[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]
‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.
***
1. చిద్విలాస శతకం:
కటకం విజయక్ష్మి శర్మ ‘చిద్విలాస’ అనే మకుటంతో రచించిన శతకం ‘చిద్వలాస శతకం’. వెంకటేశ్వర సుప్రభతం, స్తోత్రం, మంగళ శాసనాదులకు స్వేచ్ఛానువాదం ఈ శతకం. మూల రచనకు దీటుగా అనువాద పద్య రచన సాగింది. ఆద్యంతం చక్కని పదజాలంతో కూడుకున్న ఈ పద్యాలు పాఠకులకు భక్తి పారవశ్యం కలిగిస్తాయి.
~
నిదుర మేలుకో గోవింద! నిగమ వేద్య!
మేలుకో గురఢధ్వజా! నీలవర్ణ!
కమల దళనేత్ర! మేలుకో కమలనాభ!
శ్రీశ! ముల్లోకముల ఏలు చిద్విలాస!
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం అనువాదం పై పద్యం
కరకిసలయములు ధరించి కమలములను
లక్ష్మి పద్మాసన స్థిత రమ్యముగను
భగవతీ! జగమ్మాతవు వందనములు
శ్రీశ ప్రేమాది గుణశోభ చిద్వాలస!
ఇది శ్రీ వేంకటేశ్వర ప్రపత్తికి అనువాదం మచ్చుకి.
***
కటకం విజయలక్ష్మి శర్మ
పేజీలు: 50
వెల: అమూల్యం
ప్రతులకు:
కమలా శంకర నిలయం
2-390/H, HMT స్వర్ణపురి కాలనీ
మియాపూర్, హైదరాబాద్-49
ఫోన్: 9491188809
2. గోవింద నామామృతము:
తిరివీధి శ్రీమన్నారాయణ 108 గోవింద నామాలకు రచించి 108 కంద పద్యాల సంపుటి ‘శ్రీనివాసుని గోవింద నామామృతము’. ఈ 108 గోవింద నామాలు ప్రసిద్ధమైన పాట ద్వారా భక్తులందరికీ పరిచయమే. ఆ నమామాలకు అందమైన పద్యరూపం ఈ పుస్తకం.
~
కమలదళాక్షా గోవింద!
కమల దళాక్షా! ధరణిని
మము రక్షించెదవు నీవు మహితాత్మా! యో
విమల చరితా! మురహరా!
ప్రమోదమున నిను గొలిచెడి భాగ్యమొసగుము!
~
తులసీ వనమాలా గోవిందా!
ఇలలో భక్తుల బ్రోవగ
వెలసిన నీవు తిరుమలను వేంకట రమణా!
తులసీ వనమాల ధరా!
కలి కల్మషహారి! నీకు గైమోడ్తునయా!
***
తిరివీధి శ్రీమన్నారాయణ
పేజీలు: 32
వెల: అమూల్యం
ప్రతులకు: వివరాలు లేవు
3. ఈదమ్మతల్లి శతకము:
ఈదులకుంట అగ్రహార గ్రామంలో వెలసిన ఈదమ్మ తల్లికి అంకితం చేస్తూ సృజించిన కంద పద్యమాల ‘ఈదుమ్మ తల్లి శతకము’. ఈ శతకంలో నలుపు, పిలుపు, పలుపు, తలపు అనే విభాగాలలో పద్యాలను విభజించారు.
~
వేప కడు గొప్ప యౌషధ
మేపగిదిన జాడ భూమిని యెల్ల జనులకున్
వేపయె యాభరణముగను
చేపట్టితివమ్మ జనని శివమీదమ్మ!
~
కోమటి కమ్మరి కాపులు
ధీమతులై హరిజనులను తీరుగ తమతో
భీమధ్వనులను సలుపగా
గ్రామమున ఘనమగు జాతరలె ఈదమ్మా!
***
కటకం వేంకట రామశర్మ
పేజీలు: 32
వెల: ₹ 50/-
ప్రతులకు:
కమలా శంకర నిలయం
2-390 /H, HMT స్వర్ణపురి కాలనీ
మియాపూర్, హైదరాబాద్-49
ఫోన్: 9440472321
4. శ్రీ సతీశ శతకము:
శ్రీమతి మాల్యవంతం లక్ష్మీశేషు ‘శ్రీ సతీశ’ మకుటంతో భక్తి భావలను రంగరించి రచించిన పద్యాల శతకం. ‘శ్రీ సతీశ శతకము’ లోని ఆధ్యాత్మికత ఉట్టి పడే సరళమైన పద్యాలు నిర్మలమైన భావనలు కలిగిస్తాయి.
~
పెండ్లి కొమరుడాయె పెరుమాళ్లు పేర్మితో
సిరిని పెండ్లి యాడె శేషసాయి
బ్రహ్మ కోర్కె దీర్చె పరమాత్మ భువి యందు
చిద్విలాస హస శ్రీ సతీశ!
~
వేణుగానలోల వేంకటరమణగో
వింద యనుచు భక్తి వేడు కొందు
సంకటములు బాపి సద్గుణములిడుమా
చిద్విలాస హాస శ్రీ సతీశ!
***
మాల్యవంతం లక్ష్మీ శేషు
పేజీలు: 36
వెల: ₹ 60/-
ప్రతులకు:
శ్రీ తుషాస్ ప్లే స్కూల్,
ఇంటి నెంబరు 2-4/3/2
చందానగర్,
హైదరాబాద్-50
ఫోన్: 9440688950
5. శ్రీ కాశి విశ్వనాథ శతకము:
డా. గోసుకొండ సుబ్రహ్మణ్యం ‘కాశీ విశ్వనాథ కావుమయ్య’ అనే మకుటంతో రచించిన శతకము ‘శ్రీ కాశీ విశ్వనాథ శతకము’. ఆద్యాత్మ ప్రవృత్తి, లౌకిక ప్రవృత్తులను మేళవించి సమాస పదగర్భిత పద్యాలతో అందంగా పొందుపరచారు కవి.
~
సగమా తనువునందు నగజాత కొలువుండ
శిరముపైన గంగ చిందులేయ
హరుని లీల లెరుగ నజునకైన తరమే
కాశి విశ్వనాథ! కావుమయ్య!
~
కాశీక్షేత్ర మనిన జ్ఞాన ధాత్రి యగును
భక్తి తత్పరతన భవుని గొల్చి
తత్వ మరసి తనరు తత్త్వజ్ఞుల కొరకౌ
కాశీ విశ్వనాథ! కావుమయ్య!
***
డా. గోసుకొండ సుబ్రహ్మణ్యం
పేజీలు: 32
వెల: ₹ 60/-
ప్రతులకు:
లలితాలయ రెసిడెన్సీ
12-2-83014
ప్లాట్ నెం: 403,
అలపాటి నగర్
మెహదీపట్నం.
హైదరాబాద్- 28
ఫోన్: 9819218122