Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేంచేయు విశ్వావసా!

[విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ‘వేంచేయు విశ్వావసా!’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు డా. గండ్ర లక్ష్మణ రావు.]

1.
కం.
విశ్వావస! నీ వైనా
విశ్వాసము కలుగునట్లు వేంచేయుమయా!
విశ్వము నందలి వేదన
కాశ్వాసము నీవె యనగ నరుదెంచుమయా!

2.
ఉ.
కాకిపికమ్ముగా పికము కాకిగ పల్కెడు తీరు జూచి, యీ
లోకము నందు మానవులు లోభము, కామము లాదిగా మహో
ద్రేకములందుచుండిరి విధేయతలున్‌ కపటమ్ము లయ్యె, నీ
రాకతొ మార్పు చెందునని రమ్మని పిల్తుము నూత్న వత్సరా!

3.
ఉ.
వేపలు పూలు పూసెనని వేసవి సూర్యుడు మండుచుండెడున్‌
కాపులుపంట కోతురని కారుమొయిళ్ళును రాళ్ళు రాల్చెడున్‌
మాపుల దాగియుండెనని మామిడిపిందెల రాల్చె వాయువున్‌
ఆపదలన్ని యాపుటకు ఆత్మసఖుండుగ నీవు రమ్మికన్‌

4.
సీ.
అప్పులే తప్పులే అంతె చేసిరి కదా
మునుపటి పాలకు లనుటలయ్యె
గొప్పలు చెప్పుటే కొత్తదేమియు లేదు
అని నేటివారల ననుటలయ్యె
వారేమి వీరేమి వారికోసమె వారు
జనులపట్టించుకో రనుటలయ్యె
నిజము దేవుడెరుగు నీరుపల్లమెరుంగు
ప్రజల బ్రతుకులెల్ల ప్రభువెరుంగు

‘క్రోధి’ యంతయు పరులపై క్రోధమయ్యె
చాలుచాలింక క్రోధమా చనుము నీవు
కొత్త విశ్వాసమునుజూప కోరి నేడు
వచ్చు విశ్వావసుకిదియె స్వాగతమ్ము!

5.
ఉ.
పేరును మార్చి రాజ్యమున పెత్తనమున్‌నడిపించు నేటి మా
తీరులు జూచి నీవు నును తీయని కొత్త నినాదముల్‌ మహా
హోరుగ మ్రోతవెట్టుచు మహోదయమిప్పుడు గల్గునంచు, మా
కారు విధమ్ములౌ రుచుల కమ్మదనమ్మని నమ్మ జేతువా!

6.
ఉ.
పూవులు పూయు కొత్త వలపుల్‌ మరి నూయల లూపుచుండు, స
ద్భావన రాగమందుకొని భావిశుభంబుల పాడుచుండు మా
జీవనముల్‌ సిరుల్‌ గురియ జేయగ నమ్మకమింత గల్గ, వి
శ్వావస! రాగదోయి సహవాస వికాస విలాస హాసమై!

Exit mobile version