[శ్రీమతి షేక్ కాశింబి గారు రచించిన ‘వేటు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మనిషి మనిషికో ముసుగు
మనసు మనసుకో తొడుగు
బుసలు కొట్టే కసికో మరుగు
వెల్లువయ్యే అసూయకో కలుగు
ఎదురుగా ఓ మనిషి నవ్వుతూ
ప్రక్కనే మరో మనిషి చెయ్యి కలుపుతూ
దూరంగా ఓ మనిషి నీకేసే నడుస్తూ
దగ్గరగా మరో మనిషి ప్రేమ నటిస్తూ
పరిచయమున్న వాడొకడు
బొత్తిగా తెలియని వాడింకొకడు
ఆపదలో అల్లాడుతూ ఒకడు
ఆనందంలో తేలియాడుతూ మరొకడు
ఏ మనిషినీ నమ్మడానికి లేదు
ఏ ఒక్కరిని రమ్మనడానికీ లేదు
ఎవరికీ మనసు విప్పి చెప్పడానికి లేదు
ఎవరిని గుచ్చి గుచ్చి అడగడానికీ లేదు
మన చుట్టూ మనుషులుంటారు
మనతో మాట్లాడుతుంటారు
మనల్ని నవ్విస్తూ.. కవ్విస్తూ ఉంటారు
మననించి ఏదో కాజేసి వెంగళప్పల్ని చేస్తుంటారు
అనుబంధం.. ఆత్మీయత
మమకారం.. సహకారం
మంచిదనం.. సహాయం
‘మన’ దనం.. మానవత్వం
ఎప్పుడో మాయమాయ్యాయి
ఇప్పుడున్న సంబంధాలన్నీ
కనిపించని ముసుగులతోనే
కనిపించే లొసుగులతోనే
‘హాయ్’, ‘బాయ్’ లతో సరిపెట్టుకునే పలకరింపులు
ముఖంపై కృత్రిమ నవ్వుని పులుముకున్న పరిచయాలు
మనో స్పందనలు కరువైన అనురాగాలు
పేరుకే ఉన్నాయాన్న భ్రమల బంధాలు
కాదు కూడదని ఇంతకు మించి ఆశించావా..
తప్పదు సుమా భరించలేని భంగపాటు
ఈ గీత పొరబాటున దాటేవో..
పడక మానదు మనసుపై కరకుదనపు గొడ్డలి వేటు!
