[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘వేనామాల దేవర’ అనే రచనను అందిస్తున్నాము.]
ఏడుకొండలపైన వెలసిన వెంకన్న
నీ పావనపదములకు కైమోడ్పులు!
ఎలమితో చేసేము ఏటికోళ్ళు!
నామాల దేవరా చల్లంగ చూడయ్య!
తిరునామాలసామికీ చెంగనాలు!
పదివేసములసామి.. నీటిపైనే నిదర!
నలిదిండులేల! పాముయే నా పడక!
నీలవర్ణమేచాలు! నీలాలు నాకేల!
నీరనిధిరాచూలి మదిలోన వున్నది!
పరివారజనులు.. అసలులేనేలేరు!
భవబంధ పారావారము, దాటువారే గలరు!
మగరాలనిగరాల సింగారతేరులేల?
మదినినిలిపినవారి కైవారములు చాలు!
మిన్నంటు గారవములు మాకేల!
మిన్నంటు తలపు మాపై వున్నచాలు!
వేనామములసామి! వేదనలు బాపుమా!
వేనామములు మీ మదిలోన నిలుపగ
వేదనలు మీకేల వచ్చునయ్య!
వినువాకల సౌరగంగ..
మనమాహ్లాద తరంగ! నీపైన కురిసెనే!
నింగిరిక్కలరేని వదనమ్ము గలవాడ!
లచ్చిబూరకొమ్మునూదు కర్రినెచ్చెలికాడ!
తిరునామాలసామీ! చెంగనాలు! చెంగనాలు!
🙏
~
పదివేసములసామి = దశావతారుడు, శ్రీమహావిష్ణుదేవుడు
నలి దిండు = స్వర్ణమయపాన్పు అయిన పాము.. ఆదిశేషుడు
నీరనిధిరాచూలి= సాగరుని తనయ లక్ష్మీదేవి
పారా వారము = సంసారసాగరము
మగరాల నిగరాలు= శ్రేష్టమైనమాణిక్యాలు
కైవారము = స్తుతులతోనమస్కారం
వేనామములసామి.. సహస్రనామాల శ్రీమహావిష్ణువు
వినువాక= ఆకాశగంగ
సౌర = చిన్నతుంపర చినుకు
నింగిరిక్కలరేడు = జాబిలి.. రిక్క= నక్షత్రం
లచ్చిబూరకొమ్ము=శంఖం.. పాంచజన్యము
కర్రినెచ్చెలికాడు=నల్లనయ్య, కన్నయ్య
చెంగనాలు= నమస్కారాలు
కైమోడ్పులు= ఏటికోళ్ళు.. కైవారాలు