[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[తన ఎంబిఎ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి తన ఆలోచనలకి రూపకల్పన చేసుకున్నానని నిత్య శారదకి చెబుతుంది. ‘వసంత లోగిలి’లో ఉండే వృద్ధులలోని నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, అటు వృద్ధులకూ, ఇటు పిల్లలలూ ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నానని చెబుతుంది. అనారోగ్య సమస్యలు వస్తే స్పందించేందుకు మూడు టీమ్‌ల డాక్టర్లు ఉన్నారని చెబుతుంది. పెద్దలు పిల్లలకు కథలు చెప్తారు, ఆటలు ఆడిస్తారని చెబుతుంది. శారదను తనతో పాటు ‘వసంత లోగిలి’ తిప్పుతూ, అక్కడి కార్యక్రమాల గురించి వివరిస్తుంది నిత్య. శారద నిత్యని అభినందిస్తుంది. శారదని కూడా ‘వసంత లోగిలి’కి ఉపయోగపడమని, తనకి వచ్చిన కుట్టుపనితో ‘వసంత లోగిలి’కి కావల్సిన బట్టలు కుట్టిపెట్టమని అడుగుతుంది నిత్య. సరేనంటుంది. లైబ్రరీ గదిని చూపించి, దాని విశేషం శారదకి చెప్తుంది నిత్య. అలాగే అక్కడి హాల్లో గోడలకి ఉన్న కొందరి ఫోటోలను చూపిస్తూ.. ఆ వృద్ధులు ఇక్కడ సంతోషంగా గడిపి, స్వర్గస్థులయ్యారని చెబుతుంది. వాళ్ళల్లో ఒకరి అబ్బాయి, తన తండ్రికి ఎంతో సహాయం చేసినందుకు చెక్ ఇవ్వబోతే, తాను తిరస్కరించి, తమ వద్ద ఉన్న ఒక నిరుపేద అమ్మాయి చదువుకి కాంట్రిబ్యూట్ చేయమని చెప్పానని శారదతో అంటుంది నిత్య. అప్పుడు వాళ్ళేమన్నారని ప్రశ్నిస్తుంది శారద. ఇక చదవండి.]
“దానికి ఒప్పుకుని ఆ నిరుపేద అమ్మాయి బ్యాంక్ ఎకౌంట్ లో జమ చేసి వెళ్లారు శారదా.”
నిత్య అలా నాకు అన్నీ చూపించి వివరిస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“నిత్యా.. నిత్యా నువ్వు నిజంగా కారణజన్మురాలివే” అని తనని పట్టుకుని ఏడ్చాను.
“ఈ గోడ మీద వేలాడుతున్న ప్రతి ఫోటో వెనుక ఇలాంటి కధలే ఉంటాయి శారదా.. ఈ రెండు సంవత్సరాల కాలంలో 22 మంది పెద్దవాళ్ళు సంతృప్తిగా, గౌరవంగా ఇక్కడ కాలం చేసారు.” అంది.
ఇంతలో ఒక రూమ్ లో ఏదో హడావిడి జరుగుతోంది.. అందరు అటుగా వెళ్తున్నారు.
“ఏమి జరిగింది?” అంది నిత్య
“మేడం సరోజ గారు ఫిట్స్ వచ్చి పడిపోయారంటా” అని పరిగెట్టింది డాక్టర్ మానస.
“రా శారద వెళ్లి చూసి వద్దాం” అంది నిత్యం. అటుగా వెళ్ళాం..
సరోజని ఒడిసి పట్టుకుని తాళాలు చేతిలో పెట్టి, డాక్టర్ మానస ఇంజక్షన్ ఇచ్చింది. సరోజ పడుకుంది.
“ఈమే..?” అడిగాను.
“ఆ.. చెబుతా.. ఈమె ఒక కాలేజీలో ప్రొఫెసర్.. ఈమెకి ఒక కొడుకు, ఒక కూతురు, నలుగురు మనవలు ఉన్నారు. ఎవ్వరూ ఈమెతో మాట్లాడరు. ‘తిని కామ్‌గా కూర్చో’ అని అందరు తనకే చెబుతారంట. కొడుకు. కూతురు పిల్లలు ఎవరూ తనతో మాట్లాడరంట. ఈమె దగ్గరకి వస్తే, దూరంగా జరిగిపోతారంట. వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ చెయ్యి పట్టుకుని నడవాలని ఈమె ఆశ.. కాని అది తీరలేదు.. ఎవరికీ తెలియకుండా కొడుకు ఇంటి నుంచి ఇక్కడకు వచ్చేసింది. ఇక్కడే ఉంటుంది. పిల్లలని అందంగా తయారు చెయ్యాలంటే చాల ఇష్టం ఈమెకి. ఎవరి పుట్టిన రోజు వచ్చినా, వాళ్ళని అందంగా తయారు చేస్తుంది. అందుకు గాను ఆ చిన్నారులు ముద్దులు పెడితే పొంగిపోతుంది. ఈమెకి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఆమె మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా ఆమె దగ్గర మన టీం ఉంటుంది. సాయంత్రం వచ్చిన పిల్లలు సరోజ నానమ్మా ఎలా ఉన్నావ్? అని పలకరిస్తే చాలు పొంగిపోతుంది ఈమె.”
ఇంతలో “మేడం, మా ఇంట్లో వివాహం ఉంది.. మీ వసంత లోగిలిలో ఉన్న పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలి. మేమే జాగ్రత్తగా తీసుకుని వెళ్లి తీసుకు వస్తాం!” అంటూ కార్డ్ ఇచ్చింది ఒక పెద్దావిడ.
“వాళ్ళు రావడానికి వీలు పడదు. మీ కార్డులో అడ్రస్ చూస్తే చాలా దూరం ఉన్నట్టు ఉంది. దగ్గర అయితే తప్పకుండా పంపేదాన్ని. ఇక్కడి నుంచి తీసుకు వెల్లేసరికి అలసిపోతారు. ఏమీ అనుకోవద్దండి. పెళ్లి అయిపోగానే ఆ నూతన వధూవరులను ఇక్కడికి పంపేయండి. మంచిగా ఆశీర్వాదాలు ఇప్పించి పంపుతాం” అంది నిత్య. “మీరు ఎన్ని గంటలకు వస్తారన్న విషయం మా రిసెప్షన్లో చెప్పి వెళ్ళండి” అని చెప్పడంతో ఆమె ‘సరే’ అని వెళ్ళిపోయింది.
“ఇదేంటి నిత్యా.. ఆశీర్వాదం కోసం ఇక్కడకు వస్తారా!?” అన్నాను.
“ఎందుకు రారు శారదా! పెద్దవాళ్ళ ఆస్తులు కావలి, ఆశీర్వాదాలు కావాలి, కాని పెద్దవాళ్ళు వద్దు. అది మన నేటి సమాజంలో దౌర్భాగ్యం మరి.”
ఇంతలో రింగ్ అవుతున్న ఫోన్ తీసి.. “హలో నవీన్ చెప్పు” అంది నిత్య.
“రేపు నాన్న అమ్మ పెళ్లి రోజు.. గుర్తుందా!”
“అదేంటి నవీన్ అలా అంటావ్? అదెలా మర్చిపోతాను.. రేపు వాళ్ళని కామాక్షి అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అటునుంచి ఇటు వసంత లోగిలికి వచ్చేస్తాం. నువ్వు రాగలవా! మరి” అంది నిత్య
“నేను గుడికి రాలేను కాని డైరెక్ట్‌గా నీ ఆస్థానానికి అంటే నీ ‘వసంత లోగిలి’కి వచ్చేస్తా” అన్నాడు నవీన్.
“సరే” అంది నిత్య.
“మేడం ఈ బుక్ పబ్లిష్ చెయ్యాలని అంటున్నారు రాఘవాచారి గారు. ఎంతవుతుందో ఏంటో అడిగి చెప్పమన్నారు. మీరు కాస్తా సుజాత గారికి అప్పజెప్పరా! నేను లీవ్‌లో ఇంటికి వెళ్తున్నా” అంటూ వచ్చింది డాక్టర్ చంద్రిక.
బుక్ చేతిలోకి తీసుకుంటూ “నేను ఈ పని సుజాత ద్వారా చేయిస్తా గాని, నువ్వు ఎన్ని రోజులు సెలవ్ పెట్టావ్? కారణం కూడా చెప్పు” అంది నిత్య.
“మేడం నాకు మా బావతో పెళ్లి కుదిరింది, మా ఊర్లో పెళ్లి, కాని నాకు అటు గాని ఇటు గాని అమ్మమ్మా తాతయ్యా ఎవరూ లేరు. నాకుంది ఒక్క అమ్మ మాత్రమే, ఇక్కడ ‘వసంత లోగిలి’లో నా పెళ్లి చేసుకోవాలని ఉంది మేడం. కాని, మా బావకి చెబితే ఒప్పుకోవటం లేదు” అని ఏడుస్తోంది డాక్టర్ చంద్రిక.
“ఏయ్ చంద్రికా, నువ్వు డాక్టర్వి ఇలా ఎవరైనా ఏడుస్తారా!” అంటూ కన్నీళ్ళు తుడుస్తూ.. “ఒక పని చెయ్యు నీ పెళ్లి రోజు నేను ఇక్కడ నుంచి నీకు ఇష్టమైన నానమ్మా, తాతయ్య ని పంపుతాను. ఎంతమంది తాతయ్యలు కావాలి, ఎంతమంది నానమ్మలు కావాలో చెప్పు” అంది నిత్య.
“మేడం ఇక్కడి నుంచి.. చాలా దూరం కదా! అని నేను అడగలేదు” అంది డాక్టర్ చంద్రిక.
“నీ కోసం నేనే రిస్క్ తీసుకుంటా.. మరీ పెద్ద వాళ్ళను కాకుండా కాస్త ప్రయాణం చేసినా ఇబ్బంది లేని వాళ్ళని కొంతమందిని పంపుతా, పెళ్ళైన తరువాత వచ్చి మిగిలిన వాళ్ళని నువ్వు ఇక్కడ కలవచ్చు. ఇక్కడ చిన్న ‘గెట్-టుగెదర్’ పెట్టుకుందాం సరేనా” అంది నిత్య.
“థాంక్యు మేడం, థాంక్యు సో మచ్” అంటూ నిత్య చేతులని ముద్దాడింది డాక్టర్ చంద్రిక.
“నా కల నెరవేరుతుంది అనుకోలేదు మేడం.. అడగనా వద్దా అని సంశయిస్తున్నా.. ఇంతలో మీరే.. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం” అంది.
“ఈ సంతోషం నీ ముఖంలో ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. పెళ్లి అవగానే మీ ఆయనతో ఇక్కడకు వచ్చెయ్.. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం” అంటూ సాగనంపింది నిత్య.
చంద్రిక వెళ్ళగానే.. “ఈ అమ్మాయిని చూసావా శారదా.. మనసు పెట్టి పెద్దవాళ్ళకు వైద్యం చేస్తుంది. విసుక్కోదు, చిరాకు పడదు. ఎంతో ప్రేమగా చికిత్స చేస్తుంది.. వేరే దగ్గర చాలా అవకాశాలు వచ్చాయి.. కాని ‘నేను వెళ్ళను మేడం, ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలి పోవాలని లేదు’ అంటుంది.
అది కదా! మనకు కావలసింది.. మనం వసంత లోగిలి నుంచి ఇచ్చే జీత భత్యాలు, సౌకర్యాలు, వాళ్ళని సంతృప్తిగానే ఉంచుతున్నాయి. అది ఓ రకంగా వాళ్ళ గొప్పతనమే సుమా” అంది నిత్య
“గ్రేట్ నిత్యా, చాలా చోట్ల ఉండే వివక్షత, తక్కువగా చూడడం, తక్కువ చేసి మాట్లాడటం లాంటివి ఉండవు ఇక్కడ.. మనుషులను మనుషుల్లా చూస్తే సంస్థ ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా! నిత్యా”అన్నాను.
వరండాలో నడుస్తూ నిత్య కాబిన్ లోకి వెళ్ళాం.
***
చేతిలో రాఘవాచారి గారు రాసిన పుస్తకం టైటిల్ చూసి అలా ఉండిపోయింది నిత్య.
“ఏమి నిత్య ఏమైంది.. ఆ పుస్తకంలో ఏముంది?” అంటూ తన చేతిలో ఉన్న పుస్తకం తీసి చూసాను. ‘వృద్ధాప్యం కారాదు శాపం – అనద్దు అయ్యో పాపం’ అనే పేరుతో ఉన్న 106 పేజీల పుస్తకం అది.
“ఏంటి నిత్య? ఎవరీ రాఘవాచారి?” అని అడిగాను.
“ఈయన గవర్నమెంట్లో ఒక పెద్ద పొజిషన్లో పని చేసిన వ్యక్తి.. ఈయన అత్తారింటి నుంచి కూతురు అలిగి కన్నవారి ఇంటికి వచ్చినట్టు వసంత లోగిలికి వచ్చేస్తాడు.. ఒక పది రోజుల తరువాత వీళ్ళ కొడుకు కోడలు వస్తారు, బతిమాలి తీసుకుని వెళ్తారు.. అక్కడకి వెళ్ళాక ఏమి జరుగుతుందో తెలీదు, మళ్ళీ 10 రోజుల్లో ఇక్కడకు వచ్చేస్తుంటాడు.. ఇలా ఇప్పటికి 10-15 సార్లు చేసాడు.. ఇక్కడైనా అందరితో కలిసి ఉంటాడా అంటే, అదీ లేదు సాయంత్రం పిల్లలతో మాత్రమే ఆడతాడు, పెద్దవాళ్ళలో ఓ నలుగురైయిదుగురితో కాస్తా కలుస్తూ.. ఉదయం పూట వాహ్యాళికి వెళ్తాడు. ఆ తరువాత ఎప్పుడు చూసినా ఏదో రాస్తూ, ఆ కొబ్బరి చెట్టు పక్కన వాలు కుర్చీలో కూర్చుంటాడు. ఆయనలో ఒక మంచి రచయిత కూడా ఉన్నాడు.. అందుకే పబ్లిష్ చేద్దాం, బుక్ రాయమన్నాను” అంది నిత్య
“వండర్ఫుల్ అయిడియా నిత్యా” అన్నాను.
“కాని, ఆయన రాసిన పుస్తకం టైటిల్ చూసి బాదేసింది శారదా” అంది నిత్య.
“‘వృద్ధాప్యం కారాదు శాపం-అనద్దు అయ్యో పాపం’ అనే ఈ పుస్తకంలో తన వృద్ధాప్యంలో తనపై చూపించే జాలి, అనుభవాలు ఇందులో ఎంతో చక్కగా రాసాడు” అంది నిత్య
“అలా రాయడం వెనుక పరిస్థితులు ఆరా తీస్తే, ఈయన కొడుకు పిల్లలను హాస్టల్లో పెట్టద్దు అంటే, కొడుకు పెట్టేసాడంట. మనవలతో నేను గడపాలనుకుని ఇక్కడకు వస్తే, పిల్లలను హాస్టల్లో వేస్తావా! అని కొడుకు, కోడలితో గొడవపడతాడు. కోడలు వండి, ఆ టేబుల్ మీద పెట్టాను తినండి అంటుందిట. పనివాడికి పెట్టినట్టు వండి అక్కడ పడేస్తే, నేనెందుకు తింటాను?.. నాకేం కావాలో నేనేమి తింటానో తెలియకుండా తను వండింది నేను తినాలా! అని కొడుకు ఇంటికి వచ్చాక గొడవపడతాడంట.
ఆ పక్కింటి పెద్దాయన రోజూ ఇక్కడకి వచ్చి పనికి రాని వస్తువులు ఉపయోగించి, మంచి మంచి బొమ్మలు పిల్లలకోసం చేస్తాడు.. వాటిని చూపించి పిల్లలలో ఉత్సాహం నింపుతాడు. అయన నైపుణ్యతకి ‘వసంత లోగిలి’లో కొంత వేతనం ఇస్తుంది. ఎందుకూ పనికి రావు, తిండి దండగ అని తిట్టే కొడుకు, కోడలికి అది పట్టుకుని వెళ్లి ఇస్తాడు. పిల్లలకి ఇక్కడ నుంచి అప్పుడప్పడు ప్రత్యేకమైన రోజుల్లో చేసిన పిండివంటలు పట్టుకుని వెళ్తాడు. నేను కూడా సంపాదిస్తున్నా అని సగర్వంగా కాలర్ ఎగరేస్తూ ఉంటాడు.
అదిగో, ఆయనతో ఈ రాఘవాచారి వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడ ఉండడానికే ఇష్టపడతాడు.. ‘కాని మాది పెద్ద కుటుంబం నాన్నగారు పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు.. ఆయనని ఆశ్రమంలో వదిలేశామని నలుగురూ అనుకుంటార’ని, కొడుకు కోడలు వచ్చి బతిమాలి తీసుకుపోతారు, కాని అక్కడకెళ్ళిన నాలుగురోజులకే వెనక్కి వస్తాడు.. ఇక్కడ ఇలా కూచుని రాసుకుంటూ ఉంటాడు” అంది నిత్య
“ఇలా రాయటం ద్వారా ఆతను సాంత్వన పొందుతున్నాడు. మంచిదేగా నిత్యా.. అందులో ఆయనకో సంతృప్తి ఉంది. అందుకే అలా రాస్తున్నాడు.. భావి తరాలకు ఇది కూడా ఉపయోగపడుతుంది లే నిత్యా” అన్నాను.
“అవును శారదా” అంది నిత్య.
***
ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి ‘వసంత లోగిలి’ లో ఆగింది. అందులో నుంచి సుమారు 6, 8 సంవత్సరాల వయసు గల ఇద్దరి పిల్లలతో ఇద్దరు ఆలుమగలు దిగారు.
“నిత్యా మేడం ఉన్నారా!” అని అడిగారు.
అక్కడ ఉన్న అమ్మాయి “రండి సార్, మేడంకి చెప్పి లోపలకి పంపుతాం కూర్చోండి” అని వాళ్ళకి చెప్పి. లోపలకి వెళ్ళి “మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు” అని నిత్యకి చెప్పింది
వాళ్ళని లోపలకి తీసుకు రమ్మని చెప్పింది నిత్య.
వాళ్ళు లోపలకి రాగానే కూచోబెట్టి.. “చెప్పండి” అంది నిత్య.
“వీరిద్దరూ మా పిల్లలు, మా వయసుని చూసి ఈ పిల్లల్ని చూడకండి.. మాకు సంతానం లేట్‌గా కలిగింది. అందుకే మేము చాల పెద్దగా కనిపిస్తాం.. లక్షలకి కొదవలేదు మాకు. లేక లేక పుట్టిన ఈ పిల్లల్నిఅక్షరాల పేరుతొ బడికి పంపించి వాళ్ళ చిన్ని బుర్రలని ఎదగకుండా చేసి వారి జీవితాలను పరుగు పందెంలో పెట్టాలనుకోవటం లేదు. ఈ ప్రపంచం లోకి వీళ్ళు రావాలని, వేల కళ్ళతో ఎదురుచూసిన మా అమ్మ, నాన్న చనిపోయారు. నా భార్య వైపు తాత అమ్మమ్మ కూడా లేరు. నేను మా నానమ్మ తాతయ్య దగ్గర పెరిగి చాల విషయాలు నేర్చుకున్నాను, మా ఇంట్లో అమ్మ, నాన్నతో పాటు తాతయ్య అమ్మమ్మ ఉండేవారు, మా తాత చెప్పిన కధలు నాకు ఇంకా గుర్తున్నాయి. అటువంటి తీపి జ్ఞాపకాలు. అలాంటి జ్ఞాపకాలను నా పిల్లలకు అందించాలని ఉన్నా ఇప్పుడు మా అమ్మా నాన్నలు ఈ లోకంలో లేరు. మీరు అవకాశo ఇచ్చినట్టైతే, మా పిల్లలతో పాటు మేము కూడా ఇక్కడ నాలుగైదేళ్ళు ఉండిపోవాలని , మా పిల్లలకి కొన్ని జ్ఞాపకాలైనా ఇక్కడ ఇవ్వాలని మా ఆశ అన్నారు” కాళేశ్వర రావు, సుమతిలు.
“ఇక్కడ ఎటువంటి వసతులున్నా మేము ఉండడానికి సిద్దపడే వచ్చాం.. మీరు అనుమతిస్తే” అంది సుమతి.
“అయ్యో! మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండచ్చు.. మాకెలాంటి ఇబ్బంది లేదు, మీకు ఏ పని చెయ్యాలని అనిపిస్తే ఆ పని మీరు ఇక్కడ చెయ్యచ్చు.”
“అంటే.. అది నేను ఎంతైనా డబ్బు ‘పే’ చేస్తాను” అన్నాడు కాళేశ్వర రావు.
“సారీ సర్.. ఇది పెయిడ్ సర్వీస్ కాదు.. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, వృద్ధులకు మాత్రం సేవలు అందుతాయి. వాళ్ళు కూడా చెయ్యగలిగిన పనులు చెయ్యాల్సిందే. మీకు కావలసినవన్నీ మా వాళ్ళు అందిస్తారు.. మీరు ఉండడానికి వీలైన వసతి.. భోజనం అన్నీ మీకు మీ పిల్లలకి ఫ్రీ గానే అందిస్తాం.. కాకపోతే మీ నుంచి కొంత ‘సర్వీస్’ మేము తీసుకుంటాం, అది మీరు చెయ్యగలిగిందే.. కష్టం ఏమీ ఉండదు” అని చెప్పింది నిత్య.
మా పిల్లలకు అందమైన జ్ఞాపకాలు ఇక్కడున్న పెద్దవాళ్ళనుంచి అందించడానికి ఏమి చెయ్యమన్నా చేస్తాం, మీరు పనులు చెప్పండి పరవాలేదు అంది ఆ సుమతి.
“మేమూ, మా పిల్లలు ఉండడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞుడిని తల్లీ..” అంటూ ఆ ప్రశాంతమైన ‘వసంత లోగిలి’లో తనకు కేటాయించిన వసతి గృహం లోకి వెళ్ళిపోయాడు భార్యా పిల్లలతో సంతోషంగా.
అక్కడ సుమతి పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం ఎంతో అందమైన స్వెట్టర్లు అల్లి ఇచ్చేది. కాళేశ్వర రావుకి జాతకాలు చెప్పడమంటే మహా పిచ్చి, కొతమంది పెద్దవాళ్ళను గుంపుగా చేసి వారి జాతకాల గూర్చి, వారి జీవితాల గూర్చి చెబుతూ ఆ వృద్ధులను ఉత్సాహపరిచేవాడు. ‘ఇందులో మాకు ఆనందం ఉంది.. మనసుకి ఎంతో హాయిగా ఉంది’ అనేవారు ఆ దంపతులు.
***
“నిత్యక్కా! నిత్యక్కా.. ఈ తాతగారు నా వెంటపడుతున్నారు.. రా రత్నం.. ఎందుకలా దూరంగా జరుగుతున్నావ్.. వచ్చి నన్ను కౌగలించుకో.. అంటూ బలవంతం చేస్తున్నారక్కా! నిన్నటికి నిన్న నా మనవరాల్లా ఉన్నావ్.. చాక్లెట్ కొనుక్కో అని 20 రూపాయల కాగితం ఇచ్చారు. ఇవాళ రావే రత్నం అని పిలుస్తున్నారు” అంది సైకాలజీ చదివి, వృద్ధుల సైకాలజీ గురించి స్టడీ చెయ్యడానికి వచ్చిన సంజన.
“సంజనా! నీకు తెలుసుకదా ఈ గ్రూప్‌లో ఉన్న ఈ ఎనిమిది మంది స్పెషల్.. వాళ్ళు అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు.. వాళ్ళు అప్పటికే మరిచిపోతారు. నీకు వీళ్ళతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నీ కొలీగ్ రాఘవ్‌ని నీ తరపున వాళ్ళ దగ్గర కాసేపు ఉండమని చెప్పు. అలాగే కొత్తగా జాయిన్ అయిన ఊర్మిళని కూడా ఉండమని చెప్పు. ఇప్పుడన్నమాట మరి కొద్ది సేపట్లో వాళ్ళు మర్చిపోతారు” అంది నిత్య.
ఇంతలో.. “నిత్యక్కా ఈమెకి చీర కట్టడం నావల్ల కాదు, ఆ తాతగారి సల్వార్ కమీజ్ వేసుకుంటానని ఒకటే గొడవ” అంది ఊర్మిళ.
“సర్లే ఓ సారి వేసి చూడు.. కాసేపట్లోనే తీసి పారేస్తుంది.. ఇలా సమయానుకూలంగా వాళ్ళను డీల్ చెయ్యండి, అవసరమైతే, మీ ఇద్దరూ ప్లేసెస్ మారండి” అని సూచించింది నిత్య.
ఎర్రని చీర కట్టుకున్న ఓ పెద్దావిడ సరాసరి నిత్య దగ్గరకే వచ్చి.. “ఇదిగో సూర్యకళా.. నువ్వు నా పెళ్ళికి ఎందుకు రాలేదు.. నేను ఎంత బాదపడ్డానో తెలుసా?” అంటూ తన చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది.
“నేను మరిచిపోయాను.. పెద్దమ్మా! పిలుద్దామనే అనుకున్నా! కుదరలేదు.. ఈ సారి పిలుస్తాలే” అని సర్ది చెప్పిన నిత్యని అలా చూస్తూ, “నీకున్న సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా నిత్యా!” అన్నాను. నిత్యని మనసులోనే మెచ్చుకున్నా.
అక్కడే ఉన్న ఓ పెద్దాయన అన్నంలో అక్కడే ఉంచిన చారు బదులు నీరు పోసుకుని తినేస్తూ.. “ఈ రోజు చారు చాలా బాగా చేసింది సుభద్రమ్మ.. ఎంత రుచిగా ఉందో.. ఇదిగో నువ్వూ తిను” అంటూ పక్కనే ఉన్న మరో అల్జీమర్స్ వ్యక్తి నోట్లో పెడుతున్నాడు.
అది తిన్న ఆయన కూడా “అవును చాలా బాగుంది” అంటూ చప్పరిస్తూ తింటున్నాడు.
అది చూసి కిసుక్కున నవ్వుతున్న నన్ను చూసి.. ‘నవ్వద్దు సుమా’ అని నిత్య కళ్ళతో నన్ను హెచ్చరించింది.
“అసలు ఇలా నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది నిత్యా.. నాకు ఇక్కడే పని చెయ్యాలని అనిపిస్తోంది నిత్యా. ఇవన్నీ చెయ్యాలంటే, ఎంత ప్రణాళిక ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి.. ఎంత సమయస్ఫూర్తి ఉండాలి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత ఓపికగా ఉన్నావ్.. అందరికీ సమాధానం చెబుతూ.. నాకు ఇవన్నీ చూపిస్తూ.. వివరిస్తూ.. నిజంగా హాట్స్ అఫ్ నిత్యా” అన్నాను. “ఎంత పెద్ద పనైనా, కష్టమైనా, పనిని ఇష్టంగా చేస్తున్నావ్ చూడు.. అది.. అది నాకు బాగా నచ్చింది.. నీతో పాటు నాకు కూడా చెయ్యాలని ఆశగా ఉంది నిత్యా” అన్నాను.
“చెయ్యి నువ్ కూడా.. ఇక్కడ కొచ్చే పిల్లలకి కథలు చెప్పే వారు ఎనిమిది మంది ఉన్నారు.. ఇంకా మరో ఇద్దరి అవసరం ఉంది. ఇక్కడకి వచ్చే పిల్లలకి మంచి మంచి పద్యాలు, పాటలు కూడా నేర్పించేలా చూడాలి” అంది నిత్య.
“మిషన్ కుట్టడం తప్ప ఏమీ రాదు నాకు.. ఈ ‘వసంత లోగిలి’కి కావలసినవి కుట్టి పెట్టమని అడిగావ్ కదా! అది చేస్తా.. అది కాకుండా, నాలో ఏమి స్కిల్ ఉందో ముందు నేను తెలుసుకుంటా” అన్నాను.
“భలే దానివే శారదా. నీ స్కిల్ నువ్వు మర్చిపోయావా ఏంటి? నువ్వు చక్కగా పాటలు పాడగలవు కదా” అంది నిత్య.
“నిత్యా! అవునా! నీకు నా స్కిల్ కూడా గుర్తుందా! నాలో ఈ స్కిల్ ఉందని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు.. చూసావా నేను ఎలా మర్చిపోయానో!” అన్నాను.
“నువ్వు పాటలు బాగా పాడుతావు.. అది నువ్వు మర్చిపోయావు అంతే.. బరువులు, బాధ్యతల మధ్య మన గురించి మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం.. ఏం పర్వాలేదు.. నువ్వు నీ గొంతుకి పని చెప్పు తల్లి.. ఇక్కడ నీకు చాలా పని ఉంటుంది” అంది నిత్య
కొంచెం సిగ్గుగా అనిపించింది నాకు. అయినా తమాయించుకుని.. “నేను తప్పకుండా ఈ ‘వసంత లోగిలి’ లో పాటలు పాడుతా.. దానికంటే ముందు నా గొంతు సవరించుకుని వస్తా” అన్నాను.
నవ్వుతూ.. ‘వసంత లోగిలి’ లో పనులు చక్కబెట్టుకుని ఇంటి ముఖం పట్టా౦.
(సశేషం)
శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో జన్మించారు. బంటుపల్లి సన్యాసప్పలనాయుడు, రమణమ్మ గార్లు తల్లిదండ్రులు. పద్మావతి మహిళా యునివర్సిటీ ‘మాస్టర్స్ ఇన్ కమ్యునికేషన్ & జర్నలిజం’ చేశారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ నుంచి ‘డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా అండ్ పాలసీ’ చేశారు. ప్రస్తుతం విజయనగరం కన్యూమర్ కమిషన్‌లో సబ్ జడ్జ్‌గా (కన్స్యూమర్ కమిషన్ మెంబర్) వ్యవహరిస్తున్నారు. భర్త శ్రీ ఎస్.వి.సన్యాసి రావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
శ్రీదేవి గారు కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. పలు కథలకు వివిధ పత్రికలలో బహుమతులు పొందారు. లేత గులాబి అనే బాలల పుస్తకం వెలువరించారు. 60 రేడియో టాక్స్ చేశారు. చిన్ని ఆశ, పేపర్ బోట్ అనే డాక్యూమెంటరీలు తీశారు. మనోరంజని అవార్డ్ అందుకున్నారు. ‘వసంత లోగిలి’ వీరి తొలి నవల.