[బాలబాలికల కోసం ‘వెన్నుచలువ’ అనే జాతీయం కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]
గోపాలపురం అనే పల్లెటూరులో సీతాపతి, లక్ష్మి దంపతులు నివసించేవారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు హరిత, రెండవది సరిత, మూడో కూతురు రమ్య. సీతాపతికి హరిత అంటే అమితమైన ప్రేమ. ఏ వస్తువైనా, కొత్త బట్టలైనా ముందుగా హరితకే కొనేవాడు.
ఒక రోజు భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మి భర్తతో, “మనకి ముగ్గురు పిల్లలు, కానీ మీరు ఒక్క హరితని మాత్రమే ప్రేమగా చూస్తున్నారు. మిగతా ఇద్దరిని పట్టించుకోవడం లేదు” అని అసహనంగా అంది.
“హరిత పెద్దది కదా, కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది అంతే,” అన్నాడు సీతాపతి నవ్వుతూ.
“ఒకరు ఎక్కువేమిటి? మిగిలిన వారు తక్కువేమిటి? ముగ్గురినీ సమానంగా చూడాలి. మీరు పెద్దకూతురిని వెన్నుచలువ బిడ్డలా చూసుకుంటున్నారు,” అంది ఆమె కాస్త గంభీరంగా.
“వెన్నుచలువ బిడ్డా? అదేమిటి?” అని ఆశ్చర్యపోయాడు సీతాపతి.
“మా అమ్మమ్మ చెప్తుండేది. పూర్వం చిట్టిబాబు అనే దూరపు బంధువు ఉండేవాడట. అతనికి పెళ్లయిన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. గుళ్ళూ గోపురాలు తిరిగారు, నోములు వ్రతాలు చేశారు అయినా ఫలితం లేకపోయింది. అప్పుడు ఒక సాధువు అతనికి ‘వెన్నుచలువ చేసుకో నాయనా! సంతానం కలుగుతుంద’ని చెప్పాడట. ‘వెన్ను చలువ’ అంటే సంతానం లేని దంపతులు పరాయివాళ్ళ పిల్లను దత్తత తీసుకుని, కన్న బిడ్డలా పెంచుకోవడం అని అర్థం.
సాధువు మాటలు విని తమ్ముడి బిడ్డను తెచ్చుకొని పెంచుకున్నాడు. ఆ బిడ్డను కళ్లలో పెట్టి చూసుకునేవాడు. సాధువు చెప్పినట్టు, వెన్నుపై మోసిన చలువ బిడ్డ కారణంగా కొంతకాలానికి అతనికి నలుగురు పిల్లలు పుట్టారు. అయినా మొదటి బిడ్డ అంటేనే ఆయనకు మమకారం.
అప్పటి నుంచీ, ఎవరినైనా కన్నబిడ్డల కంటే ఎక్కువగా, విశేష వాత్సల్యంతో చూస్తే ‘వెన్నుచలువ బిడ్డలా చూసుకుంటున్నారు’ అని అనడం ఆనవాయితీ అయ్యింది,” అని వివరించింది లక్ష్మి.
సీతాపతి నిశ్శబ్దంగా కాసేపు ఆలోచించాడు. పిల్లలు పక్కగదిలో సరదాగా ఆడుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు.
వారిని చూసి సీతాపతి చిరునవ్వుతో “లక్ష్మీ! బాధపడకు. ఇకపై ముగ్గురినీ ఒకేలా చూసుకుంటాను,” అన్నాడు.
ఆ రోజు నుంచి గోపాలపురం లోని ఆ ఇల్లు ప్రేమ, సమానత్వం, వెన్నుచలువ వాత్సల్యంతో నిండిపోయింది.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
