Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వికసించిన అభిమానం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అవేరా గారి ‘వికసించిన అభిమానం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

గర శివార్లలోని ఒక మురికివాడలో ఒక చిన్న ఇరుకైన గదిని అద్దెకు తీసుకున్నాడు పోలయ్య. వాడి చాలీ చాలని కూలీ కథ, వేసుకున్న చాలీ చాలని చొక్కా, లాగూలు చెబుతాయి. అలసిపోయిన వలస జీవితాలకు, పక్కా ఉదాహరణ మన పోలయ్య.

కొద్దిపాటి కూలీ డబ్బులు పొదుపు చేయడం కోసం, తక్కువ కిరాయిలో గది వెతగ్గా, మురికి కాలువ పక్కనున్న ఆ గది దొరికింది. దానికోసం, మరో ఇద్దరు పోటీ పడ్డారు కానీ, అడ్డా మీద మేస్త్రి మాటసాయంతో, ఆ గదిని దక్కించుకున్నాడు పోలయ్య.

ఆ గది అద్దె, దాని ఎత్తులాగానే తక్కువగా ఉంది. ఇనుపకమ్మీల మీద రేకులు కప్పి ఉన్నాయి. అక్కడక్కడా చిన్న చిన్న చిల్లులు, ఆకాశంలో పొడిచిన పగటిచుక్కల్లా కనిపిస్తున్నాయి. ఆలస్యం చేస్తే ఇంటి ఓనరు మనసు మారిపోతుందేమోనని, వెంటనే కాకీరంగు లాగూలోంచి వెయ్యి రూపాయలు అడ్వాన్స్ తీసిచ్చాడు పోలయ్య.

అమ్మానాన్నలిద్దరినీ ఒకటే నెలలో కరోనా మహమ్మారి పట్టుకెళ్లిపోయింది. నెత్తిమీద దరిద్రాన్ని కిరీటంగా పెట్టుకొని వెళ్తే, ఏ ఆసుపత్రి కూడా లోపలికి రానివ్వలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అదే దారి. చివరికి చేసేదేమీ లేక, ఒక ఆర్.ఏం.పీ కాళ్ళు పట్టుకొని, ఇంటి లోనే వైద్యం ఇప్పించాడు. బిడ్డ కష్టాన్ని చూడలేక పోయారెమో, మూడు రోజులు మంచం మీదే ఉండి వెళ్లిపోయారు, పోలయ్య అమ్మానాన్నలు. వాళ్ళు చనిపోయాక, అమ్మానాన్నాలేని ఇల్లు, దేవుడూ, దేవతా లేని దేవాలయంలా అనిపించింది. ఆ వూళ్ళో రియల్ ఎస్టేటు పుణ్యమా అని, వ్యవసాయం కుంటుపడిపోవడంతో, పొలం పనులు కరువయ్యాయి. వారం రోజులుగా అక్కడ పనులు దొరకకపోవడంతో, వలస బయట పట్టాడు పోలయ్య. మొదట్లో కన్నతల్లి లాంటి ఉన్న ఊరిని వదిలి రావాలంటే, పేగు తెగిన శిశువులా విలవిలాలాడింది పోలయ్య మనసు. కానీ బతకాలంటే వలస తప్పని పరిస్థితికి, తలవంచక తప్పలేదు.

భాగ్యనగరంలో, బతుకు బాగుంటుందని, గంపెడాశలతో, మహబూబ్ నగర్ జిల్లాలోని, ఆ చిన్న పల్లెటూరు నుంచి వలస వచ్చి, బతుకు పోరాటం చేస్తున్నాడు.

***

మలక్ పేట పెద్దమార్కెట్..

“అరేయ్ పోలీగా! మాల్ వచ్చిందంట, సేట్ జల్దీ రమ్మన్నడు” అని చెప్పేసి వేగంగా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు యాదగిరి.

‘ఆలస్యం అయితే, సేట్ తిట్టే బూతులు వినలేను’ అని మనసులో అనుకొని పరుగెత్తుకుంటూ, గోడౌన్ దగ్గరికి వెళ్ళాడు పోలయ్య.

మిర్చి లోడ్‌తో, గోడౌన్ ముందు ఆగివుంది ఒక ట్రక్కు. గోడౌన్ బయట కుర్చీ వేసుకొని, మిర్చీ ఘాటు తగలకుండా మూతికి మాస్క్ పెట్టుకొని, పుస్తకంలో లెక్కలు రాసుకుంటూ కనిపించాడు సేట్ చమన్ లాల్.

ముక్కు మూసేలా, ముఖానికి కండువా చుట్టుకొని, గట్టిగా ముడివేసి మిర్చీ బస్తాలను గోడౌన్ లోకి మోస్తూ, పొడి పొడిగా దగ్గుతూ, మిర్చీ ఘాటుకు, ఊపిరి ఇబ్బంది పెడుతున్నా, మిర్చీ బస్తాలు మోస్తూనే ఉన్నాడు పోలయ్య. పోలయ్యతో పాటు, మరో ముగ్గురూ కూలీలు కూడా అదే పనిలో ఉన్నారు. తలా ఇరవై బస్తాలు మోసారు, ఇంకా కొన్ని బస్తాలు మిగిలాయి. “అయ్యి నేను మోత్తా అన్నా!” అని మిగిలిన కూలీలను బతిమిలాడాడు పోలయ్య. “సరే” అని వాళ్ళు వెళ్లిపోయారు. నెమ్మదిగా కష్టపడి మిగిలిన బస్తాలు కూడా గోడౌన్లో వేసి సేటు దగ్గరికి వచ్చాడు.

“ఏంది పోలిగా? గియ్యాల మస్తు జోరుగున్నావ్, ముప్పై బస్తాలు మోసినవ్! మొస గూడ వస్తలేదు, ఏంటి సంగతీ? ఇంకెన్నొద్దులు ఈడ అరుగులు మీద పంతావ్? కిరాయకు గది దొరికిందా?” అన్నాడు బ్రీఫ్ కేసులోంచి, డబ్బు తీసి లెక్కపెడుతూ.

“దొరికిందయ్యా! అడ్వాన్స్ కూడా ఇయ్యాలే ఇచ్చేసిన” అన్నాడు, సేట్ అందించిన ఆరు వంద నోట్లు అందుకుంటూ.

“బాహుత్ అచ్ఛా! జల్దీబోయి, పెళ్ళం పిల్లలని తోలుకొచ్చుకో!” అని, యాదగిరికి గోడౌన్ తాళం వేసి రమ్మని చెప్పి, వెళ్ళిపోయాడు చమన్ లాల్.

మరుసటి రోజు సెలవు కావటంతో, ఊరుకెళ్ళి, భార్య సీతని, ఆరేళ్ళ కొడుకు పవన్‌ని అదే రోజు సాయంత్రం, పట్నం తోలుకొచ్చుకున్నాడు పోలయ్య. గూన ఇల్లే ఐనా విశాలమైన ఇంటి నుంచి, అగ్గిపెట్టె లాంటి ఆ గదిలోకి వచ్చాక, కాసేపు ఊపిరి ఆడలేదు సీతకి.

“కొన్ని రోజులు ఈడనే ఉండాల, జర ఓపిక పట్టు సీతా, అపార్ట్మెంట్ వాచ్‌మన్ పని కోసం చూస్తున్నా, గదిగానీ దొరికితే, మనకి ఆడనే ఇల్లు ఇస్తరు” అని పెళ్ళానికి సర్దిచెప్పాడు పోలయ్య.

తరువాతి రోజు యథావిధిగా, మార్కెట్‌కి వెళ్ళాడు పోలయ్య. మిర్చీ గోడౌన్ దగ్గర, ఏదో గొడవ జరుగుతుంది. పది మంది పైనే అక్కడ గుమి కూడారు, పోలయ్య అక్కడికి వెళ్ళగానే, అందరూ తననే చూస్తూ ఉండడంతో, ఇబ్బందిగా అనిపించింది పోలయ్యకు. “అదిగో వచ్చిండు దొంగవెధవ” అని పొలిగాడి కాలర్ పట్టుకుని లాక్కొచ్చి, సేటు ముందు మోకాళ్ళ మీద కూర్చుండ బెట్టాడు యాదగిరి.

“మిర్చీ బస్తా ఒకటి తక్కువ వచ్చింది. ఏం జేసినవ్ బాడకావ్!” లాగి లెంపకాయ వేశాడు సేట్.

“ఏం మిర్చీ బస్తా అయ్యా! నిన్న అన్ని బస్తాలూ, మీ ముందే ఖాళీ చేసి గోడౌన్లో ఏసిన గందా! యాదగిరికి, తాళం ఏసుకొని రమ్మన్నరు తమరు. తమరు ఎల్లగానే, నేను గూడ్క ఎల్లి పోయిన్నయ్యా! పానం బోయినా దొంగతనం చెయ్యనయ్యా, దణ్ణం పెడతా నన్ను నమ్ముండ్రి” చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు పోలయ్య.

“లేదయ్యా, వీడు అబద్దం సెప్తున్నడు, మీరు బోయినంక, నాకు అర్జంటుగా ఒకటికి వస్తే, జర జూడమని చెప్పి, టాయిలెట్ బోయి వచ్చిన, సందు జూసీ ఒక సంచి బయట ఏసేసి ఉంటడు కొడుకు” అన్నాడు యాదగిరి.

“అవునా బే?” కోపంగా అడిగాడు సేట్.

“అవునయ్యా, ఆడు నాకు సెప్పి పోయింది నిజమే, కానీ నేను బస్తా బయట ఎయ్యలేదు. నన్ను నమ్ముండ్రి” చేతులు జోడించాడు పోలయ్య.

“నువ్వు తియ్యకపోతే బస్తా ఏమైనట్టురా? దయ్యమెత్తుక పోయిందా?” లాగి మరొక దెబ్బ పోలయ్య చెంపమీద వేశాడు చమన్ లాల్.

“పోలీగా, గాసంచి ఎక్కడ దాచావో సెప్పరా! మనం కూలి మీద బతికేటోళ్ళం, గిట్ల దొంగతన సెయ్యకూడదు, సెప్పు బిడ్డా!” అరవై ఏళ్ల సాయన్న పోలయ్య గడ్డం పట్టుకొని అన్నాడు.

“నేను తియ్యలేదే, అమ్మ మీద ఒట్టు!’ అన్నాడు పోలయ్య.

“గీడు ఇట్లా సెప్పడు గానీ, రెండు రోజులు కూలి ఇవ్వకుండా పని సేయించుండ్రి, మూడో రోజు నుంచీ, ఈ అడ్డ మీద నాకు కనపడొద్దు వీడు” అని, విసురుగా లేచి వెళ్ళిపోయాడు చమన్ లాల్.

ఇంటికి పోయి, జరిగింది అంతా సీతకు చెప్పి, కన్నీటి పర్యంతమయ్యిండు పోలయ్య.

“ఆల్లు పెద్దోళ్లు, ఏం జేసినా సెల్లుద్ది, నువ్వు రందిపడమాకు, ఇంకో సోట పని దొరుకుద్దిలే” అని ఓదారుస్తూ, మొగుడికి సర్దిచెప్పింది సీత.

సేటు చెప్పినట్టుగా రెండు రోజులు అడ్డ మీదకి వెళ్ళి, కూలీడబ్బు తీసుకోకుండా, పని చేసి వచ్చాడు పోలయ్య.

మూడో రోజు, ఉపాధి వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎండ, వాన లెక్కచేయకుండా, చెమటలో తడుస్తూ, అతుకుల చెప్పులు అరిగేలాగా తిరిగాడు. ఎక్కడా పని దొరకలేదు. చాలా రోజులు, అతను పని దొరక్క, రిక్తహస్తాలతో తిరిగి వచ్చాడు, ప్రతీరోజూ ఓటమితో పోరాడుతున్నాడు, రోజూ సీత ధైర్యం చెప్తోంది. తనకంటూ ఒక రోజు రాకపోతుందా, అన్న ఆశతో, ప్రయత్నం మాత్రం వదల్లేదు పోలయ్య. అలా వారం గడిచిపోయింది. గదిలో ట్రంకుపెట్టె తెరిచి చూశాడు. గుడ్డికాయ పట్టిన బట్టల చాటున, చివరి యాభై రూపాయలు కనిపించింది. ‘దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయి పోయాయి, రేపు పని దొరక్కపోతే పస్తులే’ అన్న ఊహ భరించరాని బాధ కలిగించింది పోలయ్యకు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వరకూ, చిరుగు దుప్పటిపైన, అటూ ఇటూ పొర్లి , కడుపునిండా నీళ్ళుతాగి పడుకున్నాక నిద్రపట్టింది.

మరుసటి రోజు, మరో దిక్కున ఉన్న, నిర్మాణ స్థలాలు, కర్మాగారాలకు వెళ్ళాడు, అయితే అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. అతనిలాగే వందలాది మంది ఇతర వలసదారులు కూడా పనికోసం పోటీపడుతున్నారు. చివరికి ఒక కర్మాగారంలో, మేనేజర్ కాళ్ళు పట్టుకుని, కార్మికుడిగా పనిలో చేరాడు.

మండే ఎండలో భారీ ఇటుకలను మోసుకెళ్లడం, ఆటో ట్రక్కులో వేయడం, లేదా సిమెంట్ కలపడం, పోలయ్యకు అలవాటు లేని పనులు, అయినా చేయక తప్పలేదు. పరిస్థితుల దృశ్యా, చాలా తక్కువ కూలీకి ఒప్పుకున్నాడు పోలయ్య. తన అవసరం అలాంటిది. పస్తుండడం కన్నా, గుడ్డిలో మెల్ల అనుకొని, ఏదో పనిలో కుదురుకోవడం, దొరికిన డబ్బుతో తృప్తి పడడం తప్పలేదు.

మరుసటి రోజు, చమన్ లాల్ మనిషి వచ్చి, “సేటు రమ్మన్నాడు, నీతో మాట్లాడాలట” అన్నాడు.

ఆ రోజు పనిలోకి వెళ్తున్న పోలయ్య, “ఆదివారం రోజు నాకు సెలవు ఉంటది. ఆ రోజు పొద్దున్న వత్తానని సెప్పయ్యా!” అన్నాడు.

***

ఆదివారం మలక్ పేట మార్కెట్లో, కొన్ని దుకాణాలు తెరచి ఉన్నాయి. కొన్ని మూసి ఉన్నాయి. చమన్ లాల్ దుకాణం దగ్గర కూర్చొని ఉన్నాడు. పోలయ్య వెళ్ళి, “నమస్తే అయ్యా!” అన్నాడు.

“ఓ.. పొలయ్యా, రా.. రా.., ఏంటి పనిలోకి రావడం మానేసినవ్?”

“తమరు రావద్దన్నారని రాలేదయ్యా!”

“తప్పులు మనుషులు చెయ్యకపోతే, మానులు చేస్తాయా? ఎట్లాగూ ఆ రోజు, తప్పు ఒప్పుకున్నావుగా! నష్టం కూడా రెండురోజులు పని చేసి పూడ్చేసావు, ఇక్కడికొచ్చి నన్ను బ్రతిమాలుకుంటే, పని ఇచ్చేవాడిని కదా!”

“నేను తప్పు సెయ్యలేదయ్యా! అప్పుడూ, ఇప్పుడూ అదే సెప్పిన, రేపైనా అదే సెప్త. తప్పును ఒప్పుకున్న అని తమరంటున్నరు. కానీ నేను తప్పునొప్పుకోలేదు, మీరే నేను తప్పు సేసానని, నిర్ణయించి, చిచ్చ ఏసారు. మీరు పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, మిమ్మల్ని ఎదిరించి మేము బతగ్గలమా అయ్యా! అందుకే నేను, మీరు ఏంజెప్తే దానికి తలొగ్గినా.”

“నువ్వు చెప్పింది నిజమేరా! నువ్వు తప్పు జెయ్యలేదని, నాకు మొన్ననే తెలిసింది. నిన్న మిల్లునుంచి కొత్తలోడు వచ్చింది. అందులో ఒక బస్తా ఎక్కువ పంపిన్రు, ఆ రోజూ పంపిన లోడ్‌లో ఒక బస్తా తక్కువ పంపినరని, ఆ బస్తా కొత్త లోడ్‌లో కలిపి పంపినరు. అది నాకు తెలియక, చెప్పుడు మాటలు ఇని, నిన్ను అనుమానించి, ‘దొంగ’ అని ముద్ర వేశాను. శిక్ష కూడా వేశాను. అసలైతే, నేనే తప్పు చేసా, అందుకే బాధపడి నిన్ను పిలిపించా, ఇదిగో ఆ రెండు రోజుల కులీ డబ్బులు తీసుకో, రేపటి నుంచీ పనిలోకి రా!” అని వెయ్యి రూపాయలు, పోలయ్యకు ఇచ్చాడు చమన్ లాల్.

ఆ డబ్బులు అందుకుంటూ, చూట్టూ చూశాడు పోలయ్య. దగ్గరలో, ఎవరూ కనిపించలేదు. వేరే కూలీలు ఉన్నారు గానీ, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.

“చెమించండయ్యా! నేను వేరే పనిలో కుదిరా. ‘దొంగ’ అని నింద పడిన చోట, నేను పని సేయలేనయ్యా. పరువు బోయిన సోట, పని చేయకూడదని, ఆడ ఉండకూడదని, మా అయ్యా సెప్పేవోడు. ఆ రోజు, అంత మంది ముందు నన్ను దొంగను సేసిన్రు, ఈ రోజు నేను దొంగను కాదని మీ నోటితోనే సెప్పిన్రు కానీ, ఆ మాట ఇనడానికి, ఇప్పుడు ఒక్కడు కూడా లేడు. నింద వేయడం సులభమయ్యా, పడిన నిందను సెడిపెయ్యడమే కట్టం. ఆ రోజు పదిమంది ముందు ‘దొంగ’ అన్న నిందవేసి, నన్ను కొట్టిన్రు. ఆ రోజూ మీరు కొట్టిన దెబ్బల కంటే, మీరు ఏసిన నింద, నా మనసుని పిండేసిందయ్యా. ఇంటికి పోయాక కూడా రాత్రంతా, మనసు గోసపడింది, నిద్రపట్టలే. మేము అంతస్తుల్లో పేదోళ్ళమే, కానీ అభిమానంలో కాదయ్యా! నేను పోయొస్తానయ్యా, నమస్తే!” అని చెప్పి, ఇంటికి బయలుదేరాడు పోలయ్య. వెళ్లిపోతున్న పోలయ్య వైపు చూస్తూ, ‘తొందరపడి తప్పు చేశాను, మంచి పనోడిని పోగొట్టుకున్నాను’ అని పశ్చాత్తాపపడ్డాడు చమన్ లాల్.

***సమాప్తం***

Exit mobile version