Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెయ్యేళ్ళనాటి లెక్కల మాష్టారు పావులూరి మల్లన

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘వెయ్యేళ్ళనాటి లెక్కల మాష్టారు పావులూరి మల్లన’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ఒకే యుగం, ఇద్దరు అద్భుతమైన ప్రభువులు, భిన్నమైన భాషలు – కానీ ఒకే లక్ష్యం! మాతృభాషాభివృద్ధి.

11వ శతాబ్దిలో కన్నడ, తెలుగు ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకున్న రెండు శక్తివంతమైన సామ్రాజ్యాల కథ ఇది.

ఒకవైపు కళ్యాణిని రాజధానిగా మార్చుకున్న పశ్చిమ చాళుక్య చక్రవర్తి జగదేకమల్ల జయసింహ (రెండవ జయసింహ, క్రీ.శ. 1015–1042), మరోవైపు రాజమహేంద్రవరాన్ని తన పాలనా కేంద్రంగా కలిగి ఉన్న తూర్పు చాళుక్య చక్రవర్తి రాజరాజ నరేంద్రుడు (రాజరాజేంద్ర చోళ, క్రీ.శ. 1018–1061).

రాజ్యపాలనా ఔన్నత్యం, భాషా సంరక్షణ – ఈ రెండు అంశాలే చరిత్రలో వీరి పాత్రను చిరస్మరణీయం చేశాయి.

పోరాటాల మధ్య భాషా పరిరక్షణ

జయసింహ పాలనలో పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం అనేక యుద్ధాలకు తెరతీసింది. మాళవ ప్రభువులైన పరమారులతో, తమిళ చోళ ప్రభువులతో నిరంతర దండయాత్రలు.. మరోవైపు తూర్పు చాళుక్యుల ప్రతాపం. అయినా, జయసింహుడు భాషా సంరక్షణకు వెనకడుగు వేయలేదు.

రాజరాజ నరేంద్రుడు, తన తల్లి వైపు సంబంధాల కారణంగా, చోళ రాజవంశానికి చేరువయ్యాడు. మేనమామలైన చోళుల మద్దతుతో సింహాసనాన్ని కాపాడుకున్నాడు. కానీ, జయసింహుడికి ఇలాంటి అండ ఏదీ దొరకలేదు. ఒంటరిగా పోరాటం చేశాడు. చోళుల దాష్టీకం నుండి కన్నడ నేలను, కన్నడ భాషను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. చోళులతో శత్రుత్వం కారణంగా, రాజరాజ నరేంద్రుడు అతని ప్రత్యక్ష విరోధిగా మారాడు.

ఈ సమరాల్లో గెలుపోటముల వివరాలు అలా వుంచితే, భాషా సంరక్షణలో ఎవరు ముందున్నారు? అన్న ప్రశ్న చరిత్రపుటల్లో నిలిచి ఉంటుంది.

కన్నడ సాహిత్య పరిరక్షణ, అభివృద్ధి క్రీ.శ. 8వ శతాబ్ది నాటికే ప్రారంభమైంది. పంపమహాకవి, ఇంకా ఇతర కన్నడ కవులు పురాణేతిహాసాలను కన్నడ భాషలోకి అనువదించడం ప్రారంభించారు. ‘విక్రమార్జున విజయం’ అనే మహాభారత కావ్యాన్ని పంప మహాకవి రచించాడు. కన్నడలో ‘ఆదికవి’ అనే ప్రసిద్ధిని ఆయన పొందాడు.

తెలుగులో నన్నయకు పూర్వం ఏ కావ్య రచనా ఇంతవరకూ కనిపించలేదు. 8వ శతాబ్దిలో భవభూతి, వాక్పతి రాజ, దండి వంటి సంస్కృత కవులెందరో ఉన్నా, వారు తెలుగులో రచనలు చేశారా? లేదా? చేసినా, అవి నశించాయా? అన్నది తేలలేదు.

రాజరాజ నరేంద్రుడి తెలుగు భాషోద్యమం

తెలుగు భాషోద్యమాన్ని ఎవరు ప్రారంభించారని ప్రశ్నిస్తే, మొదట చెప్పవలసిన పేరు రాజరాజ నరేంద్రుడిదే! తెలుగు భాషకు స్వతంత్రంగా స్థానం కల్పించాలనేది ఆయన సంకల్పం. అందుకే నన్నయ భట్టారకుని ఆహ్వానించి, మహాభారతాన్నిజగద్ధితంగా తెలుగులో రచించమని కోరాడు. ఆ విధంగా ‘ఆంధ్ర మహాభారతం’ రూపంలో తెలుగు సాహిత్య స్వర్ణయుగానికి నాంది పలికాడు రాజరాజ నరేంద్రుడు. కాగా, తెలుగు ఆదికవిగా ప్రసిద్ధిని నన్నయ పొందాడు.

ఇక్కడ ‘జగత్ హితంగా’ అనే పదం చాలా ముఖ్యమైనది. సాహిత్య ప్రయోజనం జగత్ హితమే కదా! యుద్ధం సర్వనాశనాన్నే తెస్తుంది సాహిత్యాది కళలపోషణ జగత్ హితాన్ని ప్రపంచ శాంతిని కలిగిస్తుంది ఈ ఇద్దరు ప్రభువులూ ఈ శాతిసందేశాన్ని గుర్తించటంలో సమానంగానే పోటీ పడ్డారు.

జయసింహుడు చావుండరాయ అనే కన్నడ కవిని తన ఆస్థానానికి ఆహ్వానించి, సామాన్యుడి కోసం విజ్ఞాన శాస్త్ర రహస్యాల్ని విడమర్చి చెప్తూ లోకోపకారకమైన ఒక గ్రంథాన్ని వెలయించవలసిందిగా కోరాడు. చావుండరాయ క్రీ.శ. 1025లో ‘లోకోపకార’ పేరుతోనే ఒక విజ్ఞాన సర్వస్వ గ్రంథాన్ని రచించాడు. కన్నడంలో తొలి విఙ్ఞాన శాస్త్ర గ్రంథం ఇదే! అదే విధంగా, రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లన అనే గణిత శాస్త్రజ్ఞుడిని ప్రోత్సహించి, ‘సారగణితసంగ్రహం’ అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచింపజేశాడు. తెలుగులో తొలి గణితశాస్త్ర గ్రంథం ఇదే!

భాషాభివృద్ధికి తోడు – ఆలయ నిర్మాణాలు

తెలుగు, కన్నడ వారసత్వాలను ప్రతిబింబించే నిర్మాణాలను చేయాలని ఈ ఇద్దరు ప్రభువులు సంకల్పించారు. భాషాభివృద్ధికి తోడు, ఆలయ నిర్మాణాల్లోనూ వీరు ముందంజ వేశారు.

జయసింహుడు – కళ్యాణి, బల్కి, మలఖేడ్ ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు చేపట్టి శిల్పకళను ఉద్ధరించాడు.

రాజరాజ నరేంద్రుడు – ద్రాక్షారామం, సామర్లకోట, రాజమహేంద్రవరంలో దేవాలయాలను నిర్మించి, వారసత్వ కళలకు ఊతమిచ్చాడు. ఈ విధంగా, 11వ శతాబ్దం తెలుగు-కన్నడ చరిత్రలో కీలక శతాబ్దంగా నిలిచింది.

ఆరోగ్యదాయక పోటీ అంటే ఇలా ఉండాలి!! ఒకరికి కన్నడ భాషా గౌరవం, మరొకరికి తెలుగు భాషా వారసత్వం వెయ్యేళ్ల క్రితం తెలుగు, కన్నడ ప్రజలను ఎంత పులకింపచేశాయో ఊహించవచ్చు.

పావులూరి మల్లన కథ

పావులూరి మల్లన పేరుతో ఇద్దరు కవులున్నారు. ఒకాయన గణితశాస్త్ర వేత్త కాగా ఇంకో ఆయన భద్రాద్రి రామశతకము వ్రాశాడు. భద్రాద్రి రామశతకం వ్రాసిన పావులూరి మల్లన గారు తన గురించి కొన్ని పద్యాల్లో చెప్పుకున్నాడు. ఈ పద్యాన్ని చూడండి:

శ్రీమహీత పావులూరి సు
ధాముడు రామన్న మంత్రి తనయుఁడ కవి సు
త్రాముడ మల్లనసచివుఁడ
శ్రీమద్భద్రాద్రిధామ శ్రీరఘురామా”

దీన్నిబట్టి ఈ మల్లన గారు రామన్న మంత్రి అనే ప్రభుత్వోద్యోగి కుమారుడు. పాపమ్మ తల్లి పేరు. పావులూరు అనే ఊళ్ళో ఉండేవాడు. వీళ్లది వాశిష్ఠ గోత్రం. ఆపస్తంభ సూత్రుడు.

గణిత శాస్త్రవేత్త పావులూరి మల్లన తన గురించి కూడా కొన్ని పద్యాల్లో చెప్పుకున్నాడు. ఈ పద్యాన్ని చూడండి:

ఇల గమ్మనాటిలోపల
విలసిల్లిన పావులూరి విభుఁడను సూత్రా
కలితాప స్తంభద్విజ
కుల తిలకుఁడ వినుత-గార్గ్య గోత్రోపద్భవుడన్”

ఈ గణిత శాస్త్రవేత్త గార్గ్యగోత్రీకుడు. గార్గ్య గోత్రీకులైన ఉన్నవ వారు తాము మల్లన వంశీకులమని ఇప్పటికీ చెప్పుకుంటారు వాళ్లు ఆరువేల నియోగులు. కాబట్టి ఈయనా ఆ శాఖవాడే కావచ్చు. కమ్మనాటి లోపల విలసిల్లినవాడిగా తనను చెప్పుకున్నాడు. చారిత్రక యుగాలలో గుంటూరు ప్రకాశం జిల్లాల మధ్యప్రాంతాన్ని కమ్మనాడు అనేవారు.  పావులూరు అనే గ్రామం బాపట్ల దగ్గర ఉంది.

శ్రీనిలయుండు శివ్యనయుఁ జిమ్మనయుం గుణసూర్య దేవుడున్
ధీనిధి పోలనార్యుఁడును దేజమునన్‌ రవితుల్యులైన యీ
సూనుల నల్వురం బడసె నూరిజనస్తుతులైన సత్య వి
జ్ఞానులు పద్మగర్భుపదనంబులు నాలుగుఁ బోలు వారిలోన్”

శ్రీలలనేశుఁ డాంధ్రనృపశేఖరుఁడై చను రాజరాజభూ
పాలకుచేతఁ బీఠపురి పార్శ్వమునన్‌ నవఖండవాడ యన్
ప్రోలు విభూతితోఁ బడసె భూరిజనస్తుతుఁడైన సత్కళా
శీలుఁడు రాజపూజితుఁడు శివ్యనపుత్రుఁడు మల్లఁ డున్నతిన్”

శివన్న గౌరమ్మలు ఈయన తల్లిదండ్రులు. రాజరాజ భూపాలకుడి ద్వారా ‘నవఖండవాడి’ అనే అగ్రహారాన్ని పొందిన మల్లన గారికి ఈ పావులూరి మల్లన మనుమడు. కాబట్టి ఇతను నిస్సందేహంగా నన్నయగారి చివరి రోజుల్లో యువశాస్త్రవేత్త అయి ఉండాలి.

ఆంధ్రమహాభారత రచన చేసిన నన్నయ, కుమారసంభవ కర్త నన్నిచోడుడు, శివతత్వసారం వ్రాసిన మల్లికార్జున పండితుడు, గణిత శాస్త్రవేత్త పావులూరి మల్లన, ఇంకా వేములవాడ భీమకవి, అదర్వణాచార్యుడు, నారాయణభట్టు, కవి భల్లటుడు ఇలా అనేక మంది తెలుగు కవులు ఆ కాలంలో కనిపిస్తారు. వీరంతా నన్నయగారి ఆంధ్రమహాభారత రచన తరువాతే వాసికెక్కినవారని అంగీకరించినప్పటికీ, ఒక వందేళ్ల కాలంలో ఒకరికొకరు సీనియర్లుగానో, జూనియర్లుగానో, సమకాలికులై ఉండే అవకాశం ఉండవచ్చు.

తెలుగు భాషపై సంస్కృత ప్రభావం

కన్నడ వారు అంతకు వందేళ్ల ముందే పురాణాలను, ఇతిహాసాలను కన్నడీకరించుకునే ప్రయత్నాలు ప్రారంభించినా, తెలుగు వారికి సంస్కృత భాషపట్ల గల గాఢానురక్తి, అదికూడా దైవభాష అనే ప్రగాఢమైన నమ్మకం కారణంగా, బహుశా సంస్కృతంలో ఉన్న పురాణాదుల్ని తెలుగులోకి తేవటానికి ఇష్టపడకపోవడం ఈ ఆలస్యానికి ఒక కారణం కావచ్చు.

రాజరాజ నరేంద్రుడు సాక్షాత్తు సార్వభౌముడు స్వయంగా మహాభారత ఇతిహాసాన్ని తెనిగించమనటం, సంస్కృతానికే పరిమితమైన అంశాలు తెలుగులో కూడా తేవచ్చుననే భావన కలగటానికి దోహదం చేసిందని భావించాలి. రాజరాజ నరేంద్రుడి వలన తెలుగు భాషకు కలిగిన మహోపకారం ఇదే! అందుకే ఆయన్ను తెలుగు భాషోద్యమానికి ఆద్యుడని పిలవడం న్యాయమైనది.

మహావీరాచార్య ప్రభావం

10వ శతాబ్దికి బౌద్ధం పూర్తిగా అంతరించిపోయినా, జైనుల ప్రాబల్యం ఇంకా కనిపిస్తుంది. వారికి భాష విషయంలో పట్టింపులు పెద్దగా లేవు. జైనులకు గణితంతో అనుబంధం ఉంది. జైన ధర్మాలకు చెందిన నాలుగు అనుయోగాలలో గణితశాస్త్రం ఒకటి. వేదధర్మాలను పాటించే హిందువులు ‘శబ్ద బ్రహ్మణి నిష్టాతః పరబ్రహ్మాధి గచ్ఛతి’ అనే సిద్ధాంతాన్ని నమ్మినట్టే, జైనులు గణిత శాస్త్రంలో పాండిత్యం వలన సంసారబంధం నుండి విముక్తి కలుగుతుందని విశ్వసించేవారు. లెక్కలు వచ్చాయంటే చాలు, జీవితాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదనే భావన! అందువల్ల జైనం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ గణితశాస్త్రం కూడా ఉండేది.

మహావీరాచార్యను ప్రోత్సహించిన మొదటి రాజు అమోఘవర్ష నృపతుంగ చక్రవర్తి. ఇతను రాష్ట్రకూట చక్రవర్తుల్లో అత్యంత ప్రసిద్ధుడు. వేంగి చాళుక్యులను ఓడించి కొంతకాలం తెలుగు నేలనూ పాలించాడు. ఇతను కన్నడ, సంస్కృత భాషల్లో నిష్ణాతుడు. కన్నడ సాహిత్యంలో తొలి కావ్యంగా పేరొందిన ‘కవిరాజమార్గ’ గ్రంథాన్ని వ్రాసినవాడు.

క్రీ.శ. 9వ శతాబ్దికి చెందిన మహావీరాచార్యుడు కన్నడ జైన దిగంబరుడు. సంస్కృతంలో ‘గణిత సార సంగ్రహం’ అనే గ్రంథాన్ని వ్రాశాడు. క్రీస్తు శకారంభం నుంచి సంస్కృత భాషలో ఎందరో గణిత శాస్త్రవేత్తలు తమ మేధోసంపత్తితో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఆర్యభట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య వంటి ప్రముఖ గణితశాస్త్రవేత్తల రచనలు అప్పటికే అందుబాటులో ఉన్నాయి.

ఈ మహావీరాచార్యుడు గణితాన్ని అనేక విభాగాలుగా వర్గీకరించి వివరించాడు. అంకగణితం (Arithmetic), బీజగణితం (Algebra) గణిత సూత్రాలు (Mathematical rules), ఖగోళ గణితం (Astronomical calculations), వస్తువుల కొలతలు (Mensuration) లాంటి అంశాలున్నాయి. వరాహమిహిరాది ఖగోళ, గణిత శాస్త్రాలను కలిపి రచనలు చేశారు. మహావీరాచార్యుడు మాత్రం గణితాన్ని వాటి నుంచి వేరు చేసి వివరించడం ఒక ప్రత్యేకత.

మహావీరాచార్యుని విశిష్టత

జైన గెజెట్ (29వ సంపుటి, జనవరి 1988 సంచిక) లో సి. ఎల్. కాళ్ అనే పరిశోధకుడు ‘గణితసార సంగ్రహం’ గ్రంథాన్ని వర్థమానాచార్యుడు వ్రాసినట్లు జైన రికార్డులను ఉటంకించాడు. మహావీరాచార్యుడికే వర్థమానాచార్యుడనే నామాంతరం ఉండవచ్చని వేదం లక్ష్మీనారాయణ శాస్త్రిగారు 1944 మే నెల ‘భారతి’ పత్రికలో వ్రాశారు.

‘పేరుసోములు’ కైఫీయత ఆధారంగా చూస్తే, భూమి కొలతలకు సంబంధించిన ప్రమాణాలు మహావీరాచార్య గణితం ఆధారంగా నిర్ణయించేవారని తెలుస్తుంది. ఈ గ్రంథం 1800 వరకు తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండేదని, ఆ తరువాత కనుమరుగై, 1910 ప్రాంతాల్లో రంగాచార్యుల కళ్లలో పడిందని భావించవచ్చు.

1912లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ఆచార్యుడు ఎం. రంగాచార్యులు ఈ గ్రంథాన్ని సంపాదించి, ఆంగ్ల అనువాదంతో మద్రాసు ప్రభుత్వం తరఫున ప్రచురించాడు.

గణితంలో మహావీరాచార్యుని విశిష్టత

మహావీరాచార్యుడు నిత్యజీవితంలో గణిత ప్రాముఖ్యతను వివరించాడు. ప్రేమ విషయాల్లోనూ, వంట విషయంలోనూ గణితాన్ని ఉపయోగించవచ్చని వాడు విశదీకరించాడు.

క్రీ. పూ. 500-100 మధ్యకాలంలో జైన పండితులు గణితశాస్త్రంపై ఎక్కువ దృష్టి సారించారు. లోగరిథం (సంవర్గమానం)ల గురించి కూడా వారికీ ఆనాడే తెలుసు. కానీ, ఆధునిక శాస్త్రం లోగరిథమ్ 16వ శతాబ్దిలో జాన్ నేపియర్ కనుగొన్నట్టు పేర్కొంటుంది.

దక్షిణాది గణిత శాస్త్రవేత్తలకు ఉత్తరాదివారు పట్టింపులు లేకపోవడం, భారతీయ గణిత శాస్త్రాన్ని యూరోపియన్ శాస్త్రవేత్తలు గుర్తించకపోవడం మనకు శాపమని చెప్పాలి. ఇప్పటికైనా ఈ విషయాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడం మేధావుల బాధ్యత!

మహావీరాచార్య గణితంలో గమ్మత్తులు

139X 109=5151
27994681X441= 12345654321
333333666667X33=11000011000011
12345679X9=111111111
152207X73=11111111

మల్లనను చిన్నచూపు చూసిన తెలుగు పండితులు

మహావీరాచార్యుడు 9వ శతాబ్దిలో కర్ణాటక ప్రాంతంలోని మైసూరులో పుట్టాడు. రాష్ట్రకూట రాజవంశానికి చెందిన అమోఘవర్ష నృపతుంగ చక్రవర్తి (క్రీ.శ. 815-874) ఆస్థాన పండితుడిగా సేవలందించాడు. అమోఘవర్షుడు కన్నడ, సంస్కృత సాహిత్యాభిమానిగా, జైన మతాభిమానిగా పేరు గాంచాడు. ఈయన ఆస్థానంలో జ్యోతిషం, గణితం, ఆయుర్వేదం పండితులు కూడా ఉండేవారు.

మొత్తం మీద, పావులూరి మల్లన కన్నా కనీసం 180 యేళ్ల ముందు ఒక గణిత శాస్త్ర గ్రంథం ఉండేదని భావిస్తూ, దాన్నే మల్లన గారు అనుసరించారనే అభిప్రాయాన్ని మన పండితులు చాలా త్వరగా ఏర్పరచుకున్నారు. కన్నడ వారు ఆ మాట అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఆ అభిప్రాయం చెప్పింది తెలుగు పండితులే!

మల్లన గారు మూల రచయిత పేరు మరుగుపరచాడని, మూలగ్రంథమైన ‘గణితసార సంగ్రహం’ను పేరు తలకిందులు చేసి ‘సంగ్రహ సార గణితం’ అన్నాడని, అతన్ని ఒక కాపీ రచయితగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి.

వేటూరి ప్రభాకరశాస్త్రి, రంగాచార్యులు మల్లన రచన మహావీరాచార్య గ్రంథానికి అనువాదమో, అనుసరణో కాదనీ, స్వతంత్రమైనదేనని అభిప్రాయపడ్డారు. వీరేశలింగం గారు మహావీరాచార్యుని రచనకు తెలుగు అనువాదమేనని తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు. చాలా పేజీలు ఇదే విషయమై వాదోపవాదాలతో వృథా అయ్యాయి. మహావీరాచార్యునికైనా, పావులూరి మల్లన కైనా మూల గ్రంథాలు ఆర్యభటాదులు వ్రాసినవే కదా!

మల్లన తన పావులూరి గణిత శాస్త్రాన్ని భాగహార గణితం, సువర్గ గణితం, మిశ్ర గణితం, భిన్నగణితం, క్షేత్ర గణితం, ఖాత గణితం, ఛాయా గణితం, సూత్ర గణితం, ప్రకీర్ణ గణితం, ప్రాంతీయ కొలమానాల వినియోగం అనే పది విభాగాలుగా విస్తరించాడు. Multiplication, division వంటి విభాగాల్లో సంఖ్యల ప్రతిబింబ (Symmetrical) ఉల్లేఖనలు చేస్తూ, కొత్త ఉదాహరణలు ప్రవేశపెట్టారు. ఇది తెలుగులో గణితాన్ని సరళతరం చేసింది. “ఆల్జిబ్రా అంటే గుండె గాబ్రా” అనే భయం లేకుండా, లెక్కలంటే భయపడే పరిస్థితిని తొలగించాడు మల్లన.

మల్లన గణిత శాస్త్రం వలన తెలుగు, ఇతర ద్రావిడ భాషల్లో గణిత పరిజ్ఞానం పెరగడానికి ఈ గ్రంథం తోడ్పడింది. ఆయన మార్గాన్ని అనుసరించే భాస్కరాచార్యుని ‘లీలావతి గణితం’ లాంటి రచనలు వెలువడే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా “పావులూరి గణిత శాస్త్రం” తొలి గణిత శాస్త్ర గ్రంథంగా నిలిచింది.

పావులూరి మల్లన గారి ఆల్జీబ్రా లెక్క

ముగ్గురు వ్యాపారులకు రోడ్డుమీద ఓ డబ్బు సంచీ దొరికింది. ఒక వ్యాపారి అన్నాడు “ఈ డబ్బుసంచీయే నాకు దొరికి ఉంటే మీ ఇద్దరి దగ్గరున్న దానికంటే రెట్టింపు డబ్బు ఉండేది” అన్నాడు. ఆ సంచి నాకు దొరికితే మీ ఇద్దరికన్నా మూడురెట్లు డబ్బు తన దగ్గరుండే దన్నాడు రెండో వర్తకుడు. నాకు దొరికి ఉంటే మీ ఇద్దరి దగ్గర ఉన్నదానికన్నా 5 రెట్లు ఎక్కువ ఉండేదన్నాడు మూడో వర్తకుడు. అసలు అ సంచిలో డబ్బెంత ఉంది? వాళ్ళ ముగ్గురి దగ్గరా ఎంతెంత ఉంది?

సంచిలో డబ్బు p, మొదటి వ్యాపారి డబ్బు x, రెండో వ్యాపారి డబ్బు y,  మూడో వ్యాపారి డబ్బు z అనుకుంటే ఈ లెక్కకు ఈవిధంగా ఫార్ములా వ్రాయవచ్చు: p+x=2(y+z), p+y=3(x+z), p+z=5(x+y) అని! బీజగణితం పద్ధతిలో ఈ లెక్కను చేస్తే p=15, x=1, y=3, z=5 అవుతుంది. ఇలా ఉంటుంది మహావీరాచార్యుని గణిత విధానం.

మల్లన కవిత్వపు పోకడ

నన్నయ సంస్కృత శ్లోకాలను ఉపయోగించినట్టే, పావులూరి మల్లన కూడా ప్రతి అధ్యాయాన్ని సంస్కృత శ్లోకంతో ప్రారంభించాడు. ఇవన్నీ నన్నయ కాలం నాటి కవుల అలవాటుగా పండితులు విశ్లేషిస్తారు.

వీరేశలింగం గారు, నిడుదవోలు వెంకటరావు గారు “ఈ పావులూరి గణితం మహావీరాచార్యుల సంస్కృత గ్రంథానికి భాషాంతరీకరణమే, కానీ ఇందులోని లెక్కలన్నీ స్వతంత్రంగా కల్పించబడ్డవే” అని వ్రాశారు. లెక్కలు పోగా మిగతాదంతా శాస్త్రం. దాన్ని ఉన్నదిన్నట్లు తెలుగులో చెప్పాడు. దీన్ని భాషాంతరీకరణం అన్నంత మాత్రాన కవి ప్రతిభ తక్కువ కాదు.

కొంతమంది దీన్ని ఆంధ్ర జైన గ్రంథంగా చిత్రించే ప్రయత్నం చేశారు. మహావీరాచార్య ‘జినాలయం’ అంటే, ఈయన ‘శివాలయం’ అన్నాడు. మల్లన శైవుడు. రాజరాజ నరేంద్రుడు కూడా శివభక్తుడే, కానీ, తెలుగు భాషాభిమాని. ఏ విషయాన్నైనా తెలుగులోకి తేవాలనే యావ ఆయనది. మల్లన గారిది కూడా అదే లక్ష్యం. మాతృభాష పట్ల అంకితభావం లేకుండా అలవాటు లేని అపోఽశనం లాగా తెలుగు పద్యాల్లో గణితాన్ని వ్రాయాలనే శ్రమకు పూనుకోలేరు ఎవరూ!

తెలుగు వారి తూనికలు, కొలతలు, ప్రమాణాలు ఈ గ్రంథంలో ప్రముఖంగా కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి కొలతలకు సంబంధించిన ప్రామాణికత ఈ గ్రంథానికి ఉంది. ఇందులో కొన్ని “చాప్టర్ల అప్రక్షిప్తాలు” ఉన్నాయని, నిడుదవోలు వెంకటరావు గారు ‘కాకతీయ ప్రతాప రుద్రుడి’ పేరు ఇందులో ప్రస్తావించబడడం లాంటి కొన్ని విషయాలను ఎత్తిచూపారు.

మహావీరాచార్యుడికి రెండు శతాబ్దాల తరువాతి వాడు రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ. 11వ శతాబ్దం). రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, అమోఘవర్షుడి ప్రభావం రాజరాజ నరేంద్రుడిపై కొంత ఉండవచ్చు. అందుకే, నన్నయ గారిని భారత రచనకు, పావులూరి మల్లన గారిని గణితశాస్త్ర రచనకు ప్రేరేపించాడు. ఆయన ఆస్థానంలో ఇతర రంగాలకు చెందిన పండితులు ఉండేవారేమో తెలియదు.

స్వయంగా గణిత శాస్త్రవేత్త అయిన పావులూరి మల్లన గోదావరి మండలంలోని పావులూరు గ్రామ కరణంగా ఉండేవాడని చెప్తారు. ఆ రోజుల్లో ‘కమ్మనాటి సీమ’ గా పిలువబడిన ప్రాంతంలో ఈ పావులూరు ఉంది.

“కావున, గణితము దెనుగున౦ |
గావింపంగ గణితిని సు |
కవిమల్లుడ గౌరీవల్లభచరణ సరో |
జావాసిత చిత్తమధుకరాత్ముండ జగతిన్”

ఇలా ఉంటుంది మల్లనగారి రచనా సంవిధనం.

వేగిదేశపు ప్రభువైన రాజరాజ నరేంద్రుడు తనకు ‘నవఖండవాడ’ అగ్రహారాన్ని మెచ్చి ఇచ్చాడని ఈ గ్రంథంలో చెప్పుకున్నాడు. అంతే గానీ, మహావీరాచార్యుడి రచనకు అనువాద గ్రంథమని గానీ, మహావీరాచార్యుడి పేరును గానీ ప్రస్తావించలేదు.

కాకినాడలో కొచ్చెర్ల శ్రీనివాసరావు గారు పావులూరి గణితపు తాటాకు ప్రతులను సంపాదించగా, వాటిని పోలవరం జమీందారు గారు, దురిశెట్టి శేషగిరిరావు గారు సంతకాలతో ప్రచురించారు. అలా మహావీరాచార్య, పావులూరి మల్లనల రచనలు ఆధునికంగా వెలుగులోకి వచ్చాయి.

మనకు పూర్వం ఏమీ లేదనీ, మనమే ఇప్పుడు సిద్ధాంతాల్లోంచి పుట్టామని, పాతనంతా తిరస్కరిస్తామనీ పోకరించే వారికి మల్లన జీవితం ఒక పాఠం. జాతి వికాసానికి పునాదుల్ని మరిచిపోకూడదు.

Exit mobile version