Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసంత లోగిలి-15

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[తనని వెంటపెట్టుకుని వసంత లోగిలిలో ఒక్కోటి చూపిస్తూ వివరిస్తున్న నిత్యని మెచ్చుకుంటుంది శారద. ఒక గదిలో గోడకి తగిలించి ఉన్న ఫోటోలను చూసి అవి ఎవరివనై అడిగితే, ఆ వ్యక్తుల వివరాలు చెప్తుంది నిత్య. ఇంతలో ఒక రూమ్‍లో ఏదో హడావిడి అవుతుంది. సరోజ అనే ఆవిడకి ఫిట్స్ వస్తాయి. అక్కడే ఉంటున్న డా. మానస ఆమెకు ఇంజక్షన్ ఇస్తుంది. శారద అడగటంతో, సరోజగారి వివరాలన్నీ చెప్తుంది నిత్య. ఇంతలో నిత్యకి ఆమె భర్త సునీల్ ఫోన్ చేస్తాడు. భర్తతో మాట్లాడి ఫోన్ పెట్టేసేసరికి, డా. చంద్రిక వచ్చి నిత్యని పలకరిస్తుంది. తనకి పెళ్ళి కుదిరిందనీ, తన పెళ్ళి వసంత లోగిలిలో చేసుకోవాలని ఉందనీ, కానీ తన బావ ఒప్పుకోవడం లేదని బాధతో చెప్తుంది డా. చంద్రిక. ఆమెని ఓదార్చి, ఆమె పెళ్ళికి ఇక్కడ్నించి కొందరు పెద్దవాళ్ళను పంపుతాననీ, పెళ్ళయి వచ్చకా, చిన్న గెట్-టుగెదర్ పెట్టుకుందామని చెప్తుంది నిత్య. వసంత లోగిలిలో ఉండే రాఘవాచారి అనే ఆయన రచించిన ఓ పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటుంది నిత్య. ఆయన గురించి, ఆ పుస్తకంలోని అంశాల గురించి శారదకి చెబుతుంది. కొంతసేపటికి ఓ కుటుంబం కారులో అక్కడికి వస్తుంది. వాళ్ళు తమని తాము పరిచయం చేసుకుని, తమ పిల్లలతో పాటు తాము కూడా ఇక్కడ నాలుగైదేళ్ళు ఉండిపోవాలని వచ్చామని చెప్తారు. నిత్య ఒప్పుకుంటుంది. అల్జీమర్స్‌తో బాధపడే వృద్ధులుండే విభాగంలో వాళ్ళ ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న యువతులకి సరైన సలహాలనిస్తుంది నిత్య. మాటల సందర్భంగా – శారదకి ఉన్న ఓ కళ – పాటలు పాడడాన్ని గుర్తు చేసి, వసంత లోగిలిలో పాడమంటుంది నిత్య. అక్కడి పనులన్నీ ముగించి, ఇంటికి బయల్దేరుతారు. ఇక చదవండి.]

ఉదయాన్నే లేచిన నిత్య ఎదురుగా నిండు ముత్తైదువులా నిలబడింది అత్తగారు. “నిత్యా.. టైం అయిపొయింది.. మనం కాత్యాయనీ అమ్మ గుడికి వెళ్ళాలి కదా!” అంది.

“షిట్.. ఆరైపోయింది..” అంటూ చకచకా తయారై నన్ను కూడా లేపి రెడీ అవమని చెబుతూ ఏర్పాటు పూర్తి చేసింది. అటు మామ అత్తగారితో ఎనిమిది గంటలకు కార్లో కూర్చున్నాం. కాత్యాయనీ అమ్మవారి గుడిలో దర్శనం చేసుకుని, పూజ చేయించి ఆది దంపతులతో బయలుదేరి ‘వసంత లోగిలి’కి సాయంత్రం చేరుకున్నాం.

ఎదురుగా నడుస్తూ వస్తున్న వాళ్ళ అమ్మానాన్నలని చూసి ఆశ్చర్యపోతూ ఎదురెళ్ళి, “ఎన్నాళ్లైంది మిమ్మల్ని చూసి.. ఎలా ఉన్నారు నాన్నా.. అమ్మా!” అంటూ నిత్య చిన్న పిల్లలా ఒదిగిపోయింది స్వప్నిక గారి ఒడిలో.

“మేము బాగున్నాం నిత్యా.. నువ్వు ఎలా ఉన్నావు?” అని కూతురుని పలకరించి, “శారదా ఎలా ఉన్నావ్.. మీవారు, పిల్లలు ఎలా ఉన్నారు?” అని నన్ను అడిగారు. స్వప్నిక గారి ఆ ప్రశ్నకి సమాధానంగా

“అందరూ బాగున్నారు ఆంటీ, మీరెలా ఉన్నారు?” అంటూ పలకరించాను.

“అమ్మా ఈ రోజు నీకు గుర్తు ఉందా!? అడిగింది నిత్య.

“లేదు నిత్యా.. నేను కూడా మర్చిపోయా.”

 “నవీన్ ఫోన్ చేస్తే మాకు గుర్తు వచ్చింది.. వెంటనే వచ్చి వాలిపోయాం” అన్నాడు సుధీర్ వర్మ.

“ఎవరో చీఫ్ గెస్ట్ వచ్చారు. చూశావా నిత్యా?” అంటూ వచ్చాడు నవీన్.

“ఎవరు నవీన్?” అంది నిత్య

పొడుగ్గా.. తెల్లగా రంగులు పూసుకున్న ముఖంతో ఎదురుగా నిలబడి తన కమీజ్ కున్న రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని స్టైల్‌గా నిలబడ్డ వ్యక్తిని తేరిపార చూస్తూ

“ముఖానికి రంగుల వల్ల పోలిక తెలియటం లేదు గాని.. బాగా తెలిసిన వాళ్ళలా ఉన్నారే” అంది నిత్య.

“అంతేలే.. ఈ తాతని అప్పుడే మర్చిపోయావు.. నీకు ఇక్కడ బోలెడు మంది తాతలున్నారు.. అందుకే నన్ను మర్చిపోయావ్.. నేను వెళ్ళిపోతానురా సుధీర్” అన్నాడు సంచిత రామవర్మ.

“తాతయ్యా.. నువ్వా” అంటూ చిన్న పిల్లలా తాతయ్య చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది నిత్య.

“తాతయ్యా! వచ్చావా! ఎన్నాళ్లైంది నిన్ను చూసి, నాన్నా.. మీరైనా అప్పుడప్పుడు కనిపిస్తారేమో! ..కాని ..కాని తాతయ్య.. తాతయ్యని చూసి చాలా దినాలైంది. ఎంతో మందికి తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మలతో ఉన్న జ్ఞాపకాలను ఇచ్చే నాకు.. నా తాతయ్యతో ఏ జ్ఞాపకం లేదు నాన్నా” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్న నిత్య తల నిమురుతూ, “ఇక నీతోనే ఉంటా నిత్యమ్మా!.. ఇంక ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఈ ‘వసంత లోగిలి’ లోనే ఉంటాను. ఇక్కడ పిల్లలకి నేను ఆనాటి రాజుల కథలు చక్కగా చెబుతాను, సరేనా!” అన్నాడు తాత సంచిత రామవర్మ.

చిన్నపిల్లలా కళ్ళను తిప్పుతూ.. “నిజంగానా!” అంది నిత్య.

“నిజమే నిత్యా.. నేను మీ మామయ్యా, మీ అమ్మా నాన్నతో మాట్లాడి, మీ తాతని ఒప్పించాం” అన్నారు నిత్య మామగారు.

మెచ్చుకోలుగా చూసింది నిత్య మామయ్యవైపు.

***

అక్కడ ఒక ప్రత్యేకమైన సందడి నడుస్తోంది. నవీన్ అమ్మా నాన్నల పెళ్లి రోజు ఘనంగా ‘వసంత లోగిలి’ ఒడిలో, ఎంతో మంది వృద్ధుల మద్య, చిన్నారుల మధ్య జరుగుతోంది. ఆదిదంపతులిద్దరూ కుర్చీలలో కూర్చున్నారు. వేద మంత్రాల సాక్షిగా, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఒకరి మెడలో ఒకరు దండలు మార్చుకున్నారు. పిల్లలు తమ ఆటపాటల ప్రదర్శనకి సిద్ధమయ్యారు. ఎదురుగా ఉన్న వేదిక మీద పిల్లలు తమ ప్రదర్శనలు ఇస్తున్నారు అవన్నీ అక్కడ ఉన్న వృద్ధులు నేర్పిన విద్యలే వారు ప్రదర్శించారు.. ఆ ప్రదర్సనలు చూడాడానికి పిల్లల అమ్మా నాన్నలు కూడా వచ్చారు.. ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఇంత చక్కని ప్రదర్శనలు అలవోకగా ఇస్తున్న చిన్నారులను చూసి వారి తల్లి తండ్రులు మురిసిపోతున్నారు. పెళ్లి రోజు వేడుక సంబరాలు అంబరాన్ని తాకాయి.

వృద్ధులు బోసి నవ్వులు నవ్వుతూ.. పిల్లలు వేసే చిందులు చూసి పిల్లల్లా కేరింతలు కొట్టారు. ‘వసంత లోగిలి’ పరిసరాలలో ఉన్న వృద్ధులు ఆనంద డోలికలలో ఊగుతున్నారు.

మిస్టర్ తాతయ్య, మిసెస్ నానమ్మల అవార్డులకు ఎంపికైన వారికి బహుమతులు ఇచ్చారు. చివరిగా నిత్య, నవీన్, ఇద్దరు కలిపి నవీన్ వాళ్ళ నాన్న అమ్మ చేతుల మీదుగా పిల్లలకు మంచి మంచి బహుమతులు, పెద్ద వాళ్లకి మంచి బట్టలు ఇచ్చారు.

సాయంత్రం అవుతోంది. కాళ్ళు కదలకుండా అందరి చేతుల్లోకి స్నాక్స్‌తో పాటు టీ, కాఫీలు వచ్చేసాయి.

ఇంతలో ఒక మంచి ‘ఉత్తరం’ కార్యక్రమం మొదలైంది.

డయాస్ మీద ఒక పెద్దాయన వచ్చి.. ‘ఉత్తమ ఉత్తరం’ కార్యక్రమంలో ‘వసంత లోగిలి’కి వచ్చిన చిన్నారులు నాలుగువందల మంది పాల్గున్నారు. వాళ్ళు, తాత అమ్మమ్మ, నాయనమ్మలకి రాసిన ఉత్తరాలు అద్భుతంగా ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన వాటికి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది” అంటూ అయిదుగురి పేర్లు చదివి వినిపించారు. వారికి మంచి బహుమతులు అందించారు నవీన్ తల్లి తండ్రులు.

అలాగే ఈ ‘ఉత్తమ ఉత్తరం’ కార్యక్రమంలో పాల్గున్న చిన్నారులందరికీ బహుమతులు అందించారు. “ఇలాగే ఈ కార్యక్రమం ప్రతి ఏడాది ఉంటుంది. మంచి బహుమతులు గెలుచుకోవాలంటే, మంచిగా తెలుగులో మీ తాత, అమ్మమ్మ, నాయనమ్మలకి ఉత్తరాలు రాస్తూ ఉండండి” అని చిన్నారులను ప్రోత్సహించారు ఆ ‘వసంత లోగిలి’ లో ఉన్న పెద్దాయన.

బహుమతులు పొందిన చిన్నారుల ముఖాల్లో చెప్పలేనంత ఆనందం, సంతోషం.. కేరింతలు కొడుతున్న ఆ చిన్నారులను చూసి పెద్దవాళ్ళు చాలా ఆనందపడ్డారు.

అలా ఆటల్లో, పాటల్లో గెలిచిన వాళ్ళకే కాకుండా, ఉత్సాహంగా పాల్గున్న పిల్లలందరికీ బహుమతులు అందజేశారు.

చివరి ఘట్టంగా, ఒక ప్రత్యేకమైన గదిలోకి ఆది దంపతులైన నవీన్ అమ్మా నాన్నలను తీసుకువచ్చాడు నవీన్.

“ఈ రోజు నుంచి మూడు రోజులు ఇక్కడే అందరితో గడిపి రండి నాన్నా” అని తలుపు వేస్తున్న నవీన్‌తో, “నవీన్… నా ‘మామూలు’ పెట్టావా?” అన్నాడు నవీన్ తండ్రి.

“అదిగోండి నాన్నా.. మీ మంచం వెనకాల.. ‘తాటికల్లు కుండ’. అమ్మా మీరు తాగి ఎంజాయ్ చెయ్యండి.. మీ ఇష్టం” అన్నాడు నవీన్.

“నవీన్.. అది.. అది.. పెట్టించావా! ఆ రూమ్‌లో?” అని రహస్యంగా అడిగింది నిత్య.

“అదెందుకు మర్చిపోతాను.. పెట్టించానులే..” అన్నాడు నవీన్.

“నిత్యా బహుదూర్.. మనం కూడా.. ఒకసారి తాగుదామా ప్లీజ్?” అని కొంటెగా చూసాడు నవీన్ నిత్య వైపు.

“ఊర్కో నవీన్.. వాళ్లకి అది అలవాటు.. మనకి అది అలవాటు లేదుగా.. పైగా నీ కోసం వాళ్ళు వాళ్ళకున్న అలవాటుని, వాళ్ళ వ్యాపారాన్ని, ఆ ‘తాటికల్లు కుండ’ని త్యాగం చేసేసారు. ఆ సరదాని నీ కోసం వాళ్ళు వదులుకున్నారు. ఏదో ఇలా ఒక్క పెళ్ళిరోజు నాడే కదా మనం వాళ్ళకోసం ఆ కుండ తెచ్చి ఇచ్చేది, వాళ్ళు సంతోషించేది..” అంది నిత్య ముసిముసిగా నవ్వుతూ.

“ఏంటే నీ ముసి ముసి నవ్వుల వెనుక దాగి ఉన్న నిజం?” అని నిత్యని అడిగాను.

“అది ‘తాటికల్లు’ శారదా! నవీన్ అమ్మానాన్నలు తాటి కల్లు అమ్మే జాతికి చెందిన వారు.. ఆ వ్యాపారమే చేసే వాళ్ళు, వాళ్లకి పిల్లలు లేరు. ఒక రోజు సంతలో ఒక పిల్లాడ్ని తీసుకుని ఒకాయన ‘తాటికల్లు’ తాగడానికి వచ్చాడంట. ‘ఈ తాటికల్లు కుండ మొత్తం నాకు ఇచ్చేస్తావా? ఈ పిల్లాడ్ని ఇచ్చేస్తాను’ అన్నాడంట ఆ పెద్దమనిషి. ..ఆ స్టోరీ చెప్పా కదా శారదా. ఈ సంతని, ఈ ప్రాంతాన్ని వదిలేసి బిడ్డతో వెళ్లిపోదామని చెప్పి తన భర్తని తీసుకుని పట్నం వెళ్ళిపోయింది సావిత్రమ్మ. ఆ రోజు తాటికల్లుని అలా వదిలేసారు ఆ ద౦పతులు. తన కోసం వదిలేసిన ఆ ‘తాటికల్లు కుండ’ని ప్రతి పెళ్లిరోజు వాళ్ళ గదిలో పెట్టిస్తాడు నవీన్. ఆ ఒక్కరోజు వాళ్ళిద్దరు అలా కొంచెం రుచి చూసి, సంతోషిస్తారని నవీన్ ఆశ.. రేపు ఉదయం వాళ్ళని చూస్తే.. అదిగో అప్పుడే విరిసిన పువ్వుల్లా ఇద్దరూ నవ్వుతూ బయటకి వస్తారు. కనీసం ‘తాటికల్లు’ వాసన కూడా రాదు” అని నిత్య చెబుతుంటే.. ఆశ్చర్యంగా విన్నాను.

ఇంతలో “అమ్మా.. ఈ పెద్దావిడ వచ్చి నాకు బట్టలు ఇవ్వలేదు. ఇస్తారా లేదా? అని అరుస్తోంది” అని ఒకావిడని తీసుకువచ్చింది సూరమ్మ.

“నాకు కూడా బట్టలు పెట్టండయ్యా.. నేను కూడా ఇక్కడే ఉంటాను” అంటూ ఒక హస్తం ముందుకు చాచిందామె. పండు ముసలి రూపం, ముడతల పడ్డ శరీరం, కళ్ళు సరిగా కనిపించక ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడకు చేరినట్టు ఉంది. ‘ఈమె కొత్తగా వచ్చినట్టు ఉంది’ అనుకుంది నిత్య.

సంచిలో అడుగున ఉన్న బట్టలు తీయబోతున్న నిత్యని ఆపి, “ఉండు నిత్యా..” అంటూ ముందుకు వచ్చింది స్వప్నిక.

ఆ ముదుసలిని ఎక్కడో చూసినట్టుగా తోచింది.. “అమ్మా.. నాకు బట్టలు ఇవ్వండమ్మా” అని అడుగుతున్న ఆ గొంతు అంజనది.. స్వప్నిక అత్తది.

స్వప్నిక ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చేతిలో బట్టలు పెట్టి పంపబోయింది.

ఇంతలో పోలీసులు.. “ఇక్కడే ఎక్కడో ఉంటుంది.. వెతకండి. వెతకండి” అంటూ అక్కడికి వచ్చారు.

“ఏమైంది సార్? మీరంతా ఎవరు? ఇక్కడ ఎవర్ని వెతుకుతున్నారు?” అని అడిగిన నిత్యకి సమాధానంగా, “ధనుంజయ్ అనే వ్యక్తిని చంపేసి ఒక ముసలామె ఇందులో దూరింది. ఆమె.. ఆమె హంతకురాలు” అన్నాడు ఇన్‌స్పెక్టర్ కమల్.

చేత్తో పట్టి, “ఇదిగో, ఈమే.. ఆ హంతకురాలు” అంటూ పోలీసులకి అప్పగించింది స్వప్నిక.

పోలీసులు బేడీలు వేసి అంజనని తీసుకుపోతుంటే, వెనక్కి తిరిగి గుడ్లురిమి చూస్తోంది స్వప్నిక వైపు అంజన.

‘హమ్మయ్య! ధనుంజయ్‌ని వాళ్ళ అమ్మ అంజన చంపేసింది.. ఆ అంజన జైలుకు పోయింది’ అనుకున్నాడు సంచిత వర్మ. “పీడ వదిలింది” అన్నాడు కటువుగా.

***

“ఏంటి మామయ్యా, ఇంత ఆలస్యంగా వచ్చావ్.. రా.. రా.. భోజనం చెయ్” అంటున్న నిత్యతో..

“నువ్వు సమాజానికి చికిత్స చేస్తున్నావ్ తల్లీ.. నేను సమాజంలో ఉన్న మనుషులకు చికిత్స చేస్తున్నా.. అందుకే వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది.. కాస్త క్షమిస్తారా నిత్యా మేడం?” అంటున్న డాక్టర్ మామయ్యని చూసి..

“మీరు భలే మాట్లాడతారు మామయ్యా!” అంటూ దగ్గరుండి వడ్డించింది నిత్య.

“అవునూ, ‘వసంత లోగిలి-1’ తో అపేస్తావా!.. దీన్ని బ్రాంచ్‌ల కింద అభివృద్ధి చేస్తావా?” అడిగాడు డాక్టర్ మామయ్య.

“మా తాత, ముత్తాతలు చేసిన తప్పులు సరిదిద్దే లెక్క తేలేవరకు ఆ కాత్యాయనీ అమ్మవారు నా చేత ఇలా చేయిస్తూనే ఉంటుంది మామయ్యా.. అది ఎంతవరకు తీసుకెళ్తే అంత దూరం నేను ప్రయాణం చెయ్యాల్సిందే, ఇది ఓ క్రతువు మామయ్యా! దీన్ని ఆపడం జరగదు.. ఇది నేను ఉన్నంతవరకే కాదు.. నా తరువాత నా కూతురు కొనసాగిస్తుంది” అంది నిత్య.

“నిత్యా! నాకు ఒక ధర్మ సందేహం ఉంది. తీరుస్తావా!?” అడిగాడాయన.

“ఏంటి మామయ్యా అది? చెప్పండి” అంది నిత్య

“వృద్ధాశ్రమాలు పెరిగి వృద్ధులంతా వృద్ధాశ్రమాన్ని చేరాలని నీ ఉద్దేశమా?”

“కానే కాదు మామయ్యా! ప్రస్తుత తరంలో తాతా మనవడు, తాతా మనవరాళ్ళు, బామ్మ గారి మనవడు.. ఇలా చెప్పుకోవడానికి నలుగురు తాతలు లేరు, నలుగురు మనవాళ్ళు లేరు మామయ్యా! పిల్లలంతా హాస్టల్స్‌లో ఉంటే, వృద్ధులంతా వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు. వీరిద్దర్నీ కలిపే వారధి ఉండాలి అన్నదే నా ఆశయం. అమ్మా, నాన్నా, నేను, తమ్ముడు, లేదా నేను చెల్లి.. ఇలా ఇల్లు అంటే నలుగురే అన్నట్టుగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. పెరుగుతున్న అవసరాలు పెద్దవాళ్ళను చూసుకునే అవకాశమే ఇవ్వటం లేదు. రాలిపోతున్న ఆకులను వదిలేసి, ఎంతోమంది పుట్టిన ఊరుని వదిలేసి, పట్టణాలకు తరలి పోతున్నారు. పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని పెద్దవాళ్ళు కూడా బతికేస్తున్నారు.

ఈ క్రమంలో పెద్దవాళ్ళ కోసం వృద్ధాశ్రమాలు వచ్చాయి. కొంతమంది తమ పెద్దవాళ్ళను ఇళ్ళల్లో ఉంచుకుంటున్నారు. కొంతమంది వృద్ధాశ్రమాలలో ఉంచుతున్నారు. అది వాళ్ళ సౌలభ్యం కోసమే అయినా, దాని వల్ల నేటి పిల్లల తరం తాత, అమ్మమ్మ, నానమ్మ లతో గడపడం చాలా తక్కువ అయిపోయింది. దీని వల్ల పిల్లల తరం పెద్దలని, పెద్దల తరం పిల్లలని చాలా వరకు ‘మిస్’ అవుతున్నారు. పెద్దతరాన్ని చూడాలంటే రేపటి తరం మ్యూజియంలలో చూడాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా ఇద్దర్ని సమన్వయం చేస్తూ.. నేటి తరాన్ని తాతల తరంతో కలిపి ఒక మంచి తరాన్ని తయారు చెయ్యమని ఆ కాత్యాయని అమ్మవారు నన్ను ఆజ్ఞాపించారు. ఆ ‘ఆజ్ఞ’ నాకు బాగా నచ్చింది. దానికి కారణం మా తాత తండ్రుల వంశంలో జరిగిన తప్పిదమే కావచ్చు. కాని తరాన్ని, తరాన్ని దగ్గర చేస్తూ ఎప్పుడో జరిగిన ఓ తప్పుని సరిచేసే అవకాశ౦ నాకు వచ్చింది. దానికి నన్ను ఎంపిక చెయ్యడం నా పూర్వజన్మ సుకృతం మామయ్యా! ఈ ప్రక్రియలో సమాజానికి మంచే జరుగుతుంది అని నమ్మాను మామయ్యా!

‘వసంత లోగిలి’ వృద్ధాశ్రమం కానే కాదు మామయ్యా! ..అదిగో అక్కడ రెండు బస్‌లు ఉన్నాయి చూడండి.. అందులో వృద్ధులు ఇళ్ళకు బయలుదేరారు, ఇంట్లో వీరితో సమకాలీకులు ఎవరూ ఉండరు మామయ్యా! పిల్లలు స్కూల్, హోం వర్క్ బిజీలో పడిపోయే ఈ రోజుల్లో వీళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఒంటరితనం పోగొట్టే ప్రయత్నంలో వాళ్ళని రోజూ ఉదయం ఇక్కడకు తీసుకొని వస్తాం. సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు.. ఇక్కడ ఉన్న వాళ్ళతో గడుపుతారు.. సాయంత్రం వెళ్ళిపోతారు.. కొంతమంది ఇంటికి వెళ్ళాలని లేదని ఆ రోజు ఇక్కడే ఉండిపోతారు.. వాళ్లకి అటువంటి సౌలబ్యం ఇక్కడ ఉంది. కొంతమంది వాళ్ళ తల్లి తండ్రులను కార్లు ఇచ్చి పంపుతారు, సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకునే వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం అంతే..” అంది నిత్య

“మంచి ఆలోచన నిత్యా! ఆ కాత్యాయనీ దేవి నిన్ను ఒక గురుతర బాధ్యత కోసం ఎంచుకుంది, దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే శక్తి నీకు ఆ అమ్మవారే ఇస్తుంది.. ఆల్ ది బెస్ట్” అన్నాడు డాక్టర్ మామయ్య.

“తరాల మధ్య తారతమ్యాన్ని తగ్గించి.. రెండు తరాల మద్య అందమైన ‘బంధం గొలుసు’ అందంగా కట్టాల్సిందే మామయ్యా” అని నిశ్చింతగా చెబుతున్న నిత్యని చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించింది ఆమె అమ్మానాన్నలకి. “మొత్తానికి నిత్యా బహుదూర్, ‘బహుదూర్’ వంశం పరువు నిలబెట్టింది సుధీర్” అంది స్వప్నిక భర్తతో.

ఇదంతా చూస్తున్న నేను, నిత్య దగ్గరకి వెళ్ళి, “నీ అడుగులో అడుగునవుతా.. సమ సమాజ స్థాపనకి నా అడుగు నీతో కలిపి నడుస్తా నేస్తం” అంటూ నిత్య చేతులు పట్టుకున్నాను.

దీంతో నిత్య బహుదూర్ ఒక కొత్త తరానికి తెరతీసి.. పాత తప్పిదాలకు పాతర వేసి, కొత్తగా మరో తరానికి స్వాగతం చెబుతూ ‘శుభం’ కార్డ్ వేసిందనే చెప్పాలి.” అంటూ ముగించింది శారద.

అంతా విన్న సునీల్ – నిత్యని అభినందించకుండా ఉండలేకపోయాడు.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version