[శ్రీ బద్రి రచించిన ‘వెంకటాచలానికి తొందరెక్కువ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
లోకమంతా ఒక తీరైతే, వెంకటాచలానిది మరో తీరు.
వాడికి అన్నీ తొందరే. ఆ తొందర వాడి నరనరాల్లో ప్రవహించేది. ఎంత తొందరంటే, తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి కూడా తొందరపడి, నెలలు నిండకముందే ఈ లోకాన్ని పలకరించాడు.
పిల్లలకు ఏడెనిమిది నెలలకు గానీ పళ్లు రావు, కానీ ఈ మహానుభావుడు ఐదో నెలకే చిగుళ్లలో ముత్యాలు మొలిచాయి. తొమ్మిదో నెలకే వాడి పాదాలు భూదేవిని పలకరించేందుకు తొందరపడ్డాయి. మాటలు కూడా అంతే! తోటి పిల్లలు “అమ్మా, నాన్నా” అనడానికి తడుముకుంటుంటే, వీడు గలగలా కబుర్లతో ఇల్లంతా నింపేసేవాడు.
బడిలో చేర్పించడం కూడా వాడి వయసు కంటే ముందే జరిగిపోయింది.
తెల్లవారుజామున కోడి కూత వాడికి మేలుకొలుపైతే, చెరువులోని చన్నీళ్లు స్నానం చేసి గుడి పూజారి గంట కొట్టకముందే, ఈ వెంకటాచలం గుడి తలుపుల ముందు ఉండేవాడు. ఆయన గర్భగుడి తాళం తీసేలోపే, వీడు గాలిదుమారంలా గుడి ప్రాంగణమంతా శుభ్రం చేసేసేవాడు. వాడిది నడక కాదు, అదో పరుగు.
ఏ పనైనా మొదలుపెట్టాడంటే, నిమిషాల్లో ముగించాల్సిందే. మూడు గంటల పరీక్షను గంటన్నరలోనే పూర్తి చేసి, మిగతా సమయం ఈగలు తోలుకుంటూ కూర్చునేవాడు. రాసింది సరిచూసుకోమంటే మాత్రం, బద్ధకమనేవాడు.
అందరికంటే ముందుండాలనేది వాడికో చిన్న పిచ్చి.
పది గంటల బస్సు కోసం ఏడు గంటలకే స్టేషన్లో కూర్చునే రకం. విచిత్రమేమిటంటే, వాడి అదృష్టం కొద్దీ ఆ బస్సో, రైలో ఓ గంట ఆలస్యంగానే వచ్చేది.
విధి కూడా వింతగా ఉంటుంది! అంతటి వేగమూర్తికి, నిదానానికి నిలువెత్తు రూపమైన కామాక్షితో ముడి పడింది . రాత్రి 1:32 గంటలకు జీలకర్ర బెల్లం పెట్టే శుభముహూర్తం అయితే, వీడి అసహనం రాత్రి 12:30 నుండే మొదలు. వాడిని ఆపడానికి వాళ్ల అమ్మ, నాన్నమ్మ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.
అతను సుడిగాలిలా దూసుకుపోతుంటే, ఆమె వేసవి సాయంత్రపు చల్లగాలిలా నెమ్మదిగా కదిలేది. పొలం పనులకు ఏడింటికి బయల్దేరాలంటే, ఆమె ఎనిమిది గంటలకు నిదానంగా చద్దన్నం మూట కట్టేది. మొదట్లో వెంకటాచలం కళ్లల్లో, గొంతులో అసహనం చిందులు వేసేది. “ఇంకా కాలేదా? అర్ధగంటయింది, గంటైపోయింది!” అని ప్రతిరోజూ అరిచేవాడు. అందుకు జవాబుగా కామాక్షి పెదవులపై ఓ శబ్దం లేని చిరునవ్వు మెరిసేది. కాలక్రమేణా, ఆమెను మార్చడం తనవల్ల కాదని అతనికి అర్థమైందో, లేక ఇతని వేగానికి తాను అందలేనని ఆమె నిర్ధారించుకుందో తెలియదు కానీ, వెంకటాచలం అరుపులైతే తగ్గుముఖం పట్టాయి.
కామాక్షి చేతివంట అమోఘం. ఆమె వండిన చేపల పులుసు, బొగ్గుల కుంపటిపై కాల్చిన వంకాయ పచ్చడి, చింతకాయ తొక్కు, నాటుకోడి ఇగురు.. అబ్బో, ఏది చేసినా అమృతంలా ఉండేది. కానీ ఆ రుచిని ఆస్వాదించే తీరిక ఆ సుడిగాలికి ఏది? ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చుంటే, ఆమె రెండో ముద్దలో ఉన్నప్పుడు, ఇతను మజ్జిగన్నంతో ముగించేసేవాడు. ఆమె గిన్నెలన్నీ సర్దుకుని పడకగదికి వచ్చేసరికి, ఇతను గాఢ నిద్రలోకి జారుకునేవాడు. ఆమె జిక్కీలా అందంగా పాడేది, కానీ ఆ పాటను పూర్తిగా వినే ఓపిక వీడికి ఎక్కడిది?
తిరుపతి కొండ మెట్లెక్కుతుంటే, ఆమె వంద మెట్లు ఎక్కేసరికి, ఇతను ఐదొందల మెట్టుపై నిలబడి ఆమె కోసం చూసేవాడు. ఒకరు వేగం, మరొకరు నిదానం.. వీరిద్దరి సంసారమనే బండి ఎలా సాగుతుందా అని మాకందరికీ ఆశ్చర్యంగా ఉండేది. కానీ ఆ బండి సాగింది, ఏకంగా ముప్పై ఏళ్ళు సాగింది. ఇద్దరు పిల్లలు కూడా ఆ బండికి సాక్షులుగా నిలిచారు.
అలాంటి వారి జీవితంలో విధి ఓ వింత మలుపు తిప్పింది. తాబేలు నడకల కామాక్షే.. చిత్రంగా, జీవితపు పరుగుపందెంలో ముందు గీత దాటింది. వెంకటాచలాన్ని ఒంటరిని చేసి, తాను మాత్రం తొందరగా వెళ్ళిపోయింది.
ఆమె లేని జీవితం, ఆగిపోయిన గడియారంలా నెమ్మదిపడింది. వెంకటాచలం వేగం ఆగిపోయింది. ఇప్పుడు అతను కామాక్షిలాగే నెమ్మదిగా తింటున్నాడు, నెమ్మదిగా నడుస్తున్నాడు. కోడలు వండిన వంటలో ఉప్పు తక్కువైందో, కారం ఎక్కువైందో చెప్పడానికి, ముందు కామాక్షి వంటను సంతృప్తిగా తిని ఉంటే కదా! ఆమె పాడిన పాటను ఎప్పుడూ పూర్తిగా వినని వాడికి, ఇప్పుడు ఎవరి స్వరమూ చెవికెక్కడం లేదు.
ఒకప్పుడు నిలకడలేని వాడిగా ఊరంతా తిరిగినవాడు, ఇప్పుడు వీధి అరుగు మీద మునిలా మౌనంగా కూర్చుంటున్నాడు. బహుశా, ఆమె దగ్గరికి తొందరగా చేరాలంటే, ఆమెలాగే నెమ్మదిగా ప్రయాణించాలని అనుకున్నాడో ఏమో.
విధి ఎంత చిత్రమైనది.. జీవితాంతం తొందరపడిన వాడికి నిదానాన్ని, నిదానంగా బతికిన ఆమెకు తొందరనూ నేర్పింది.
