[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[తన గతం గురించి నిత్య తనకి చెప్పిన విషయాలను; వసంత లోగిలి గురించి తనకి నిత్య చెప్పిన విషయాలు భర్తకు చెబుతూంటుంది శారద. తాను నవీన్‍తో ప్రేమలో పడడం గురించి, నవీన్ తల్లిదండ్రుల గురించి వివరంగా శారదకి చెప్తుంది నిత్య. వృద్ధులు, పిల్లలపై తాను వ్రాసిన థీసిస్ పేపర్ చదివిన నవీన్ తన ప్రేమని అంగీకరించాడని, పెళ్ళికి ప్రపోజ్ చేశాడనీ చెబుతుంది. మొదట తాను పెళ్ళి ఎందుకు వద్దన్నాడో నవీన్ నిత్యకి చెప్తాడు. సొంత తండ్రి తనని కల్లు కోసం అమ్మేస్తే, పెంచిన తల్లిదండ్రులు తనని ఎలా పైకి తీసుకొచ్చినది చెప్తాడు. అయితే, పెళ్ళయ్యాకా, పిల్లల్ని కనవద్దని, ఇద్దరు అనాథలని పెంచుకుందామని అంటాడు. కనీసం ఒక్కరినైనా కందామని నిత్య అంటే, తర్వాత రోజుల్లో పిల్లల పట్ల చూపే ప్రేమలో తేడాలు రావచ్చని అంటాడు. నిత్య నవీన్‍ని తన తల్లిదండ్రులకి పరిచయం చేస్తుంది. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగిపోతుంది. ఒకరోజు తనని ‘వసంత లోగిలి’కి తీసుకు అక్కడ జరిగే కార్యక్రమాలను చూపించింది నిత్య అని చెప్పి, అవి తననెంతో ఆకట్టుకున్నాయని భర్తకి చెబుతుంది శారద. తాను చదివిన చదువుని ‘వసంత లోగిలి’కి ఎలా అనుసంధానం చెయ్యాలా అని నిత్య ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుందని శారద, సునీల్‍కి చెప్తుంది. ఇక చదవండి.]
“ఎం.బి.ఏ చదివిన అనుభవంతో నా ఆలోచనలకు రూపకల్పన చేసుకున్నాను.. నా గోల్ ఏంటి, నేనేం చెయ్యాలి, ఇందులో ఎవరి పాత్ర ఎంత.. ఇలాంటి ఆలోచనలతో పక్కా ప్రణాళిక వేసుకున్నాను. ఇక్కడ ఉన్న వృద్ధులలో చాలా నైపుణ్యాలు దాగి ఉన్నాయని నాకు అర్థం అయింది. ఎవరికి ఏ అంశంలో పట్టు ఉందో ఆ అంశాన్ని వారికి కేటాయించి పిల్లలకు చెప్పే విధంగా తర్ఫీదు ఇచ్చాం. వయసుతో వచ్చిన మార్పుల వల్ల వాళ్ళు ఎక్కడ అలసిపోతే అక్కడ వాళ్ళ పని అపేయవచ్చు. నిత్యం వృద్ధుల అవసరాలకు, ఇక్కడకు వచ్చిన పిల్లల అవసరాలను గమనిస్తూ అప్పటికప్పుడు హాజరయ్యే గ్రూప్స్ ఉంటాయి. అలాగే వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే స్పందిచే డాక్టర్స్‌తో మూడు టీమ్స్ ‘వైద్యో నారాయణ’ పేరుతో నిత్యం పని చేస్తాయి.
అదిగో అక్కడ రామాయణం రసరమ్యంగా చెప్పే ఆచారి గారు, భగవద్గీతను పొల్లుపోకుండా వినిపించే భ్రమరాంబ గారు, చిక్కు ప్రశ్నలు వేసే చిన్నారులకు బేతాళకథలతో సమాధానం చెప్పే భానుమతి టీచర్, ‘పేదరాసి పెద్దమ్మ కథల్లో పెద్దమ్మ ఎవరు?’ అంటున్న పేరిందేవిగారు, చందమామ కథలు చెబుతూ చెవులూరించే చలం మాస్టారు, ‘మాల్గుడి కథల’ తో మరో లోకానికి తీసుకెళ్ళే మౌళి గారు, పంచతంత్రం కథలలో తంత్రం వివిరిస్తున్న పరంధామయ్య గారు.. వీరంతా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని హుందాగా కూర్చుని క్లాస్ రూమ్‌లో బిజీగా ఉన్నారు. వీరి తపనంతా కథల వినే చిన్నారులను ఉత్సాహపరిచి, ఉర్రూతలూగించి, వారిలో సృజనాత్మకత పెంచటమే. ‘అయ్యయ్యో ఆ తరువాత ఏమైంది తాతగారు’ అంటూ పిల్లలు ఇంతింత కళ్ళను బండి చక్రాల్ల తిప్పుతూ చెవులు రిక్కించి వింటున్నారు చూడు శారదా” అంది నిత్య.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “రకరకాల ఆటలు, గోటి బిళ్ళ, గుంటాట, కోతి-కొమ్మచ్చి, దొంగా – పోలీస్, గుడి-గుడి గుంచం-గుండా రాగం, బచ్చాట, చింత పిక్కలాట, రాళ్ళ బిక్కలాట, గచ్చుపిక్కల ఆట, వైకుంఠపాళీ, ఖోఖో, కబడ్డీ ఇలా రక రకాల ఆటలు ఆడించే విశాలమైన ఆటస్థలం ఇది.. ఈ రోజు కొత్తగా పిల్లల చేత ఏమి ఆడించాలని కొత్తగా సరికొత్తగా ఆలోచనలు చేసే సులోచన, సుశీల, సుబ్బాయమ్మలు కొత్తగా వారి ప్రణాళికలను తయారు చేస్తున్నారు.. ఏ రోజు కా రోజు పిల్లల కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటారు.
అదిగో చూడు, అప్పుడే ఒక టీం పిల్లలు ఇంకో టీం పిల్లలపై అలకపూనితే.. సర్ది చెబుతూ కనిపించే శివానంద మాస్టారు.. ‘ఇదిగో ఇలా అయితే నేను ఆడను.. మా తాతయ్యతో చెబుతా’ అంటూ బుంగమూతి పెడుతూ వెళ్ళిపోతున్న సుప్రజని, ఇది ‘ఆటలో అరటిపండు.. సరేనా! మళ్ళీ ఆడుదాం రా’ అంటూ బతిమాలి వెనక్కి తీసుకెళ్తున్న పద్మజ.. ఇలా రోజూ ఏదో ఒక హడావిడి నడుస్తూనే ఉంటుంది.
వేమన పద్యాలు, సుమతీ శతకాలు, భర్తృహరి సుభాషితాలు, తెనాలి రామకృష్టుడి హాస్య చతురతతో పాటు స్వతంత్ర వీరుల గాథలు, దేశభక్తి కథలు, సంఘసంస్కర్తలు, సామాజికవేత్తల కథలు.. అంతుపట్టని విశ్వం గురించి, అనoతమైన ఆకాశం గురించి.. ఉత్సాహం కలిగించేలా అడుగడుగునా.. ఇలా ఎన్నో రకాల ప్రదర్శనలు పిల్లల ఊహాశక్తిని పెంచేలా ఒక షెడ్యుల్ తయారు చేసే పనిలో తలమునకలైపోయిన తాయారు గారు, శర్మ గారు, నాయక్ గారు, శ్రీవాణి గారు.. వాళ్ళ పనిలో మునిగిపోయారు.
చరిత్ర పేజీలలో దాగున్న సత్యాలు, అసత్యాలు, రాజులు రాణులు గతవైభవాలు, యుద్ధాలు, దండనీతి , చాణక్య నీతి, దుర్నీతి రాజ్యాలు, ఇలా ఎన్నో విషయాలు పిల్లకు అర్థం అయ్యే రీతిలో ప్లకార్డ్స్ తయారు చేస్తున్న కుటుంబరావు, కాళేశ్వర రావు, ముక్తినాథం తమ పనుల్లో నిమగ్నమైపోయారు
వీళ్ళంతా రేపటి తరాన్ని తయారు చేసే యజ్ఞంలో పాలుపంచుకుంటున్న వృద్ధ యువకులు శారదా! వీళ్ళంతా 60 నుంచి సుమారుగా 90 సంవత్సారాల వయసు వారే. వీళ్ళ వయసు చూసి ఇదేదో ఓల్డ్ ఏజ్ హోమ్ అనో, ఈ కథలో హీరోలు హీరోయిన్స్ ఇంత ముసలి వాళ్ళా.. అయితే సినిమా ‘డమాల్’ అనో అనుకుంటే పప్పులో కాలేసినట్టే నువ్వు.
ఈ ‘వసంత లోగిలి’ ని నిత్య నూతనంగా, నిత్య యవ్వనంతో కొత్తగా సరికొత్తగా సేద్యం చేస్తున్న ఈమె పేరు సరయు, వయసు కేవలం 30 సంవత్సరాలే.. ఈ అండపిండ బ్రహ్మాండాన్నిబద్దలుగొట్టి విపులీకరించి పిల్లల వయసుని బట్టి అర్థమయ్యే రీతిలో రకరకాల రంగులలో ఆలోచనలకు రూపం ఇచ్చి కార్డ్స్, బొమ్మల రూపంలో మనసుని తట్టిలేపే ఆలోచనల స్థాయిని పెంచే విధంగా వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ అటు వృద్ధుల ఆలోచనలను, ఇటు బాల్యపు చాయలు వీడని పిల్లల అవసరాలను అడుగడుగున అనుసంధానం చేస్తూ రోజువారీ ప్రణాళిక తయారు చెయ్యడానికి సహకరించే సింధు, భిందు, మురళి, రవళి వయస్సు 20-30 మధ్యనే సుమా!
నా ఈ గోల్ సమాజానికి ఒక కొత్త తరాన్ని అందిస్తుంది.. తరాల మధ్య దూరం తగ్గేటట్టు చేస్తుంది.. ప్రతి పిల్లవాడు అమ్మమ్మ చెప్పే కథలు, తాతయ్య చెప్పే కబుర్ల మధ్య పెరుగుతాడు.. వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలను చూసి మురిసిపోతారు.. కొత్త తరాన్ని తయారుచేసే శక్తివంతమైన, అమూల్య మైన బాధ్యతలో మేము కూడా భాగమయ్యామని పొంగిపోతారు. అంతే కాకుండా, మా జీవితాలు పనికిరానివి కాదని, మా అనుభవం రేపటి తరానికి ఉపయోగపడే ముడిసరుకు అని గర్వంగా చెబుతారు. మా పనికి ఒక వేతనం ఉందని, దాన్ని కష్టపడి మేము సంపాదిస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతారు.. కొడుకుల చేత, కోడళ్ళ చేత నిర్లక్ష్యానికి గురి అవుతున్న తమ పెద్దరికం, అనుభవం ఒక ‘వనరు’ గా మారి సమాజానికి ఉపయోగ పడుతున్నందుకు ఈ వృద్ధులు ఎంతో సంతోషిస్తారు.
బాల్యంలో ఉన్న చైతన్యాన్ని తిరిగి పునరుత్తేజం చేసుకుంటే, వృద్ధాప్యం భారంగా కాకుండా ఉత్సాహంగా ఉంటుంది.. బతుకు మీద ఆశను పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది.. వాళ్లకు అడుగడుగునా పలకరించే వృద్దాప్య రోగాలు దూరమైపోతాయి, వాళ్ళ అనుభవ పాఠాలు రేపటి తరాన్ని పదును పెట్టే చురకత్తులవుతాయి ఇలా నా ఆలోచనలకు పదును పెట్టాను.
ఎస్.. అందరూ చేసే పని.. ఉద్యోగం.. జీతం.. ఇలా కాకుండా కొత్తగా సరికొత్తగా సమాజానికి ఉపయోగపడాలి అనుకున్నాను.
కాకపొతే ఇది అంత సులువైన మార్గమేమి కాదు. ఇందులో కూడా రకరకాల సమస్యలు పలకరిస్తాయి. ముసలి వాళ్ళతో ఎన్ని సమస్యలు ఉంటాయో! నాకు తెలుసు.. వాళ్ళని నమ్ముకుంటే అభాసు పాలవుతావన్న వారు కూడా ఉన్నారు.. ఇక్కడ వృద్ధులు ఏదో ఒక పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు.. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళతో బలవంతంగా పని చేయించే ప్రశ్నే లేదు.. నచ్చినవాళ్ళు నచ్చిన పని చేస్తారు. ఇక్కడ భోజనం, వసతి ఉచితంగా ఇచ్చినా, వాళ్ళు చేసే పనికి కొద్దిగా వేతనం కూడా ఇస్తాం. ఎందుకంటే, వేతనం పొందితే మేము కూడా సంపాదానపరులమే సుమా! మా కాళ్ళ మీద మేము నిలబడగలం అనే గర్వం వాళ్ళని మరింత ఉత్సాహంగా ఉంచుతుంది. ఆ వేతనాన్ని చూసి మురిసిపోతారు.. వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న మనవళ్ళకి, మనవరాళ్ళకి వీళ్ళు సంపాదించిన డబ్బు పంపుతూ ఉంటారు. కొంత మంది ఇక్కడకు వచ్చిన పిల్లల పుట్టినరోజులకి కానుక గా ఇస్తారు.
‘నీ నుంచి పైసా సంపాదన లేదు, తిండి దండగ’ అన్న కొడుకు మాటకి ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు రహీం. అక్కడ, ఇక్కడ తిరిగి ఇక్కడ వచ్చాడు పిల్లల్ని ఉత్సాహంగా ఉంచే తన గజల్స్ పిల్లల్ని తనకి దగ్గర చేసాయి. ఇక్కడకు వచ్చాక ఆయన తన కోడలు, కొడుకు అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపదేవాడు మొదట్లో.. ఆ తరువాత మెల్లిగా తన గజల్స్ వినిపించేవాడు. అందుకు గాను తనకి కొంత డబ్బు ఇచ్చేవాళ్ళం. అది చూసి ఎంత మురిసిపోయాడో. ఆ డబ్బుతో తన మనవడికి మంచి మంచి బట్టలు కొని తీసుకుని వెళ్ళేవాడు. అప్పడప్పుడు ఆ మనవడ్ని ఇక్కడకు తీసుకు వస్తుంటాడు.
ఈ ‘వసంత లోగిలి’ ద్వారా తరానికి తరానికి మద్య బ్రిడ్జ్ కట్టాలి, అమ్మా నాన్నా, అమ్మమ్మా, తాతయ్యలతో గడిపిన మన ముందు తరం ఎంతో గొప్పగా ఎదిగింది. నేటి తరంలో తాత, అమ్మమ్మల బంధం తెగిపోయి, వృద్ధాశ్రమాల పాలైపోయింది.. వీరిమద్య అనుసంధానం లేనే లేదు… ‘బంధాల గొలుసు’ బరువైపోయి తెగిపోయింది..ఆ గొలుసు రిపేర్ చెయ్యాల్సిన బాధ్యత మనపై ఉంది శారదా” అంది నిత్య.
కొన్ని క్షణాల తరువాత మళ్ళీ చెప్పసాగింది –
“పిల్లలలో ఊహాశక్తిని పెంచాలి. సృజనాత్మకతను వెలికితియ్యాలి, ర్యాంక్‌ల కోసం పాకులాడి, వాళ్ళ చిట్టి బుర్రలో ఉన్న చిన్న సామ్రాజ్యాన్ని నలిపేస్తూ వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను చంపేస్తున్నారు. కథల ద్వారా, పాటల ద్వారా ఆటల ద్వారా సృజనాత్మకతను బయటకి తియ్యాలి.
పిల్లలలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా ఆహారం పట్ల అవగాహన పెంచాలి. మారుతున్న కాల మాన పరిస్థితులలో ఆహారం విషయంలో చాల మార్పులు వచ్చాయి, వాటి వల్ల చిన్న పిల్లలలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటికి చెక్ పెట్టి ఆరోగ్యవంతమైన పిల్లలను భావి తరానికి అందించాలి. వాళ్ళ కేరింతలతో, తుళ్ళింతలతో రోజు గడవాలి, అందమైన బాల్యాన్ని పిల్లలందరూ రుచి చూడాలి. అనుభవించాలి. బాల్యావస్థకు చేరిన పెద్దరికానికి ఆసరాతో పాటు వేతనంతో కూడిన గౌరవాన్ని ఇవ్వాలి.. వారి సేవలకు ఆదరణ కల్పించాలి,
రేపటి తరాన్ని తయారు చెయ్యడానికి వృద్ధులు తలో చెయ్యి అందించాలి. ‘అనుభవం’ ఒక వనరుగా గుర్తించాలి.. దానిలో ఉన్న పాఠాలు నేటి తరానికి అందించాలి.
జీవితం అనే ఈ ప్రయాణంలో ఎత్తు పల్లాలు సహజమని, వాటిని ఎదుర్కునే శక్తి సామర్థ్యాలు ఆటల ద్వారా, పాటల ద్వారా సాధ్యమని బాల్యం నుంచే పిల్లలకు అర్ధమయ్యేలా ఇక్కడ వృద్ధుల తమ అనుభవాల ద్వారా పంచుతుంటారు” అంటూ ఆపింది నిత్య.
“చాలా పెద్ద బాధ్యతని నెత్తిమీద పెట్టుకున్నావ్, నీ ఆలోచనలు అమలుచేయడానికి కావలసినవన్నీ నీ ముందు ఉన్నాయి. అమలుచేసే శక్తి నీలో ఉంది. నీ శక్తి నాకు తెలుసు. స్కూల్, కాలేజ్ రోజుల్లోనే నువ్వు మల్టీ టాలెంటెడ్.. ఇప్పుడు ఇంకా ఎదిగావ్. సమాజం – దానిలో వచ్చే మార్పులు కూలంకుషంగా తెలుసుకున్న దానివి. ఇక దూసుకుపో నిత్యా” అన్నాను.
“థాంక్స్ శారదా.. నేను ఇలా ముందుకు వెళ్ళాలంటే నీలాంటి స్నేహితులు సహకారం ఎంతో అవసరం” అని నా చెయ్యి పట్టుకుంది నిత్య
“నాలాంటి వాళ్ళా?” అన్నాను.
“అవును శారదా! ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంది అని నమ్ముతాను.. అలా నీలో కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది నేను నమ్ముతాను శారదా.” అంది నిత్య.
“నాలో ఏముంది నిత్యా! ఏదో అప్పుడప్పుడు మిషన్ మీద చిన్న చితక బట్టలు కుట్టడం తప్ప” అన్నాను.
“ఓ అది చాలు.. మా ‘వసంత లోగిలి’కి కావలసిన కొన్ని బట్టలు కుట్టి పెట్టు” అంది నిత్య.
“ఓ తప్పకుండా” అన్నాను.
ముందుకు నడిచాము.
ఒక గదిని చూసి, “అన్నట్టు నిత్యా ఇదేంటి.. ఇది లైబ్రరీయా!?” అని అడిగాను.
“అవును శారదా!.. పిల్లల గోలను, అల్లర్లను భరించలేని వృద్ధులు కూడా కొంత మంది ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ రూమ్ ఏర్పాటు చేశాను. ఈ పక్కనే మరో రూమ్‌లో కావాల్సిన వాళ్ళు వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు, లేదా పుస్తకాలు చదువుకోవచ్చు.. వాళ్లకు కావలసిన ప్రపంచంలో వాళ్ళు ఉండచ్చు.
ఇదిగో ఇదే ఆధునిక వంట గది. వృద్ధుల కోసం మాత్రమే వృద్ధుల అవసరాలను బట్టి వారికి ఎలా కావాలో అలా వండి పెట్టే ‘టీం’ వీళ్ళు.. వంట అయిపోగానే వాళ్లకు కావలసిన పదార్థాలను ప్రేమతో వడ్డించే ‘టీం’ ఇది” అంటూ వారిని పరిచయం చేసింది నిత్య
“ఈ టీంలో ఉన్న వాళ్ళంతా జీతానికి పనిచెయ్యరు. ఇందులో కొంతమందికి వండి వార్చి, ప్రేమతో పెద్దవాళ్ళకి వడ్డించడమంటే మహా సరదా, కొంతమంది తమకు జీతం కావాలి అంటారు. కావలసినవాల్లకి తప్పకుండా గౌరవ వేతనం ఇస్తాం. కాని సొంత మనుషులకు ఎలా అయితే సర్వీస్ ఇస్తామో! అలాగే అందిస్తారు వీళ్ళంతా..
వీళ్ళలో.. ఈ అనసూయమ్మని చూడు, ఈమె.. ఈమె కొడుకు, కూతురు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈవిడికి వంట చెయ్యడమంటే చాల ఇష్టం. ఈమె చేసిన వంటలు లొట్టలేసుకుంటూ తింటారు ఈ వృద్ధులు. కొడుకు కూతురు ఆస్ట్రేలియా రమ్మని ఫోన్ చేస్తే, నా కుటుంబమంతా ఇక్కడ ఉంది, వీళ్ళని వదిలి నేను రాలేను అంటుంది. సాయంత్రం పూట స్పెషల్ గా స్నాక్స్ చేసి కావలసిన వాళ్లకి ప్రేమతో తీసుకుని వెళ్తుంది.
ఇక్కడకు వచ్చే పదేళ్ల భాషిణికి నానమ్మ అంటే చాలా ఇష్టం, కాని ఆమె ఆక్సిడెంట్‌లో చనిపోయారు. దానితో తను బెంగ పెట్టుకుంది, తిండి నిద్ర మానేసిన భాషిణి ఆరోగ్యం పాడైపోయింది, నానమ్మనే కలవరించే ఈ పిల్లని చాలా హాస్పిటల్స్‌కి తిప్పారు. నానమ్మని మరిపించడానికి చాలా ప్రయత్నాలు చేసారు కాని ఏమీ మార్పు లేదు.. ఈ భాషిణి అమ్మ గృహిణి, నాన్న పోలీస్ ఆఫీసర్, తనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంతమంది ఉన్నా నానమ్మే కావాలని పేచీ పెట్టేది. కాలం గాయాన్ని మారుస్తుంది కదా! మెల్లిగా మార్పు వస్తుంది తనలో అని అనుకున్నారు భాషిణి తల్లి తండ్రులు. ఇలా ఏడాది దాటింది. బడిలో ఎంతో ఆక్టివ్‌గా ఉండే ఈ పిల్ల మౌనంగా ఏదో కోల్పోయినట్టు ఒక మూల కూర్చుంటుంది. చదువులో బుర్ర పెట్టక.. ఒకలాంటి నైరాశ్యం లోకి వెళ్ళిపోయింది. అదిగో అప్పుడే మన ‘వసంత లోగిలి’ గురించి తెలుసుకుని భాషిణిని తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నగారు ఇక్కడ 10 రోజులు ఉండిపోయారు. అప్పడు అనసూయమ్మకి చాలా దగ్గరైపోయింది భాషిణి.. ఎంతో సరదాగా సంతోషంగా ఇక్కడ తిరుగుతుంటే ఆ పాపని చూసి మురిసిపోయారు వాళ్ళ నాన్న. అనసూయమ్మ అంత ప్రేమ చూపించింది ఆ పాపకి. వాళ్ళ నానమ్మని మెల్లిగా మరిచిపోయింది. అయితే వచ్చిన చిక్కేంటంటే, ఇంటికి వెళ్ళిపోదాం రా అని వాళ్ళ నాన్న పిలిస్తే, ఈ నానమ్మ వస్తే వస్తాను లేకుంటే రాను అని అల్లరి చేసింది. దాంతో అనసూయమ్మని వాళ్ళ ఇంటికి పంపించాం.. అక్కడ 10 రోజులు ఉంచి, స్కూల్‌కి కొంచెం అలవాటు అయ్యాక అనసూయమ్మ వచ్చేసారు.. కాని రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇక్కడకి వస్తుంది భాషిణి. వెళ్ళేటప్పుడు ముఖం మాడ్చుకుంటుంది. ..ఈ అనసూయమ్మ ఆ భాషిణికి ఏమి చెబుతుందో తెలీదు. అంతే, చెంగున రెడీ అయి ఇంటికి వెళ్ళిపోతుంది.
ఇకపోతే ఇది పిల్లల ‘వంట గది’.. బడుల నుంచి వచ్చిన పిల్లలు ఆకలితో వస్తారు కదా! వాళ్లకు కావలసిన పదార్థాలు ఇక్కడ తయారు చేస్తారు.. తయారు చేసిన వెంటనే కొంత మంది వృద్ధులు వాళ్ళ మనవళ్ళకు తినిపిస్తామని తీసుకుని వెళ్తారు.. ప్రేమగా పిల్లలతో కబుర్లు చెబుతూ తినిపిస్తారు.
సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు పిల్లల ఆటపాటలతో, సరదా కబుర్లతో, వాళ్ళ నవ్వులతో ‘వసంత లోగిలి’ నిండిపోతుంది.. అదిగో చూసావా.. కొంతమంది పిల్లలు తాత, నాయనమ్మలను వదిలిపోనని మారం చేస్తున్నారు.. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి బందీగానే ఉంటాయి వాళ్ళ బతుకులు” అంటూ ఆపింది నిత్య.
అక్కడున్న ఫోటోలు చూస్తూ, “ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు.. ఎవరు?” అడిగాను.
“ఈ ఫోటోలో ఉన్న వ్యక్తీ అరవింద్ పిళ్ళై.. ఇతను పెద్ద వ్యాపారి, భార్య పోయిన తరువాత కొడుకుల వద్దకు, కూతురు వద్దకు వెళ్లి కొన్ని రోజులు ఉన్నాడు. వాళ్ళంతా ఈయనకి మునుపటి గౌరవం ఇవ్వటం లేదు అన్న వంకతో నేను నా ఇంట్లో నే ఉంటాను అని తన ఊరు వెళ్ళిపోయాడు. కొడుకులు పనివాళ్ళని తనకి సహాయంగా ఉండమని ఉంచారు. పని వాళ్ళు వాళ్ళ డ్యూటీ ప్రకారం వచ్చి వండి పెట్టి వెళ్ళిపోయేవారు.. పిల్లలు అతని దగ్గరకి వచ్చి వెళ్ళే పరిస్థితి లేకపోయింది. ఆరోగ్యం బాగా క్షీణించడంతో పనివాళ్ళు కూడా దగ్గరకి వచ్చేవారు కాదు. దాంతో ప్రేమ రాహిత్యాన్ని, గౌరవ భంగాన్ని భరించలేక, ఒంటరితనాన్ని భరించలేక మేడమీద నుంచి దూకి ‘ఆత్మహత్య’ చేసుకోబోయాడు. కాలు విరిగిపోయింది, తలకి దెబ్బ తగిలింది కాని చావలేదు. వాళ్ళపిల్లలు చెప్పారని ఆ పనివాళ్ళు ఇక్కడ మామయ్య ఉండే ఈ హాస్పిటల్‌లో చేర్చారుట. వీళ్ళ పిల్లలు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఈయనని చూడడానికి హాస్పిటల్‌కి వస్తే.. ఎవ్వరితో మాట్లాడలేదట.. మామయ్యని పిల్చి ఇక్కడ నుంచి వాళ్ళని వెళ్లిపోమ్మనండి అని ఒకటే గొడవ చేసాడట. అతనికున్న బెంగ వల్ల తేరుకోవడానికి హాస్పిటల్‍లో చాలా రోజులు ఉంచారు. ఈయనని చూసుకోడానికి ఒక కొడుకు ఉండిపోవాలని అనుకున్నాడు. కాని ముసలాయన ఒప్పుకుంటేగా! నాకు ఎవ్వరూ వద్దు.. ఇక్కడ నుంచి వెళ్ళిపో౦డి అని ఒకటే గొడవ. దాంతో ఇక్కడ హాస్పిటల్‌లో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ మేమే చూసుకుంటాం అని మామయ్య మాట్లాడి వాళ్ళను పంపేసాడు. కాని నలుగురూ ఏమనుకుంటారు? అతనిని అనాథలా వదిలేశామని అనుకోరా! అని పిల్లలు మామయ్యతో అన్నారంట. నలుగురు కోసం అలోచించి అతనిని మీరు చూడవద్దు. మీకు మీ నాన్న కావాలంటే, ఇష్టంగా అయన వస్తే తీసుకుపోండి అని అన్నారంట మామయ్య. వాళ్ళు మళ్ళీ వస్తాం అని వెళ్ళిపోయారు. కొంచెం కోలుకున్నాక ‘వసంత లోగిలి’కి మామయ్య ఈయనని పంపారు. ఇక్కడ తన సమవయస్కులతో ఎంతో సంతోషంగా బతికాడు.
ఇక్కడ పిల్లల పుట్టినరోజు వస్తే ఆయనే ఈ రూమ్‌ని బెలూన్‌లతో అలంకరించి. స్పెషల్ గిఫ్ట్స్ పిల్లలకి ఇచ్చేవాడు.. పిల్లలకి మంచి మంచి కథలు చెప్పేవాడు.. ఎంతో హుషారుగా మారిపోయాడు. తన పిల్లలపై ద్యాసే లేకపోయే. తన పిల్లలు తండ్రి కోసం వచ్చి కాసేపు గడిపి వెళ్ళేవారు.. వాళ్ళమీద కోపాన్ని ప్రదర్శించడం మానేసాడు.. ఇక్కడ నాకు బాగుంది. మీరేం బాధపడకండి అని చెప్పి వాళ్ళని పంపేసాడు. అలాంటి వ్యక్తి సడెన్‌గా గుండెపోటు వచ్చి ఈ మధ్యనే పోయాడు. ఆ ముందురోజు పిల్లలందరితో చక్కగా పోజ్‌లు ఇస్తూ మంచి మంచి ఫోటోలు దిగాడు. అతని వ్యక్తిత్వం చాలా మంచిది శారదా! పాపం ఆయన పోయాడు.
ఆతను డైరీలో – ‘నా పిల్లలతో ఉంటే నేను ఇంకా ముందే చనిపోయేవాడిని, ‘వసంత లోగిలి’లో ఉండటం వల్ల నేను ఇంత హాయిగా ఆనందంగా ఉన్నాను. చనిపోయేవరకు సంతోషంగా ఉన్నాను. ‘వసంత లోగిలి’ నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. నా ఒంటరితనం పోగొట్టే ఈ ‘వసంత లోగిలి’లో నా చివరి మజిలీ సంతోషంగా గడిచింది’ అని రాసాడు.
చివరికి ఇక్కడే మట్టిలో కలిసిపోయాడు.. వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చే తండ్రి కర్మకాండలు జరిపించారు.. వెళ్తూ వెళ్తూ ‘మీరు మా నాన్న గారికి ఏంతో సహాయం చేసారు. ప్రతిఫలంగా ఈ చెక్’ అని ఇవ్వబోయారు.
సున్నితంగా తిరస్కరించి, “నిధులు అవసరమయినప్పుడు తప్పకుండా మీరు మాకు సహాయం చేయవచ్చు. ఈ ‘వసంత లోగిలి’ కి కాత్యాయని అమ్మవారి ఆశీస్సులతో నిండుగా ఒక గొప్ప నిధి ఉంది, కాబట్టి దీనికోసం మీరు ప్రస్తుతం ఇవ్వాల్సిన పని లేదు.. కాని నిరుపేద అమ్మాయిలు మా వద్ద ఉన్నారు వారిలో ఒకరి చదువుకి మీరు దీన్ని ఇవ్వవచ్చు.. ఆమె యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ఆమె చదువుకి మీరు సహకరించవచ్చు” అని చెప్పా అంది నిత్య.
“మరి వాళ్ళు ఏమన్నారు?” అని అడిగాను.
(సశేషం)
శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో జన్మించారు. బంటుపల్లి సన్యాసప్పలనాయుడు, రమణమ్మ గార్లు తల్లిదండ్రులు. పద్మావతి మహిళా యునివర్సిటీ ‘మాస్టర్స్ ఇన్ కమ్యునికేషన్ & జర్నలిజం’ చేశారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ నుంచి ‘డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా అండ్ పాలసీ’ చేశారు. ప్రస్తుతం విజయనగరం కన్యూమర్ కమిషన్‌లో సబ్ జడ్జ్‌గా (కన్స్యూమర్ కమిషన్ మెంబర్) వ్యవహరిస్తున్నారు. భర్త శ్రీ ఎస్.వి.సన్యాసి రావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
శ్రీదేవి గారు కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. పలు కథలకు వివిధ పత్రికలలో బహుమతులు పొందారు. లేత గులాబి అనే బాలల పుస్తకం వెలువరించారు. 60 రేడియో టాక్స్ చేశారు. చిన్ని ఆశ, పేపర్ బోట్ అనే డాక్యూమెంటరీలు తీశారు. మనోరంజని అవార్డ్ అందుకున్నారు. ‘వసంత లోగిలి’ వీరి తొలి నవల.