కిలోమీటర్ల కొద్దీ ఉన్నాయి. వీటిని డీకోడ్ చేయడం చాలా కష్టం. ఏకంగా కొన్ని చోట్ల ఎనభై కిలోమీటర్ల వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా ఉన్నాయి. ఈ లైన్స్ అన్నీ జ్యోతిష్య, ఖగోళ శాస్త్రాలతో ముడిపడి ఉండడం ఆశ్చర్యం. ఈ గీతలకు దేవుడితో, మతంతో ఉన్న సంబంధం కాదనలేని సత్యం. ఈ గీతలను ఏన్షియెంట్ ఆస్ట్రోనాట్స్ రోదసీ జీవుల ఎయిర్ ఫీల్డ్స్ అని భావిస్తున్నారు. అదే నిజమైతే దేవతల ఉనికి కూడా వాస్తవమే అని నమ్మాల్సిందే అంటారు సంతోష్ కుమార్ గారు. ఈ ప్రాంతంలో ఏ కాలంలో చూసినా వాతావరణం 365 రోజులు 25 డిగ్రీలు మాత్రమే ఉండడం భూమి మీద ఎక్కడా లేని విచిత్రం.

హిమాలయ పర్వత సానువుల్లో నివసించే సిద్ధుల గురించి ఈ వ్యాస సంపుటిలో సంతోష్ గారు వివరించారు. మన విశ్వాసాల ప్రకారం అది దేవభూమి. దివ్యశక్తులు కలిగిన సిద్ధులు నివసించే ప్రదేశం. సాధారణ మానవునికి అంతుపట్టని జీవన రహస్యం. వీరిలో చాలామంది వయసు 150 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఒకరిద్దరు 250 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఉన్నారు. అటువంటి వాతావరణంలో ఇన్ని సంవత్సరాలు వారు జీవించి ఉండడానికి కారణం నిరంతర ఈశ్వరోపాసన, కఠోరమైన జీవన విధానం, మెడిటేషన్, నిశ్చల మనస్సుతో సమాధి స్థితిలోకి వెళ్లిపోవడం. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన దేవ్ రహ్ బాబా ఇన్ని సంవత్సరాలు జీవించడం విదేశీయులను కూడా అబ్బురపరచింది. ఇందిరాగాంధీ గారు స్వయంగా వెళ్లి ఆయనను దర్శించుకున్నారు.

టెంపుల్ మౌంట్ జెరూసలేం వేల సంవత్సరాల ప్రాచీన ప్రహరితో సుమారు 35 ఎకరాల్లో ఉన్న అద్భుతమైన మందిరం. ఇది ఇస్లామ్, క్రిస్టియానిటీ, జుడాయిజం మూడు మతాలకు ప్రధానమైంది. కింగ్ సాలమన్ దేవుడి కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆలయం. దీని నిర్మాణ శైలిని కనుక్కోవడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. మూడువేల సంవత్సరాల తరువాత కూడా దీని నిర్మాణ నైపుణ్యాన్ని అడ్వాన్స్ డ్ అంటున్నామంటే దీని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.

పునర్జన్మలు ఉండడం, వసుధైక కుటుంబకం అన్నట్టు ఒక దేశానికి ఎక్కడో మరొక దేశంలో ఉండేవాళ్ళ డిఎన్‌ఏ మ్యాచ్ అవడం వంటి విషయాలు కూడా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి. అయిదువేల సంవత్సరాల క్రితం కృష్ణుడు పుట్టిన మధుర ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ప్రాంతంగా, ఇక్కడ మొత్తం అరవై కోట్ల పవిత్ర క్షేత్రాలు ఉండడం గురించిన విషయాన్ని కూడా సంతోష్ గారు వివరించారు. స్వర్గ నరకాల ప్రస్తావన, పాతాళ లోకపు విశేషాలు, సైతానుగా చెప్పబడే దుష్టశక్తి గురించి కూడా ఆయన సహేతుకంగా వివరించారు.

భారతదేశం వేదాలను అనుసరిస్తూ, పురాణాలను నమ్ముతూ, కర్మసిద్ధాంతానికి కట్టుబడి అభివృద్ధి రహితంగా జీవనం కొనసాగిస్తుందని అనుకునేవాళ్ళకు ఈ పుస్తకం కనువిప్పు కలిగిస్తుంది. కేవలం మన దేశమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు ఎన్నో పరిశోధనలు చేసి కూడా అద్భుతమై, అత్యంత రహస్యమైన పైన పేర్కొన్న విషయాలను కనుగొనలేక మానవేతరులకు మాత్రమే ఇటువంటివి సాధ్యమని నిర్ధారిస్తున్నారు. వాళ్ళు దీనిని గ్రహాంతర వాసుల శక్తిగా పరిగణిస్తే మనం దైవీశక్తిగా భావిస్తున్నాం. అంతే తేడా.

సంతోష్ గారు ఇదివరకే ‘దేవరహస్యం’, ‘మహావిద్య’ అనే పుస్తకాలు రచించారు. ‘విలయ విన్యాసం’ తర్వాత ‘రామం భజే శ్యామలం’ అన్న పుస్తకం కూడా వెలువరించారు. ఆసక్తికరమైన అనేక అంశాలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రాచీన జ్ఞాన సంపదను శాస్త్రీయ విజ్ఞానంతో అనుసంధానం చేసి విశ్లేషిస్తున్న ఆయన కృషి ప్రశంసార్హం. ఇటువంటి వినూత్న అంశాలతో మరికొన్ని రచనలు చేయబోతున్నట్లు చెప్పిన ఆయనకు ఎల్లవేళలా ఆ సరస్వతీ మాత పరిపూర్ణ మైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

***

విలయ విన్యాసం
రచన: కోవెల సంతోష్‌కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 160,
ధర: ₹ 100/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520004.
ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

Exit mobile version