Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేల్పులవెజ్జు ధన్వంతరి

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘వేల్పులవెజ్జు ధన్వంతరి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“భూరి యాగభాగభోక్త ధన్వంతరి
యనగ నమృతకలశ హస్తుడగుచు
నిఖిలవైద్యశాస్త్ర నిపుణు డాయుర్వేది
వేల్పు వెజ్జు కడలి వెడలివచ్చె”

ఆయుర్వేద మౌలిక సిద్ధాంతాలు బీజరూపంలో వేదాలలో అనేక సందర్బంలో మనకు కనిపిస్తాయి.

‘త్రిక్నో అశ్వినా దిద్వానిభేషజాత్రిం’ అనే ఋక్కులో బృహస్పతి కుమారుడైన ‘శం’ అనే ఆయనకి ఈ భూమ్మీదా, దేవలోకంలోనూ దొరికే ఔషధు లిచ్చి వ్యాధిని నయం చేసినట్టే, త్రిధాతు సామ్యాన్ని కలిగించి నా కుమారుడికి సుఖాయువును ప్రసాదించమని అశ్వనీ దేవతలను కీర్తించిన ఋక్కు ఋగ్వేదకాలానికి త్రిధాతువుల పరిజ్ఞానం ఉందని సాక్ష్యం ఇస్తోంది.

క్షీరసాగరమధనం సమయంలో సాగరగర్భం నుండి విష్ణు అంశతో యువకుడైన ఒక దివ్యపురుషుడు, పీనాయుత బాహు దండాలతో, విశాల వక్షస్థలితో, పద్మారుణ లోచనాలతో, సుస్నిగ్ధ కేశజాలంతో, నీలగాత్ర తేజంతో, పీతాంబరధారుడై, మణికుండలాలతో పుష్పమాలా సమలంకృతుడై, అమృత కలశాన్ని ఒక చేత్తోనూ, వనమూలికల్ని మరొక చేత్తోనూ పుచ్చుకుని ఆవిర్భవించాడు. ముక్కోటి దేవతలూ ఆ రూపాన్ని రెప్పవాల్చకుండా చూశారు. ఆయనను ‘ధన్వంతరి’గా ఆరాధించారు

“అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే”

ఇది ధన్వంతరి ధ్యానమంత్రం.

“ఓం తత్పురుషాయ విద్మహే
అమృత కలశహస్తాయా ధీమహి
తన్నో ధన్వంతరి ప్రచోదయాత్”

ఇది ధన్వంతరీ గాయత్రి.

“ఓం నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురై ర్వందిత పాదపద్మం
లోకే జరారుగ్మయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషదీనాం”

ఇది ధన్వంతరీ ప్రార్థన.

‘ధనుః శల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః’ అనే సూత్రం ప్రకారం, ‘ధనూ’ అనగా చికిత్సకు అందని వ్యాధి, ‘అంత’ అనగా నాశము ‘రి’ అనగా కలిగించువాడు కాబట్టి, చికిత్సకు లొంగని వ్యాధుల్ని (మరణాన్ని) నశింపచేసే అమృతాన్ని తెచ్చిన వాడని ధన్వంతరి అనే పదానికి అర్థం.

ఆయన తెచ్చిన అమృతం ఆయుర్వేద శాస్త్రమే!

శరీరాన్ని ముసురుకున్న వ్యాధుల్నీ, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించే వాడు ధన్వంతరి.

సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది.

భాగవత పురాణంలో ధన్వంతరి విష్ణువుయొక్క 12వ అవతారం అని పేర్కొంది.

“తరుణుండు దీర్ఘదోర్దండుండుగంబుకంధరుఁడు పీతాంబరధారి స్రగ్వి
లసిత భూషణాలంకృతుం డరుణాక్షుఁ డున్నతోరస్కుఁ డత్యుత్తముండు
నీలకుంచిత కేశనివహుండు జలధర శ్యాముండు మృగరాజ సత్త్వశాలి
మణికుండలుఁడు రత్నమంజీరుఁ డచ్యుతునంశాంశసంభవుం డమలమూర్తి
భూరియాగభాగ భోక్త ధన్వంతరియనఁగ నమృతకలశ హస్తుఁడగుచు
నిఖిల వైద్యశాస్త్రనిపుణుఁ డాయుర్వేది వేల్పువెజ్జుఁగడలి వెడలివచ్చె”

అని బమ్మెర పోతనామాత్యుడు-ఆంధ్రమహాభాగవతంలో ధన్వంతరిని కీర్తించాడు.

వైద్యశాస్త్ర పరంపర

నైమిశారణ్యంలో అగస్త్యమహర్షి, గౌతమమహర్షి, భరద్వాజమహర్షి మొదలైన వారితో మహర్షిమండలి సమావేశమై లోకంలో మనుషులు రకరకాల శారీరక, మానసిక రోగాలతో బాధపడ్తున్నారు కాబట్టి, నానాటికీ వ్యాధులు, వ్యాధిగ్రస్థులు పెరిగిపోవటాన వ్యాధుల నిర్మూలన కోసం దేవేంద్రుడి నుండి వైద్యశాస్త్రాన్ని పొందేందుకు భరద్వాజ మహర్షిని ఇంద్రలోకానికి పంపారు.

జీవుల సుఖదుఃఖాలు, ఆరోగ్య, అనారోగ్యాలు, వృద్ధాప్యం, మరణాల గురించి విధాత ముందే ఆలోచించి, ఆయుష్షును సంరక్షించే ఆయుర్వేద శాస్త్రాన్ని అధర్వణవేదానికి ఉపవేదంగా రూపొందించినట్టు ఇంద్రుడు చెప్పాడు.

బ్రహ్మదేవుడు నాలుగు వేదాల్లోంచి ఆయుర్వేదాన్ని వేరుచేసి, ఒక ప్రత్యేక శాస్త్రంగా సూర్యుడికి బోధించాడనీ, సూర్యుడు దాన్ని ఒక తంత్రం (శాస్త్రం)గా నిర్మించి, ధన్వంతరి, చవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలైన 16 మంది శిష్యులకు బోధించాడని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది.

కాశీరాజగు దివోదాసు రెండవ ధన్వంతరిగా ప్రసిద్ధుడు. “బ్రహ్మ ఆయుర్వేదాన్ని ప్రవచించాడు. ఆయన నుండి దక్ష ప్రజాపతి గ్రహించాడు. దక్షుడి నుండీ అశ్వనీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు, ఇంద్రుడి నుంచి నేనూ నేర్చుకున్నాం. ప్రజాహితం కోసం ఈ లోకంలో కోరిన వారికి నేను ఆయుర్వేద విద్యను ఉపదేశిస్తాను..” అని బార్హస్పత్య భరద్వాజమహర్షి ఈ ధన్వంతరితో అన్నట్టుగా సుశ్రుతుడు (సు.సం. సూ. 1-20) పేర్కొన్నాడు. భరద్వాజమహర్షి నుండి ధన్వంతరి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాడు,

ఇంద్రుని వద్ద క్రియా సహితంగా ఆయుర్వేదాన్ని పొందిన దివోదాస ధన్వంతరి ఆ శాస్త్రాన్ని ఎనిమిది అంగాలుగా విభజించి తన శిష్యులకు నేర్పించాడు. ఈ ధన్వంతరి చారిత్రక వ్యక్తేననీ, క్రీస్తు పూర్వం 3,000 యేళ్ళనాటివాడనీ, పునర్వసు ఆత్రేయుడికి సమకాలికుడని చరిత్రకారులు భావిస్తారు. గౌతమ బుద్ధుడికన్నా పూర్వీకుడు.

సుశ్రుత, ఔపధేనవ లాంటి శిష్యులు ఆయన్ను కలిసి, తమకు ఆయుర్వేదం భోధించాలని ప్రార్థిస్తే, వారిలో ఒక్కరికీ ఆయుర్వేద అష్టాంగాల్లో ఒక్కక్కటి బోధించాడనీ, ఆ శిష్యులద్వారా ఈ 8 అంగాలు ప్రత్యేక విభాగాలుగా అభివృద్ధి చెందాయనీ, శస్త్రచికిత్సకులు (సర్జన్లు), కాయ చికిత్సకులు (ఫిజీషియన్లు)గా వైద్యులు రాణించసాగారనీ ఆయుర్వేద ఇతిహాసం వివరిస్తుంది.

ధన్వంతరి ఎవరు?

హరివంశంలో 29వ అధ్యాయంలో కాశీరాజైన ధన్వంతరి, దివోదాసుల గురించి కనిపిస్తుంది. ‘కాశ’ అనే ఆయన ఈ వంశం మూలపురుషుడు. అతని పుత్రుడు దీర్ఘతప. అతనికి ధన్వ, ధన్వకు ధన్వంతరి, ఆయనకు కేతుమాను, అతనికి భీమసేన, భీమసేనుడికి దివోదాసు, అతనికి ప్రతర్దనుడు, ఆయనకు వత్స, వత్సకు అలర్కుడు.. ఇలా ఈ కాశ వంశ పరంపర కనిపిస్తుంది.

‘కాశ’కు మనుమడు ధన్వ. ఈయన సముద్రమథన సమయంలో ఉత్పన్నమైన అంజ అనే దేవతని ప్రార్థిస్తే ధన్వంతరీ అనే పుత్రుణ్ణి ప్రసాదించినట్టు, ఈ ధన్వంతరే భారద్వాజుడి నుండి ఆయుర్వేద శాస్త్రాన్ని పొందినట్టు ఐతిహ్యం.

భాగవతం నవమ స్కంధంలో(9.17.4) విష్ణుమూర్తి అంశతో, ద్వితీయ ద్వాపర యుగంలో కాశీరాజ్యాన్ని పాలించిన చంద్రవంశ పురూరవుడికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతప, దీర్ఘతపకు ధన్వంతరి జన్మించారు. ఈ ధన్వంతరి భరద్వాజుని నుండి పొంది, ఆయుర్వేదాన్ని ప్రవర్తింపచేశాడు. ఇతన్నే యఙ్ఞహవిస్సుల స్వీకర్త. వాసుదేవుడి అంశతో జన్మించాడని భావిస్తారు.

కౌశిక గృహ్య సూత్రాలు (74.6), ధన్వంతరికి, జలాలు, ఓషధులు, వనస్పతులు, స్వర్గం, భూమి, ఆకాశాలకు బలిహరణాలను రోజూ ఇవ్వాలని పేర్కొన్నాయి.

విక్రమాదిత్యుడి ఆస్థానంలో ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహ, శంకభట్ట, వేతాళభట్ట, ఘటకర్పర, వరాహమిహిర, వరరుచి, కాళిదాసాది నవరత్నా లుండేవారు. వీరిలో ధన్వంతరి ఒకడు. బహుశా ‘ధన్వంతరి నిఘంటు’ రూపకర్త ఈయనే కావచ్చు.

క్రీస్తుపూరం 2వ శతాబ్ది నాటి (మిళింద పన్హ-మిళింద ప్రశ్న”) అనే పాళీ గ్రంథంలో నాగసేనుడుకీ, ఆఫ్ఘనిస్తానుని ఆక్రమించి పాలిస్తూ బౌద్ధుడిగా మారిన గ్రీకురాజు మినాండర్ (మిళింద)కూ మధ్య ప్రశ్నలు-జవాబుల రూపంలో ఈ గ్రంథం ఉంటుంది. ఈ ప్రశ్నల్లో పూర్వవైద్యుల పేర్లలోధన్వంతరి గురించి ఉంది.

‘ఆయోగృహ్’ లేదా ‘అయోఘర్’ అనే బౌద్ధ జాతక కథలో ధన్వంతరి, వైతరణ, భోజ మొదలైన పూర్వవైద్యుల ప్రస్తావన ఉంది. వైతరణ భోజాదులు దివోదాస ధన్వంతరి శిష్యులే!

ఋగ్వేదంలో దేవభిషక్కులుగా అశ్వనీదేవతలే ప్రసిద్ధులు.

ఋగ్వేదంలో శంబరాసురుడిని జయించిన దివోదాసు, అతని కుమారుడు సుదాసుల గురించి ప్రధమ మండలంలో ఉంది. కానీ, ఈ వైదిక దివోదాసు వైద్యుడు కాడు. ధన్వంతరితో ఏ సంబంధమూ లేదు. ఈ దివోదాసు కథనే రాహుల్ సాంకృత్యాయన్ నవలగా వ్రాశారు.

వ్యాసభారత ఉద్యోగపర్వం (117 అధ్యాయం)లో ‘మహాబలో మహావీర్యః కాశీనా మీశ్వరః ప్రభాః’ అనే శ్లోకం మహాబలుడు, మహావీర్యుడు, ఈశ్వర వరపుత్రుడు, దివోదాసుగా ప్రసిద్ధుడైన భీమసేనుడి గురించి చెప్తుంది.

కాఠక సంహితలోనూ భీమసేనుడి పుత్రుడు దివోదాసు అని ఉంది.

ఋగ్వేద ఆధారాల్లో ‘ప్రతర్ధనో దైవోదాసిః’ ప్రతర్ధనుడే దివోదాసని ఉంది.

విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడి గురువు ఈ దివోదాస ధన్వంతరే! ఆయనకు అమరవరుడనే బిరుదు కూడా ఉంది.

ధన్వంతరి అవతారాలెన్నో

ఆయుర్వేద ఇతిహాసం ధన్వంతరిని గురుపరంపరలో భాగంగా ఆదిదైవంగా భావించినా, ఆయన వివిధకాలాలో వివిధ ధన్వంతరి రూపాలలో ఈ భూమ్మీద అవతరించి వైద్యసేవలను అందించాడని, గొప్ప శాస్త్రవేత్తలకు ఆచార్యవర్యుడై శాస్త్ర అభివృద్ధికి పాటుబడ్డాడనీ ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు.

సుశ్రుతుడి గురువైన ధన్వంతరి వద్ద అనుపధేనవ, ఔరభ్ర, బైత్రణ, పౌష్కలావత, కరివర్య, గోపురక్షితలు కూడా వైద్యవిద్యను అభ్యసించారు. సుశ్రుతుడు ధన్వంతరి వద్ద తాను నేర్చిన శస్త్రచికిత్సా పద్ధతుల్ని క్రోడీకరించి ఒక శస్త్ర శాస్త్రగ్రంథంగా సుశ్రుతసంహిను రూపొందించి శస్త్రచికిత్సా పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు.

ఆది దైవమైన భగవాన్ ధన్వంతరియే ఈ కాశీరాజైన దివోదాసుగా ‘ఆయు’ వంశంలో జన్మించి, ఆచార్యుడై, సుశ్రుతాదులకు వైద్య విద్యని అందించాడని దీని తాత్పర్యం.

దివోదాసు, కాశీరాజు ఇద్దరూ ఒక్కరే! ఆయనే ధన్వంతరి అని సంహితలు విశ్వసించాయి.

దేవతలకు వార్థక్యం కలగకుండా, వారికి అమరత్వాన్ని కలిగించినవాడూ ఈ ధన్వంతరేనని ఆయన అవతారమే దివోదాసు!

మానవుడిగా ధన్వంతరి అవతరించింది మొదటిగా ఈ కాశీరాజు రూపంలోనే!

చిన్ననాటినుండే ఈ కాశీరాజ దివోదాసు దేశాటనం చేశాడు. మానవ శరీర తత్వాల్ని, వారి జీవన విధానాల్ని, ఆహార విహారాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తగిన రీతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికీ, రోగాల్ని పరిమార్చుకోవటానికి అనుసరించవలసిన విధానాల రూపకల్పన చేసుకోగలిగాడు.

ధన్వంతరి చారిత్రక వ్యక్తా?

మహాభారతంలో 4 చోట్ల దివోదాసు గురించి ఉంది. కాశీరాజైన దివోదాసుని హైహయులు ఓడించినప్పుడు ఆయన భారద్వాజుణ్ణి శరణు వేడాడని, భరద్వాజుడు అతని చేత పుత్రేష్ఠి యఙ్ఞం చేయించగా ప్రతర్దనుడు జన్మించి హైహయుల్ని ఓడించినట్టు ఐతిహ్యం కనిపిస్తుంది.

కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్తులో ఈ ప్రతర్దనుడు బ్రహ్మవిద్య పొందినట్టు పేర్కొన్నారు. అగ్నిపురాణం (అ. 267), గరుడపురాణం (అ. 139) లలో వైద్య ధన్వంతరి నాలుగవ సంతతిగా దివోదాసు జన్మించినట్టు ఉంది.

దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో కొన్ని వివరాలున్నాయి.

కాశీ రాజైన దీర్ఘతపకి చాలా కాలంపాటు సంతానభాగ్యం లేకపోవడంతో విష్ణువుని వేడుకుంటూ ఘోరతపస్సు చేసాడు. అప్పుడు స్వామి ఈ ధన్వంతరిని పుత్రుడిగా అనుగ్రహించాడు.

అలా దీర్ఘతప ఇంట మానవ రూపంలో జన్మించిన ధన్వంతరి దేవలోకంలోని వైద్యవిధానాల్ని మానవ లోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

ధన్వంతరి ఆరోగ్య స్పృహని కలిగించే దైవం. ఆయనను తలచుకోగానే రోగకారకమైన ఆహార విహార అజాగ్రత్తల్ని మనం ఆపగలుగుతాం. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత నీయగలుగుతాం.

దేశం అంతా కార్తీకమాసం కృష్ణపక్షం త్రయోదశిని ‘ధన్-తేరాస్’ జరుపుకుంటుంది. బంగారం కొనాల్సిన రోజుగా దానికి స్వర్ణవ్యాపారులు విశేషఖ్యాతి తెచ్చారు. వాస్తవానికి ధన్వంతరి సాగరమధనం లోంచి ఆవిర్భవించిన రోజు అది. ఆరోజుని ధన్వంతరి త్రయోదశిని జరుపుతారు. అదే ధన్ త్రయోదశి అయ్యింది. కాలవశాన డబ్బు ముందుకొచ్చి ఆరోగ్యం వెనక్కి పోయింది.

ధన్వంతరీ నిఘంటువు

ధన్వంతరి నిఘంటువును ఎప్పటికప్పుడు ఆయుర్వేద శాస్త్రవేత్తలు కొత్త ఓషధులను చేరుస్తూ, పాతవాటి గురించి అదనపు సమాచారాన్ని అందిస్తూ పెంపుచేస్తూ వచ్చారు. అమరకోశానికి (క్రీ.శ. 1వ శతాబ్ది) సమానకాలంలో ధన్వంతరి నిఘంటువు ఒక రూపాన్ని సంతరించుకోగా, 10వ శతాబ్ది వరకూ అది పెంపుని పొందుతూనే ఉంది. ఇప్పుడు మనకు దొరుకుతున్న ధన్వంతరీ నిఘంటువు 9-10 శతాబ్దాల నాటిది. ద్రవ్యావళీ సముచ్ఛయం పేరుతో వెలువడిన ఈ గ్రంథమే ప్రస్తుత ధన్వంతరీ నిఘంటువు.

గుప్తుల కాలంలో విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానంలోని నవరత్నాల్లో ధన్వంతరి కూడా ఒకరని భావిస్తారు. బహుశా భగవాన్ ధన్వంతరి కాశీరాజ ధన్వంతరి అవతారం తరువాత ఈ ధన్వంతరిగా జన్మించాడని ఒక భావన. ఆ రోజుల్లో 100 ఔషధాల ప్రయోగాలు తెలిసినవాడు వైద్యుడని, 200 ఔషధాల ప్రయోగాలు ఎరిగినవాడు భిషక్ అని, 300 ప్రయోగాలు తెలిసినవాడు ధన్వంతరి అనీ వ్యహరించేవారట. విక్రమాదిత్యుని ఆస్థానంలోని ఒక వైద్యుడు ఆ విధంగా ధన్వంతరిగా ప్రసిద్ధుడై ఉండొచ్చు.

ధన్వంతరి ఒక వ్యక్తి కాదు. అమృతాన్ని అందించే ఒక ప్రదాత. ఆయనే చికిత్సా శాస్త్రం. ఆయనే శస్త్రవైద్య శాస్త్రం. ఆయనే అష్ఠాంగాలు. ఆయనే ఆయుష్షు పాలకుడు. ఆయనే రోగమాపకుడు. ఆయనకు నమస్కరించుకోవటమే ఒక ఆరోగ్యసూత్రం.

Exit mobile version