Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసంత లోగిలి-11

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[తాము కోటలోనే ఉండి తిలక్ బహుదూర్‌ని, నందినిని బుట్టలో వేసుకోవాలనీ, కోటలో ఉండే మనం ఏదైనా చెయ్యగలం, లేకుంటే చెయ్యలేమని తల్లి చెప్పడంతో కాస్త తగ్గుతాడు ధనుంజయ్. ఎలాగైనా ధనుంజయ్‍ని కోట లోంచి పంపేయాలని తిలక్ బహుదూర్ భావిస్తే, స్వప్నిక సుధీర్‍ల క్షేమం గురించి ఆలోచించిన, నందిని వారిస్తుంది. ఈ వివరాలన్నీ సంచిత రామశర్మ కొడుకు సుధీర్‍కి చెప్తాడు. ధనుంజయ్ చేసిన అకృత్యాలు, మార్తాండని హత్య చేయించిన వైనం, తిలక్ బహుదూర్‌ని, నందినిని గదిలో బంధించిన సంగతి చెప్తాడు. ఒకరోజు వాళ్ళిద్దరినీ చంపేశాడనీ, పైగా తానే చంపేశానని సైకో అరిచాడనీ, పోలీసులు వచ్చి అరెస్టు చేశారనీ చెప్తాడు. ఈలోపు పోలీసులు, మీడియా వాళ్ళు అక్కడికి సుమిత్రని మీరేనా  స్వప్నికా బహుదూర్? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? అంటూ ఏవేవే ప్రశ్నలు వేస్తుంటే, సుధీర్ వాళ్ళని పక్కకి పిలిచి, తనని తాను పరిచయం చేసుకుని వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్తాడు. సంచిత రామవర్మ మనవరాలు నిత్యని దగ్గర తీసుకుని – ఆమెకు దూరంగా బతకాల్సి వచ్చినందుకు బాధపడతాడు. అప్పటి దాకా, నాన్న సుధీర్ తనకి చెప్పిన విషయాలు శారదకి చెప్పింది నిత్య. తర్వాత తను స్వయంగా చూసిన సంఘటనలను చెప్పింది. కోటంతా తిరుగుతున్న నిత్యకు ఓ డైరీ దొరుకుతుంది. అందులో స్వప్నికని ఉద్దేశించి నందిని రాసిన విషయాలుంటాయి. దాన్ని తీసుకెళ్ళి అమ్మకిస్తుంది నిత్య. ఆ డైరీలో రాసిన ప్రకారం స్వప్నిక, సుధీర్, నిత్య, సంచిత రామవర్మలు కాత్యాయనీ అమ్మవారి గుడికి వెళ్తారు. పూజ చేసుకుంటారు. మనవరాలిని తన వద్ద ఉంచి వెళ్ళమని సంచిత రామశర్మ అడిగితే, మీరే మా దగ్గరకి వచ్చేయండి అంటుంది నిత్య. మనవరాలిని చూసి ముచ్చటపడతాడు రామశర్మ. ఇక చదవండి.]

“పూజానంతరం అమ్మవారి వెనుకకు వెళ్ళి నేను అమ్మ అక్కడున్న ఒక కవరు పట్టుకుని బయటకు వచ్చాం.

‘ఆ కవరులో ఏమి రాసి ఉందో తెరిచి చదువు నిత్యా’ అంది అమ్మ.

***

ప్రియమైన స్వప్నిక సుధీర్ లకు

ప్రేమతో రాయునది.

కాత్యాయనీ అమ్మవారి సేవలో తరించిన మాకు ‘స్వప్నిక’ను బహుమతిగా ఇచ్చి, తరతరాలుగా బహుదూర్ వంశంలో ఉన్న శాపానికి ఒక దారి చూపించింది ఆ అమ్మవారు. ఆ దారిలో నడుస్తున్న నాకు పౌర్ణమి రోజు రాత్రి కలలో కనిపించి ఇలా చెప్పింది.. కలలో చెప్పిన ప్రతి విషయాన్ని ఇందులో రాస్తున్నా.. ఓపికగా చదవండి..

ఇది కాత్యాయనీ దేవి నోట్లోనుంచి వచ్చిన బీజక్షరాలు.. ఈ బీజాక్షరాలే మిమ్మల్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి తప్పకుండా పాటిస్తారు కదూ!

బహుదూర్ వంశంలో మీ తాత ముత్తాతల తరాలలో అనగా మీ తాత ముత్తాతల పాలనలో జరిగిన ఘోర తప్పిదాలు మీ వంశాన్ని పట్టి పీడుస్తున్నాయి. వాటి ఫలితమే ‘మీ వంశంతో మూడు తరాలకి ఒకసారి పుట్టే ఆడబిడ్డ అకాల మరణం’.

రాజ్యంలో కరువు కాటకాలు వచ్చే సమయంలో పరిపాలనా దక్షత గల రాజు ఎంతో యుక్తిగా వ్యవహరించాలి, ప్రజల ఆలనా పాలన పట్ల ఎంతో శ్రద్ద వహించాలి. కొత్త కొత్త వనరులు సృష్టిస్తూ ప్రజలను రక్షించుకోవాలి. అలాంటి రాజు దక్షత మరచి బాధ్యతా రహితంగా వ్యవహరించాడు. యుద్దానికి యువకులు అవసరం ఎంతైనా ఉంది, దేశరక్షణకు ఉపయోగపడేది యువత మాత్రమే, వారిని సంరక్షించడమే ముఖ్యం. దేశానికి శ్రేయస్సు అంటూ వృద్ధులను, నిర్లక్ష్యం చేస్తూ, ఉన్న ఆహార నిల్వలను కేవలం యువకులకు, పిల్లలకు మాత్రమే అందించేవారు అప్పటి పాలనాధికారులు. సమాజంలో వృద్ధులు కూడా ఒక భాగమే అని, వారు కూడా రాజ్యం కోసం ఒకప్పుడు తమ కండలను కరిగించారని మరిచిపోయి వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించారు ఆనాటి పాలకులు. అంతే కాకుండా వృద్ధులకు పిల్లలకు మద్య అనుబంధాన్ని తెంచేసి వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి ప్రజానీకానికి, జన జీవన స్రవంతికి దూరంగా ఉంచేవారు. అంతే కాక వారి అవసరాలకు ఖర్చు చేసే మొత్తం యువతపై పెట్టుబడిగా పెడితే దేశాన్ని రక్షించడంలో వారు ఉపయోగపడతారని, వృద్ధులను సామూహిక దహనం చేసి వారి పీడ వదిలించుకున్నారు.

ఇలా రాజ్యంలో ఉన్న వృద్ధులు అందరూ దహన కాండకి బలికావలసి వచ్చేది. ఈ దురహంకారాన్ని ప్రశ్నించే వారికి కఠిన శిక్షలు కూడా పడేవి. దానితో వృద్ధాప్యం వచ్చిన ప్రతి మనిషి నైరాశ్యంతో వారికి వారే వృద్ధాశ్రమాలకి తరిలి వెళ్ళటం, ‘దహనం’ కావటం సర్వ సాధారణం అయిపొయింది.

వారి పాలనలో, ఆ తరాలలో పుట్టిన ఏ బిడ్డకి తాత, అమ్మమ్మ ఉండేవారు కాదు.. వృద్ధాప్య ఛాయలు కనపడి, నిస్సత్తువుగా పని చెయ్యని స్తితిలో ఉన్న ప్రతి వృద్ధుడిని ఆ వృద్ధాశ్రమాలకై తరలించడం, బలవంతంగా చంపేయడం.. ఇదే రాజనీతిగా రాజ్యమేలింది. రాజ్యంలో వయసుమీరిన వారిపై జరిగే ఈ దాడులను వ్యతిరేకించే పరిస్థితి లేకపోయేది. ఓ మనిషి తను చనిపోయేవరకు ‘జీవించే హక్కు’ లేకుండా, బలవంతంగా చంపేసే అమానుష పరిస్థితిపై నోరు మెదిపి మాట్లాడే పరిస్తితి లేకుండా పోయింది.

ఆ పాపమే శాపంగా మారి మీ వంశంలో ఆడబిడ్డలను అంతం చేసే దుస్థుతికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మీ తాత తండ్రుల ముత్తాతలకు కలలో కనిపించి చాలా సార్లు హెచ్చరించాను. బహుదూర్ వంశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు జాగ్రత్త పడమని పలుమార్లు చెప్పినా కాని పెడ చెవిని పెట్టారు. కర్మలను అనుభవించారు.

ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు ఎలాగూ రాజ్యాలు, రాజులు లేరు.. నిర్వీర్యమైపోతున్న బహుదూర్ వంశాన్ని సంరక్షించాలంటే, బహుదూర్ వంశం బతకాలి కదా! అలా బతకాలంటే, మీ వంశంలో పుట్టిన ఆడబిడ్డని మరో కులంతో సంక్రమణం చెయ్యాల్సి ఉంది. ఒక తరంలో పుట్టిన రాజకుమార్తెకి, బ్రాహ్మణ కుమారునికి పుట్టిన బిడ్డకి వివాహం జరిపించాలి. వారే ఈ బహుదూర్ వంశాన్ని నిలబెట్టాల్సి ఉంది. ‘బహుదూర్’ ఇంటి పేరుని స్వప్నిక-సుధీర్‌కి పుట్టిన ఆడబిడ్డకి ధారాదత్తం చెయ్యండి. మీ వంశంలో జరిగిన తప్పిదాలను, తాను తలపెట్టిన సత్కర్మలతో సమతుల్యం చెయ్యాల్సి ఉంది. తర తరాలుగా చేసిన తప్పులను చెరిపేసి, బహుదూర్ వంశ చరిత్రని సరికొత్తగా రాసే ఆయుధంగా, ఓ వారధిగా స్వప్నిక-సుధీర్‌ల బిడ్డ మారుతుంది అని కాత్యాయని అమ్మవారు చెప్పారు.

ఆ కాత్యాయని అమ్మవారు చెప్పిన విధం గానే మేము చేసాం.. అందుకే బ్రాహ్మణ కుమారుడైన సుధీర్ వర్మతో నీ వివాహం జరిపించాం. దీనివల్ల మన బహుదూర్ వంశంలో ఆడబిడ్డ అంటే నువ్వు ముందు రక్షించ బడతావు. మన వంశంలో పుట్టిన ఆడబిడ్డ 18 వత్సరంలో వివాహం జరిగిన ఏడాది చనిపోవడం శాపంగా మారింది. దాని నుంచి నువ్వు రక్షించబడతావు. నీ శాపవిమోచన జరిగిన తరువాత, మీకు పుట్టిన బిడ్డ బహుదూర్ వంశానికి, తన తరంలో వచ్చిన మార్పులకు మూల కారణంగా మారుతుంది. అంతే కాదు, తన ద్వారా ఆనాటి సమాజం సంస్కరించబడుతుంది. తాత తండ్రులు చేసిన తప్పిదాలను సరిచేస్తూ సమాజాన్ని ముందుకు నడిపించే దిశగా ప్రయాణం చేస్తుంది.

నీ బిడ్డ తరంలో ఉన్న పిల్లలను, వృద్ధులతో అనుసంధానం చేస్తూ.. పెద్దవాళ్ళ అనుభవాలను, వారి ఆలోచనలను ఆ నాటి సమాజానికి ఉపయోగపడే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంటుంది. ‘వృద్దాప్యం శాపం కాదు, జీవితంలో తప్పనిసరిగా వచ్చే ఒక మజిలీ’. అంతమాత్రం చేత వృద్ధులందరినీ ఊరవతల వృద్ధాశ్రామాలలో ఉంచమని కాదు, వాళ్ళు కూడా సమాజంలో భాగమే, వాళ్ళకీ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. అడవిలో బలమైన సింహం ఒక్కటే ఉండదు, అలా ఉంటే అది అడవే కాదు. సింహంతో పాటు అన్ని జంతువులకు బతికే హక్కు ఉంటుంది, బలమైన జంతువులు కొన్ని, బలహీనమైనవి కొన్ని ఉంటాయి. పైగా ఒక జీవి పై ఇంకో జీవి ఆధారపడి జీవిస్తుంది, అప్పుడే జీవ వైవిద్యం సాధ్యపడుతుంది. అన్ని జీవుల మద్య జీవ చక్రం ఎలా ఉంటుందో! మనుషుల మధ్య కూడా ఒక జీవ చక్రం ఉంటుంది. అప్పుడే వైవిధ్యమైన సమాజం ఏర్పడుతుంది.

సమాజంలో పిల్లలు, యువకులు, మహిళలు, పెద్దలు, వృద్ధులు, ఒకరి పై ఒకరు ఆధారపడి బతుకుతూ ఉంటారు. వీరి మద్య కూడా ఒక జీవన చక్రం ఉండే తీరాలి. అన్ని తరగతుల వారు ఉండే ప్రపంచాన్ని మాత్రమే ‘సమాజం’ అంటారు. వృద్ధాప్యంలో వాళ్ళు పని చెయ్యలేరని, వాళ్ళు ఎందుకు పనికి రారని, వాళ్ళ అవసరం ఇక లేదని చంపేస్తే, కొత్త తరం ఎక్కడ నుంచి అనుభవ పాఠాలను నేర్చుకుంటుంది. గత జ్ఞాపకాలు, గతం గుర్తులు లేకుండా నేటి సమాజాన్ని ఎలా నిర్మించగలవు? గతంలోనుంచి నీ భవిష్యత్తుని ఎలా చూడగలవు? నేటి వృద్ధులు ఒకప్పటి సమాజ నిర్మాతలు. నేటి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మన తాత తండ్రుల అనుభవాలు, జ్ఞాపకాలు, జ్ఞానం ఎంతో ఉపయోగపడతాయి, వారి జీవన విధానమే నేటి సమాజాన్ని తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చే వనరు. అటువంటి ముఖ్యమైన వనరు ప్రతి తరం లోనూ వృద్ధులు మనకు అందించి గతిస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి వేసిన బాటలోనే మనం నడుస్తూ ఉంటాం. ఆ వృద్ధుల దగ్గర దొరికే జ్ఞానాన్ని మనం పొందాలంటే, మన నుంచి వాళ్ళు దూరం కాకూడదు. మనతో పాటు వాళ్ళనీ బతకనివ్వాలి, మనతో కలిసి బతికేలా చూసుకోవాలి. వృద్దాప్యం ఓ శాపం లా వృద్దాప్య౦ రాగానే, అదేదో వింత జబ్బు, వారికి మాత్రమే వచ్చింది, అది మనకు రాదు అన్నట్టు అంటరానివారిలా దూరంగా ఉంచడం వల్ల నేటి తరం కోల్పోయింది ఎక్కువే అని చెప్పాలి. మనతో పాటు బతుకుతున్న వృద్ధులకు, వాళ్ళ అనుభవాలకి ఒక విలువ, గౌరవం ఇవ్వాలి. వృద్ధులను కూడా సమాజం కలుపుకుంటూ పోవాలి. వాళ్ళతో మనం కలిసి ఉన్నప్పుడే సామాజిక సమతుల్యత సాధ్యమవుతుంది. వాళ్ళ అనుభవాలు మనల్ని తీర్చిదిద్దుతాయి.

అంటరానివాళ్ళలా, పనికిరానివాళ్ళలా వృద్ధులందరినీ కలిపి ఊరవతల ఒక ఆశ్రమం లోకి పంపి జీవనచిత్రాన్ని చిద్రం చేస్తూ తరానికి తరానికి మద్య ఉన్న జీవన గొలుసు తెంపివేసి పిల్లలకు పెద్దలకు మధ్య సంబంధం లేకుండా చెయ్యటం వల్ల సమాజానికి జరిగే కీడే ఎక్కువుగా ఉంటుందని, అది సమాజానికి మంచిది కాదని కాత్యాయని అమ్మవారు కలలో విపులీకరించారు. ఆమె సుదీర్ఘ ఆలోచనలకి, దూరాలోచనలకి మన నేటి తరం ప్రణమిల్లాల్సిందే సుమా! వృద్ధులకు పిల్లలకు మద్య వారధి కావాలి నీ మనవరాలు అని ఆ జగన్మాత కాత్యాయనీ దేవి నొక్కి వక్కానించింది.

పిల్లల తరాన్ని, పెద్దల తరానికి అనుసంధానం చేసే ఒక నవ సమాజం ఏర్పరిచే దిశగా నీ బిడ్డకు పుట్టిన బిడ్డ ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది, సమకాలీన సమాజానికి ఈ అవసరం ఎంతో ఉంది. వృద్ధులు చనిపోయే వరకు ఆనందంగా బతికే హక్కు ఉండాలి, అలాగే పిల్లలు తమ తాత ముత్తాతల వద్ద గారాలు పోతూ వారి దగ్గర ఈ బిడ్డలు తమ భవిష్యత్తుకి కావలసిన జ్ఞానబీజాలను నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం నడిపించే రథ సారథి నీ బిడ్డకి పుట్టిన బిడ్డే. దానికి కావలసిన నిధులు కూడా సమకూర్చి ఉన్నాయి.. నా వెనుక ద్వారం గుండా మీరు ప్రయాణం చేసి ఆ నిధిని సొంతం చేసుకుని, నేను చెప్పే ఈ బృహత్ ప్రణాళిక అమలు చెయ్యాల్సి ఉంటుంది.. ఈ ప్రయాణంలో ఎదురైనా ఏ సమస్య అయినా ఎదుర్కుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మీ బిడ్డకు పుట్టిన బిడ్డకి కాత్యాయని దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి – అని రాసి ఉంది.

***

ఆ ఉత్తరం చదివిన నాకు, అమ్మా నాన్నలకు చెమటలు పట్టాయి. ‘కాత్యాయనీ అమ్మవారు ఎటువంటి తీర్పు ఇచ్చారు. రాజవంశంలో జరిగిన ఘోరమైన, హేయమైన తప్పిదాన్ని సవరించడానికి ఎంత పెద్ద ప్రణాళిక రచించారు’ అని మేమంతా ఆశ్చర్యపోయాం.

‘మన బిడ్డకి ఇంత పెద్ద ఆశయాన్ని అమలుపరచమని అడిగింది. ఇది సాధ్యమేనా సుధీర్!’ అంది అమ్మ.

‘ఎన్నో తరాలుగా ఉన్న బహుదూర్ వంశపు శాపాన్ని తప్పించింది. అంటే నీ చావుని తప్పించింది. దానికి బదులుగా సమాజ హితాన్ని అడిగింది. అది గొప్ప అదృష్టంగా మనం భావించాలి స్వప్నికా’ అన్నాడు నాన్న.

‘మన బిడ్డ కారణ జన్మురాలు.. గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప ఆశయాల కోసమే పుడతారు. ఈ ఆశయాన్ని సాధించడానికే పుట్టింది.. తప్పకుండా ఆ అమ్మవారు మన బిడ్డ చేత ఈ బృహత్ కార్యక్రమం చేయించుకుంటుంది. .అందులో సందేహమే లేదు. మనం భయపడాల్సిన అవసరమే లేదు స్వప్నికా’ అన్నాడు నాన్న.

నాన్నా.. ఇదిగో ఈ మూల ఇక్కడ నుంచి వెళ్తే ‘నిధి’కి చేరుకోవచ్చు, పదండి అన్నాను. ఉత్సాహంగా ఆ ద్వారం గుండా వెళ్ళిన మాకు ఒక గది ఎదురొచ్చింది.. అలా ముందుకు వెళ్ళాక ఒక పెద్ద కుండ ఎదురుపడింది. అందులో ఏముంది అంటూ చెయ్యి లోపలి పెట్టిన నా చేతికి కొన్ని కాగితాలు తగిలాయి. బయటకు తీసి చూస్తే, అవి విలువైన డాక్యుమెంట్స్. ‘బహుదూర్’ పేరుని దారాదత్తం చేస్తూ ఒక డాక్యుమెంట్, కోటని స్వప్నిక కూతురుకి అప్పగిస్తూ ‘వసంత లోగిలి’ పేరుతో ఒక డాక్యుమెంట్‍తో పాటు బ్యాంక్ పాస్ బుక్ ఉంది. అందులో కోట్ల రూపాయలు జమచేసి ఉన్నాయి. అరటిపండు ఒలిచి పెట్టినట్టు అలా కాత్యాయని అమ్మవారు అద్భుతంగా ప్రణాళిక రచించి ఉంచారు శారదా! అది చూసి నేను, నాన్న, అమ్మ, తాతయ్య అందరం ఆశ్చర్యపోయాం. తాతయ్య నన్ను పట్టుకుని ‘నీ మీద ఎందుకంత నమ్మకం ఆ దేవికి, ఆమె కృపా కటాక్షాలు దండిగా నీపై ఉన్నాయి తల్లీ’ అని ఏడ్చేసారు తెలుసా శారదా!

‘నిత్యా ఈ బృహత్ కార్యానికి అమ్మవారు నిన్నే ఎంపిక చేసుకుంది.. నిత్య బహుదూర్గా మీ తాతగారి వంశాన్ని నువ్వే నిలబెట్టు.. నీ వెనుక ఎప్పుడు మేముంటాం’ అన్నారు నాన్న, అమ్మ.

బహుదూర్ కోటలో అలా రెండు నెలలు గడిపాం..

‘నిత్య అనుకున్న చదువు పూర్తైన తరువాత, ఈ కోటలోనే కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం’ ఆ౦ది అమ్మ.

‘కొన్నాళ్ళ పాటు ఈ పరిసరాలకు దూరంగా ఉండండి..’ అంటూ సలహా ఇచ్చారు మా తాతగారు. ‘కోటకు తాళం వేసి విశాఖపట్నం ప్రయాణం అవ్వండి..’ అని చెప్పారు.

ఎందుకు తాతగారూ అని అడిగాను.

‘అదే మంచిది తల్లీ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు.. కొన్నాళ్లపాటు మీరు ఈ కోటకి దూరంగా ఉండండి.. ఈ లోగా మనం చెయ్యాల్సిన కార్యక్రమాలకు ఒక ప్రణాళిక వేసుకుందాం’ అన్నారు తాతగారు.

‘మీరు మాతో వస్తున్నారు కదా!’ అంటూ తాత చెంకలో చెయ్యి పెట్టి లాగుతూ బయలుదేరదీసాను.

‘జీ హుజూర్ నిత్యా బహుదూర్.. మీరెక్కడ ఉన్నారో తెలిసింది కదా! ఇక వస్తాలే’ అంటూ మమ్మల్ని తనివి తీరా చూసుకుని వెళ్ళిపోయారు తాతయ్య. మా కారు స్టార్ట్ అయింది.

కాని మనమొకటి తలిస్తే, దైవం ఒకటి తలుస్తుందనిఅంటారు కదా!

మేము ముగ్గురం బయలుదేరే కారు మార్గ మధ్యంలో ఏక్సిడెంట్‌కి గురయ్యింది.

కారు నుజ్జు నుజ్జు అయింది. కాకపోతే ముగ్గురం ప్రాణాలతో బయటపపడ్డాం.. మా సేఫ్టీలో భాగంగా మేము చనిపోయినట్టు మీడియాలో వార్త వచ్చింది.. ఎందుకంటే ధనుంజయ్‌ని అరెస్ట్ చేసిన తరువాత జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిసింది. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గానికి ఒక సమాచారం వచ్చింది. అందువల్ల మేము చనిపోయినట్టు చెప్పి రహస్యంగా ఉండాల్సి వచ్చింది.

ఈ విషయంలో మా తాతగారు తిలక్ బహుదూర్ చదివించిన ఒక పోలీస్ అధికారి మాకు చాలా సహాయం చేసారు. దగ్గర ఉన్న హాస్పిటల్‌లో రహస్యంగా రెండు నెలల పాటు ఉండిపోయాం. ఎందుకంటే అమ్మ నాన్నలకు బాగా దెబ్బలు తగిలాయి.. నాకు మోచేయి, కాలికి దెబ్బలు తగిలాయి. కొంచెం కోలుకున్నాక మద్రాస్ మకాం మార్చాం.. ఎందుకంటే, వైజాగ్ వస్తే కాస్త రిస్క్ ఉంది అని చెప్పడంతో మద్రాస్ వెళ్ళిపోయాం. అక్కడే నేను కాలేజ్‌లో చేరి ఎంబిఎ చేసా..” అంటూ ఆపింది నిత్య.

(సశేషం)

Exit mobile version