[‘విభిన్న’ అనే కథా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఫేస్‌బుక్ సమూహం అయిన తెలుగు సాహితీ వనం నిర్వాహకులు, ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శ్రీమతి శాంతి కృష్ణ సంపాదకత్వంలో, తమ సమూహం 8వ వార్షికోత్సవం సందర్భంగా వెలువరించిన కథా సంకలనం ‘విభిన్న’. 25 మంది ప్రసిద్ధులైన సీనియర్ కథకులు, యువ రచయితలు అందించిన 25 కథల సంకలనం ఇది. కథలను రచయితల అనుభవం దృష్ట్యా కాకుండా కథా శీర్షిక అక్షర క్రమంలో అమర్చారు.
~
“ఈ సంకలనంలోని కథలు భిన్న సమస్యలకు అద్దం పడుతూనే వాటిపై ఒక ఆశావహ దృక్పథంతో ముగింపునివ్వడం, విషాదాంతాలు కాకుండా బాధిత పాత్రలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవడం ద్వారా కథకుల్లోని గుణాత్మకమైన స్వభావం ప్రకటిస్తాయి, సమాజానికి మనోబలాన్ని కలిగిస్తాయి.” అని తమ ముందుమాట – ‘విభిన్న’లో నిశ్శబ్ద విప్లవం – లో వ్యాఖ్యానించారు డా. రూప్‍కుమార్ డబ్బీకార్.
~
పిల్లల్ని నమ్మించడానికి చిన్నప్పటి నుంచి తల్లులు తమ విషయంలో ప్రేమతో అబద్ధాలు చెప్తారు. తమ ఇబ్బందులు దాచుకుంటారు. పిల్లల పనులకు అడ్డం కాకూడదని అబద్ధం చెప్పి తమ ఇబ్బందులని దాటవేస్తారు. కాస్త జ్ఞానం వచ్చిన పిల్లలు తల్లి అబద్ధం చెప్తోంది అని గ్రహిస్తారు. కానీ నామని సుజనాదేవి గారి ‘అమ్మ అబద్ధాలకోరు’ కథలో శ్రీను తల్లి అంతరంగం గ్రహించడు. ఆమెను పల్లెలో వదిలేసి భార్యాపిల్లలతో అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ కేశవ కనబడడం, అతనితో ముచ్చటించడం జరిగాకా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. “ఎవరికైనా కొంచెం డబ్బు, హోదా ఉన్నవాళ్ళు తమవాళ్ళని చెప్పుకోవడం సరదాగా, ఆనందంగా ఉంటుంది కదా అనుకుంటూ వెంట నడిచాను” – ఈ ఒక్క వాక్యం చాలు, రచయిత్రి సమాజాన్ని ఎంత నిశితంగా పరిశీలించారో చెప్పటానికి!
తాను అందరూ ఉన్న ఒంటరిగాడినని తెగ బాధపడిపోతుంటాడు రాజు, రమాదేవి కులకర్ణి గారి ‘ఒంటరి’ కథలో. అతని ఒంటరితనం వాస్తవమా లేక అతనే ఆపాదించుకున్నదా అన్నది కథ చదివితే అర్థమవుతుంది. తన ఒంటరితనానికి కారణం పెద్దన్న అనుకున్న రాజు – పెద్దన్న అచ్యుతరామయ్య గురించి అక్కల, రెండో అన్న దగ్గర, బయటవాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడుతాడు. పెద్దన్న మాత్రం అందరి అపోహలకి బలయిపోతాడు. “మానవ సంబంధాలు ఉచిత సలహాల వేదికలు కావు” అనేది ఈ కథలోని అద్భుతమైన వాక్యం!
వెన్నెలలో గడపడం ఎవరికైనా ఇష్టమే. మరికొందరికి సముద్రతీరంలో వెన్నెలలో గడపడం ఇష్టం! కొందరిగా ఒంటరిగా వెన్నలని ఆస్వాదించడం ఇష్టం! మరికొందరికి చంద్రుడితో కబుర్లు చెప్పడం ఇష్టం! బూడూరి సుదర్శన్ గారి ‘చందమామతో ఒక మాట చెప్పాలి’ కథలో ప్రశాంత్ కథలో చంద్రుడితో మాట్లాడానికి ఆస్వాదన కన్నా మరో బలమైన కారణం ఉంటుంది. ఆర్.కె. బీచ్‌లో day-wise గా జరుగుతున్నట్టుగా కథని అల్లి, చెప్పదలచుకున్న విషయాన్ని పాత్రల సంభాషణల మధ్య జొప్పించి, మబ్బుల వెనుక దాగిన చంద్రుడిలా వ్యక్తం చేసి – ఆఖర్న మబ్బులను తొలగిస్తారు, విషయం గ్రహించిన పాఠకులు – కథావెన్నెలని ఆస్వాదిస్తారు. “మనలో గాయపడని వాళ్ళు ఎవరని? అందరూ ఏదో ఒక బస్తా మోస్తున్నవాళ్ళే” – ఈ వాక్యాలు వ్యక్తిగత వేదనలకి అద్దం పడతాయి.
మొగుడు వదిలేసిన పాపక్కని.. సుబ్బన్న ఎందుకు రెండో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో ఎం. ఆర్. అరుణకుమారి గారి ‘తాళిబొట్టు’ కథ చెబుతుంది. రాయలసీమ మాండలికంలో సాగిన ఈ కథ మనుషుల్లోని స్వార్థాన్ని ఒక వైపు చూపిస్తూ, మరో వైపు నిస్వార్థంతో, ఎన్నెన్నో నిందలు మోసి, నమ్మినవారికి అండగా నిలిచే మనుషుల ఔన్నత్యాన్ని చాటుతుంది.
బాల్యంలో జీవితంపై అవగాహన లేక చేసే తప్పుల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో, ఎవరెవర్ని, ఏమేం కోల్పోవాల్సి వస్తుందో సుధాకళ్యాణి ఆచంట గారి ‘తెలిసీ తెలియక’ కథ చెబుతుంది. శీర్షికలోనే – అర్థమవుతుంది తెలిసీ తెలియని వయసులో చేసే తప్పుల వల్ల తలెత్తే పరిణామాల గురించి కథ సాగబోతోందని! అయినా రచయిత్రి కథని ఉద్విగ్నతతో నడిపిస్తారు.. అయిదు పేజీల చిన్న కథలో ఇరవై ఏళ్ళ జీవితాన్ని ప్రదర్శించారు. ఆఖరి వాక్యం కథకి హైలైట్!
చిరుతపులి జింకల గుంపుని వేటాడుతుంటే ఎలా ఉంటుంది? అదీ రాత్రి పూట! ఏ నేషనల్ జాగ్రఫీ ఛానల్ లోనే చూడ్డం కాదు, వివేక్ లంకమల గారి ‘ద లాస్ట్ రోర్’ కథలో చదవండి. ఒంట్లో గగుర్పాటు కలుగుతుంది. అదే చిరుతపులి ఆకలితో ఊరి పొలిమేరల్లోకి వచ్చేస్తే? పల్లెవాసుల పెంపుడు జంతువులని తినేస్తుంటే? చిరుతకీ, రేచుకుక్కలకీ పోరాటం జరిగితే? కుక్కల్ని తినడానికి ఊర్లోకి వచ్చి, మనుషులకి బందీ అయిన ఆ చిరుతపులి తనకి దొరికిన ఆ కుక్కని ఎందుకు తినలేదో, ఓ గొర్రెల కాపరి చేత చెప్పిస్తారు రచయిత. లంకమల, ఆ చుట్టుపక్కల అటవీప్రాంతంలో పాఠకులని తిప్పి తీసుకొస్తుందీ కథ.
చదివిన చదువుకి తగిన ఉద్యోగం రాక, ఆన్‍లైన్‌లో ఇంటర్వ్యూల పేరుతో ఫేక్ కంపెనీల మోసానికి గురైన ఓ యువకుడు బాధపడతాడు. అమ్మానాన్నల ఆశలు అడియాశలైనందుకు క్రుంగిపోతాడు. తనలాగే చాలామంది మోసపోయినట్టు గ్రహించిన అతను – ఒక సెక్యూర్డ్ యాప్ తయారు చేసి, తన లాగా మరెవ్వరూ మోసాల బారిన పడకుండా కాపాడుతాడు డా. బెల్లంకొండ సంపత్ కుమార్ గారి ‘దేశమంటే..’ కథలో. దేశమంటే ఏమిటో చివర్లో చెప్పినదానిని ఎవరూ కాదనలేరు.
రాజకీయాలలో అందలాలు ఎక్కాలనుకునేవాళ్ళు అమాయకులను ఎలా తొక్కేస్తారో, ఎలా అడ్డదారులు తొక్కుతారో పెద్దింటి అశోక్ కుమార్ గారి ‘నాయకుడు’ కథ చెబుతుంది. పట్నం బాల్రాజ్ – ఎమ్మెల్లే సాబ్ ఎట్లయిండో తెలియాలంటే రాజకీయ క్రీడల అవకతవకలు అనుభవంలోకి రావాలి. నాయకుడైపోదామని ఆశపడ్డ బాల్రాజ్‌కి – రాజకీయాలంటే ఎలా, ఎందుకు ఆసక్తి కల్గిందో కథ చివర్లో తెలిసినప్పుడు, రాజకీయాల పట్ల రోత కలుగుతుంది.
‘నేను చూసిన నక్షత్రం’ కథ – సినిమాలలో చిన్నా చితకా వేషాలు వేసి గుర్తింపు కోసం తపించే వ్యక్తుల ఆశలను ప్రతిబింబిస్తుంది. వేలుమణి ఆర్తీ, ఆవేదన పాఠకులను కదిలిస్తాయి. డా. కడియాల వివేకానంద మూర్తి గారి ఈ కథ మనసుని బరువెక్కిస్తుంది. “ఫీల్డు లోకింకా ప్రవేశించకపోయినా కాఫీ తాగినట్టు బాగానే నటించాను”, “నిన్న సాయంత్రం దాకా నాతో తిరిగిన వేలుమణికి యీ వేలుమణి డూప్‌లా అనిపించాడు” – ఇలాంటి చక్కని వాక్యాలున్న ఈ కథ పూర్తి చేశాక, చిన్న నిట్టూర్పు వెలువడుతుంది.
ప్రపంచాన్ని వినడం నేర్చుకుని, అందులో ఆనందాన్ని గ్రహించిన విశ్వ – తన వల్ల జరిగిన పొరపాటుకి బలైపోయిన యువతి – ఆత్మ సహాయంతో, ఆ నేరానికి కారణమైన వారిని పోలీసులకి పట్టిస్తాడు, ఆమె ఆత్మకి శాంతి కలిగిస్తాడు విజయ్ అప్పల్ల గారి ‘నేను – నా హెడ్ ఫోన్స్’ కథలో.
మనుషుల దాష్టీకం ఒక వైపు, పశువు ప్రేమ ఒక వైపు – ఆర్ద్రంగా సాగుతుంది ఎన్. సురేంద్రనాథ్ గారి ‘నందిరాజా’ కథ. పడగలెత్తుతున్న స్వార్థానికి పరాకాష్ట ఈ కథలోని సర్పంచ్ ప్రవర్తన!
మామూలుగా – కూతుర్నిచ్చి పెళ్ళి చేసిన మామగారిని వేధించే అల్లుళ్ళ కథలు చదువుతాం, నిజజీవితంలో చూస్తున్నాం. కానీ హుమయున్ సంఘీర్ గారి ‘పచ్చని సంబురం’ కథలో మామకెంతో మేలు చేసిన అల్లుడిని చూస్తాం! ఒక రకంగా చెప్పాలంటే, మామ ప్రాణం నిలిపిన అల్లుడన్న మాట! “ఓడిపోయి, నేల రాలుతున్న యుద్ధ విమానపు శకలంలా ఉందతని నిలువు దృశ్యం” లాంటి అద్భుతమైన వాక్యాలున్న ఈ కథ మనుషుల్లో కాస్తైనా మిగిలి ఉన్న మానవత్వం పట్ల నమ్మకం కల్గిస్తుంది.
భార్య సావిత్రికి ఆరేళ్ళ పాటు కష్టపడి దాచిన డబ్బుతో ఒక నెక్లెస్ చేయిస్తాడు అవధానులు. ఇంతలో ఆమె చెల్లెలికి పెళ్ళి కుదిరిందన్న కబురు తెలుస్తుంది. సావిత్రిని ఆ నగ మెడలో వేసుకుని పెళ్ళిలో తిరగమంటాడు అవధానులు. ఎందుకంటే, “చిన్నపాటి ఉద్యోగం చేస్తూ, ఎంత ఒబ్బిడిగా చేయించావురా” అని బంధువుల నుంచి ప్రశంసలు పొందాలన్న ఆలోచనతో. కానీ అనుకున్నదొకటి, అయినదొకటి అవుతుందా పెళ్ళిలో. ఆ నగ చేజారిపోతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు – అలకలు. దగ్గరి బంధువులలోని స్వార్థపు చీకటి కోణాన్ని చూపిస్తుంది శ్రీఊహ గారి ‘పచ్చల సెట్టు’ కథ.
చరణ్ పరిమి గారి కథ ‘పులి అవతారం’ మనుషుల్లోని పశుప్రవృత్తిని ఎత్తి చూపుతుంది. పోలీసులతో తన్నులు తినే నాగేష్‌కి వంటి మీద పులి చారలు రావడం, దాంతో పోలీసులు భయపడడం – ప్రతీకాత్మకమైన కథ. “ప్రతీసారీ మనమే ఓడడం కాదు, కష్టపడితే మనం గెలుస్తాం కూడా” అని అతని భార్య సంబరపడడంలో – ఆమెకి అసలు విషయం తెలియకపోయినా – భర్త మీద ఉన్న నమ్మకం అలా అనేలా చేస్తుంది. నాగేష్ వంటి మీద ఆ పులి చారాలు దేనికి ప్రతీకో పాఠకులకు అర్థమవుతుంది. ఆపకుండా చదివిస్తుందీ కథ.
జయంతి వాసరచెట్ల గారి కథ ‘ప్రశ్నాపత్రం’ ప్రశాంతి జీవితం పట్ల ఎన్నో ప్రశ్నలు వేస్తూనే, బతుక్కొక దారి చూపిస్తుంది. ఆడపిల్లల తల్లులకు సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తుందీ కథ.
చైల్డ్ అబ్యూస్‌కి గురైన బాలిక, ఆ అమ్మాయి తల్లి, ఆ ఘోరానికి సాక్షిగా నిలిచిన రాజీ మానసికమైన క్షోభని అనుభవిస్తారు. నేరం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడినా, అతని భార్య శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష ఆయనకా? ఆమెకా? అని పాఠకులు తర్కించుకుంటారు. ఏమైనా మకిలి పట్టించే మరకని ఆలస్యంగానైనా తుడిపేసుకోడం అవసరమని శాంతి కృష్ణ గారి ‘మరక’ కథ చెబుతుంది.
ఈతకోట సుబ్బారావు గారి ‘మొలక’ కథ చెట్లను కాపాడుకోవాల్సిన అవసరాన్ని, కార్పోరేట్ ఆసుపత్రుల కుటిల పన్నాగాలతో ముడిపెట్టి చెప్పింది. “మనిషి ఊపిరి కూడా వ్యాపార వస్తువైపోయిన రోజులు” అంటారు రచయిత ఈ కథలో. అదే కథావస్తువు కూడా అయింది, ఒక హెచ్చరికని చేస్తూనే, మన బాధ్యతని గుర్తు చేస్తుంది.
భువనచంద్ర గారి ‘వానా గో దే’ ఎన్నో జీవితసత్యాలను వినిపిస్తుంది. తెలుగు భాషని తెలుగువాళ్ళే కుళ్లబొడుస్తున్నందుకు బాధను వ్యక్తం చేస్తుంది. పరాయి భాషల వాడకం వరదలా ముంచుకొచ్చినా, అది తాత్కాలికమేననీ, వరద ఇంకిపోక తప్పదనీ, అలాగే అన్యభాషలూ అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. “మనిషి మనిషిని నమ్మడు. తనకన్నా పై స్థాయి వాడ్ని వెయ్యిసార్లు నమ్మి మోసపోవడానికైనా సిద్ధపడతాడు గానీ, తనకంటే తక్కువస్థాయి వాడ్ని నమ్మడు”. కాదనలేని వాస్తవం!
ముగ్గురు జర్నలిస్తుల అత్యుత్సాహం ఎంతటి ప్రహసనానికి దారితీసిందో సత్యాజీ గారి ‘వార్తాలహరి’ కథ వ్యంగ్యంగా చెబుతుంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందాన మసలుకుని, గందరగోళం సృష్టించే వ్యక్తుల తీరుతెన్నులను తేటతెల్లం చేస్తుంది.
అరుణ సందడి గారి ‘వీక్షణ’ కథ భౌతిక సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ముఖ్యమని చాటుతుంది. కథాశీర్షిక, కథానాయిక పేరు – వీక్షణ – అంటే చూడమని! ఏం చూడమంటున్నారు? మనిషి అంతరంగాన్ని చూడమంటున్నారు. మనసులు కలిసిన దాంపత్యంలో తనువులో లోపాలు పట్టించుకోనక్కరలేనివిగా మారిపోతాయని ఈ కథ చెబుతుంది.
పొదుపు, వృథాఖర్చులు అంటే కొడుకులని కూతుళ్ళని ఇబ్బంది పెట్టే ఓ పెద్దాయనకి గుండెజబ్బొచ్చి స్టంట్ వేయాల్సి వస్తుంది. అంతకుముందు తన మాట ఎవరూ వినడం లేదని ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ చికిత్స జరిగాకా, కొడుకు అన్న మాటలతో, అయనకి వెళ్ళిపోవాలనిపిస్తుంది – ఇంటికి! అవ్వారు శ్రీధర్ బాబు గారి ‘వెళ్ళిపోవాలా’ కథలో అంతర్లీనంగా చక్కని సందేశం ఉంది.
తోబుట్టువుల మధ్య అకారణ ద్వేషం, పంతాలు పట్టింపులు ఉంటే, ఒకరి అంతు మరొకరు చూసుకునేదాకా ఉంటే ఏమవుతుందో శ్రీధర్ బిల్లా గారి ‘సగం’ చెబుతుంది. కళ్ళు చెమర్చుతాయి చదవడం పూర్తయ్యాకా!
అవసరార్థం ప్రభుత్వ కార్యాలయాలలో కొన్ని ధృవపత్రాలు తీసుకోవాలంటే ఎంత కష్టమవుతుందో డా. ఏనుగు నరసింహారెడ్డి గారి ‘సేవింగ్ ది స్కిన్’ కథ చెబుతుంది. ఎందుకు కష్టమవుతుందో కూడా చెబుతుంది. కొన్ని కఠిన వాస్తవాలు మింగుడు పడవు.
నెల్లుట్ల రమాదేవి గారి ‘సంధ్యా సమయం’ కథలో చాలా కాలం తరువాత కలుసుకున్న స్నేహితురాళ్ళు తమ జీవితాలను పునశ్చరణ చేసుకుంటారు. జీవితం చివరి దశలో నలుగురు కలిసి ఉంటూ, హుందాగా బతకాలని నిర్ణయించుకుంటారు. ఓ రకమైన పాజిటివిటీ ఉందీ కథలో.
ఇక నా కథ ‘లావైతేనేమిరా జీవుడు’ గురించి నేనేమీ చెప్పను. ముందుమాటలో డా. రూప్ కుమార్ డబ్బీకార్ గారు చెప్పినవే చెప్తాను, చాలు! “బాడీ షేమింగ్ అనేది సమాజంలో ఎప్పుడూ వుండే సమస్య, ఊబకాయంతో వున్న వ్యక్తి జీవన్ తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇరుగు పొరుగు అతని ఆకారాన్ని అవహేళన చేయటం, ఆరోగ్యం గురించి అతి జాగ్రత్తలు చెప్పటం అనే కథాంశంతో చక్కగా మలచిన కథ కొల్లూరి సోమ శంకర్ రచించిన ‘లావైతేనేమిరా జీవుడు’.”.
~
“ఎన్నో దృశ్యాలు, ఎన్నో సంఘటనలు, ఎన్నెన్నో కలలు మనసు పొరల్లో నిత్యం సంఘర్షిస్తూ, సంవేదిస్తూ, ప్రశ్నిస్తూ, ప్రబోధిస్తూ.. భిన్న స్వరాలతో, భిన్న మాండలికాలతో ఒక్కటైన పుటల గుచ్ఛమిది.. పాతిక మంది రచయితల హృదయ స్పందనల ‘విభిన్న’ కథాకథనాల వర్తమాన దర్పణమిది” అని వెనుక అట్టమీద ముద్రించిన వ్యాఖ్యలు సముచితంగా ఉన్నాయని పాఠకులు ఈ కథలు చదివాకా, అంగీకరిస్తారు.
~
వస్తు వైవిధ్యం, భిన్నమైన రచనా శైలులు, కథను నడిపే కొత్త తీరులు, ఇతివృత్తాల ఎంపిక ఈ సంకలనాన్ని పేరుకు తగ్గట్టే విభిన్నంగా మార్చాయి. ఏ మాత్రం నిరాశపరచని పుస్తకం!
***
సంపాదకత్వం: శ్రీమతి శాంతి కృష్ణ
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పేజీలు: 200
వెల: ₹ 200/-
ప్రతులకు
శ్రీమతి శాంతి కృష్ణ:
9502236670
శ్రీ నవీన్:
8309686404
~
‘విభిన్న’ కథా సంకలనం సంపాదకురాలు శ్రీమతి శాంతికృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-sathi-krishna/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.