Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాత్సల్య సౌగంధికం

[శ్రీ సముద్రాల హరికృష్ణ గారి ‘వాత్సల్య సౌగంధికం’ అనే రచనని అందిస్తున్నాము.]

మాయాద్యూత నిబంధనల ప్రకారం వనవాసం చేస్తున్న పాండవులు గంధమాదన పర్వతం చేరుకున్నారు.

ఆ గంధమాదనం ఎంత ఎత్తైనదో, దాని పరిసర ప్రకృతి రామణీయకత కూడా అంతే ఎత్తులో వర్ణింప తగినది. స్ఫటికశిలాతలాలు, నిర్మలజల నిర్ఝరిణులతో; ఎత్తైన సాలవృక్షాల,లోతైన లోయల అందాలతో!

ఆ అందాలను చూస్తూ వెళుతున్న వారికి హఠాత్తుగా వాతావరణం మారటం కనిపించింది. ఉద్ధృతమైన గాలి వీచసాగింది. నేల అంతా పరాగం కప్పేసినట్లయింది. దుమ్ము బాగా పైకి లేచి సుళ్ళు తిరగసాగింది.ఒకరికి ఒకరు కనిపించనంత ధూళి తెరలు ఏర్పడసాగాయి. మహావృక్షాల నుంచి పెద్ద కొమ్మలు విరిగి అదిరిపడే శబ్దంతో ధభీమని నేల మీద పడసాగాయి. మిన్ను విరిగి భూమి మీద పడ్డదా,లేక మహాపర్వత శిఖరాలు విరిగి కూలినయ్యా అని అనిపించేటంత శబ్దం.

నేల మీద పడ్డ కొమ్మలను పక్కకు తప్పించి మెల్లగా విశాలమైన వృక్షాల ఆచ్ఛాదన కిందకు వచ్చి నిల్చున్నారు. కానీ అప్పటికే అగ్నిహోత్రాలతో ధర్మజ సహదేవ ధౌమ్యులొకవంక, నకుల రోమశులు ఒక వైపూ, గదాధారియైన భీమసేనుడూ, ద్రౌపదీదేవి ఒక వంకా అయిపోయారు, ఆ ధూళి వర్షంలో! ఇంతలో ప్రచండ ధారగా వర్షం ఆరంభమైంది. ఉరుముల గర్జారవాలతో, మెరుపుల ఝళిపింపులతో చాలా సేపు సాగింది ఆ కుంభవృష్టి.

కొన్ని గంటల తరువాత వాన ఆగిపోగా,మెల్లగామళ్ళీ నడక సాగించారు వారు.

కానీ ఆ కఠిన శిలలూ, హెచ్చుతగ్గులతో కూడిన నేల మీద పరమ సుకుమారియైన పాండవ పట్టమహిషి ద్రౌపదీ దేవి నడవలేక పోయింది. పూర్తిగా డస్సి పోయి, ఆమె నేల మీద పడిపోయింది మూర్ఛితురాలై.

అందరూ కంగారు పడ్డారు.

భీమసేనుడు వెంటనే ఆమె నెత్తుకొని మృగచర్మంతో చేసిన ఒక శాలువా లాంటిది పరిచి దాని మీద ఆమెను మెల్లిగా దింపాడు. అరటి ఆకులను వీవనలుగా విసర సాగాడు, ఉపశమనం కలిగేట్లు!

నకులసహదేవులు తమ ఆయుధాభ్యాసంతో కాయలు కాచి గట్టిపడ్డ చేతులతోనే, సప్రేమగా ఆమె కోమల పాదాలను ఒత్తసాగారు, నడిచి నడిచి వచ్చిన ఆమెకు నెప్పి తగ్గటానికి.

“అయ్యో, శ్రమ కోర్చని సుమ సుకుమారి యీ పాంచాలతనయ, నా వల్ల ఎన్ని కష్టాలు పడుతోంది?! పాండవు లంతటివారికి ఇచ్చాను నా కూతురిని, వైభవంగా సుఖంగా జీవిస్తుంది అనుకుని కదా, ఈమె తండ్రి ద్రుపద మహారాజు మా సంబంధం కలుపుకున్నాడు! నేడిట్లా అడవుల్లో అల్లాడవచ్చిందే,నా కారణాన”, అని ధర్మరాజు చాలా బాధపడ సాగాడు. ధౌమ్యాదులు ఆయనను ఓదార్చారు.

ఇంతలో ఉపచారాల ఫలితంగా మెల్లగా కళ్ళు తెరిచి స్వస్థురాలైంది ద్రౌపది. అందరూ కాస్త నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నారు!

***

వెంటనే ధర్మరాజు, భీమునితో, “ఇకపై ఇట్లా సాగటం చాలా దుష్కరం, కాలి మార్గాన! ఏదైనా తగిన ఉపాయం చేయాలి, భీమసేనా” అన్నాడు.

ఆ మాట వినిన భీమసేనుడు తన కుమారుడు అమితబల సంపన్నుడు, మాయా విద్యా ప్రవీణుడు అయిన ఘటోత్కచుణ్ణి మనస్సులో తలచుకున్నాడు. ఘటోత్కచుడు వెంటనే ప్రత్యక్షమై అందరికీ నమస్కరించి “ఆజ్ఞ” అని నిలుచున్నాడు వినయంగా.

“ఈమె నీకు మాతృ సమానురాలు, ద్రౌపదీదేవి. ఈమెను నీ భుజాల మీద ఎత్తుకుని సురక్షిత ప్రదేశానికి తరలించాలి, నడవలేక పోతున్నది ఈ కఠిన శిలా మార్గంలో”, అన్నాడు భీమసేనుడు వచ్చిన తన కొడుకును ప్రేమగా ఆలింగనం చేసుకుని, ఆశీర్వదించి.

దానికి ఘటోత్కచుడు, “ఇది కాలినడకకు ఏ మాత్రం అనువైన ప్రదేశం కాదు తండ్రీ, మిమ్మల్ని అందరినీ తరలిస్తాను నా భుజాల మీద కూచోపెట్టుకుని. ఇది నా కర్తవ్యం, మిమ్ము సేవించే భాగ్యం కూడా నాకు, కాదనకండి” అన్నాడు మిక్కుటమైన బంధుప్రీతితో!

రోమశమహర్షి మాత్రం సిధ్ధుల లోకాలకు వెళ్ళిపోగా, ఆ పాండవులు నలుగురూ ద్రౌపదీ దేవీ-గురువైన ధౌమ్య తదితర బ్రాహ్మణవరులతో కలిసి గంగాతీరంలో ఉన్న నరనారాయణాశ్రమమైన సుందర బదరీవనం పైనుంచి చూసి, ఇక్కడ దిగుతాము అని దిగారు, వీరఘటోత్కచుడి విశాల భుజస్కంధాల మీద క్షేమంగా ప్రయాణం సాగించి!

***

అక్కడ దిగిన వెంటనే వారిని ఆకర్షించింది, పుష్కలంగా ఉన్న బదరీవృక్షాలు. మృదుపత్రవిలసితాలు, స్వాదుఫలభరితాలూ, వీడని శీతల ఛాయ నిచ్చేవీ-అట్లాంటి బదరీ వ్రృక్షాలు!

ప్రతిదినమూ పావన గంగా జలాల్లో స్నానాలు పూర్తి చేసుకుని, సద్వ్రతాలలో నిమగ్నులై, గడుపుతున్నారు పాండవులు ఆ బదరీవనంలో. అప్పటికి ఒక వారం రోజులు గడిచాయి వారు ఆ ప్రాంతానికి వచ్చి.

***

ఆ రోజు సమీపంలోనే ఉన్న ఆ గంధమాదన మహాపర్వత సానువుల అందాలు చూస్తూ విహరిస్తున్న భీమసేన ద్రౌపదుల సమక్షంలోకి అపూర్వ సౌరభాలతో ఒక సహస్రదళకమలం గాలిలో తేలుతూ వచ్చి నేల మీద పడ్డది. దాని పత్రరాణీయకతకూ,అపూర్వ పరిమళానికీ ద్రౌపదీ దేవి మురిసిపోయింది. వెంటనే ఆ పుష్పాన్ని భీమసేనుడికి చూపిస్తూ “దగ్గరలోనే ఎక్కడైనా ఉంటే ఇంకా కొన్ని ఈ పూలు తెచ్చి ఇవ్వగలరా, మహా లోభనీయంగా ఉన్నాయి” అని అన్నది ఆశగా.

దానికి భీముడు “మా దేవి గారు కోరుకుంటే దగ్గరలో లేకపోతే, ఎంత దూరంలో, చివరకు ఆకాశంలో ఉన్నా తెచ్చి ఇవ్వటమే మాకు ఆనందదాయకమూ, మా విధి కూడా”, అన్నాడు నవ్వుతూ.

ద్రౌపదీదేవి సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వి ఆ పుష్పాన్ని ధర్మరాజాదులకు చూపించటానికి తమ కుటీరం వైపు నడిచి వెళ్ళింది,ఆ పువ్వును మైమరచి చూస్తూ, దాని అందాన్ని పదేపదే పొగుడుతూ!

భీమసేనుడు కూడా ఆ పుష్పం వచ్చిన దిశగా స్వర్ణపరిపుష్టమైన ధనువూ, ఆశీవిషాల లాంటి బాణాలనూ తీసుకుని,వెంటనే బయల్దేరాడు వీరోత్సాహంతో!

దారి పొడుగునా, మనోహరమైన కదళీ వనాలనూ, ఫలపుష్పభరితాలైన నానావిధ పాదపాలనూ, కోకిలాది పక్షుల మధురాలాపాలనూ, చూస్తూ వింటూ మహోల్లాసంతో వెళుతున్నాడు వృకోదరుడు వేగంగా!

మధ్యలో అడ్డం వచ్చిన ఏనుగులను వాటికంటే పెద్దగా ఘీంకారశబ్థాలు తనే చేసి భయపెడ్తూ, దారిలో తారసపడిన సింహాన్ని ఇంకొక సింహంపైకి జూలు పట్టుకుని అవలీలగా, ఆటగా విసిరి వేస్తూ, అవి తోక ముడిచి పారిపోతుంటే నవ్వుకుంటూ వాయుపుత్ర భీమసేనుడు మహా సంరంభంగా సాగి పోతున్నాడు.

కోరక కోరక ఒక సామాన్యమైన కోరిక – కొన్ని పూలు కావాలని కోరింది పాండవ పట్టమహిషి, అవి తెచ్చి యిచ్చి ఆమె మనసును సంతోష పెట్టాలి అన్న ఆ ఉత్సాహంలో భీముడు దారిలో కనబడిన తీగలను లాగుతూ, సింహనాదాలు చేస్తూ వెళ్తున్నాడు,ఆ నిర్జన ప్రదేశంలో, నిర్భీక మల్లుడై.

గిరి కంథరాలలో నుంచి అదృశ్యరూపులై ఖేచరసిధ్ధ గరుడనాగగంధర్వ కన్యలు అబ్బురపడి చూశారు, “ఎవరబ్బా ఇంతటి పోటు వీరుడు ఈ దుష్కర గంధమాదనపు ప్రదేశాలలో ఇట్లా ఆర్భటిగా వెళ్తున్నాడు”, అని!

అట్లా వెళ్తున్న ఆ కుంతీసుతమధ్యముడైన భీమసేనుడికి తన సింహనాదాలతో చెదిరి బెదిరి పారుతున్న పక్షుల రెక్కలు తడిగా ఉండటం కనిపించింది. ‘ఓహో, దగ్గరలోనే ఉన్నట్టుంది ఆ అపూర్వ కమలాలు పూచే కొలను’, అనుకుని మరింత వేగంతో అడుగులేయటం సాగించాడు.

అంతలోనే కనబడ్డది ఒక నిర్మలవారి పూరితమూ, శీతలవాయు పులకితమూ అయిన కాసార మొకటి కళ్ళెదుట!

అందులో హాయిగా స్నానం చేసి, సేద తీర్చుకుని,కొంత సేపటికి ఒక అరటి తోటలోకి ప్రవేశించి, తన శంఖనాదం పూరించాడు మహోధ్ధతితో!

***

ఆ శంఖనాదం దిక్కులు పిక్కటిల్ల చేసింది! ఆ మహా శబ్దానికి అక్కడే గుహలో నిత్యం ధ్యానమగ్నుడై ఉండే శ్రీరామ పరమ భక్తుడూ, చిరంజీవీ, మహాబలి అయిన ఆంజనేయుడికి మెలకువ వచ్చింది సమాధి స్థితి నుంచి. ఆయనకు వినబడింది ఆ శంఖారావం.

“ఓహో ఇది ఏదో మైత్రీ భావంతో ధ్వనిస్తోందే, సందేహం లేదు ఇది నా తమ్ముడి శంఖఘోషయే”, అని నిశ్చయించుకుని సంతోషపడ్డాడు.

తన వాలాన్ని గట్టిగా విదిలించాడు, ఒక భయంకరమైన శబ్దాన్ని అది పుట్టించగా! చుట్టుపక్కల ఉన్న జంతుజాలం అదిరిపడ్డది ఆ ధ్వనికి! భీముడు కూడా చకితుడైనాడు, అంతటి మహారావం అది.

కాస్త వేడ్క చేద్దామని, ఆంజనేయుడు పెద్ద మాకులను భీముడి దారికి అడ్డంగా పడేశాడు. అసలే అది ఒక్కటే అక్కడ ఉన్న ఇరుకుదారి. తన తోక బారెడు దూరం పరిచి పడుకున్నాడు. అది దాటితే కాని భీమసేనుడు ముందుకు వెళ్ళలేని విధంగా!

నాలుగడుగులు వేసేటప్పటికి,ఆ కదళీ వనంలో ఒక పెద్ద శిలాతలం మీద విశ్రమిస్తున్న మహావీర హంవీర హనుమంతులవారు కనిపించారు భీముడికి.

***

ఆజానుబాహుడూ, పింగాక్షుడూ, దృఢమైన వజ్రసమ వక్షస్థలి కలవాడూ అయిన మహాసత్త్వుడిని, ధర్మనిర్మలుడినీ యోగనిద్రా భంగిమలో ఉన్న హనుమను చూశాడు భీమసేనుడు.

తన ఉనికి ఆయనకు తెలియాలని పెద్దగా సింహనాదం చేశాడు భీముడు.

“ఏవఁయ్యా, ముసలివాణ్ణి, అలసిసొలసిన వాణ్ణీ, ఇట్లా పడుకుని ఉన్నవాడికి నిద్రాభంగం కలిగించటానికి మనసెట్లా వచ్చిందయ్యా నీకు?! జంతువులైతే విచక్షణ లేకుండా ఉంటాయి, మనిషిపై యుండి ఇంత నిర్దయ దేనికి నీకు వృధ్ధుల పట్ల,అనవసరంగా పెద్ద శబ్దం చేశావు. ధర్మమార్గం అనుసరించవద్దూ?! సరేలే,ఇంతకీ ఎవరివి నువ్వు,ఇంతటి దుర్గమమైన ప్రాంతానికి ఎందుకొచ్చావు,అసలు సిద్ధులు కాని వారికి ఇక్కడ ప్రవేశమే ఉండదే?! సరే ఏది ఏమైనా, నీ పట్ల స్నేహ భావమే కలుగుతోంది నాకు, ఇక్కడ మధురమైన ఫలాలు బోలెడు ఉన్నాయి, మరెక్కడా దొరకనివి. కడుపునిండా తిని, ఇక బయలుదేరు, నా నిద్ర కొనసాగించనీ” అన్నాడు ఆంజనేయుడు కవ్విస్తూ!

“సరేలే భోజనం సంగతి అట్లా ఉంచు, నేను అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను. నా సంగతి విను. ఉత్తమ క్షత్రియుణ్ణి, కుంతీసుతుణ్ణి; వాయుదేవుడి వరం వలన పుట్టిన మహాబలుణ్ణి, భీముడు అంటారు నన్ను” అన్నాడు భీమసేనుడు ఆ మహాకపి ఎవరో బుద్ధికి అందక!

“కనుక, మర్యాదగా అడ్డంగా ఉన్న నీ తోక తీసి, దారి విడువు నాకు. లేదనుకో, పూర్వం సాగరలంఘనం చేసి లంక చేరిన హనుమంతుల వారి లాగా యీ పర్వతాన్ని లంఘించి మరీ వెళ్ళిపోగల సమర్ధుడను, జాగ్రత్త” అన్నాడు.

హనుమ నవ్వుతూ, “నీ బలం తరువాత చూస్తాను ఆయనెవరో అన్నావేఁ, ఆయనెందుకు సాగరలంఘనం చేయాల్సి వచ్చిందో తెలిస్తే చెప్పవయ్యా, వింటాను” అన్నాడు, తమ్ముడితో సంభాషణను ఆనందిస్తూ!

“సరే విను. పూర్వం ఇక్ష్వాకు వంశతిలకుడు రామచంద్రమూర్తి పెద్దల మాట గౌరవించి వనవాసానికి వెళ్ళాడు. అక్కడ ఆయన సతీమణి జానకీ దేవిని లంకాధిపతి రావణుడు అపహరించాడు. కపి రాజుతో స్నేహం కలిసింది ఆయనకు. ఆ వానరసైన్యానికి సముద్రం ఆవల లంకలో సీతాదేవిని ఉంచినట్టు తెలిసింది సంపాతి ద్వారా. అప్పుడు ఎవ్వరూ చేయలేని ఆ దుస్సాహస కార్యాన్ని, సముద్ర లంఘనాన్ని చేసి, సీతాదేవిని కనుక్కన్నది ఆ ఆంజనేయుల వారే, మహానుభావులు. నేనూ అంతటివాణ్ణే అందుకే చెపుతున్నాను, నీ తోక మర్యాదగా పక్కకు తీసెయ్, నేను వెళ్ళాలి తొందరగా” అన్నాడు భీముడు అసహనంగా!

వస్తున్న నవ్వును ఆపుకుంటూ హనుమ, “ఓహో అంతటి వాడివా, అయితే అంతంత పనులు చేయనక్కర్లేదు నువ్వు. నేను ముసలి వాణ్ణి, కదలలేను – అందుకని నువ్వే నా తోకను కాస్త పక్కకు తొలగించి దారి చేసుకుని మహరాజుగా వెళ్ళిపో! మా నాయన, మాట విను” అన్నాడు అనునయంగా.

ఆ మాట విని నిర్లక్ష్యంగా, “అలా రా దారికి”, అని, ఎడమ చేత్తో తోక ఎత్తబోయి విఫలుడయ్యాడు భీముడు. ఇదేవిఁటి, ఇంత బరువు ఉంది అనుకుని, రెండు చేతులతో ప్రయత్నించాడు, అంగుళం కదల్చ లేకపోయాడు ఆ తోకని. చివరకు తన శక్తినంతా కూడదీసి, హుప్పంటూ మళ్ళీ ప్రయత్నించాడు తోక ఎత్తడానికి. తూలి ముందుకు పడబోయి భంగ పడ్డాడు. తోక మాత్రం ఇసుమంతైనా కదలలేదు. భీముడికి అలసటతో, చిన్నతనంతో చెమటలు పట్టేసినై. ముఖం చిన్నవోయి నిలుచున్నాడు.

వెంటనే ఎదురుగా ఉన్పది ఎవరో మహానుభావుడై ఉంటాడని స్ఫురించి, “అయ్యా నా తప్పు మన్నించండి. ఏవేవో పలికాను దంభపు మాటలు. మీరెవ్వరో చెప్పి నన్ను కరుణించండి. సిధ్ధ గంధర్వ దేవతల్లో ఒక్కరై ఉంటారు తప్పకుండా. మీరెవరో చెప్పండి,నా అవజ్ఞను మన్నించండి” అన్నాడు వినయంగా, పశ్చాత్తాపంతో!

అప్పుడు ఇంక చాలులే తమ్ముడితో సరదా అనుకుని హనుమ, “ నాయనా ఆ రామచంద్ర సేవకుణ్ణి, నీవు ఇందాక చెప్పిన హనుమంతుణ్ణి నేనే! వాయుభట్టారక వరలబ్ధిని, కేసరి పుత్రుణ్ణి. వరుసకు నీవు నాకు తమ్ముడివే! ఆ రామవిభుడు రావణ వధానంతరం భువిని పదకొండు వేల ఏళ్ళు ధర్మావతారంగా పాలించి, దివి కేగాడు, నాకు చిరంజీవిత్వ వరం ఇచ్చి మరీ! నా చరిత భూమ్మీద చెప్పుకునేంత వరకు, నీవు చిరాయువువై ఉంటావు హనుమా అని ప్రేమపూర్వకంగా చెప్పి మరీ వెళ్ళాడు, ఆ లోకారాధ్య విగ్రహుడు, శ్రీరాముడు! ఇదీ నా కథ” అన్నాడు, వాత్సల్య భావంతో తమ్ముడు భీమసేనుణ్ణి చూస్తూ!

వెంటనే భీముడు సాదరంగా ప్రణామం చేసి, “ధన్యుణ్ణి మహాభాగా నీ దర్శనంతో ధన్యుడినయ్యాను. అయితే అన్నా, ఆ నాటి నీ మహా స్వరూపాన్ని నేను చూడవచ్చా, ఒక్కసారి నీ మహా దివ్య దేహాన్ని సాగరలంఘన కాలం నాటిది చూడాలని నా కోరిక, మన్నిస్తావా” అని అడిగాడు!

దానికి హనుమ, “నాయనా, కాలాన్ని బట్టి ఆయా ధర్మాలు ప్రమాణాలు మారుతాయి కదా! ఒక్క తీరుగా ఉండదు కదా! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది, ప్రజ మదమాత్సర్యపైశునాది గుణాలు లేక మోక్షకాములై బ్రతికేవారు. నారాయణుడు ఆ యుగంలో శుక్ల వర్ణుడై ప్రజారక్షకుడిగా ఉన్నాడు. త్రేత లో మూడుపాదాల నడిచింది ధర్మవృషభం, ప్రజలు సత్యరతులై, యజ్ఞదానాదులలో నిమగ్నులై తరించారు. నారాయణుడు రక్తవర్ణుడై వెలుగొందాడు ఆ యుగంలో. ద్వాపరంలో ఆ నారాయణుడు కృష్ణ వర్ణంలో రాజిల్లుతాడు, కానీ ప్రజ ధర్మహీనులై బ్రతుకుతారు. రెండు పాదాలపై పోతుంది ధర్మం. కలిలో ఏక పాదమే దానికి, ఎంతో ధర్మ గ్లాని జరిగిపోతుంది, ప్రజ నీతి నియమాలు తప్పటం వలన. కృష్ణుడు పీత వర్ణుడై ఉంటాడు ఈ యుగంలో. ఇవీ యుగ ధర్మాలు”, అని చెప్పి,”వెళ్ళిరా నాయనా నీకు జయం కలుగుతుంది” అన్నాడు హనుమ.

దానికి మళ్ళీ భీమసేనుడు తన కోరిక వెల్లడించాడు హనుమ ఆ నాటి స్వరూపం తను చూడాలని. అప్పుడు హనుమంతుడు తన సోదరుడి పట్ల ప్రీతితో, “సరే చూడు” అని తన ఉత్తుంగ పర్వతం లాంటి దేహాన్ని, రెండవ మేరువా అని భీముడు చకితుడై పోయేట్టు చూపించాడు.

ఆ తేజస్సుకీ ,ఆ ప్రమాణానికి భయం కూడా కలిగి, భీమసేనుడు “ధన్యుణ్ణి అన్నయ్యా, ఇంక చాలు ఉపసంహరించుకో, ఈ యీ నిజ బ్రృహత్స్వరూపం దుర్నిరీక్ష్యమై తట్టుకోలేకుండా ఉన్నాను ఆ దేహప్రభను” అన్నాడు, వినయంగా.

హనుమ మామూలు ప్రమాణానికి తిరిగి వచ్చి, “అదీ నాయనా నా సాధారణ స్వరూపం ఆ యుగంలో. యుద్ధంలో ఉన్నప్పుడు శత్రు సమక్షంలో ఇంకా ద్విగుణం బహుగుణం కూడా అవుతుంది ఆ ప్రమాణం” అన్నాడు, తమ్మునితో సాదర దృక్కులతో!

అప్పుడు భీమసేనుడు, “ఆ రాఘవ మహావీరుడికి నీ సాయం గొప్ప అండ, అగ్రజా!, ఆశ్చర్యమేముంది రావణుడంతటి వాణ్ణి ఆయన జయించటంలో”, అని అభినందించాడు .

అప్పుడు హనుమ ప్రసన్న వదనంతో, “నాదేముంది నాయనా, అంతా ఆ రామచంద్ర ప్రభువు దయ! సరే ఇది విను నాయనా, నీవు వెళుతున్న పని నాకు తెలుసు, సౌగంధిక పుష్పాల కోసమే కదా! చాలా జాగ్రత్తగా మెలకువగా మసలుకో. దేవగణాలైన యక్ష పరిరక్షిత సరోవరంలో ఉండేవి అవి. ఈ భూములన్నీ దేవతలు సంచరించే, వారికిష్టమైన ప్రాంతాలు. సాహసంగా ఏదీ చేయటానికి పూనుకోవద్దు. ధర్మమార్గాన్ని ఎన్నడూ ఎట్టి కారణానికీ వీడవద్ధు. దేవతలు స్తోత్ర నమస్కారాలతో ప్రసన్నులౌతారు, అన్య మార్గాలు ఎంతమాత్రం కూడదు. ఇదే నా హెచ్చరిక. ఇక వెళ్ళి రా, విజయోస్తు”, అని ఆశీర్వదించాడు.

అని, “నాయనా భీమసేనా, నిన్ను చూడటంతో నాకు నయనానందమూ, మనః ప్రసన్నతా చాలినంత కల్గినాయి.. ప్రియ సోదరా, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను”, అన్నాడు ప్రేమపూర్వకంగా.

“చెప్పు మీకు ఇంత అన్యాయం చేసిన ఆ దాయాదులను ఒక్కణ్ణే వెళ్ళి సమూల నిర్మూలన చేయమంటావా” అని కూడా అడిగాడు, సోదరుడి వనవాస అజ్ఞాతవాస వివరాలు పూర్తిగా తెలిసిన సర్వవేదియై!

దానికి, “మహానుభావా, అందుకు మీ దయ వల్ల మేమే చాలు, వారి పని పట్టి అంతమొందించడానికి.”, అన్నాడు భీముడు.

అప్పుడు ఆంజనేయుడు “అయితే యుద్ధంలో నన్ను తల్చుకోండి, సదా విజయులై రాణిస్తారు.. మీ తమ్ముడు – ప్రస్తుతం తపస్సుకై వెళ్ళిన మహారథి అర్జునుడి రథకేతనమై ఉంటాను సూక్ష్మరూపంలో. అక్కడి నుంచి సర్వ రక్షగా ఉంటూ, మీ బలపరాక్రమాలను చూస్తుంటాను. విజయీభవ, దిగ్విజయీభవ, యశస్వీభవ!” అని తమ్ముణ్ణి ఆశీర్వదించాడు మహావీరాగ్రేసర సామీరి,తన సోదరుడు భీష్ముణ్ణి ఆలింగనం చేసుకుంటూ!

సోదరుణ్ణి ఆలింగనం చేసుకుని, సౌగంధిక సరోవర మార్గం కూడా చెప్పాడు వివరంగా, వాత్సల్యంతో హనుమ.

భీమసేనుడు అగ్రజుడు హనుమ పాదాలంటి నమస్కరించి, “సెలవు తీసుకుంటాను”, అని సరోవర మార్గం పట్టాడు.

ఆ మహా తపస్వి హనుమ దేహస్పర్శ వలన భీముడికి అంతవరకు చేసిన ఆ సుదీర్ఘ నడక వలన కలిగిన శ్రమా, బడలికా అన్నీ మటుమాయమై పోయి,జవసత్త్వాలు పెరిగిన భావం కలిగింది.

మహామహిమాన్వితుడైన ఆంజనేయుడు అంతర్హితు డయ్యాడు తత్క్షణమే!

***

బయలుదేరిన భీమసేనుడికి ఆ మార్గంలో వెళుతుండగా పెద్ద పెద్ద ఏనుగుల బృంహితధ్వనులు వినిపించాయి. వాటికి పోటీగా అన్నట్టు మహాపర్జన్యసంఘాల గర్జనలు!

ఏది ఏనుగు ఘీంకారమో, ఏది మేఘనినాదమో తెలియనంతగా ఆ శబ్దాలు కలగలిసి రావటం విని భీమసేనుడు విస్మయం చెందుతూ, సుందర హిమాలయాలకు సమీప ప్రాంతంలో ఉన్న కుబేరపురం లోని సౌగంధిక కమలవనం చేరుకున్నాడు.

ఆ వనం చేరగానే, ప్రియ తనయుడికి హాయి కూర్చాలని బంగారు కమలాల మత్తిలచేసే సుగంధంతో కూడిన తెమ్మెరలను ప్రసరింప చేశాడు, వాయుదేవుడు.

వెంటనే అక్కడ కాపలా కాస్తున్న పదివేలమంది రాక్షస జాతి వాళ్ళు, ‘ఈ వ్యక్తి ఎవరో ఎట్లా వచ్చాడో ఇక్కడికి, ఆశ్చర్యం. మహాతేజస్విగా ఉన్నాడు, తాపసి వేషంలో ఉన్నాడు కానీ ఆయుధధారిగా ఉండి ఉద్దండ గదాదండంతో కనిపిస్తున్నాడు. ఎవరై ఉంటాడో’ అనుకుంటూ; “ఇది కుబేరుడి వనం, ఆయనకూ, ఆయన స్త్రీ జనానికి మాత్రమే ప్రవేశం ఇక్కడికి. మా ప్రభువు వారు విలాసంగా రాణులతో సహా వచ్చి విహరించి ఆనందించే ప్రత్యేక స్థలం ఇది. ఏవిఁటి. నీ సాహసం, ఎవరు నువ్వు, ఎందుకు ఎట్లా చొరబడ్డావు లోపలికి” అని అడిగారు, గద్దిస్తున్నట్లు!

“ఈ సరోవరం తీరంలో దేవర్షిగణాలు దేవతార్చనలు చేస్తూంటారు; దీని జలం అమృత సమానాలై ఉంటుంది. అపూర్వ సౌరభాన్విత కనక కమలాలు వికసించే దివ్య సరోవరం ఇది. సామాన్యుడివి నువ్వు, ఎట్లా వచ్చావు, ఎందుకు వచ్చావు చెప్పు” అని నిలదీశారు కూడా!

దానికి భీముడు, “నేను ధర్మరాజానుజుణ్ణి, భీముడు అంటారు నన్ను. మా పట్టమహిషి ముచ్చటపడితే, ఈ సౌగంధిక కమలాలు కొన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఇదే చెప్తున్నాను, దేవతలే అడ్డం వచ్చినా నా కార్యం సఫలం చేసుకునే వెళ్తాను, ఇది నిశ్చయం” అని ఖరాఖండిగా చెప్పాడు.

వారు కొంత శాంతించి, “అయ్యా మీరే అంటున్నారు ధర్మరాజుల వారి సోదరులమని. మరి ధర్మం తప్పటం సబబు కాదు కదా! అందుకని మీరు మా ప్రభువు కుబేరుల అనుజ్ఞ తీసుకుని కావలసినన్ని కమలాలు తీసుకోండి, అది ఉచితంగా ఉంటుంది”, అన్నారు, మధ్యే మార్గం సూచించాము అనుకుంటూ!

“ఏమిటయ్యా చెపుతున్నారు వింత మాటలు! కొండల్లో సహజంగా పారుతున్న నీటి నుంచే కదా ఏర్పడినది ఈ సరోవరం కూడా అన్నిటిలాగే! ఒక్క కుబేరుడిది అంటారేవిఁటి?! ఎవరైనా వాడుకోవచ్చు యథేచ్ఛగా!”, అన్నాడు భీముడు.

“క్షత్రియుడు ఐన వాడు చేయి చాచి ఎవరినీ ఏమీ అడగడు తెలుసుకోండి! ఏ సంపద ఎక్కడ ఉన్నా బాహుబలంతో సంపాదించి జనానికి పంచి ఇస్తాడు వితరణగా! కీర్తి సంపాదిస్తాడు, అంతే!” అంటూనే భీమసేనుడు ఆ కొలనులోకి దిగి సంతృప్తిగా నీళ్ళు తాగి జవసత్త్వాలు పెరిగినవాడైనాడు. అట్లాగే కొన్ని పూవులూ కోసుకున్నాడు.

ఈ దశలో కోపంతో ఆ కాపలా రాక్షసులు ఆయుధాలతో భీముడి మీదకు దాడి కొచ్చారు.

భీముడు తన గదతో వారినందరినీ బాది, వారి ఆయుధాలను నుగ్గునూచం చేసేశాడు. దానితో వారు బతుకు జీవుడా అంటూ కుబేరుడికి విషయం నివేదించడానికి పారిపోయారు.

అంతా వినిన కుబేరుడు ఆ వచ్చినది ధర్మ పక్షాన ఉన్న పాండవులలో ఒకడైన భీముడనీ, అతని పరాక్రమం వినీ, ద్రౌపదీ దేవి ముచ్చట తీర్చటానికి పూల కోసం వచ్చాడని తెలుసుకునీ, ఉపేక్షించి ఊరుకున్నాడు.

భీమసేనుడు కావలసినన్ని సౌగంధికాలను కోసుకొని, అక్కడ ఉన్న ఒక ఉపవనంలో విహరించ సాగాడు.

***

అక్కడ ధర్మరాజాది ఇతర పాండవులూ, ద్రౌపదీదేవీ ఉన్న చోట హఠాత్తుగా పిడుగులు పడటం ఆరంభమైంది. భయంకర వడగళ్ళ గాలివాన విజృంభించింది. సూర్యబింబం కనరాక చీకటి పడ్డట్టు అయింది.

అంతా కలయ చూసిన ధర్మరాజుకు భీముడు కనబడలేదు. ఆదుర్దాతో అడిగాడు, దగ్గరలో ఉన్న ద్రౌపదితో, “ఇదంతా రాక్షస గంధర్వ మయమైన ప్రాంతం. ఎక్కడ తిరుగుతున్నాడో ఒంటరిగా భీమసేనుడు?! నాకు కలవరంగా, కంగారుగా ఉంది, నీకేమైనా తెలుసా”, అని అడిగాడు.

“అవును మీకు చూపించానే బంగారు కమలం, అట్లాంటివే ఇంకొన్ని దగ్గరలో ఉంటే తెమ్మని అడిగాను నేనే. అందుకని వారు ఆ సౌరభకమలం ఏ దిశ నుంచి వచ్చిందో ఆ ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళ్ళారు, ఇంకా రాలేదు, నాకూ అదే కంగారు మొదలైంది” అన్నది.

“అయ్యో అట్లా అయితే అందరం అక్కడికే వెళ్లి చూద్దామ” అని రాక్షస భుజాల మీద ఆ సౌగంధిక సరోవరం తీరానికి చేరుకున్నారు. అక్కడ భీముడి చేత చంపబడ్డ యక్ష రాక్షసులనూ, గదాధారియై వెలిగిపోతున్న భీమసేనుణ్ణీ చూశారు. చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు నెమ్మదిగా!

భీముడు కూడా ధౌమ్యధర్మరాజాది పెద్దలకు మొక్కి, పిన్నవారిని అక్కున జేర్చుకునీ, తాను పోరాడి సాధించిన వైఢూర్య నాళాలు గల ఆ సౌగంధికాలను ద్రౌపదీ దేవి దోసిట నింపాడు. ఆమె ముఖం ప్రసన్న కమలమే అయింది ఆ క్షణాన!

తన భర్త తన కోసం అంత సాహసం చేసి యక్ష భూమిలో నిలబడి పోరాడి సంపాదించి తెచ్చిన ఆ సౌగంధికాలు మరింత అందంగా అనిపించాయి ఆమె కళ్ళకు, ఆ క్షణంలో.

వాటి అపూర్వ సౌరభాలతో ఆమెకు ఏదో అపూర్వ లోక దివ్యోద్యానంలో విహరించినట్లు అనిపించింది.

అప్పుడు ధర్మరాజు, “ఎంత కంగారు పుట్టించావు భీమసేనా! ఇట్లా సాహసోపేతమైన పనులు చేయకయ్యా, నీవే మాకు పెద్ద అండ! అందునా ఒంటరిగా అసలు వెళ్శవద్దు ఈ నిర్జన ప్రదేశాలలో”, అని సూచన చేశాడు, తన తమ్ముడి పై గల అపార ప్రేమతో!

అందరూ అక్కడే ఆ కుబేరుడి సౌగంధిక వన తీరంలో మాట్లాడుకుంటుండగా, రక్షకభటులు వచ్చి “అయ్యా మన్నించాలి, ఇక్కడ ఎక్కువ సమయం మీరు ఉండటం మంచిది కాదు, ఇది యక్షరాక్షస సంచార ప్రదేశం, దయచేసి వెళ్ళిపోండి” అని అభ్యర్థించారు..

అప్పుడు పాండవులు ఘటోత్కచుణ్ణి అతని అనుచరులతో సహా “ఇక సెలవు మీకు”, అని పంపించివేసి, ఆ కుబేర వనం నుంచి బయటకు వచ్చి కాస్త దూరంలో కుటీరాలు వేసుకుని నివసించ సాగారు, వనవాసం కొనసాగిస్తూ!

***

ద్రౌపదీ దేవికి భీముడి పట్ల ఆరాధనా భావం ఎంతో పెరిగిపోయింది, ఈ సౌగంధిక కమలాల వృత్తాంతం తరువాత.

“ఎంత సాహసం చేసి తెచ్చారు నా కోరిక మన్నించి”, అని ఆ ఇనుమడించిన ప్రేమ భావం.

ఆ తరువాత, ఏకాంతంలో ఉన్నప్పుడు, భీమసేనుడు ద్రౌపదిని “సౌగంధికాప్రియా” అని పిలవటం కూడా ఆరంభమైంది. దానికి చిరునవ్వుతో ఆ యాజ్ఞసేని ఇచ్చే జవాబు, “సెలవీయండి,సౌగంధిక వీరా”, అనే!

ఏది ఏమైనా, ఈ సౌగంధికా కమలాల ఘట్టం భీమద్రౌపదుల జీవితాలలో ఒక మనోజ్ఞ పరిమళ భరితమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

***

భీమసేనుడికి, తన సోదరుడూ చిరంజీవీ యైన మహావీరుడు ఆంజనేయుడు దర్శనమిచ్చి అఖండ ధైర్యాన్ని ఇచ్చే వరం ప్రసాదించిన సన్నివేశమూ ఇదే! అన్ని విధాలా, పాండవులకు వాత్సల్య, సుగంధ పర్వమే అయింది ఇది, నిస్సంశయంగా!

పాండవులు ధర్మపరీమళ చరిత్రులు. వారి పట్టమహిషి, శారదోత్పలనయన మాత్రమే కాదు, శారదోత్పల శుధ్ధసౌశీల్య కూడా!

అట్టివారి జీవన సన్నివేశ మననం నిజంగా పుణ్యసౌగంధికా ప్రదాయకమే! నిస్సంశయంగా!

Exit mobile version