Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేయి కళ్లు!

[బాలబాలికల కోసం ‘వేయి కళ్లు!’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీ బోగా పురుషోత్తం.]

సుదర్శనపురాన్ని సుచికేతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి కళ్లు లేవు. అందుచేత తను పాలనను తన తమ్ముల్లు సూరప్పరాయుడు, సుదర్శనరాయుడికి అప్పగించాడు.

తమ్ముళ్లు పాలనను పర్యవేక్షించేవాడు సుచికేతుడు. వారానికోసారి సోదరులను తన వద్దకు రప్పించుకుని పరిపాలన ఎలా వుందో సమీక్షించేవాడు. వారు ప్రజలందరూ క్షేమమేనని, మీ పాలనలో కన్న బిడ్డల్లా రక్షించబడుతున్నారని చెప్పేవారు. అది విన్న సుచికేతుడు తను ఊహిస్తున్న శ్రీరామరాజ్య పాలన కొనసాగుతోందని భావించి ఆనందించేవాడు. అది “నిజమా? కాదా..?” అని తన భటుల ద్వారా రాజ్య పరిస్థితులను అడిగి తెలుసుకునేవాడు.

“ప్రభూ.. మీ తమ్ముళ్లు చెబుతున్నంతగా ప్రజాక్షేమ పాలన ఏమీ కొనసాగడం లేదు.. ప్రజలు అధిక ధరలు, అవినీతి, సమస్యల మధ్య నలిగి పోతున్నారు..” అని చెప్పేవారు. అది విన్నసుచికేతుడుకి అది ప్రతక్ష్యంగా చూసి చక్కదిద్దాలని అభిలషించేవాడు. అయితే కళ్లు లేకపోవడంతో తెలిసేది కాదు.

ఓసారి తనే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లాడు సుచికేతుడు. ఓ కళ్లు లేని వృద్ధుడు “ప్రభూ మొన్న నేను వృద్ధాప్య పింఛను కోసం వస్తే రాజ ఉద్యోగులు బంగారు నగలు లంచంగా అడిగారు.. అంత ఆస్తి వుంటే నేను మీ దగ్గరకు వచ్చేవాడినే కాదు.. హాయిగా కూర్చొని తినేవాడిని” అని తన బాధను చెప్పుకున్నాడు.

మరో కళ్లు లేని యువతి “ప్రభూ.. నేను పట్టణంలో సరుకులు తీసుకోవడానికి వెళుతుండగా దొంగలు నా వద్ద వున్న వెయ్యి రూపాయలు లాక్కుని వెళ్లారు.. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము పరుల పాలు అయ్యింది. ఇక మా కుటుంబం పస్తులు వుండాల్సిందే.. దొంగలెవరో కనుక్కుని చెబుదామన్నా నాకు కళ్లు లేవు..!” అని అనడంతో రాజు మనసు చివుక్కుమంది. రాజ్యంలో జరుగుతున్న అవినీతి, దొంగతనం, దౌర్జన్యాలు, అక్రమాలను నిర్మూలించాలనుకున్నాడు.

వెంటనే తన తమ్ముళ్లను పిలిచాడు. “శ్రీరామరాజ్య పాలన చేయమంటే దొంగల, దోపిడీ, అవినీతి రాజ్య పాలన చేస్తారేమిటీ?” అని ప్రశ్నించాడు.

తమ్ముల్లకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. “అన్నా మీకు కళ్లు లేవు కదా.. వారి కష్టాలు ఏమి తెలుస్తాయి? కావాలంటే భటులను పిలిచి అడగండి.. పరిస్థితిని వివరిస్తారు..” అన్నారు రాజు తమ్ముళ్లు.

అది విన్న సుచికేతుడికి కోపం వచ్చింది. రాజ భటులను పిలిచాడు “పరిస్థితి వివరించండి..” అని ప్రశ్నించాడు.

భటులు “ప్రభూ.. అంతా బాగా వుంది.. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నమ్మేస్తారా? కావాలంటే రాజ్యంలో ప్రజల వద్దకు తీసుకెళతాం.. స్వయంగా మాట్లాడండి..” అని భటులు పొగడ్తలు వినిపించడంతో ఆశ్చర్యపోయాడు రాజు.

వెంటనే భటులను తీసుకుని ప్రజల వద్దకు వెళ్లాడు. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారికి లంచం ఇచ్చి వారి గొంతు నొక్కి పాలన చక్కగా వుందని, ప్రశంసల జల్లు కురిపించాడు.

సుచికేతుడికి అనుమానం వేసి అక్కడ జరుగుతున్న దేమిటో వారి మాటల సైగలను విని రాజు ‘పరిస్థితి అధ్వానంగా వుంది.. ఇక చక్కదిద్దకుంటే ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు..’ అని గ్రహించాడు.

అబద్ధం చెప్పిన రాజ భటులను పిలిచి “మీకు కళ్లు వున్నా జరుగుతున్న నిజాన్ని వివరించలేకపోయారు.. స్వార్థం పెరిగిపోయింది. మీకంటే కళ్లులేని నేనే నిజాన్ని గ్రహించగలుగుతున్నాను.. కళ్లు వుండి ఏమి లాభం? మీ కళ్లు తీసివేసి కళ్లులేని వాళ్లకు అమర్చుదాం..” అప్పుడు వాళ్లు సమాజంలో జరుగుతున్న నిజాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతారు..” అని “ఎవరక్కడ? వెంటనే వీరి కళ్లు పీకి కళ్లులేని వారికి అమర్చండి..” అని ఆజ్ఞాపించాడు రాజు.

రాజ భటులు గజగజ వణికిపోయారు. ప్రభూ.. మా కుటుంబాలు అనాథలు అవుతాయి.. దయచేసి మా కళ్లు తీసేయకండి.. జీవితాంతం మీ పాదాల వద్దే గడుపుదాం..” అని వేడుకున్నారు.

వెంటనే తన తమ్ముళ్లను పిలిచి పాలనా బాధ్యతల నుంచి తొలగించాడు. రాజ భటులను, ఉద్యోగులను వెంటనే తీసివేశాడు. రాజ్యంలో కళ్లులేని వారిని అన్ని విభాగాల్లో నియమించాడు.

అప్పటి నుండి వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించారు.

నిజాయతీతో లంచగొండితనం, అనినీతి, అధిక ధరలు, సమస్యలను చక్కదిద్ది ప్రజలకు శ్రీరామరాజ్య పరిపాలన అందించాడు రాజు.

కళ్లు లేకున్నా సమర్థవంతంగా పరిపాలిస్తున్న వారిని చూసి పాలన అంటే ఏమిటో నేర్చుకోవాలని హితవు పలికాడు. వేయి కళ్లతో ప్రజలకు ఏ కష్టాలు రాకుండా సుదర్శన పురాన్ని ప్రజారంజకంగా పాలించాడు సుచికేతుడు.

Exit mobile version