Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్పుని ఆశించే కవితల సంపుటి ‘వెలుగు పూల కోసం’

[డా. ఎస్. వి. రమేష్ కుమార్ గారి ‘వెలుగు పూల కోసం’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

వృత్తి రీత్యా ఇంగ్లీష్ లెక్చరర్ అయిన డా. ఎస్. వి. రమేష్ కుమార్ ప్రవృత్తి రీత్యా కవి. డా. సవేర అనే కలం పేరుతో ప్రసిద్ధులు. తాను రచించిన 50 కవితలతో ‘వెలుగు పూల కోసం’ అనే కవితా సంపుటిని వెలువరించారు.

“సరళమైన శైలి, స్పష్టమైన అభివ్యక్తి, సంప్రదాయ కుటుంబ వ్యవస్థపై ప్రేమ, సమాజం పట్ల సానుకూల దృక్పథం, మార్పు కోసం పరితపించే తత్త్వం రమేష్ కుమార్ గారి కవిత్వ లక్షణాలు” అని వ్యాఖ్యానించారు డా. ఎన్. ఈశ్వరరెడ్డి గారు తమ ముందుమాటలో.

“ఇందులోని చాలా కవితలు అందంగా ఆరంభమై, ఆలోచనతో అంతమౌతాయి. ఆ ఆలోచనలు మన నిత్య జీవితంలో సమస్యలకు సమాధానమౌతాయి” అని వ్యాఖ్యానించారు డా. ఎ. మొహిద్దీన్ బాషా.

~

కవిత్వం రాయటం తనకి ఎందుకు ఇష్టమో, దానిని సమాజానికి మేలు కలిగించేదిలా ఎలా మలుచుకుంటున్నారో ‘సాహితీ వ్యవసాయం’ కవితలో వెల్లడించారు. “ఆ మొక్కలు పెరిగి/ఏపైన వృక్షాలై/సుగంధ పుష్పాలు పూస్తే/తియ్యటి పండ్లు కాస్తే/వాటిని పదిమందికి పంచడం/నాకెంతో ఇష్టం!” అంటారు.

అక్షరం భుజాన ఆలోచనా తుపాకీ’ అనే కవితలో తన కవిత్వపు ఉద్దేశమేమిటో స్పష్టంగా వివరించారు కవి. “అక్షరాల వెన్నలో ముంచిన/చేదైన గుళిక మందు/మనిషిని మంచివైపు నడిపించే/ఓ దిక్సూచి నా కవిత్వం” అనడంలో ఆయన కవిత్వపు లక్ష్యం తేటతెల్లమవుతుంది.

తమ తల్లిదండ్రులను, నాయనమ్మ వేర్వేరు కవితల్లో ఆపేక్షగా తలచుకున్నారు కవి. తన పట్ల వారి ప్రేమని జ్ఞాపకాలలో నిలుపుకున్నారు.

గురువు’ అనే కవితలో గురువుల గొప్పదనాన్ని సరళమైన పదాలలో ఘనంగా వెల్లడించారు. ‘బోధనా వ్యవసాయం’ అనే కవితతో తానో గురువుగా విద్యార్థులను ఎలా మలుస్తారో తెలిపారు.

ధర్మాసుపత్రిని ఆరోగ్యనిలయంగా మార్చాల్సిన అవసరాన్ని, ఆర్తినిండిన వాక్యాలతో వివరించారు ‘ఏది ధర్మం ఏది న్యాయం’ అనే కవితలో.

విధి నిర్వహణ కూడా దేశ సేవే నంటారు ‘దేశం కోసం’ అనే కవితలో. “నీ విధిలో నీ ధర్మం/ఉత్తమంగా నిర్వర్తించు” అంటూ ప్రబోధిస్తారు.

ఎందుకో మరి’ అనే కవితలో కవి వేసిన ప్రశ్నలు బుద్ధిజీవులను ఆలోచింపజేస్తాయి.

అసలైన విద్య అంటే ఏమిటో ‘బ్రతికించే చదువు’ కవితలో అద్భుతంగా చెప్పారు డా. సవేర. “చదువంటే అక్షరాస్యత కాదు/చదువంటే సమాచార సేకరణ కాదు/మనల్ని మనకు తెలియజేసేది చదువు/మనల్ని మన కాళ్ళపై నిలబెట్టేది చదువు!” అంటారు. ఈ కవిత చదువుతుంటే నాకు డా. సినారె గారి ద్విపదులలో ఒకటి గుర్తొచ్చింది. “విషయ సేకరణ చేసినంతనే విజ్ఞాన రాశి అవుతుందా?/రాళ్ళను కుప్పగా పోసి ఇదే మా ఇల్లంటే సరిపోతుందా?” అన్నారు డా. సినారె.

బాల్యం చాలామందికి ఓ మధురస్మృతి. అవకాశం వస్తే, బాల్యానికి తిరిగి వెళ్ళాలని అనుకునేవారు ఎందరో. ‘కాలాశ్వానికి కళ్ళెమెయ్యగలిగితే’ కవితలో కవి కూడా అదే కోరుకున్నారు. ‘వేగం వద్దు.. ప్రాణం ముద్దు’ కవిత శీర్షికలోనే సందేశం ఉంది. రహదారులపై మితి మీరిన వేగం ప్రాణాంతకమని సూచించారు కవి ఈ కవితలో.

క్షమించు మిత్రమా’ గొప్ప కవిత. తనని క్షమించమని స్నేహితుడిని ఎందుకు అడిగాడో కవిత చదివాక పాఠకులకు అర్థమవుతుంది. అతని నిబద్ధతకీ, కర్తవ్య పరాయణతకి ప్రణమిల్లాలనిపిస్తుంది.

కనిపించిన దృశ్యం’ చక్కని కవిత. కోడిలో తల్లిని, చీమలో తండ్రిని, శిల్పిలో గురువుని చూసుకున్న కవి, మనిషిలో మాత్రం సమాజపు ఉదాసీనతని చూస్తారు. తెలియకుండానే ఓ నిట్టూర్పు వెలువడుతుంది చదువరులకి.

ఇల్లు ‘ఆనందనిలయం’ ఎలా అవుతుందో చెప్పిన కవితలోని వాక్యాలు ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గవి. ‘తాటిచెట్టు – జామచెట్టు’ కవితలో రెండు రకాల మనుషుల ప్రవర్తనలోని తేడాలను ప్రతీకాత్మకంగా చెప్పారు.

అద్దం అంటే తనకెందుకు ఇష్టమో ఓ పొట్టి కవితలో చెప్పారు. ‘అమ్మ కొంగు’ అద్భుతమైన కవిత. ఇంకా మరెన్నో చక్కని, సమాజ హితం కోరే కవితలున్నాయి ఈ సంపుటిలో.

~

“నా అభిమాన ఆంగ్ల రచయిత రాబర్ట్ ఫ్రాస్ట్ గారి పొయిటిక్ ఫిలాసఫి ‘Poetry begins in delight and ends in wisdom’ నాకెంతో ఇష్టమైన సిద్ధాంతం” అని డా. సవేర ‘నా మాట’లో వ్రాసుకున్న వాక్యాలు అక్షర సత్యాలని పాఠకులు అభిప్రాయపడతారీ కవితలు చదివాకా.

~

ఈ కవితలకి డా. సవేర గారి కుమార్తె విద్యా లహరి గీసిన చిత్రాలు కవితలలోని భావాన్ని రేఖలలో గొప్పగా ఒడిసిపట్టాయి. ముఖ్యంగా ‘పుస్తకాలు మా మంచి నేస్తాలు’ కవితకి విద్యా లహరి గీసిన చిత్రం సముచితంగా ఉంది. చిత్రకారిణికి ప్రత్యేకంగా అభినందనలు.

***

వెలుగు పూల కోసం (కవిత్వం)
రచన: డా. ఎస్. వి. రమేష్ కుమార్ (డా. సవేర)
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 72
వెల: ₹ 100/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు బుక్స్: 8558899478
acchamgatelugu@gmail.com
ఆన్‍లైన్‌లో:
https://books.acchamgatelugu.com/products/velugu-poola-kosam

Exit mobile version