[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]
‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.
***
1. వరద శతకము/ శంకర శతకము:
కంది శంకరయ్య ఒక్క రోజులో ‘వరద’ మకుటంతో రచించిన శతకం ‘వరద శతకం’. ఇందులోని అన్నీ కంద పద్యాలు. పదం పదంలో విష్ణు భక్తి తొణికిసలాడుతూంటుంది. శివరాత్రి పర్వదినం రోజు శివపరమైన శతకం రాయాలన్న సంకల్పం కలగటంతో ఆ రోజు పట్టుబట్టి 24 గంటలలో రచించిన శతకం ‘శంకర శతకం’. శివభక్త పరమైన ఈ శతకంలో భావానుగుణంగా లలిత ప్రౌఢ ఛందస్సులను ప్రయోగిస్తూ ‘శంకర’ మకుటంతో రచించిన శతకం ఇది.
వరద శతకము:
కోరికల కందిరీగలు
చిది హృదయ కోటరమున జేయుచు రొదలే
యారాట పెట్టుచుండెను
ధీరత స్వాస్థ్యమ్ము నిమ్ము దేవా! వరదా!
~
భక్తిని సత్యము పైనను
రక్తిని, విషయములపై, విరక్తిని మాధు
ర్యోక్తిని, శక్తిని, భజనా
సక్తిని నా కొసగుమయ్య శౌరీ! వరదా!
శంకర శకతము:
హే గంగాధర! నాగభూషణ! హరా! హే ధూర్జటీ! శాశ్వతా!
హే గీర్వాణ సమూష సంస్తుత పదా! హే దీనలోకావనా!
యోగీంద్రా తత చింతిత ప్రదాత సద్యోగ ప్రభా పుంజమా!
హే గౌరీ హృదయేశ! హే పశుపతే! హే దైవమా! శంకరా!
~
శిరమున ఖండచంద్రుడు విశిష్ట కిరీటముగా వెలుంగగన్
గఠిముఖ కార్తికేయులు సుఖంబుగ దా మిరు ప్రక్కలుండగా
గిరియా వామ పార్శ్వంబున గేవల మర్ధశరీర మందగా
నిరవుగా దేవతల్ ప్రమధులెంచెడు రూపము నీది శంకరా!
***
కంది శంకరయ్య
పేజీలు: 48
వెల: భక్తి శ్రద్ధలు
ప్రతులకు:
11-25-627, కొత్త పేట
వరంగల్ – 506002
ఫోన్: 7569822984
2. శ్రీ సత్య శకతము:
బొలిశెట్టి సత్యనారాయణ రచించిన ‘శ్రీ సత్య శతకము’ భూమిపై సత్యాలను నొక్కి వక్కాణిస్తుంది. ఈ శతకాన్ని నీతి శతకంగా భావించవచ్చు. సరళమైన తెలుగు పదాలతో, సులభంగా అర్థమయ్యే రీతిలో సమాజ హితమైన సత్యాలను ప్రకటిస్తుందీ శతకం. ప్రతి పద్యం క్రింద భావాన్ని పొందుపరచారు. చివరలో గర్భకవిత్వాన్ని అదనంగా పొందుపరిచారు.
నిండు జీవితమున నేర్వ నేమియు లేదు
బ్రతుకుచుండుగాదె పణము గల్ల
పనియు పాట లేక పడుకొను సోమరి
యరయ సత్య మిదియె యవని పైన
~
మంచి మార్గమెంచి మనుగడ సాగింప
శాంతి గులుగు చుండు స్వాంత మందు
దొడ్డి దారి నెంచ దొరకదు సాంత్వన
మరయ సత్య మిదియె యవని పైన
***
బొలిశెట్టి సత్యనారాయణ
పేజీలు: 62
వెల: ₹ 100 /-
ప్రతులకు:
11-3-101, రోడ్ నెంబర్ 9
శ్రీ వెంకటేశ్వర కాలనీ
సరూర్ నగర్,
హైదరాబాద్ -500035
ఫోన్: 9490709207
3. శ్రీ యశస్వినీ శకతము:
‘హంసగీతి’ రచించిన ‘శ్రీ యశస్వినీ’ మకుటం కల శతకం ‘శ్రీ యశస్విని శకతము’. భక్తి ప్రధానమైన శతకం ఇది. అమ్మవారిపై అచంచల భక్తి ప్రపత్తులతో రచించిన శతకం ఇది. పద్యాలలో అమ్మవారికి సమస్యలను వివరించి లోకాన్ని రక్షించమని వేడుకోవటం కనిపిస్తుంది.
అర్థము కోసమై, సతము ఖ్యాతి గడింప దపించు చుండియన్
స్పర్ధల తోడ జీవితపు వాంఛలతో సమయమ్ము నంతటిన్
వ్యర్థము సేయచుందుమిట వ్యాకులతన్ మతి లేక బ్రాంతితో
స్పర్ధలు వీడి యుండగను శాంతము నీయమ శ్రీ యశస్వినీ.
~
రమ్యంబు నీదు రూపు మపరాజిత కాంచిన జాలు మోదమున
సౌమ్యము లేదు లోకమున ఒక్కని తల్లిగ నీదు ప్రీతికిన్
రమ్యకపర్దినీ! సలుపు బ్రార్థన భక్తుల రక్ష సేయగా
సౌమ్యము తోడ నిమ్ము తగు సాధన సద్గతి శ్రీ యశస్వినీ.
***
హంసగీతి
పేజీలు: 48
వెల: ₹ 60 /-
ప్రతులకు:
4-7-15/16/102
ఫ్లాట్ నెం. 102, సాయికిరణ్ అపార్ట్‌మెంట్స్,
రాఘవేంద్ర నగర్, సాయిబాబా గుడి వద్ద,
నాచారం,
హైదరాబాద్-500076.
ఫోన్: 9866985756
4. శ్రీ వెంకటేశ శతకము:
టి.వి.ఎస్. రామకృష్ణచార్యులు ‘వేంకటేశ’ మకుటంతో తేటగీతి ఛందస్సులో వ్రాసిన శతకం ‘శ్రీ వేంకటేశ్వర శతకము’. తుని పట్టణ సమీపంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉద్దేశ్యంచి వ్రాసిన శతకం ఇది. అలతి పదాలతో సుందరమైన భక్తి భావాలను, ప్రదర్శిస్తాయి ఈ శకతంలో పద్యాలు.
~
శ్వేతవర్ణ మందిరమున శిల్పములను
కనులు చెదరగ జెక్కెరి కట్టెదుటనే
కలియుగ వరదుడగు నిను గాంచజేసి
విష్ణు భక్తులెల్ల గొలువ వేంకటేశ
~
పాద దర్శన మదెచాలు పాపములను
తొలగజేయగ భజియింతు దురితదూర
వరము నిచ్చెద వనుచును పరమ పురష
విరుల మాలల నర్పింతు వేంకటేశ.
***
టి.వి.ఎస్. రామకృష్ణాచార్యులు
పేజీలు: 52
వెల: ₹ 100/-
ప్రతులకు:
3-259, ఎలిమెంటరీ స్కూలు వెనుక
దత్తసాయి నగర్, మాధవ పట్నం
సామర్లకోట మం.
కాకినాడ జిల్లా
ఫోన్: 9346676049
5. శ్రీ బాల శతకము:
కాటేపల్లి అన్నపుర్ణ ‘బాలా’ మకుటంతో రచించిన శతకం ‘శ్రీ బాల శతకం’. కంద పద్యాలతో ఈ శతకం రచించారు. ద్రాక్షాపాకంతో భక్తి రసప్లావితంగా మధుర శైలిలో కవనం సాగిందని తోపిల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు అన్నారు. ఇంటి ఇలవేల్పైన బాలాత్రిపురసుందరి భావనతో పద్యాలను తీర్చిదిద్దారు. పద్యాలకు అర్ధం కూడా అందిచారు.
~
చేసిన కర్మఫలములు
వాసనగను వెంట నడువు వాగర్థములై
తోసియా నకృత్యములకే
వాసిగ భృత్యులని బ్రోచు వరదవు బాలా!
~
తీయని తేనియ పాటలు
హాయిని గొలుపగను వాణి ‘యాహ’ యనగన్
మ్రోయగ కమ్మల రవళులు
చేయగ నీ పై ప్రశంస చెలగును బాలా!
***
కాటేపల్లి అన్నపూర్ణ
పేజీలు: 50
వెల: ₹ 50/-
ప్రతులకు:
203, హరివిల్లా అపార్ట్‌మెంట్స్,
రోడ్ నెం: 5, మాధవపురి హిల్స్,
పిజెఆర్ ఎన్‍క్లేవ్,
చందానగర్,
హైదరాబాద్.
ఫోన్: 9440136869

