[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]
‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.
***
1. కస్తూరీ పద్య పరిమళం:
శ్రీమతి కస్తూరి రంగ (కూచిమంచి) మోచర్ల రచించిన రెండు శతకాలు. శ్రీ వేంకటేశ్వర శతకం, సాయి శతకం కలిపి అందిస్తుందీ ‘కస్తూరీ పద్య పరిమళం’ పుస్తకం.
శ్రీ వేంకటేశ్వర శతకం ఉత్పల మాల, చంపక మాలలతో రచించిన శతకం. సాయి శతకం కంద పద్య నిర్మితం.
శ్రీ వేంకటేశ్వర శతకం:
కాంచగ నిను నా యెడద కౌమన ముందును వేంకటాద్రి పై
కాంచన పీఠమందు ఘన కాంతులు చిందుచు వైభవమ్ముగన్
మించిన రాజసమ్మునను మేల్కోరించుచు భక్తి కోటికిన్
బంచెద నీవు భాగ్యముల చలన సేయుచు వేంకటేశ్వరా!
~
మానస మందునన్ కలుగు మైమరపంతయు కన్నులందునన్
గానబడన్ కపోలములు కందగ కెంపుల లోలె చక్కగన్
తేనెలు జాలువారగను తీయన్ మోవి మీసమొందనీ
మానిని నిల్చె నీ దరిని మక్కువ నేలర వేంకటేశ్వరా!
సాయి శకతం:
సారపు విద్య లెరుంగను
పారగుడను కాను నేను భాషలు తెలియన్
భావమదెంచక జ్ఞాన మ
పారంబుగా వృద్ధి చెందు వరమిడు సాయీ!
~
సర్వము నీవే మాకు న
నిర్వచ నీయమగు హాయి నిండు నిను గనన్
గర్వువు మాకెల్లప్పుడు
నుర్విని వెలసిన ప్రసిద్ద యోగివి సాయీ!
***
కస్తూరి రంగ మోచర్ల
పేజీలు: 54
వెల: ₹ 60/-
ప్రతులకు:
ఇంటి నెం. 1604, 6వ అంతస్తు, సి బ్లాక్,
ఏసియన్ సన్ సిటీ,
కొత్తగుడా, కొండాపూర్
హైదరాబాద్.
ఫోన్: 9866188618
2. శ్రీకాంత శతకము:
డా. చిన్నాపుల వేంకట రాజారెడ్డి, తన కుమారుడి పేరు ‘శ్రీకాంత్’ మకుటంగా రచించిన శతకము ‘శ్రీకాంత శతకము’. తన కుమారుడు విద్యార్థి జీవనగమనంలో అనేక సోపానాలు అధిరోహించాలని తండ్రి చేసిన హితబోధ శతకం. యువతకు చైనత్యం నింపేదిగా ఉన్నాయి ఈ శతకంలో పద్యాలు.
~
ఇతరులన్నేడిపించుట హీనమగును
పరుల దుఃఖమ్ము బాపుట పరమ హితము
ఏడువక యేడిపించక ఇలను మనము
వినుర శ్రీకాంత నా మాట తెలుగు బాట
~
మణులు మాన్యాలు చలన సంపదలు సుమ్మా
జ్ఞాన సంపద యొక్కటే శాశ్వతమ్ము
యత్న మొనరించి తద్భాగ్య ముందుకొమ్ము
వినుర శ్రీకాంత నా మాట వెలుగు బాట
***
పేజీలు: 68
వెల: ₹ 200/-
ప్రతులకు:
ఇంటి నెం: 87/1255-6-11713
సోమిశెట్టి నగరం-2,
బి.క్యాంప్
కర్నూలు-2
ఫోన్: 8985804576
3. వదలబోకుము నా చేయి వాసుదేవ:
నారుమంచి వేంకట అనంతకృష్ణ ‘వదలబోకుము నా చేయి వాసుదేవ’ అన్న మకుటంతో రచించిన శతకం ఇది. శకతంలోని పద్యాలలో తాత్త్వికత అంతర్భాగంగా కనిపిస్తుంది. నవవిధ భక్తి ప్రదర్శిస్తాయి పద్యాలు. కృష్ణ లీలలను ప్రకటిస్తాయి.
~
నేను నేనన్న నేనది నేను కాక
నీవు నీవన్న తత్త్వమ్ము నీవే నేర్పి
యిట్టి భావమ్ము నాలోన గట్టిపడగ
వదలబోకుము నా చేయి వాసుదేవ
~
శాస్త్ర మెరగ యుగాదుల న్పెర్మలేదు
సాధనాదుల చేయంగ సాద్యపడదు
చిత్తమొక్కటి నీవాళ్ల చెంత నిడుదు
వదలబోకుము నా చేయి వాసుదేవ
***
నారుమంచి వేంకట అనంత కృష్ణ
పేజీలు: 32
వెల: అమూల్యము
ప్రతులకు:
ప్లాట్ నెం. 80,
శ్రీసాయి నగర్
రోడ్ నెం 4, శ్రీ సాయి బాబా మందిరం ఎదురుగా,
నాగోల్ పోస్ట్
హైదరాబాద్ – 68
ఫోన్: 9246531895
4. శ్రీనివాస శతకము:
జొన్నలగడ్డ శ్రీనివాసరావు ‘చిత్రమిదియె కనుమ! శ్రీనివాస!’ అనే మకుటంతో రచించిన శతకము ఇది. ఆటవెలది పద్యాలలో సరళమైన భాషతో గంభీరమైన భావాలను ప్రదర్శించి భక్తి భావనతో పాటు సామాజిక స్పృహను ప్రదర్శిస్తాయి ఈ శతకంలోని పద్యాలు.
~
కోనసీమలోన గోదావరీ పాయ
సోయగాలు చూసి సోకు చేసె
వంపుసొంపులున్న వయ్యారి భామట్లు
చిత్రమిదియె కనుమ! శ్రీనివాస!
~
అన్నియున్నవాడు యణకువగా నుండు
కొంచమున్న వాడు గొప్ప చేయు
నేమి లేని వాడు నెగరిపడిన తీరు
చిత్రమిదియె కనుమ! శ్రీనివాస!
***
జొన్నలగడ్డ శ్రీనివాసరావు
పేజీలు: 26
వెల: అమూల్యము
ప్రతులకు:
జొన్నలగడ్డ శ్రీనివాసరావు
తొత్తరమూడి,
అయినవిల్లి మండలం.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 533211

