[బాలబాలికల కోసం ‘విద్యార్థి సందేహం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
కోమలపురంలో విద్యాపతి అనే గురువుగారు తన దగ్గర విద్యనభ్యసించే విద్యార్థులకు శ్రద్థగా పాఠాలు బోధిస్తూ చెప్పిన పాఠాలకు అవసరమైన ఉదాహరణలు చెబుతూ, చూపిస్తూ వారికి అర్థం అయ్యేట్టు చెప్పేవాడు. దానితో వారికి గురువుగారు చెప్పేది క్షుణ్ణంగా అర్థం అయ్యేది.
గిరి అనే విద్యార్ధికి అనేక వింత సందేహాలు వస్తుండేవి. ఒకరోజు గురువుగారు ప్రకృతిని గురించి దానిలోని సూక్ష్మాలను గురించి పాఠాలను చెబుతున్నప్పుడు గిరిలేచి నిలబడి ఈ విధంగా ప్రశ్నించాడు.
“గురువుగారు మీరు మాకు ఇన్ని మంచి విషయాలు చెబుతున్నారు. మరి మీరు ఏ గురువు వద్ద చదువుకున్నారు? మీకు ఆయన మీరు మాకు చెబుతున్నట్టే బోధించేవారా?” అని అడిగాడు.
“నాయనా నా గురువు గారు మహీపతి గారు. ఆయన అనేక విషయాలు బోధించేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఏ గురువైనా తను అనేక విషయాలు బోధించి మన జ్ఞానాన్ని చైతన్యవంతం చేస్తారు. నిజ జీవితంలో మనమే మన అనుభవాల నుండి మన పరిశీలనల నుండి గ్రహించాలి.” చెప్పారు.
“గురువు గారు మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదు. తమరు మరికొంత వివరించి నా సందేహాలను తొలగించండి” గురువు గారిని కోరాడు.
“నిజానికి ప్రకృతే మనకు గొప్ప గురువు.నాతో రండి చూపిస్తాను”అని శిష్యులందరినీ తీసుకుని తన గురుకులానికి దగ్గరలోని కొండ.దాని చుట్టూ ఉన్న అడవి వద్దకు తీసుక వెళ్ళాడు.
“చూశారా ఇక్కడ రాళ్ళు, చెట్లు ఆఎత్తైన కొండలు, అన్నీ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. వాటినుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు” చెప్పారు గురువు.
“గురువు గారు ఆ బండరాయి ఏ విధంగా ఉపయోగపడుతుంది?”
గురువుగారు చిరునవ్వుతో ఈవిధంగా చెప్పాడు. “బండరాళ్ళు ఇళ్ళు కట్టడానికి, విగ్రహాలను చెయ్యడానికి, దారిలో రాళ్ళు పరవడానికి ఉపయోగపడి ఎంతో మేలు చేస్తున్నాయి. ఆ పువ్వులు బతికేది రెండు మూడు రోజులే. అవి దేవుడి మెడ అలంకరిస్తూ మనకి ఆహ్లాదాన్ని పంచుతూ జన్మ సార్థకం చేసుకుంటున్నాయి. వాటినుండి మనం నేర్చుకునేది ఏమిటి? బతికినన్ని రోజులు మన పరిధిలో తోటివారికి సహాయం చేయాలి. ఆ ఎత్తుగా ఉన్న కొండను చూడండి. అది నిశ్శబ్దంగా వానాకాలంలో మేఘాలను ఆపి వర్షం కురిసేట్టు చేసి, నదులు పారేట్టు చేసి పొలాలు పండేట్టు చేస్తుంది. అది కూడా ఒక విధంగా గురువే. మనం ఎంత ఎత్తు ఎదిగినా మన వలన కొంతమంది బాగుపడితే అంతకన్నా కావలిందేముంది? ఆ చెట్టు చూడండి, దానికున్న ఫలాలు చూడండి. ఆ ఫలాలు అది తినదు. ఆకలితో ఉన్న పక్షులకు, జంతువులకూ, మనకు పంచి పెట్టి ఎనలేని ఆనందం పొందుతుంది. దాని విత్తనాలు మరలా మొలచి అవి కూడా తగిన సేవ చేస్తూ లోకాన్ని పచ్చగా ఉండేట్టు కాపాడతాయి.
ఈ విధంగా మనం చెట్టును పుట్టను, కొండరాయిని మరి దేనిని చూసినా కాస్తంత ఆలోచిస్తే ప్రతీదీ మనకు ఏదో ఒక సత్యం బోధిస్తూనే ఉంటుంది. అందుకే వాటిని నేను గురువులుగా భావిస్తాను. ప్రతి మనిషి నుండీ, ప్రతి జీవి నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. నేర్చుకున్న దానిని మనం ఎక్కువ మందికి పంచాలి అర్థమయిందా గిరి?” అని అడిగారు.
“అర్థమయింది గురువు గారు. మేమందరం కూడా మీరు చెప్పినట్లు ప్రకృతి నుండి విషయాలు గ్రహిస్తాం. అనుమానాలు వస్తే మిమ్మల్ని అడిగి మా సందేహాలు తొలగించుకుంటాం.” అందరూ ముక్తకంఠంతో చెప్పారు.
గురువుగారు సంతోషంతో అక్కడ ఉన్న చెట్టు పండ్లను కోయించి అందరికీ పంచి పెట్టారు. ఆ మధుర ఫలాలను తిని అందరూ గురుకులానికి బయలుదేరారు.