[రెడ్డిశెట్టి పవన్ కుమార్ గారి ‘విద్యా వినయేన శోభతే’ అనే రచనని అందిస్తున్నాము.]
అక్షరం ఆయుధమే కాదు, జీవితంతో సంబంధం, ప్రగతితో అనుబంధం. అక్షరాస్యత, విషయ పరిజ్ఞానంతో అడుగులు వేసిన విద్య, లోకం అనే పుస్తకంతో తరగతి గదికి మించి నేర్పిస్తూ, వ్యాపార, ఉద్యోగ అవకాశాల్లో నీకు అగ్రతాంబూలం అందిస్తూ, నీ కాళ్ళ పైన నిన్ను నిలబెడుతూ, వస్తు సేవలందు నీలోని తెలివిని సాన పెడుతూ, రోజూ నువ్వు ఎదుర్కొనే పరీక్షల్లో తర్ఫీదునిస్తూ నిన్ను విజయుడిగా తీర్చి దిద్దుతుంది. జన్మతః వచ్చిన పేదరికపు సంకెళ్లు, అంటరానితనపు అమానుషాల వెతలెన్నున్నా సమాజం విసిరే సమస్యలన్నింటికీ ఎదురొడ్డే ధైర్యాన్ని అందిస్తుంది.
బ్రతుకు అనే పాలలో అమేయమైన మీగడ రుచి చవి చూపించేది విద్య. ఒక చోట ధనం ఓడిపోతుంది, ఒక చోట కాలం ఆగిపోతుంది, ఒక చోట స్థలం మోకరిల్లుతుంది కానీ అంతటా గెలిచేది, నిలిచేది అందరూ కొలిచేదీ విద్య ఒక్కటే. తలకెత్తుకున్నవాడి తలను నిలబెడుతుంది విద్య.
విద్య అనే నాగలికి శ్రమ అనే బరువు చేరితే అది పండిచని పంట ఉండదు. ఒకడు ఏ రంగంలో ఉన్నతంగా ఎదగాలన్నాకేవలం విద్యయే తొలి మెట్టు, మలి మెట్టూ. ప్రతి మజిలీకి ఏకైక దారి విద్య. కుసుమాలు విరబూయని వనం వంటిది విద్య లేని జీవితం. విద్యనభ్యసించినపుడే నువ్వు లోకాన్ని సరిగ్గా చూడగలవు. అదే విద్య అంచులవరకూ నువ్వు సాగితే ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించగలవు. ఒక గుంపులో ఉన్న మరుగుజ్జువాడు వేదిక మీది ప్రదర్శనను ఏ విధంగా పొడచూస్తాడో, విద్యాహీనుడు సమాజంలోని ప్రగతిని అంతే అనుభవించగలడు. అట్లే ఒక పొడవైనవాడు ఏ విధంగా ఆ ప్రదర్శనను పూర్తిగా చూడగలడో కేవలం ఒక విద్యావంతుడే ఏ రంగంలోని ఉన్నతినైనా చేరగలడు.
అమ్మ ఆలన అవనిని చూచేవరకే, నాన్న చేయూత అడుగులు తడబడనంత వరకే, గురువు భోదన బడి దాటే వరకే, కానీ జీవితాంతం నడిపించేది నేర్చిన విద్య ఒక్కటే. ఇలకు రవి వెలుగు కూడా సగం కాలానికే పరిమితం. జడివానలో తడి చేరకుండా తలను కాపాడే గొడుగు సైతం పవనుడు తోడైతే చేతులెత్తేస్తుంది. అందుకే విద్య అందించే ఉపకారానికి ఉపమానమేదీ లేదీ సృష్టిలో అంటే అతిశయోక్తి కాదు.
విద్ అనే ధాతువు నుండి విద్య అనే పదం వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం. మనిషి ఆలోచనాశక్తికి అడుగులు నేర్పేది విద్య ఒక్కటే. చదువుతో నువ్వు వెలగడమే కాకుండా నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా వెలిగించగలవు. నిస్సహాయత, నిర్వీర్యం నుండి ఆత్మస్తైర్యం వరకు మనిషిని నడిపించేది విద్య ఒక్కటే. సాంకేతికతతో సమాజాన్ని వణికించే హ్యాకరైనా, చోరులతో నిండిన లోకంలో సొత్తును కాపాడే లాకరైనా, యమకింకరులను తిప్పి పంపే డాక్టరైనా, కనబడని న్యాయాన్ని కనిపెట్టుకొని కాపాడే కళ్లులేని న్యాయ దేవతైనా, చిరుత వేగం చిత్తయిపోయేలా సాగే బుల్లెట్ ట్రైన్ అయినా, సంగీతంతో మన్ననలు పొందే కళాకారుడైనా, చలిని వెక్కిరించే కంబళ్లయినా, బాణుడిదాడి నుండి కాపాడే మట్టికుండైనా, దశరథ తనయ రాముడిని – నందమూరి తారక రాముణ్ణి బ్రతికించి కంట నిలిపే వెండితెరైనా, అర్థరాత్రి సూర్యుడిని తలపించే ఎలెక్ట్రిక్ బల్బులైనా, ఆకాశమంత జలరాశిని ఒడిసిపట్టే ఆనకట్టైనా, పక్షి కంటే ఎత్తులో సేద తీరస్తు విహరింపచేసే విమానమైనా, ఒక్క గింజతో లక్ష గింజలు పుట్టించే వ్యయసాయమైనా, నింగికి ISRO వంటివి వేసిన నిచ్చెనలైనా అన్నీ విద్యా కుసుమాలే. అంతులేనిది విద్య. సంగీతం, సాహిత్యం, నిర్మాణం, విద్వంసం అన్నీ విద్యా వారసత్వపు సంపదలే. అజ్ఞానమనే దరి నుండి ఆవలి ఒడ్డుకు చేర్చే వారధి విద్య. అందుకే ప్రభుత్వం పథకాల పేరిట అన్నార్థినీ విద్యార్థి గాటికి కట్టేదీ ఒకింతైనా విద్యా పరిమళం అందరికీ సోకడానికి.
సవాళ్ళను సానుకూలంగా మలచుకోవడం విద్య. వ్యక్తి జీవితాన్నే కాదు దేశ తలరాతను సైతం మార్చగలిగే మహత్తు కేవలం విద్య సొంతం. కేవలం తరగతి గదిలో మార్కుల సాధనకై కాదు విద్య. అంతకు మించి. విద్య విషయాల ప్రోగు మాత్రమే కాదు, నైపుణ్యాల సాగు. సహజసిద్ధమైన తెలివిని సానపెట్టేది విద్య. సమాజ అవసరాలను తీర్చేది, తీరుస్తున్నది విద్య.
ఒకరిని మోసం చేయాలన్నా విద్యే కావాలి, ఒకరి మోసం నుండి కాపాడుకోవాలన్నా విద్యే కావాలి. దొంగతనం లోని చురుకుదనం విద్య. మల్లీ ఆ దొంగను నిలువరించడమూ విద్య. విద్య అనే లోహానికి కర్కశమనే పదును తోడైతే దానికి మించిన కిరాతకమింకేదీ ఉండదు. అందుకే విద్య అనే జ్ఞాన కుసుమానికి మానవత్వపు తావినద్దినపుడే సమాజం ఒక కుటుంబమవుతుంది. అందుకే పెద్దలన్నారు విద్యా వినయేన శోభతే.
రెడ్డిశెట్టి పవన్ కుమార్ భారతీయ రైల్వేలో ఉద్యోగి. పువ్వులంటే ఇష్టం. రుబాయీలు, కవితలు, ఆర్టికల్స్, పాటలు, ప్రకటనలు, స్క్రీన్ ప్లే ఇవి వారి కొమ్మకు కుసుమాలు. వీటిని ఏ కొమ్మన చూసినా, తన మనసు తుమ్మెద అవుతుందనే పవన్ కుమార్ తేనెలొలుకు తెలుగు భాషకు ప్రణమిల్లుతారు. ఫోన్:9392941388