Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసంత లోగిలి-9

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[అర్ధరాత్రి దాటుతుంది. స్వప్నికా, సుధీర్‍లను వారుంటున్న ఆశ్రమానికి రహస్యంగా వచ్చి కలుస్తాడు మార్తాండ. ఆయన రాగానే, స్వప్నికలో అప్పటిదాకా అణచుకున్న వేదన బయటపడుతుంది. తల్లిదండ్రులతో ఎడబాటు రావటాన్ని భరించలేకపొతున్నానని ఏడుస్తూ చెబుతుంది. ఆయన ఆమెను ఓదారుస్తాడు. ఆమె సందేహాలు తొలగించటానికే వచ్చానని చెప్తాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెను రహస్యంగా కోట నుంచి తప్పించడానికీ, సుధీర్ వర్మతో వివాహం జరిపించటానికి ఉన్న కారణాన్ని వివరిస్తాడు. బహాదూర్ వంశంలో ప్రతి మూడవ తరంలో పుట్టే ఆడపిల్లలకు ఎదురవుతున్న ఒక శాపం గురించి చెప్తాడు. ఆ వంశంలో తొమ్మిదో తరంలో పుట్టిన ఆడపిల్ల స్వప్నిక అని చెప్తాడు. రాచరికాలు దూరమైనా, తిలక్ నందిని బహుదూర్‍లు రాజసాన్ని వదులుకోలేక, దానధర్మాలు కొనసాగించటంతో ఆస్తులు కరిగిపోయాయని చెప్తాడు. స్వప్నికకి ఆరేళ్ళ వయసులో, తిలక్ బహదూర్ తమ ఇలవేల్పు కాత్యాయని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాడనీ, తమ కూతురిని కాపాడమని అమ్మవారిని ప్రార్థిచాడని చెప్తాడు. అమ్మవారు తిలక్‍కి స్వప్నదర్శనమిచ్చి, అభయమిచ్చిందని చెప్తాడు. మర్నాడు అమ్మవారు నందిని బహాదూర్‌కు కలలో కనిపించి, ఏం చేయాలో తెలిపిందనీ, అమ్మవారి ఆదేశాల మేరకే, స్వప్నికని కోటనుంచి తప్పించి, రహస్య ప్రదేశానికి చేర్చామనీ, సుధీర్‍ వర్మతో వివాహం జరిగేలా చేశామని ఆయన చెప్తాడు. ఇదొక యుద్ధమనీ, అమ్మానాన్నల గురించి బాధపడవద్దనీ, ప్రశాంతంగా ఉండమనీ చెప్తాడు. తర్వాత చేయాల్సిన పనుల గురించి సుధీర్ వర్మకి సూచనలు చేసి మార్తాండ వెళ్ళిపోతాడు. ఇక చదవండి.]

నైమిశారణ్యం ప్రయాణం..

“నువ్వు ప్రపంచాన్ని చూడాలనుకున్నావ్.. నీ కళ్ళతో చూస్తున్నావ్. ఇప్పుడు మనం వెళ్తున్న నైమిశారణ్యం ఎంత పవిత్రమైనదో తెలుసా.. పవిత్ర గోమతీ తీరంలో 88000 ఋషులు తపస్సు చేసిన యజ్ఞభూమి ఇది. వేదవ్యాసుడు వేదాలు నాలుగు భాగాలుగా విభజించిన ప్రదేశం. అష్టాదశ పురాణాలు, ఆరు శాస్త్రాలు రాసిన ప్రదేశం. మొట్టమొదట సత్యనారాయణ వ్రత కల్పాన్ని వ్యాసుడు సూత మహర్షికి చెప్పిన ప్రదేశం. మొట్టమొదట మహాభారత పారాయణ౦ చేసిన ప్రాంతం. ఇంద్రుని వజ్రాయుధం ఇక్కడే తయారు చేసారు తెలుసా! సుమిత్రా” అని సుధీర్ చెబుతుంటే చెవులు రిక్కించి, చారడేసి కళ్ళతో ఆశ్చర్యంగా వింటోంది.

శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో బ్రతికిన దధీచి మహర్షి, మహా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందింది ఇక్కడే.

దధీచి మహర్షి తిరిగే పవిత్రమైన ప్రాంతం.. ఈ నైమిశారణ్యం.

తన తపోశక్తితో తన శరీరం త్యజించి తన శరీరంలో ఉన్న ఎముకలతో వజ్రాయుధం, సారంగి, పినాక ఆయుధాలను తయారు చేసి దేవతలకు ఇచ్చిన గొప్ప మహర్షి దధీచి మహర్షి.. ఆయన నివాసం ఉన్న ప్రదేశం ఈ దధీచి మహర్షి ఆశ్రమం” అంటూ ఆగిన సుధీర్ వర్మతో..

“ఎంత గొప్ప ప్రదేశానికి వచ్చాం కదా! పురాణాలను పుస్తకాలలో చదవటమే గాని, ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది సుధీర్. ఈ పవిత్ర భూమిని తాకుతూ ఉంటే గొప్ప అనుభూతి కలుగుతోంది, మన వైదిక ధర్మం ఎంత గొప్పదో, మన ఋషులు, మహర్షులు ఎంత గొప్పవారో కదా” అంది సుమిత్ర.

“ఇంతకీ మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నాం” అంది.

“ఇక్కడ ఒక ఆచార్యుల వారిని కలుసుకొని ఈ ప్రాంతమంతా తిరిగి మనకి తెలిసిన విద్యని వారికి చెబుతూ కొన్నాళ్ళు గడుపుదాం సుమిత్రా” అన్నాడు సుధీర్.

ప్రశాంతమైన ఈ వాతావరణంలో, ప్రకృతి మాత ప్రణమిల్లే ఈ నేలమీద నడయాడటం పూర్వ జన్మ సుకృతం అంటూ.. ప్రశాంతంగా ప్రకృతిని దర్శిస్తున్న సుమిత్ర కళ్ళల్లోకి సూటిగా చూసాడు సుధీర్.

సుమిత్ర సుధీర్ కళ్ళల్లోకి చూసింది. తన బాధని మరిచిపోతూ మెల్లిగా సుధీర్‌కి దగ్గరవుతోంది సుమిత్ర.

సుధీర్ గుండెలపై తల ఆనిస్తూ.. “నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాసుధీర్” అంది.

“ఏంటది సుమిత్రా, అడుగు..”

“సుధీర్.. అసలు.. అసలు నేను నీకు నచ్చానా? లేక మా నాన్నగారు కోరారని, మీ నాన్నగారు అడిగారని నన్ను వివాహం చేసుకోవాల్సి వచ్చిందా?” అంది సుమిత్ర.

“మాలాంటి వాళ్ళు ప్రేమ, అభిమానం లాంటివి మనసులో దాచుకోవడానికే గాని వ్యక్తపరచడానికి వీలుకాదు సుమిత్రా! కాని, నేను అదృష్టవంతుడను. నా మనసులో నీ పట్ల ఉన్న ప్రేమని అర్థం చేసుకుని నిన్ను నాకు ఇచ్చేసాడు ఆ దేవుడు.

వెల్తూ వెళ్తూ మార్తాండ ఆచార్యులవారు ఒక మాట అన్నారు సుమిత్రా! అదేంటంటే, ‘మీ మద్య పవిత్రమైన స్నేహం మాత్రమే ఉంది, దాన్ని ప్రేమ అనే మెట్టు ఎక్కించే బాధ్యత నీదే సుధీర్..’ అన్నారు..

వేదాలు చదువుకునే బ్రాహ్మణుడిని, ఆశ ఉన్నా నేరవేర్చుకునే అవకాశమే లేని నిన్ను ఎప్పుడో ఇష్టపడ్డాను, కాని నా ఆశను నా గుండెలోనే భద్రపరచుకున్నాను.. ఎందుకంటే, నువ్వు నాకు అందవని తెలిసీ, ప్రయత్నం చేయటం, అభాసుపాలు కావడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను సుమిత్రా!

నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం.. కాని రాజకుమార్తెవి కదా! అని నేను నా ఆశను గుండెల్లో సమాధి చేసుకున్నాను. కాని కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టుగా నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది నేను కోరుకున్న నిన్ను వివాహం చేసుకోవడం” అంటూ సుమిత్ర ముంగురులు తన ముని వేళ్ళతో సవరించాడు సుధీర్ వర్మ.

“నేను సామాన్య బ్రాహ్మణుడిని, నువ్వు ఎంతైనా రాజపుత్రికవి.. నీతో నా పెళ్లి అంటే అది కల గానే మిగిలిపోతుందని అనుకున్నాను.. కాని అది వాస్తవ రూపం దాల్చడం చాల సంతోషంగా ఉంది తెలుసా! కడు పేదవాడి ముందు పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. అసలు మీ ధనుంజయ్ వర్మ నీ జీవితం లోకి వచ్చేస్తాడేమో అని చాలా భయపడ్డాను కూడా” అన్నాడు సుధీర్.

“అవునా!” అంది ఆశ్చర్యంగా సుమిత్ర.

“అయినా ఇంత జరుగుతుందని నాకేం తెలుసు? మీ రాజవంశానికి ఇంత చరిత్ర ఉంటు౦దని ఉహించలేదు సుమా!”

“అదిగో మీ రాజవంశం అని నన్ను వేరు చేసి మాట్లాడకు సుధీర్.. మనం ఇప్పుడు రాజ వంశస్తులం కాదు.. సామాన్యులం అంతే..” అంది సుమిత్ర.

“అమ్మానాన్నలని వదిలి రావలసి వచ్చినందుకు బాధగా ఉంది తప్ప.. నాకింకేం బాధ లేదు సుధీర్. ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో నేను చూస్తున్నా. అందరితో పాటు బతుకుతున్నా, అందరిలా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నా. రాచరికపు ఉచ్చు తీయగలిగాను. అందుకు.. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

నాన్నగారు, అమ్మ నా క్షేమం కోరి, బహుదూర్ వంశం క్షేమం కోరి బయటకు వారే నన్ను పంపారు. అందుకు అందుకు ఇంకా సంతోషంగా ఉంది. కాకపోతే మళ్ళీ వాళ్ళను చూడగలనా!” అని ఆగింది సుమిత్ర.

“చూస్తాం సుమిత్రా.. మన బిడ్డ ద్వారా మళ్ళీ చూడగలం.. అంతవరకూ తప్పదు మనకీ అజ్ఞాత వాసం” అన్నాడు సుధీర్.

***

“అలా ఇద్దరు నైమిశారణ్యంలో కొంత కాలం ఉన్నాం.. ఆ తరువాత రామకృష్ణ మిషన్ – వేలూరి మఠం. ఇలా.. తిరుగుతూనే ఉన్నాం..

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగాం, చిన్న చిన్న ఆశ్రమాలలో చేరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసాం.. మాకు పెళ్ళైన రెండున్నరేళ్ళ తరువాత నువ్వు పుట్టావ్.. నువ్వు పుట్టాక మా జీవితాలు పరిపూర్ణమైపోయాయి.. నువ్వే మా ప్రపంచం అయ్యావు. ఉన్న చోటే ఆశ్రమం లోనే నిన్ను చదివిస్తూ వచ్చాం. కాని ఇంకా ఇలా అక్కడ, ఇక్కడ తిరుగుతూ ఒక పద్ధతి, పాడు లేకుండా ఉంటే మా జీవితాల్లా నీ జీవితం కూడా తయారవుతుంది. ‘మనం ఇప్పుడు ఈ విశాఖపట్నం నుంచి ఇంకెక్కడికి పోవద్దు. నిత్య చదువు మంచిగా కొనసాగాలంటే ఒక స్కూల్‍లో వేసి చదివించాలి. ప్రస్తుత ప్రపంచానికి తగ్గట్టు నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చదవించాలి. ఇక ఈ తిరుగుళ్ళు ఆపెయ్యాలి. ఆ ఆశ్రమం లో పని చేస్తూ నిన్ను చదివించాల’ని అనుకున్నాం. పద్దెనిమిదేళ్ళు దాటాక నువ్వు ఏమి చెయ్యవలసి వస్తుందో తెలీదు. కాని దానికి నిన్ను సిద్ధం చెయ్యాలి.. అదే మా ముందున్న కర్తవ్యం.

అన్నట్టు గానే మేము నిన్నువిశాఖపట్నంలో ఒక సందులో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని సాదా సీదాగా బతుకునీడుస్తూ నిన్ను హైస్కూల్‍లో జాయిన్ చేసాం.. అలా నీ చదువు విశాఖపట్నం లోనే కొనసాగుతూ వస్తోంది. నీ డిగ్రీ చదువు అయిపోగానే నువ్వు కోరుకున్నట్టే MBAలో సీట్ తెచ్చుకుని, నీ చదువు పూర్తయ్యాక గాని మద్యలో గాని అంటే 18 నిండిన తరువాత నిన్ను తాత, అమ్మమ్మ ల దగ్గరకి తీసుకుని వెళ్లి నిన్ను వాళ్లకి చూపించాలని అనుకున్నాం..” అంటూ నిత్యకి చెప్పడం ఆపాడు సుధీర్ వర్మ.

కాసేపు నిట్టూర్చి, మళ్ళీ మొదలు పెట్టాడు.

“ఇంతలో.. ఇలా..

ఇంటికి వచ్చి టి.వి వేసి కుర్చీలో కూర్చున్నాను .. నీ గురించి, నీ చివరి పరీక్ష గురించి ఆలోచిస్తూ కూర్చున్నా.. తిలక్ బహుదూర్, నందినల గురించి, వాళ్ళ వంశం గురించి చెబుతూ.. వారు హత్యకి గురైనట్టు టివిలో చెప్పారు. అది విన్న అమ్మ వంటగదిలో నుంచి వచ్చి.. అమ్మ ఏడవటం మొదలు పెట్టింది.. ఎందుకు ఏడుస్తోందో నాకూ అర్థం కాలేదు మొదట.

తిలక్ బహుదూర్, నందిని బహుదూర్‌లు హత్య గావించబడ్డారని, వారి కుమార్తె స్వప్నిక బహుదూర్ బతికి ఉందో లేదో అని టి.వి.లో చెబుతున్నారు.

అది విన్న వెంటనే మీ అమ్మ ‘స్వప్నిక బహుదూర్’ బతికే ఉందని నా స్నేహితుని ద్వారా మీడియాకి చెప్పాను. బయలుదేరి మద్రాస్ వస్తున్నామని ఒక సమాచారం అందించాం. ఎందుకంటే, తాతయ్య అమ్మమ్మ లను చివరి చూపు చూసుకోవాలని, మేము వెళ్ళే దాకా వాళ్ళ పార్థివ దేహాలను ఉంచుతారన్న ఆశతో ముందుగా సమాచారం అందించాను” కూతురికి చెప్పాడు సుధీర్ వర్మ.

***

తండ్రి తనకు చెప్పిన గతాన్ని ముగించి, తనకు తెలిసిన విషయాలను శారదకి చెప్పడం కొనసాగించింది నిత్య.

“మీ అమ్మమ్మ – తాతయ్య లను బతికుండగా నీకు చూపించలేకపోయాం.. ఇప్పుడు చూపిద్దాం అంటే వాళ్ళు బతికి లేరు నిత్యా” అంటూ ఏడుస్తున్న అమ్మని ఓదారస్తున్నారు నాన్న.

అలా, మద్రాస్ చేరుకున్నాం.. అక్కడ చేరుకున్నాక.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా శారదా..

కోట చుట్టూ పోలీసులు, మీడియా వాళ్ళు .. ఇంకా ఎవరెవరో పెద్దవాళ్ళు .. అలా బారులు తీరిన జనం.

కోట ముందు కారు ఆగింది..

ఒక పెద్దాయన.. సంచిత రామవర్మ.. ఏ మూల నుంచి వచ్చారో! “నాయనా సుధీర్, స్వప్నికా.. ఎన్నేళ్ళు అయింది మిమ్మల్ని చూసి.. రండమ్మా రండి” అంటూ, “తిలక్ బహుదూర్ కూతురు ‘స్వప్నికా బహుదూర్’ ఈమెనే సార్” అని అక్కడ ఉన్న పోలీస్ అధికారులకి పరిచయం చేసారు.

“ఓ అలాగా, రండి మేడం” అంటూ లోపలికి తీసుకుని వెళ్ళారు.

ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న వాళ్ళని ఆపి.. కూతురుని తల్లి తండ్రుల వద్దకు తీసుకుని వెళ్లారు.. అమ్మ వెనుకే నేను, నాన్న ఉన్నాం.

చనిపోయిన తాత, అమ్మమ్మని చూసి అమ్మ ఒకటే ఏడుపు.

“మేడం స్వప్నికా! మేము చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి.. మీరు కాస్త సహకరించాలి” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

అమ్మని అలా పక్కకి తీసుకుని వెళ్ళాం.

ఇంతలో.. అక్కడకు విచ్చేసిన సంచిత వర్మని చూసి..

“నాన్నా! ఇలా హత్య చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? పాపం కూతుర్ని దూరం చేసుకుని బాధలో ఉన్న వీళ్ళ మీద ఎవరికి ఇంత కోపం?” అడిగారు మా నాన్న సుధీర్.

“ఇంకెవరు నాయనా! ధనుంజయ్, అంజనని చేరదీసి, వారికి తల దాచుకునే అవకాశం ఇచ్చారు కదా! వారే ఈ హత్య చేసారు” చెప్పారు మా తాతయ్య.

“అవునా! అంత పని చేసారా ఆ దుర్మార్గులు” అన్నాడు నాన్న ఆవేశంగా.

“ఇప్పుడు కాదు నాయనా! మానసికంగా ఎప్పుడో చంపేసాడు ఆ ధనుంజయ్ వీళ్ళని. స్వప్నికతో పాటు ఈ కోటని దక్కించుకోవాలని ఆశపడ్డాడు.. తిలక్ బహుదూర్‍ని ఒంటరి చేసి దక్కించుకోవాలని ఆశించి తిలక్‍కి తోడుగా, సన్నిహితంగా ఉన్న మార్తాండని పొట్టని పెట్టుకున్నాడు” అన్నారాయన.

“అవునా! మార్తాండ గారిని చంపేసారా! ఎలా?.. అందుకే ఆయన మమ్మల్ని కలవలేదన్న మాట..

నైమిషారణ్యం తరువాత మేము ఎక్కడికెళ్లాలో చెప్పారు.. ఆ తరువాత ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు మాకు” అన్నాడు నాన్న ఆశ్చర్యంగా.

“వాడు చాలా దుర్మార్గుడు సుధీర్.. కోటలో పాగా వేసిన ధనుంజయ్ ఆగడాలకు అంతులేకుండా పోయింది.

కొన్నాళ్ళ క్రితం, ఈ ధనుంజయ్ ఏమి చేసాడో తెలుసా సుధీర్..

‘సంచిత రామ వర్మా!’ అనుకుంటూ ఈ ధనుంజయ్ నా మీదకు వచ్చాడు.. ‘మీ సుధీర్ వర్మ ఈ మధ్య కనిపించటం లేదేం’ .. అని అనుమానంతో అడిగిన ధనుంజయ్ వర్మకి సమాధానంగా ‘కొన్ని ఉపనిషత్తులు నేర్చుకోవడానికి వెళ్ళాడని.. వచ్చేసరికి కాస్త టైం పట్టచ్చ’ని సమాధానం చెప్పాను. నమ్మలేదు..

ఏ ఆశ్రమానికి వెళ్ళాడు అన్నాడు.. హిమాలయాల్లో ఋషుల వద్దకి వెళ్ళాడు అన్నాను. అది నమ్మినట్టే నమ్మినా ఏదో సందేహం తోనే ఉన్నాడు ధనుంజయ్.

పిచ్చి సన్నాసి.. నిన్ను వెతకడానికి అక్కడకు మనుషులను పంపాడు తెలుసా!

‘మార్తాండాచార్యుల వారూ.. మీరు కూడా.. ఈమధ్య కనిపించడం లేదు.. ఏవైనా రాచ కార్యాలు మిగిలి ఉన్నాయా!’ అని అడిగాడు కాస్తా సందేహిస్తూ ధనుంజయ్.

‘రాజ్యాలున్నాయా! రాచరికాలున్నాయా! రాచ కార్యాలు మిగలడానికి.. భుక్తి కావాలి కదా! ఎప్పుడు ఈ కోటలోనే ఉంటే ఎలా?.. ఈ జానెడు పొట్ట నిండాలి కదా! అందుకే అక్కడ, ఇక్కడ తిరిగి భుక్తి గడుపుకోవాడానికి వెళ్లి వస్తున్నా’ , అని చెప్పి తప్పించుకున్నాడు మార్తాండ.

కాని డేగ కళ్ళ ధనుంజయ్ నిఘాలో ఎక్కడో స్వప్నిక బహుదూర్‌ని కలిసిన వాసన కనిపెట్టినట్టుగా అనిపిస్తూనే అనుమానపడుతున్నట్లు ధనుంజయ ముఖకవళికలు చెప్పకనే చెబుతున్నాయి.

ఎంత ప్రయత్నించినా, ఎంత దగ్గరైనా తిలక్ మామ, నందినిలు వారికున్న ఆస్తి పాస్తి వివరాలు గాని, స్వప్నిక గురించి గాని సమాచారం చెప్పటం లేదు.. అసలు స్వప్నిక గురించి వెతుకులాడటం మాని మామూలుగా ఉన్న తిలక్ నందినిలను చూసి సందేహించిన ధనుంజయ్, ఒకరోజు, ‘తిలక్ మామా, స్వప్నిక వెళ్లి చాలా రోజులైంది. ఇంతవరకు ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలియటం లేదు. అసలు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యటం లేదు?’ అని అడిగాడు.

‘తను కావాలని మమ్మల్ని వదిలివెళ్లిపోయినప్పుడు తనని వెతకడం అనవసరం అనిపించింది ధనుంజయ్. ఆ మాత్రం దానికి వెతుకుట దేనికి ధనుంజయ్.. పైగా ఈ ఉత్తరంలో తనని వెతకద్దు అని రాసి మరీ వెళ్ళింది కదా! వెళ్ళనీ, తనకి అమ్మా నాన్న వద్దనుకుంది, తను మాత్రం మాకు ఎందుకు?’ అని ధనుంజయ్‌ని నమ్మించడానికి అన్నాడు తిలక్ బహుదూర్.

తిలక్ మామకున్న బలం మార్తాండ. అతనికి తిలక్‌కి ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా గుర్తించాడు. అతని ద్వారా ఆస్తుల వివరాలు, స్వాప్నిక గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసాడు ధనుంజయ్.

ఒక రోజు, మార్తాండ ధనుంజయ్‌కి పట్టుబడ్డాడు.. ‘స్వప్నిక ఎక్కడ ఉందో మీకు తెలుసని నాకు తెలుసు.. ఎక్కడ ఉందో చెప్పండి’ అని బెదిరించాడు.

కాని స్వప్నిక గురించి ఎంత అడిగినా చెప్పకుండా మౌనం వహించాడు మార్తాండ.

అసహనంతో రగిలిపోయిన ధనుంజయ్ చేతులు ఊరుకోలేదు సరికదా, మార్తాండ పీక పట్టుకుని ఒక్కసారి బలంగా పైకి లేపాడు.

ఈ హఠాత్ పరిణామానికి భిన్నుడైపోయాడు మార్తాండ..

‘నోరు మెదపని నిన్ను పీకపిసికి ప్రాణాలు తీసి పైకి పంపిస్తాను’ అని ఉక్రోషంతో గట్టిగా బలంగా రెండు చేతులు మార్తాండ మెడ చుట్టూ వేసి నొక్కడంతో మార్తాండ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కాని, ఏమీ ఎరుగని వాడిలా వ్యవహరిస్తూ మార్తాండ శరీరాన్ని అతి రహస్యంగా తరలించి రైలు పట్టల మీదకి నెట్టి, శరీర బాగాలు నుజ్జు నుజ్జు అయ్యేలా.. సాక్ష్యం లేకుండా పని కానిచ్చేసాడు ధనుంజయ్.

మొత్తానికి మార్తాండని మట్టు పెట్టేసాడు ఈ ధనుంజయ్.

ఈ విషయం తెలిసిన తిలక్ బహుదూర్, నందినిలు సవితి చెల్లి అయిన అంజనని, ఆమె కొడుకు ధనుజయ్‌ని కోటను వదిలి పొమ్మన్నారు.. ‘నా హితుడు, స్నేహితుడు అయిన రాజ మార్తాండని పొట్టన పెట్టుకున్న నీకు, నీ కొడుకుకి నా ఇంట్లో స్థానం లేద’ని తిలక్ బహుదూర్ తెగేసి చెప్పారు.

అప్పుడే అక్కడకు వచ్చిన ధనుంజయ్.. ‘చూడు తిలక్ మామా! నీ కూతురు ఎటు పోయిందో, ఎవడితో పోయిందో తెలియదు.. ఇరవై ఏళ్లు పైగా తను ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇంతవరకు రాని స్వప్నిక బహుదూర్ ఇంకెప్పుడు వచ్చే అవకాశమే లేదు.. పైగా ఇన్నాళ్ళుగా రాని నీ కూతురు బహుశా బతికి ఉండదు, చచ్చిపోయి ఉంటుంది’ అన్నాడు.. అలా అనగానే ధనుంజయ్ చెంప చెల్లుమంటుంది..

‘ఏది పడితే అది వాగుతున్నావ్.. పోరా బయటకి’ అంటూ నందిని ధనుంజయ్ పై చెయ్యి చేసుకుంది.

‘నా సంగతి మీకు అర్థం కావటం లేదు నందిని అత్తా.. మార్తాండనే మట్టు బెట్టి సాక్ష్యాలు లేకుండా చేసి, చట్టానికి దొరక్కుండా తిరుగుతున్నాను. అటువంటిది మిమ్మల్ని ఏమి చెయ్యలేక కాదు. ఉన్న ఆస్తులు, ఈ కోట మీ తదనంతరం అనుభవించడానికి ఇంకా ఎవరున్నారు?.. అవి నా పేరు మీద రాస్తే, మిమ్మల్ని నేను చూసుకుంటాను. వయసుడిగిన మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నా మాట విని నా పేరు మీద రాసివ్వండి, నేను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటా’ అన్నాడు ధనుంజయ్.

‘అది జరగనే జరగదు.. తల దాచుకోడానికి వచ్చావు.. మమ్మల్ని, మా కోటని కబ్జా చెయ్యాలని చూస్తున్నావు. పోనీలే తండ్రి లేక నువ్వు, భర్త, బందువులు దూరమై మీ అమ్మ వస్తే మా పంచన ఉండమని చేరదీసాం. మా పిల్లతో పాటు విద్యలన్నీ నేర్పి, మా పిల్లతో సమానంగా నిన్ను చూసాం. ఇది నీకు తగదు ధనుంజయ్.. ఈ కోటను వదిలిపో’ అంటూ తిలక్ బహుదూర్ గట్టిగా అరిచాడు.

దాంతో సవితి చెల్లెలు అంజన ‘తల దాచుకునే కోటని వదిలి పోవడమంటే రోడ్డున పడడమే అన్నయ్యా, చిన్నవాడు తెలిసో తెలియకో ఏదో అన్నాడు.. క్షమించండి అన్నయ్యా’ అని కాళ్ళ వేళ్ళా పడడంతో.. మళ్ళీ మొదటికి వచ్చింది కథ” అంటూ చెప్పడం ఆపారు సంచిత రామవర్మ.

(సశేషం)

Exit mobile version