[శ్రీ అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రచించిన ‘వసంతోదయము’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
సంవత్సర కాలం అనుభవించిన
తియ్యని విరహ వేదననీ,
వన్నెతగ్గని వలపు మోదాన్ని
పడుగుపేకలుగా అల్లి పంచుతూ
నేసీన పచ్పటి పట్టుచీర పట్టుకొస్తు
న్నాడు, చైత్రుడని కబురు రాగానే
ఫాల్గుణంలో తరువులన్నీ
తమ తమకాల దారాలతో ఎర్రటి చివురు
రైకల్ని కుట్టించేస్తున్నాయి.
ప్రకృతి మంత్రసానొచ్చి
చైత్రంలో పురుడొస్తుందని చెప్పి వెళ్ళింది కామోసు..
పొత్తిళ్ళలో మొగ్గ పాపాయిలను
లాలించడానికేమో..
మల్లె పొదలన్నీ కొత్తాకుల మెత్తటి చీరల
బొత్తిపెట్టుకున్నాయి.
మాఘపు అందాలమత్తులో పడి
ఒళ్ళు మఱచి వలువలని జార
విడుచుకున్న శిశిరానికి ఫాల్గుణం
సుతిమెత్తటి పల్లవాలతో ఉడుపు
లని వొడుకుతుంది.పూల పెదవు
లని ముద్దాడుతూ మగతలో ఉన్న
మంచుబిందువూలనీ.. మంచు
కాలపు గడువు తీరిపోవచ్చిందనీ
..వెచ్చటి ఎండలు వేడేక్కక
ముందే ఇక సందూపులు సద్దుకుని
సన్ననాకుల సందూల్లోంచి వలస
దారి పట్టండనీ.. పొద్దుటే వీచే
చల్ల గాలులు తోటతోటకి తిరిగి
చాటింపేసొస్తుంటాయి.
వసంతుడొచ్చేసరికి వాకిళ్ళకి
మంగళ తోరణాలు కట్టాలని..
వచ్చివాలే కోకిలమ్మలకి విడుదులు
సద్దాలనీ.. మామిడి తోపులన్నీ
ముడుచుక్కూచ్చున్న కొమ్మల్ని
కొంచెంకొంచెంగా కోప్పడ్తూ
తొందర పెడుతుంటాయి..
మన్మథుడి అమ్ములపొదిలో ఒదగడానికి సిద్దం
కమ్మంటూ రెమ్మల్ని చీవాట్లు పెడుతుంటాయి.
రాలిపడ్డ మోదుగుపూలన్నీ
కుర్రాళ్ళ దోసిళ్ళలో నిండి చావిట్లో
మరుగుతున్న నీటిగంగాళంలో మునిగి
ఎఱ్ఱటి రంగై పొంగితే
పడుచుపిల్లల దోసిళ్ళనిండి
పసుపుసున్నం వసంతమై
తొంగి చూస్తుంది..
ఎగసిన కాముని పున్నమి మంటల సెగలకి
ఝడిసిన చలి వెనక్కి తిరిగి చూడకుండా
అల్లంత దూరం పరుగులు తీస్తుంది..
రాబోయే వసంతాన్ని
స్వాగతిస్తూ ముందస్తుగా
“వావి లేదు వరసలేదు హోళీ..
చెమ్మ కేళిర హోళీ..” అని దేశవాళి
పదాలకి చిందేస్తూ రంగులు చిమ్ముకునే
వసంతకేళి పసివాళ్ళనీ.. పడుచువాళ్ళనే కాదు..
ముదుసళ్ళని కూడా ముసి ముసి నవ్వులతో
బులిపిస్తుంది.. మనసైనవాళ్ళు
మరొక్కసారి మదిలో మెదిలేలా చేస్తుంది.
ఎన్నెన్ని వన్నెలు.. వెన్నెల తిన్నెలూ..
ఎన్నెన్ని పరిమళపు పుష్పాలూ..
మధురఫలాలూ ఎన్నెన్ని అందాలూ..
అల్లుకున్న ఆత్మీయపు బంధాలూ..
ఇన్నింటినీ అనుభవించడానికి
అస్సలేమాత్రం సరిపోని ఒకే ఒక్క.
ఒకే ఒక్క.. చిన్ని జీవితం..
దాన్ని కూడా మింగేసే అనవసరపు
అసూయలూ-ద్వేషాలూ…
కోపాలూ.. తాపాలూ.. మన కనవసరమా నేస్తం..;
హాయిగా పలుకరించే పిట్టల పాటలు వింటూ..
తిండానికి రెండు రొట్టెలు.., నిత్య నూతన
వధూవులా మురిపించి మైమరపించే
ఓ దోసిలి మధువు..
జీవితపు రుచిని ప్రతిక్షణం
అనుభూతించేట్లు చేసే కాసింత కమ్మటి
కవిత్వం.., ఇలా.. ఇలా.. చాలు..
చాలు.. కదా.. ఆనక అలాగే
రెప్ప వాలినా మేలు కదా..