నాలుగు మాటలని గుండెల్లో వేసి
ఉయ్యాల వూచితే పాటవుతుంది
రాగాన్ని రాతలతో కలిపి రంగరిస్తే..
పదునెక్కిన పద్యం పల్లవి అందుకుంటుంది
చరణాలు చరణాలు గా కిరణాలు వెదజల్లే
వేకువ పూదోట పరిమళం పాట
అలలు అలలుగా దూకే.
అనుభూతుల జలపాత పరవశమూ పాటే.
మై మరచిపోయినప్పుడు
దారి తప్పిన మనసు తిరిగే సంతోషాల బాట పాట
భాషకు కొత్తబట్టలు వేసిముస్తాబు చేసే
భావ ప్రభావవిభవ ప్రవాహం పాటే కదా
గగుర్పొడిచే డప్పు చర్మం మీద చప్పుడు లో
దరువేసి చిందులేస్తు సందడి చేసేది పాటే
వేట కొడవలి పట్టి వెంటపడ్డట్టు
విప్లవ బాణీల వీరంగ ధీరత్వమూ పాటే
జాతరలో ఊగిపోతూ గెంతే పోతురాజు లా
పాదాలకు పారాణి పూసుకు
మంగళారతులు పాడే ముత్తైదవ ముగ్ధ రూపంలా
పండగ వేళ పావడా కట్టిన పడచుపిల్ల
వయ్యరాల వన్నెల్లో విరిసిన వెన్నెల్లా
పాటెప్పుడూ ఆపాత మధురమే
ఒక పాట మాత్రం.. పూట గడవక చితికిపోయిన బతకుని
చింతల చితిమీద తగలేస్తున్నట్టు చిటపట లాడుతూ
ఆకలిమంటల ఆఖరి రాగం పాడుతుంది
ఆర్తుల బగ్గమీంచి జారిపడే కన్నీటి బొట్ల టపటపల్లో..
కలిసి కరిగిన నిశ్శబ్ద శోక గీతమై కాలాన్ని వెంటాడుతుంది.
గరిమెళ్ళ వి.ఎన్. నాగేశ్వర రావు గారు జవహర్ నవోదయ విద్యాలయ, విశాఖపట్నంలో ఉపాధ్యాయులు. వీరి 300 పైగా కవితలు, 50 కథలు, 40 బాలల కథలు, గేయాలు,వ్యాసాలు వివిధ పత్రికలలో అచ్చయినవి.
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారంతో పాటు విద్యారంగంలో సాంకేతికత మేళవించి రూపొందించిన అంశాలకు 9 సార్లు జాతీయ పురస్కారాలు, సాహిత్యరంగంలో ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 90 కి పైగా పురస్కారాలు పొందారు.