Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసంతగీతిక

[విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మరింగంటి సత్యభామ గారు రచించిన ‘వసంతగీతిక’ అనే కవితని అందిస్తున్నాము.]

శ్రీ క్రోధి సంవత్సరమునకు వీడుకోలు
శ్రీవిశ్వావసు నామ సంవత్సరమా
పూర్ణకుంభ స్వాగతము సుస్వాగతము
సుస్వాగతము ఓ సంవత్సరాదీ
కుహూ కుహూ యని స్వాగతగీతిక
కోకిల గానము మురిసె వసంతము
మామిడి పూత పరిమళములతో
లేత మామిడి వగరు కొత్తచింత
పండు పులుపుతో నోరూర
గుడ ప్రసాద తియ్యందనము వేప
పూత చిరుచేదు రుచితో మిరియంపు
కారము ఉగాది ప్రసాదము లవణ
మొకింత చెరుకు ముక్కలు కలిపి
షట్ కామనల ఎరుక జీవిత మనీ
షడ్రుచులె జీవన సమ్మేళనమ్మని
తెలియజేయు అన్నిసమయము
లందు యుక్తి యుక్తముగ నుండ
వలె నని ప్రబోధించు యుగాది
శాంతి యుతమ్మగు కర్షకుడే
ఎల్లర ఆకలి తీర్చు దైవము
ఏరువాక సాగురైతన్న నాగలికి
పసుపు కుంకుమలద్ది పూలహారము
వేసి భూమిపూజలు చేసి నల్గురను
పిలిచి ఏరువాక సాగి ప్రసాదమును
పంచి ఐకమత్యము తోడ దానధర్మము
చేయు రైతన్నయే మనకు ఆదర్శము
నవజీవనమునిచ్చు యుగాదీ
రా రమ్మని పిలిచె వసంత ఋతువు
పచ్చని తరువుల సుమ సౌరభమువ
చల్లని మలయ మారుతమ్ముల
క్రొత్త వత్సరమా స్వాగతం సుస్వాగతం
కొంగ్రొత్త తలపులు ఆశలు తీర్చే
శ్రీవిశ్వావసు నామ వత్సరమా
మల్లియ మొల్లల మాలిక పరచి
పూర్ణకలశముతో స్వాగతముపలికి
స్వాగత గీతిక ఆలాపనలతో
స్వాగతించెదము రా రావమ్మ
వత్సర సుందరి ఆగమమునకు
స్వాగతం సుస్వాగతం స్వాగతం
షడ్రుచులతో ఉగాది ప్రసాదము
పరమాత్మకు నివేదన చేసి కోరెదము
అరవిరిసే విరి తావి తావులతొ
శోభాయమానముగ వత్సర మంతయు
శుభప్రదమ్ముగా మా కామనల తీర్చు
కాలపురుషునీ కీర్తించి స్తుతించెదము
శ్రధ్ధగా పంచాంగ శ్రవణము చేసీ
భవిత ఆశలను మనసున నింపుకొని
యుగాదీ మేము నవ జీవనము నిమ్మా
సప్తాశ్వరధమెక్కి కాలగమనమున
మమ్ము నడిపించు ప్రత్యక్ష దైవమా
స్వాగతము స్వాగతము శ్రీవిశ్వావసు
సిరిసంపదలు నీయవె ఆరోగ్యమీయవే
శాంతియుతమ్మగు బ్రతుకునీయమ్మ
స్వాగతము స్వాగతము సుస్వాగతం
కరువుకాటకములు రాకుండ మమ్ముల
కాపాడు కాల స్వరూపా పరమేశ్వరా
హృదయపూర్వక స్వాగత సుమాంజలి

(షడ్రుచులు: 1. తీపి – మధురం 2. పులుపు – ఆమ్లము 3. ఉప్పు – లవణము 4. కారము – కటువు 5. చేదు –  తిక్తము  6. వగరు –  కషాయము
షడ్గుణాలు: 1.  జ్ఞానము 2. ఐశ్వర్యం 3. బలం 4. వీర్యం 5. తేజస్సు 6. శక్తి సంపూర్ణంగా కలిగిన చైతన్యం.
దీనినే భగవంతుడు అంటారు
ఈ గుణాలు అన్నీ జ్ఞానముతో నిండి వుంటాయి. అలాంటి జ్ఞానస్వరూపం కాలము గమన స్వరూపం)

Exit mobile version