[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘వేదనా నివేదనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కుదురుగా ఎన్నెన్ని శ్రమ బీజాలను నాటినా
కుండపోతగా చెమట ధారలను
కురియించినా
కలతల కలుపు మొక్కలను తప్ప
కలల పంటలను దర్శించి
కుశల మందని
బడుగుల బంజరు బ్రతుకు సేద్యం
దరిద్ర దేవతకు నైవేద్యం!
నడి వేసవి వడగాడ్పుల్లా
నిర్ధనుల బ్రతుకు నిండా
నిరాశల నిట్టూర్పుల కాకల
ఇనుమడి ముట్టడి!
పెను తుపాను రాత్రి
ఏక ధారలా కురిసే వర్షంలా
నిరుపేదల వేదనాశ్రువుల
జడి వడి హావడి ఒత్తడి!
వడ వడ వణకించే శీతకాలంలో
గడ్డ కట్టే జలాశయాల్లా ఘనీభవించే
గరీబుల ఆశయా
స్రవంతుల తడి!
ఊడిగాలకు ఉపయోగపడే
ఊపిర్లు తప్ప
దిలాసా నందించే ఊతమేదీ లేని
దీన కార్మికుల జీర్ణ జీవనం
సహస్ర విషాదాల సంకలనం!
నేలపై వెలసిన క్షణం నుండీ
నేలలో కలిసిపోయే దినం దాకా
ఆపదలను అనుభవిస్తూ అణగారే
నిస్సహాయ అభాగ్యుల
బ్రతుకు కథనం
హృదయ విదారక వేదనా నివేదనం!