[శ్రీ అవధానుల మణిబాబు రచించిన ‘వీలులేక గానీ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అరగంట నుంచి ఆకలేస్తోన్న బడి వాకిలికి
అమ్మల రాకతో అన్నం వాసన తగిలింది.
జెండాలో కట్టిన పూలన్నీ
ఆవిష్కరణ కాగానే
గ్రౌండ్ అంతా పరచుకున్నట్టు
గదిలో ఒదిగి కూర్చున్న పసితనం
గంట మోగగానే
ఆవరణ మొత్తం పరుగులు పెడుతోంది.
బుగ్గనున్న సగం గోరుముద్ద
జారుడు బల్ల మెట్లెక్కుతుంటే
నేలను తాకగానే నోట చేరుదామని
మిగిలిన ముద్ద ఎదురుచూస్తోంది.
గుర్రం బొమ్మ ముందుకు వాలినపుడల్లా
ఓ చిన్నిముద్ద పిల్లాడి నోట చేరుతోంది.
ఊయల ఆకాశం నుండి కిందకు జారినపుడల్లా
ఓ చిట్టి ముద్ద నోట కరచుకుని మళ్ళీ ఎగిరిపోతోంది.
బల్లకింద దాక్కున్న నోటికోసం
చెవులు మెలిపడి ఎర్రబడుతున్నాయ్.
పిల్లల ఆటలు వేరు అల్లర్లు వేరు.
వినోదాలు వేరు, విన్యాసాలు వేరు.
కానీ తల్లులందరిదీ
బృంద నాట్యం చేస్తున్నవారిలా ఒకే హస్త ముద్ర.
అందరినోటా ఒకటే మాట “ఈ ఒక్క ముద్దా”.
ఏమైతేనేం
మురిపించి, మరిపించి
తినిపించి, ఊరడించి
జుట్టు సరిచేసి, జడలు ముడివేసి
కాసేపట్లో వచ్చి తీసుకుపోతానని నమ్మబలికి
ఆయాలకు అప్పగించి
వెనక్కు చూస్తూ టాటా చెబుతూ
ముందుకు సాగిపోతాయ్, అమ్మల చేతులు.
ఈ చేతులే కదూ!
తీర్చి దిద్దేది, వార్చి వడ్డించేది,
ఊయలలూపేది, తప్పు చెప్పి ఆపేది.
సరిచూసేదీ, సరిచేసేదీ..
ఒకటేమిటి ఆలనా పాలనా అంతా ఇవే.
ఒక్కోసారి అనిపిస్తుందీ..
అమరిక, అవకాశం ఉండి ఉంటే
అమ్మలు తమ కుడి చేతిని కూడా
స్కూల్ బాగ్లో సర్దేసేవారేమో!
అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023) వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘మధుశ్రీలు చదివాకా’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024) అందుకున్నారు.