Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసంత లోగిలి-10

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[మార్తాండ గారు చెప్పినట్టుగా స్వప్నిక, సుధీర్‍లు నైమిశారణ్యం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడుపుతారు. నైమిశారణ్యం చరిత్రను భార్యకు వివరిస్తాడు సుధీర్. మాటల మధ్యలో తాను ఒక విషయం అడగాలనుకుంటున్నానని చెబుతుంది స్వప్నిక. అడగమంటాడు సుధీర్. తాను సుధీర్‍కి నచ్చానా, లేక ఆమె నాన్నగారు కోరారని, సుధీర్ నాన్నగారు అడిగారని తనని వివాహం చేసుకోవాల్సి వచ్చిందా – అని అడుగుతుంది. తాను స్వప్నికని ఇష్టపడ్డాననీ, దైవమే తమని జత కలిపాడనీ జవాబిస్తాడు సుధీర్. మళ్ళీ ఎప్పటికైన అమ్మానాన్నలను చూస్తామా అని స్వప్నిక బెంగపడితే, చూస్తామని, తమ బిడ్డ ద్వారా తామంతా కలుస్తామనీ అంటాడు సుధీర్. అక్కడ్నించి వేలూర్ వచ్చి రామకృష్ణమఠంలో కొన్నాళ్ళుంటారు. ఆ తర్వాత దేశమంతా తిరుగుతారు. చివరికి నిత్య పుట్టాకా, విశాఖపట్టణంలో స్థిరపడతారు స్వప్నిక, సుధీర్. నిత్యని ఓ మామూలు హైస్కూల్‍లో చేర్చి చదివించామని, తన చదువు పూర్తయ్యాకా, అంటే 18 ఏళ్ళు నిండాకా, నిత్యని తాతయ్య అమ్మమ్మల దగ్గరకి తీసుకువెళ్ళాలని అనుకున్నామని సుధీర్ నిత్యకి చెప్తాడు. ఇంతలో టీవీలో వార్తల్లో – తిలక్ బహుదూర్, నందిని బహుదూర్‌లు హత్య గావించబడ్డారని, వారి కుమార్తె స్వప్నిక బహుదూర్ బతికి ఉందో లేదో అని చెప్తారు. దాంతో స్వప్నిక బ్రతికే ఉందనీ, వెంటనే బయల్దేరి మద్రాస్ వస్తున్నామని, ఓ స్నేహితుడి ద్వారా సమాచారం అందిస్తాడు సుధీర్. ఇలా తండ్రి తనకి చెప్పిన విషయాలను శారదకు చెప్తుంది నిత్య. మద్రాస్ చేరాకా, సుధీర్ తండ్రి సంచిత రామవర్మ వచ్చి కొడుకుని, కోడలిని పలకరిస్తారు. అక్కడున్న పోలీస్ అధికారులకి స్వప్నికని పరిచయం చేస్తారు. వాళ్ళు విచారణ కోసం, సమాచారం కోసం స్వప్నికను వేరే గదిలోకి తీసుకువెళ్తారు. ఈలోపు అసలేం జరిగిందో కొడుకుకి వివరిస్తారు సంచిత రామవర్మ. ఇక చదవండి.]

సంచిత రామవర్మ మళ్ళీ కొనసాగించారు:

“కథ షరా మామూలే..

“మనం ఇక్కడే ఉండి మెల్లిగా తిలక్ బహుదూర్‌ని, నందిని ని బుట్టలో వేసుకోవాలి. ఈ కోటలో ఉండే మనం ఏదైనా చెయ్యగలం, లేకుంటే చెయ్యడం కష్టం” అని కొడుకుతో తల్లి చెప్పడంతో ధనుంజయ్ కాస్తా తగ్గుతాడు కాని, ధను౦జయ్ తల పొగరు గానే వ్యవహరిస్తూ తిలక్ బహుదూర్‌కి తలనొప్పిగా తయారయ్యాడు.

“మనం ఏదో ఒకటి చేసి ధనుంజయ్‌ని కోట నుంచి పంపేయాలి నందినీ” అన్నారు తిలక్ బహుదూర్.

“ధనుంజయ్ మన కోటలోనే ఉంటే, బయట ఉన్న స్వప్నిక – సుధీర్‌లు క్షేమంగా ఉంటారు, ధను౦జయ్ బయటకి వెళ్తే వాళ్లకి ప్రమాదం ఉంది” అని తిలక్ బహుదూర్‌తో నందిని అనడంతో తప్పనిసరి పరిస్థితులలో ధనుంజయ్‍ని భరించడానికి బహుదూర్‌కి ఒప్పుకోక తప్పలేదు రా సుధీర్” అంటూ కోటలో జరిగిన విషయాలు కొడుక్కి చెప్పాడు సుధీర్ తండ్రి సంచిత రామవర్మ.

“అయ్యో అంత పని జరిగిందా నాన్నా.. మార్తాండ చాలా మంచి వ్యక్తి.. తనని చంపాలని ఎలా అనిపించింది నాన్నా ఈ ధనుంజయ్‍కి” అన్నాడు సుధీర్.

“ఆ ధనుంజయ్ మేక వన్నె పులి, ‘స్వప్నిక ఎక్కడ ఉందో మీకే తెలుసు.. నాకు చెప్తారా! లేదా!’ అని అడిగి హింసించాడు. తిలక్ బహుదూర్ మీద ఆదిపత్యం చెయ్యాలంటే, రాజ మార్తాండని చంపేయ్యాలి అనుకున్నాడు,  చంపేసాడు.. కాని ధనుంజయ్, అంజనమ్మలు పట్టుబడలేదు.. సాక్ష్యాలు కూడా లేకుండా చంపేసారు. స్వప్నిక దూరం కావడంతో సగం చచ్చిపోయి బతుకుతున్నారు వాళ్ళు. ఇంతలో మార్తాండ మరణం తెలిసి తిలక్ బహుదూర్ కుమిలిపోయారు. ఇంట్లో నుంచి తరిమేద్దాం, అంటే ధనుంజయ్ వల్ల మీకు ముప్పు వస్తుందేమో అనే భయం, వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయలేదు. పోనీ రాజ మార్తాండని చంపిన నేరం కింద జైల్లో వేద్దామంటే, రాజ మార్తాండ ట్రైన్ ఏక్సిడెంట్‌లో చనిపోయినట్టు సృష్టించాడు.. తగినన్ని ఆధారాలు లేకపోయే.. నువ్వు, స్వప్నిక వెళ్ళాక కోటలో ఇన్ని విషయాలు జరిగాయి సుధీర్” అని కొడుక్కి చెప్పారు సంచిత రామవర్మ.

“గత కొంతకాలంగా తిలక్ బహుదూర్, నందినమ్మలను మేము ఎవరం చూడడానికి కూడా లేకుండా ఒక రూమ్‍లో బంధించాడు.. ఇప్పుడు ఏకంగా చంపేసాడు ఆ మూర్ఖుడు. పైగా విజయం సాధించిన వాడిలా, పిచ్చివాడిలా బయటకు వచ్చి గెంతుతూ.. ‘నేనే చంపేసా! నేనే చంపేసా!’ అంటూ సైకోలా అరిచాడు.

వాడి కేకలు విన్న మేము లోపలికి వెళ్లేసరికి తిలక్, నందిని బహుదూర్‌లు చనిపోయి ఉన్నారు.. ఆ పక్కనే మతి పోయిన దానిలా అంజనమ్మ కూర్చుని ఉన్నారు.. ఆవిడ ఉలుకు, పలుకు లేకుండా ఉన్నారు.. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికక్కడే ధనుంజయ్‌ని అరెస్ట్ చేసారు. స్వప్నిక బహుదూర్ ఎక్కడ ఉంటారు అని అడిగిన పోలీసులకు సమాధానం చెప్పలేకపోయాను. మీరు ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఈలోగా మీడియాకి సమాచారం ఇచ్చారు. కాని అది మీరు చూస్తారో, లేదో అదో సంశయం. కాని మీరు వస్తున్నట్టు సమాచారం అందిన తరువాత కాస్త స్థిమితపడ్డాను” అని సంచిత రామవర్మ కొడుకు సుధీర్ వర్మకి చెప్పుకుంటూ తిలక్ బహుదూర్ వంశంతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

ఇంతలో పోలీసులు, మీడియా వాళ్ళు గుమిగూడారు.

“తిలక్ బహుదూర్ కూతురైన స్వప్నిక మీరేనా? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ తల్లి తండ్రులను హత్య చేసింది మీ బావ ధనుంజయ్ అని సాక్ష్యాలు ఉన్నాయి, అరెస్ట్ చేసాం.. చనిపోయే ముందు వాళ్ళు ఏమైనా మాట్లాడారా? మీరు వాళ్లకి ఎలా దూరమయ్యారు? అసలు వీరు చనిపోయిన విషయం మీకు ఎలా తెలిసింది? ఇరవై సంవత్సరాలు తల్లి తండ్రులకు దూరంగా ఉన్నారంట నిజమేనా?” అని ప్రశ్నిస్తున్న మీడియాకి   సమాధానంగా..

“అవును, ప్రేమించిన వాడితో వెళ్ళిపోయాను.. వారిని ఇదే చూడటం” అంటూ ఏడుస్తున్న స్వప్నికని ఓదారుస్తూ, “సర్ నేను ఆమె భర్తని, నేను చెబుతాను” అంటూ ముందుకు వచ్చాడు సుధీర్.

రాజవంశం రహస్యం బహిరంగంగా  చెప్పడం ఇష్టం లేని సుధీర్, “నా పేరు సుధీర్, మేము విశాఖపట్నంలో ఉంటున్నాం. నేను  స్వప్నిక ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. అది నచ్చని తిలక్ బహుదూర్, నందినిలు మమ్మల్ని కోపంతో బయటకి పంపేసారు.. దానితో మేము వెనుకకి రాలేకపోయాం” అని చెప్పాడు.

“సుధీర్ తదుపరి కార్యక్రమాలు చూడు.. రాచరికపు హోదాకి తగ్గట్టు అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి జరిపించు” అన్నాడు తండ్రి సంచిత రామవర్మ.

“అలాగే నాన్నా.. ఆ పనులలోనే ఉన్నాను” అన్నాడు సుధీర్.

అనుకున్నట్టే  అత్తామామల కార్యక్రమాలన్నీ దగ్గర ఉండి చేయించాడు సుధీర్.

***

“స్వప్నికమ్మకి.. అమ్మ నాన్న ఉండి కూడా దూరంగా బతకాల్సి వచ్చింది.. తిరిగి కలుసుకున్న క్షణంలో ఈ లోకం నుంచే వెళ్ళిపోయారు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సంచిత రామవర్మ.

నిత్య ఒడిలో తలవాల్చుకుని శూన్యంలోకి చూస్తోంది స్వప్నిక.

అందంగా పొడుగ్గా.. బొంగరం లాంటి కళ్ళతో తల్లి తలపై చేత్తో తల్లిని నిమురుతున్న నిత్యని చూసి..

“సుధీర్ ఆ.. ఆ.. అమ్మాయి..” అన్నాడు అర్ధోక్తిగా సంచిత రామవర్మ

“తను నీ మనవరాలు నిత్య నాన్నా!”  అని చెప్పగానే, విప్పారిన కళ్ళతో సంబరంగా చూసి… “నిజమా! సుధీర్”.. అంటూ దగ్గరగా వెళ్లి తన తల మీద చెయ్యి ఆనించి “తల్లీ” అని పిలిచాడు సంచిత రామవర్మ.

వెనక్కి తిరిగి చూసిన నిత్యని ఉద్దేశిస్తూ… “నిత్యా, ఆయన మీ తాతయ్య” అన్నాడు సుధీర్.

“అవునా నాన్నా, నాకు చెప్పనే లేదు  ఇంతవరకు” అంటూ, “తాతయ్యా!” అంటూ ఒడిలో ఉన్న అమ్మ తలని పక్కకి పెట్టి నిలబడబోతే.. “వద్దమ్మా అమ్మని నిద్రపోనీ తల్లీ నీ ఒడిలో. నీ పక్కన నేను కూర్చుంటాను లే తల్లీ” అంటూ సముదాయించడంతో అలాగే కూర్చుంది నిత్య.

నిత్య పక్కనే కూర్చున్న సంచిత రామవర్మ, ‘తిలక్ బహుదూర్, నందినిలు చూసి ఎంత మురిసిపోయేవారో! నిన్ను ఇలా చూసి’ అని నిత్య తలమీద నిమురుతూ అనుకున్నాడు మనసులో…

సన్నని పెదవులు, కలువల్లాంటి కళ్ళు, అచ్చం తాతగారు తిలక్ బహుదూర్ గారి విశాలమైన నుదురు, కొంటె కోణంగి లాంటి ముక్కు, రాజసం ఉట్టిపడే ఆ మనవరాలి మోము చూస్తూ ఉండిపోయాడు తాత సంచిత రామవర్మ.

***

ఇప్పటి దాకా, నాన్న సుధీర్ తనకి చెప్పిన విషయాలు తన నేస్తానికి చెప్పింది నిత్య. ఇప్పుడు తను స్వయంగా చూసిన సంఘటనలను వివరిస్తోంది.

***

పెద్ద కోట బురుజులు, విశాలమైన గదులు, పెద్ద పెద్ద నవ్వారు మంచాలు.. రాజసం, దర్పం మూర్తీభవించిన ఆ ఇంద్రభవనం లాంటి కోట కల తప్పినట్టు, కళావిహీనంగా, జీవం కోల్పోయినట్టుగా ఉంది.. ఒక్కొక్క గదిని పరికించి  చూస్తున్నాను. ఎక్కడ చూసిన స్వప్నికా బహుదూర్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ‘కూతురు గుర్తులతో బతికిన తాత అమ్మమ్మలని బతికి ఉండగా చూడలేకపోయిన దురదృష్ఠవంతురాలిని నేను’ అని మనసులో చాలా బాధ పడ్డాను.

అమ్మమ్మ తాతయ్య రూమ్.. విశాలమైన ఆ గది రాజరికం ఉట్టి పడేలా ఉంది.. ఎత్తైన పెద్ద పందిరి మంచం, దాని మీద నించి పలుచని దోమతెర వేళ్ళాడుతోంది. వెనుకగా అందమైన చెక్క పెట్టె.. ఆ పెట్టికి ఇరువైపులా రెండు అందమైన ఏనుగులు.. ‘ఈ పెట్టెలో ఏముండి ఉంటాయి’ అని తెరిచి చూసాను.

అందులో అరలు అరలు..

కొన్నివెండి గిన్నెలు చిన్నది, దానికంటే పెద్దది, దానికంటే పెద్దది ఇలా.. ఓ ఇరవై పైగా గిన్నెలు, కంచాలు ఒక వైపు, మరో వైపు చిన్న పిల్లలను ఆడించే బొమ్మలు.. ‘ఓహ్ ఇవి అమ్మ తిన్న వెండి కంచాలు అయి ఉంటాయి, ఈ బొమ్మలు చిన్నప్పటి బొమ్మలై ఉంటాయి.. ఇంకో వైపు చిన్న చిన్న గౌనులు.. బహుశా ఇవి కూడా అమ్మవే అయి ఉంటాయి.. చెక్కు చెదరకుండా అమ్మ జ్ఞాపకాలు దాచి ఉంచుకున్నారు’ అనుకున్నాను మనసులో. ‘అమ్మ ఎంత వైభవం గా పెరిగింది కదా!’ అనుకుంటూ ఆ పెట్టెలో ఇంకో అర తెరిచి చూశాను. అందులో ఉన్న డైరీ బయటకు తీసి తెరిచాను.

అందులో ప్రతి పేజిలో అమ్మే.. మా అమ్మే.. అలా.. అలా.. అలా.. చదువుతూనే ఉన్నాను. ‘ఇదేంటి నా చేతి రాతే.. ముత్యాల లాంటి చేతి రాత.. బహుశా ఈ రాతే నాకు వచ్చినట్టుగా ఉంది. అచ్చం నేను ఇలానే రాస్తా’ అనుకున్నా.

ఆ పేజీల వెంట నా కళ్ళు పరిగెడుతున్నాయి.. నాన్న చెప్పినట్టే.. అమ్మకున్న శాపం.. మూడో తరంలో పుట్టిన అమ్మాయి.. 18 సంవత్సరాల తరువాత చనిపోవడం.. ఇలా.. అన్నీ పూసగుచ్చినట్టు ఉన్నాయి.. ఇక డైరీ మూసేస్తున్న సమయంలో చివరి రెండు పేజీలలో నా చూపు ఆగిపోయింది.

తేదీ.. చనిపోడానికి నాలుగు రోజుల ముందు రాసినది.

స్వప్ని తల్లీ..

ఈ కోట నుంచి బయటకి పంపినందుకు మా మీద నీకు చాలా కోపం వచ్చి ఉంటుంది. కాని నిన్ను మేము రక్షించుకోవడానికి, వంశాన్ని ఉద్దరించడానికి ఇంతకంటే మాకు మరో దారి దొరకలేదు తల్లీ. నువ్వు వస్తావో రావో!.. నిన్ను చూడగలమో! లేదో.. నువ్వు సుధీర్ వర్మ సంతోషంగా ఉండే ఉంటారు.. పిల్లో- పాపో కలిగే ఉంటారు కదా! నిన్ను, నీ బిడ్డని చూసుకునే అదృష్టం మాకు ఉందో లేదో. తల్లీ..18 సంవత్సరాలు దాటిన వెంటనే నీ బిడ్డని కాత్యాయనీ అమ్మ వారి ఆశీస్సుల కోసం తీసుకుని వెళ్ళు .. అక్కడ అమ్మవారి వెనుక జాగ్రత్తగా వెతికి చూడు.. నా స్వదస్తూరితో రాసిన ఉత్తరం ఉంటుంది. దాని ప్రకారం నడుచుకో. బిడ్డ జాగ్రత్త, బహుదూర్ వంశం జాగ్రత్త.

ఇట్లు ప్రేమతో, అమ్మ

నందిని బహుదూర్

అది చదివిన వెంటనే.. “అమ్మా! అమ్మా! ఎక్కడున్నావ్?” అంటూ అమ్మని వెతుక్కుంటూ వెళ్ళాను.

కోటలో ప్రతి మూల తల్లిదండ్రులతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటోంది అమ్మ స్వప్నిక. ఎన్ని జ్ఞాపకాలు.. ‘నాన్న, నేను, అమ్మ వీరే నా ప్రపంచం..నా ప్రపంచంలో వేరే ఎవ్వరూ లేరు ఒకప్పుడు. అప్పుడప్పుడు వచ్చే నాన్న మిత్రులు మార్తాండ, సంచిత రామవర్మ.. ఇదే నా ప్రపంచం.. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ, అల్లరి చేస్తూ.. ఈ రాచరికపు ఛాయల నుంచి నన్ను బయట పడేయండి అంటూ అలిగి మారాం చేసి ఓ మూల దాగున్న నన్ను వెతుక్కుంటూ వచ్చిన నాన్న.. ఇలా ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఈ కోటలో ప్రతి గదిలో ఉన్నాయి. యువరాణి దుస్తులు వేసి అలరించాలని అమ్మ పట్టుబడితే, ఈ మోడరన్ డ్రస్స్ వేసి చూడ౦డి అంటూ నాన్న వెంబడిస్తుంటే.. నాకివ్వేవి వద్దు అంటూ కుర్తా పైజామా వేసుకు వచ్చిన నన్ను చూసి అమ్మ నాన్న ఎంత అవాక్కయ్యారు ఆ రోజు?’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నఅమ్మని చూసి “అమ్మా! నువ్వు ఇక్కడున్నావా!.. ఇది చూడు.. ఈ డైరీలో..” అంటూ అమ్మకు చూపించాను.

నా  చేతిలో ఉన్న డైరీని ఆత్రుతగా చేతిలోకి తీసుకుంది అమ్మ.

“ఇది మా అమ్మ రాసిన డైరీ..” అంటూ నా చేతిలో నుంచి డైరీ తీసుకుంది. చివరి పేజీలను ఆత్రుతగా తన కుడి చేత్తో తడుముతూ.. ఒక్కొక్కటిగా చదువుతూ..

“అవును.. అవును నిత్యా మనం.. మనం కాత్యాయనీ అమ్మవారి గుడికి వెళ్ళాలి” అంది అమ్మ ఉన్నట్టుండి.

“తప్పకుండా వెళ్దాం.. మీ అమ్మా నాన్న కర్మకాండలు పూర్తైన తరువాత వెళ్దాం. మన నిత్య చేత ఏదో పని చేయించుకుంటాను అని కాత్యాయనీ అమ్మవారు చెప్పారు కదా! ఆమె మనల్ని ఎలా నడిపిస్తుందో మరి.. వెళ్దాం” అన్నారు నాన్న సుధీర్.

అన్నదే తడవుగా కాత్యాయని అమ్మవారి దేవాలయానికి అందరం బయలుదేరాం.

***

దేవాలయం తాళం తీసి లోపలకు వెళ్ళాం. గత కొన్ని రోజులుగా గుడి పరిసరాలు శుభ్రం చేసినట్టు లేదు. ఆ దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి పూజకి కావలసిన వస్తువులు తెప్పింఛి తన కొడుకు కోడలు మనవరాలితో పూజ చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తాతయ్య సంచిత రామవర్మ.

కాత్యాయనీ అమ్మవారి విగ్రహాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయాను.

ఆమె రూపాన్ని చూస్తున్న నా వెన్నులో ఒక్కసారి జలదరింపు. పెదవులపై సన్నని చిరునగవు మధ్య ‘నిత్యా వచ్చావా’ అన్నట్టుగా వినిపించే ఓ పలకరింపు వినపడి అటు ఇటు చూశాను. ఎవ్వరూ కనిపించలేదు, నా భ్రమ కావచ్చు అనుకుని అమ్మవారి కళ్ళల్లోకి చూస్తున్న నాలో ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అంతలోనే రా రమ్మని చారడేసి కళ్ళతో తీక్షణంగా చూస్తూ ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్న అమ్మవారి చూపులు,  విశాలమైన ఆమె నుదట తీర్చిదిద్దిన కుంకుమ బొట్టు, ఆమె మెడలో మాసిన పూలదండ! బహుశా అమ్మమ్మ వేసిన చివరి దండ ఇదే అయి ఉంటుంది. కాత్యాయనీ మాత నాలుగు భుజాలతో విరాజిల్లుతూంది, ఆమె ముఖ వర్చస్సు నుండి కాంతులీనే వెలుగు రేకలు బంగారు వర్ణం రంగులో నలుదిశలా విస్తరించి దేదీప్యమానమై వికసిస్తున్నాయి. ఆమె కుడిచేతిలో అభయ ముద్ర, వరముద్ర. ఎడమచేతిలో ఖడ్గం, పద్మం పట్టుకుని  సింహవాహనంపై కొలువై ఠీవిగా కూర్చున్న అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు.

“నిత్యా.. రా.. పూజలో కూర్చో” అని తాతగారు పిలిచేంత వరకు కాత్యాయని మాతను తన్మయంతో చూస్తూ ఉండిపోయాను.

అమ్మా, నాన్నల మద్య ఇమిడిగ్గా కూర్చుని, ఏదో యజ్ఞం చేస్తున్నట్టుగా పూజలో నిమగ్నమయ్యాను.

పూజ పూర్తైన తరువాత అక్కడే సేద దీరుతూ, కాత్యాయనీ మాత సన్నిదిలో గడిపిన క్షణాలను నాన్న సుధీర్ వర్మకి, నాతో పాటు, మామగారైన సంచిత రామవర్మకి వివరిస్తూ, తన బాల్యాన్ని, తన తండ్రి, తల్లితో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ బాధపడింది అమ్మ.

కాసేపు పోయాక, గుడి పరిసరాలను పరికిస్తూ, తాతగారితో సంభాషిస్తున్నా నేను.

“నిత్యతో మాట్లాడుతూ ఉంటే అసలు కాలం తెలియటం లేదు రా సుధీర్.. నా దగ్గర నిత్యని ఉంచి మీరు వెళ్ళండి” అన్నారు తాతయ్య.

“తాతయ్యా! అలా ఏమీ కుదరదు.. మీరే మాతో రావాలి, మాతోనే ఉండాలి” అన్నాను.

ఆ మాటకి పొంగి పోయి నా నుదిటి పై ముద్దు పెట్టి.. “ఆ బహుదూర్ ఉంటే నిన్ను చూసి ఎంత పొంగిపోయేవారో తల్లీ” అన్నారు తాతయ్య  సంచిత రామవర్మ.

‘బ్రాహ్మణత్వం ఉట్టి పడే నడవడిక, రాజసం కలగలేపే నిత్య రూపం చూస్తుంటే ముచ్చటేస్తుంది ఎవరికైనా’ అనుకున్నారు మనసులో సంచిత రామవర్మ.

(సశేషం)

Exit mobile version