[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘విడ్డూరాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నిరవధిక వైశాల్యంతో
అలరారే నింగి నీడన
సంకుచిత స్వభావాల
సంఘనాంధకారంలో కుంచించుకుంటూ
కుత్సితులౌతూ
జన్మను వ్యర్థ పరచుతూ
చిన్నబోతూ
చీత్కృతుల పాలౌతున్న
వ్యక్తులుండడం అబ్బురం!
నిరూపమాన సహనానికి
నిదర్శనమైన అవనిపై
కొద్దిపాటి ఓర్పు కూడా లేక
కోపగిస్తూ, కొట్లాడుతూ
శాంతినీ, భద్రతను కోల్పడుతూ
కాలాన్ని కళంకితం చేసుకునే
అల్ప జనులుండడం చిత్రం!
సకల జీవ జాతి హితానికీ,
సమానత్వానికీ
పరమావధిగా ప్రవర్తించే
గాలిని శ్వాసిస్తున్నా,
నీటిని ప్రాశిస్తున్నా
ఇసుమంతైనా
ఇతరుల మేలునాశించక
స్వార్థాన్ని పోషిస్తూ
విభేదాలను విస్తరింపజేస్తూ
జీవనానందాన్ని మంటగలుపుకునే
దుర్బుద్ది జీవులుండడం విడ్డూరం!
తర తరాలుగా
తారతమ్యాలు లేకుండా
ప్రకాశాన్నీ, వికాసాన్నీ
ప్రసాదించే ప్రభాకరుని
కారుణ్యోపకారాన్ని అందుకుంటున్నా
అంతరాలను పాటిస్తూ
అజ్ఞానతిమిరాన్ని ఆశ్రయిస్తూ
కలతలకూ, కలహాలకూ
కారకులయ్యే
అమానవీయులుండడం ఆశ్చర్యం!
ప్రత్యక్ష ప్రవర్తన ద్వారా
ప్రశస్త జీవన పద్ధతులను బోధించే
ప్రకృతి పాఠశాలలో ఉంటూ
సత్ప్రవర్తనను నేర్వలేని
నేరస్థులౌతున్న
దుర్బద్ధి వశ్యులూ,
దుశ్శీల శిష్యులూ ఉండడం
చోద్యం!
బుద్ధి జీవులను లజ్జితులను చేస్తూ
వారి కన్నా గొప్పగా
ప్రకృతి బోధలను
అభ్యసిస్తూ, ఆచరిస్తూ
పాదప శ్రేణులూ,
ప్రసూన రాణులూ
అభినందనలను అందుకోవడం
విస్మయ పరచే విషయం!