Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హిందీ నవలా పరిచయం-3 – జాలరుల జీవితాలకు అద్దం పట్టిన నవల ‘వరుణ్ కే బేటే’

[హిందీ నవలల పరిచయం శీర్షికలో భాగంగా ‘వరుణ్ కే బేటే’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]

హిందీ సాహిత్యంలో ‘ప్రాంతీయ నవల’ సాంప్రదాయంలో ప్రముఖుడు నాగార్జున్. ప్రాంతీయ నవలలను ‘ఆంచలిక్ ఉపన్యాస్’ అంటారు. అవి ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని, కేంద్రంగా ఉంచుకుని రాసిన నవలలు. ఈ నవలల్లో ఆ ప్రాంతపు ప్రత్యేక లక్షణాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, వ్యక్తిత్వం కనిపిస్తాయి. ప్రాంతీయ నవలల్లో ఆ ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సామాజిక జీవితం, రాజకీయ కుట్రలు, సామాన్యుల సమస్యలు వివరిస్తారు రచయితలు. ఎక్కువగా ఈ నవలలు ఆధునిక సౌకర్యాలకు, విద్య, భౌతిక సౌకర్యాలకు దూరంగా ఉన్న సాంప్రదాయ సమాజ కథలను రికార్డు చేస్తాయి. కొన్ని సార్లు ఆ ప్రాంతాలలోని రాజకీయ పార్టీల విధానాలు, ఉద్దేశాలు కూడా చర్చకు వస్తాయి. ఆచార్య నందులారే వాజ్‌పేయి ప్రకారం, ప్రాంతీయ నవలలలో, గిరిజనులు లేదా వెనుకబడిన ప్రాంతాల ఆదిమ కులాల కథలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ రామ్‌దర్శ్ మిశ్రా ప్రకారం, ప్రాంతీయ నవల అనేది ఆ ప్రాంతం యొక్క మొత్తం జీవితానికి సంబంధించిన కథ. అలాంటి ప్రాంతీయ నవలలలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేది నాగార్జున్ రాసిన ‘వరుణ్ కే బేటే’.

వరుణుడు అంటే సముద్రుడు. ఇది సముద్ర పుత్రుల కథ, అంటే జాలరుల జీవిత కథ. వీరి జీవన గతుల గురించి సాంస్కృతిక నేపద్యం గురించి పూర్తి వాస్తవిక దృక్కోణంతో భారతదేశంలో వచ్చిన సాహిత్యం చాలా చాలా తక్కువ. ఈ నవలలో నాగార్జున్ ఎంత వివరంగా వీరి జీవితాలను వర్ణిస్తారంటే, వారి దైనిక జీవనంలో – చదువుతున్న పాఠకులూ ఓ భాగం అయిపోతారు. వారు నివసించే ఇళ్ళ నుండి, చేపలను వేటాడే పద్దతి, అప్పుడు వారు ఆచరించే విధానాలు, వారి నమ్మకాలు, ఇవన్నీ అత్యంత స్పష్టంగా ఈ కథలో వివరిస్తారు నాగార్జున్.

నాగార్జున్ అసలు పేరు వైద్యనాథ్ మిశ్రా. హిందీ సాహిత్యంలో వీరిని జనకవి, ప్రజా కవి అని కూడా పిలుస్తారు. ఈయన కొన్ని నవలలు, చిన్న కథలు, సాహిత్య జీవిత చరిత్రలు, ట్రావెలాగ్స్ రాశారు. సంస్కృతం, మైథిలీ, బెంగాలీ భాషల నుండి రచనలను హిందీలోకి అనువదించారు. సంస్కృతం, బెంగాలీలలో రచనలు కూడా చేసారు. మైథిలీ వీరి మాతృభాష. యాత్రి పేరుతో మైథిలీలో అనేక కవితలు, వ్యాసాలు నవలలను ఆయన రచించారు. సంస్కృతం, పాళీ, హిందీ భాషల్లో నిష్ణాతులు. వీరు ఎక్కువగా హిందీలో రాసారు. ఈయన రచనలలో హిందీ సంస్కృతం నుండి స్థానిక రూపాల వరకు మారుతూ కనిపిస్తుంది. ఇతను బహుజన కవి, స్థానిక ప్రభావం ఉన్న భాషలో రాయడానికి ఇష్టపడేవారు. అందుకే ఎప్పుడూ నిర్దిష్ట భాషల సరిహద్దులకు కట్టుబడి లేరు. దీనితో హిందీ ప్రాంతాలకు దూరం అయిన పాఠకులకు ఈయన ఉపయోగించే భాష కాస్త కష్టంగా ఉంటుంది. ఈయన పేదరికం, ఆకలి, దౌర్జన్యంలపై వ్యతిరేకంగా గళం ఎత్తిన ప్రగతిశీల ఆలోచనాపరుడు.

నాగార్జున్ బీహార్లోని మధుబని జిల్లాలోని సత్లాఖా గ్రామంలో జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని కొద్దికాలం పాటు శ్రీలంకలో బోధించారు. అక్కడే బౌద్ధ భిక్షువుగా మారి ఆ మతాన్ని అధ్యయనం చేసారు. రాహుల్ సాంకృతాయన్ వీరి గురువు. బహుశా అందుకే నాగార్జున్ అనే కలం పేరుని ఎన్నుకున్నారు. భౌద్దాశ్రమంలో ఉంటూనే లెనినిజం, మార్క్సిజం సిద్ధాంతాలను కూడా అభ్యసించారు. 1938లో భారతదేశానికి తిరిగి వచ్చే ముందు, ప్రముఖ రైతు నాయకుడు, కిసాన్ సభ వ్యవస్థాపకుడు సహజానంద్ సరస్వతి నిర్వహించిన ‘సమ్మర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్’లో చేరారు. స్వతహాగా సంచారి అయిన నాగార్జున్ 1930, 1940 లలో భారతదేశం అంతటా ప్రయాణించారు.

ఎమర్జెన్సీ కాలానికి (1975–1977) ముందు జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో ఈయన చురుకైన పాత్ర పోషించారు. ఆ కాలంలో పదకొండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈయన లెనినిస్ట్-మార్క్సిస్ట్ భావజాలంతో బలంగా ప్రభావితమయ్యారు అందుకే ప్రధాన రాజకీయ సంస్థల నుండి ఎప్పుడూ వీరికి ప్రోత్సాహం లభించలేదు. కాని ప్రజల మనసుల్లో ఆయన విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంత విస్తృతంగా కవిత్వం రాసేవారంటే తులసీదాస్ తర్వాత గ్రామీణ వర్గాల నుండి ఉన్నత వర్గాల వరకు పాఠకులను ఒకే స్థాయిలో ఆకర్షించగల ఏకైక హిందీ కవిగా నాగార్జున పరిగణించబడ్డారు.

నాగార్జున్‌కు 1968లో ‘పతర్హీన్ నగ్నా గచ్’ అనే పుస్తకానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 1983లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘భారత్ భారతి అవార్డు’తో వీరిని సత్కరించింది. 1994లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, లభించిన రచయిత ఆయన.

ఆయన రాసిన ‘వరుణ్ కే బేటే’ జాలరుల సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక జీవనానికి అద్దం పడుతుంది. ఆ ప్రాంతంతో ఆయనకు ఎంతో సంబంధం ఉందని అక్కడ ఆయన కొన్నాళ్ళు జీవించి ఉండవచ్చని అనిపిస్తుంది ఈ నవల చదువుతుంటే. ఎంత వివరంగా ప్రతి ఒక్క విషయాని ఆయన ఈ పుస్తకంలో వర్ణిస్తారంటే, ఆ జనం మధ్య కొన్నాళ్ళు కలిసి ఉండకపోతే ఇంత వివరణ అసాద్యం ఎవరికైనా. గఢ్ పోఖర్ అనే ఓ చిన్న బస్తీలో కథ మొత్తం నడుస్తుంది. వీటిని చేపల చెరువులుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కథలో ఖుర్ ఖున్ అనే ఓ చిన్న జాలరి కుటుంబం ప్రధాన అంశం. ఈ జాలర్లలో కూడా ధనిక పేద వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భూమి ఉన్న రైతు లేని రైతు మధ్య ఎంత సామాజిక తేడా ఉంటుందో అదే స్థాయి భేదం ఈ జాలర్ల మధ్య కూడా కనిపిస్తుంది. భోలా, ఖుర్ ఖున్ ఒకే ఊరి వాళ్లు కాని భోలా ధనికుడు ఈ తేడా వారి మాటలో భాషలో ఇళ్ళ నిర్మాణంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

గ్రామాల మధ్య చేపల చెరువులు ఒకప్పుడు జమిందారుల అధికారంలో ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వీటిపై భూస్వాముల పెత్తనం అంతమయింది. దానితో వాళ్లు తెలివిగా ఆ ప్రాంతాలలో ఉండే రౌడీ మూకలకు చట్టవిరుద్ధంగా ఆ చెరువులపై అధికారాన్ని ఇచ్చారు. ఈ కథ ఆ సంఘర్షణల మధ్య నడుస్తుంది. తమకు జరుగుతున్న అన్యాయానికి విరుద్ధంగా పేద శ్రామిక జాలరులందరూ ఏకమై పోరాటం చేయడం, తమ హక్కుల కోసం గళమెత్తి విజయం దిశగా ప్రయాణం చేయడం ఈ నవల కథా వస్తువు.

ఖుర్ ఖుర్‌కి మధురీ అనే కూతురు ఉంటుంది. ఈమె ఈ నవలలో ప్రధాన పాత్ర. ఈ పాత్రను హిందీ సాహిత్యంలో ఓ గొప్ప మహిళా పాత్ర అని చెప్పవచ్చు. మధురీ నవలలో ప్రధాన పాత్ర అయినా ఆమె పైనే పూర్తిగా కథ నడిపించడం నాగార్జున్ ఉద్దేశం కాదు. నవలలో వచ్చే పాత్రలన్ని కూడా ఆ జాలరుల జీవితాలకు ప్రతిబింబాలే. అందుకే మధురీ ముఖ్య పాత్రగా ఉంటూనే నవలలో కనిపించే సందర్భాలు తక్కువుంటాయి. కాని ఆమె ద్వారా శ్రామిక స్త్రీలలోని ఆలోచనాపటిమ, సామూహిక జీవితానికి, సంఘ నియమాలకు వాళ్లిచ్చే గౌరవం, వ్యక్తిగత ఆనందం సుఖం కన్నా సామూహికంగా తమ మొత్తం తెగ ఆనందం గురించి వాళ్లు చేసే త్యాగం ఇవన్నీ ఇందులో చర్చిస్తారు నాగార్జున్. భారతీయ శ్రామిక మహిళలు ఈ దేశ సంస్కృతీ సాంప్రాదాయాలకు, కుటుంబ వ్యవ్యస్థకు ఎంత గట్టి పునాది వేసారో ఈ నవలలో మధురీ పాత్ర ద్వారా చూపిస్తారు రచయిత.

మధురీ ఇంటికి పెద్ద కూతురు. జాలర్ల కుటుంబాలలో స్త్రీలు పిల్లలందరూ శ్రమ పడవలసిందే. చేపలను అమ్మడం, శుభ్రం చేయడం లాంటి పనులన్నీ చిన్నతనం నుండే ఈ పిల్లలు చేస్తారు. పైగా తల్లి తండ్రికి సహాయం చేస్తూ ఉంటే పిల్లలని చూసుకునే బాధ్యత ఆ ఇంటి పెద్ద కూతురిది. అందుకే ప్రతి ఒక్కరూ ఆ ఇంట శ్రమజీవులే. వీరి బాల్యం బాధ్యతల తోనూ పని విభజన తోనూ నిండి ఉంటుంది. కుటుంబంలోని చిన్నా పెద్ద కలిసి పని చేయకపోతే ఆ ఇల్లు నడవదు. ఖుర్ ఖున్ కుటుంబ పరిస్థితులను వారి ఇంటి వాతావరణాన్ని ఎంతో విపులంగా చర్చిస్తూ జాలర్ల కుటుంబ జీవితాన్ని చూపిస్తారు నాగార్జున్.

భోలా కొడుకు మంగల్. చిన్నతనంలోనే వివాహాలు జరిపే సంప్రదాయం ఆ ఊర్లో ఉంటుంది. తరువాత వయసు వచ్చాక ఆ జంట జీవితం మొదలెడుతుంది. అలా వారి వారి స్థాయిలను బట్టి మంగల్, మధురీల వివాహాలు చిన్నతనం లోనే వేరేవారితో జరిగిపోతాయి. అయితే ఒకే చోట కలిసి పెరుగుతూ వీళ్లిద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది వారి తల్లి తండ్రులకు తెలియదు. వీళ్లు దొంగచాటుగా కలుసుకుంటూ ఉంటారు. మంగల్ భార్యను అత్తవారింటికి తీసుకువచ్చే సమయం వస్తుంది. మధురీని మంగల్ అప్పుడు కూడ రహస్యంగా కలవాలని కోరతాడు. మధురీ అతన్ని కలుస్తుంది. కాని ఇప్పుడు తాము ఇంతకు ముందులా కలవకూడదని, అలా చేయడం వల్ల తమ జీవిత భాగస్వాములకు అన్యాయం జరుగుతుందని, ఎంత ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా అది తమ చిన్నతనంలో, తెలియనితనంలో పెరిగిన బంధం కాబట్టి దాన్నిదాటి తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని ఆమె మంగల్‌కి చెబుతుంది. చిన్నతనంలో తమకు జరిగిన వివాహాలను వాళ్లు విస్మరించలేరు. అది ఊరి సంప్రదాయం కాదు. ఆ ఊరు దాటి మరో చోటకు పారిపోలేరు. కాబట్టి ఆ ప్రేమను మరచి తమ జీవిత భాగస్వాములతో కలిసి జీవించడం తమ కర్తవ్యం అని మధురీ ఎంతో పరిపక్వతతో మంగల్‌కు వివరిస్తుంది. మంగల్ దీన్ని అర్థం చేసుకుంటాడు. మనసులోని బాధను దిగమింగి భార్యతో జీవితం మొదలెడతాడు.

మధురీ కూడా అత్తగారింటికి వెళ్తుంది. ఊరి ఆడపిల్ల ఊరు దాటుతుంటే ఆ ఊరిలో స్త్రీలందరూ దుఃఖపడతారు. ఎందుకంటె ఒక ఇంటి ఆడపిల్ల ఒకింటికే పరిమితం కాదు. మగవారందరూ వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు ఊర్లో స్త్రీలందరూ ఒకరికొకరు తోడుగా జీవిస్తారు. ఏ ఇంట అవసరం వచ్చినా ఆ ఊరి ఆడపిల్లలు ఆ ఇంటికి వెళ్లి పనిలో సహకారం అందిస్తారు. ఇది జాలరుల జీవితంలో ఓ భాగం. మధురీ అలా ఆ ఊరి అందరి ఇళ్లలో ఏదో ఓ సందర్భంలో పని చేసిన అమ్మాయి. అందుకే ఆమె ఆ ఊరందరి కూతురు. ఆమె అత్తింటికి వెళ్తుందని ఊరంతా ఆమెను కలిసి సొంత ఆడపిల్ల ఊరొదిలి వెళ్తున్నట్లు దుఃఖిస్తారు.

మధురీ అత్తింటికి వెళ్తుంది. కాని ఆమె భర్త పరమ కిరాతకూడు. ఆమెను విపరీతంగా కొడతాడు. కొన్నాళ్ళు ఈ దౌర్జన్యాన్ని సహిస్తుంది మధురీ. కాని తరువాత అతన్ని వదిలి పుట్టింటికి వచ్చేస్తుంది. మళ్ళి తిరిగి అత్తింటికి వెళ్లనని నిర్ణయించుకుంటుంది. మంగల్ ప్రేమను వివాహంపై గౌరవంతో కాదని అతన్ని భార్యతో సంసారం చేయమని చెప్పి పంపించిన మధురీ, అదే వ్యవస్థ తనపై దౌర్జన్యం చేయబోతే తిరగబడుతుంది. ఆ వివాహం తనకు వద్దని భర్తను వదిలేస్తుంది. సంప్రదాయాలను ఎంత వరకు గౌరవించాలి, ఎప్పుడు ఎదిరించాలి అన్న విషయంపై ఆమెకున్న స్పష్టత ఆమె వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

మధురీ భర్త దగ్గరకు వెళ్ళనని నిర్ణయం తీసుకుంటే ఆమె తండ్రి ఆమెకు మద్దతిస్తాడు. ఊరి రాజకీయాలలో మధురీ క్రియాశీలక పాత్ర వహిస్తుంటే గర్వపడతాడు. తమ చేపల చెరువులను జమిందారులు కుయిక్తులతో ఊరి రౌడిల పరం చేస్తుంటే తమ ఊరి నాయకులకు బాసటగా నిలిచి అధికారులపై పోరుకు సిద్ధపడుతుంది మధురి. చివరకు అరెస్టయి ఊరందరికి మార్గనిర్దేశం చేసే స్థితికి ఎదుగుతుంది. ఆమె ధైర్యాన్ని చూసి మంగల్, జలేసర్, కన్హాయీ, నక్ ఛేదీలు కూడా ఆమెతో జతకట్టి పోరాటానికి దిగుతారు. చదువు లేని ఓ సాధారణ జాలర స్త్రీ, సామాజికంగా ఎదిగి వ్యక్తిగత జీవితం లోని వైఫల్యాలను అధిగమించి ఊరందరికి మారనిర్దేశం చేసే స్థితికి చేరడం ఈ నవల ముగింపు.

ఆ ఊరిలో రాజకీయంగా కొంత అవగాహన ఉన్న మోహన్ మాంఝీ ఈ జాలర్లకు నాయకుడు. తుఫాను తాకిడికి జాలర్ల ఇల్లు నీటి పాలవడం మామూలే. వీళ్ళకి పునరావాస ఏర్పాట్లు చేయడం సహాయ శిబిరాలు నిర్మించడం గురించి ఇతను పని చేస్తూ ఉంటాడు. అలా ఓసారి ఊరు సమస్య ఎదుర్కున్నప్పుడు, ఆగి ఉన్న గూడ్సు రైళ్లను వీళ్ళు కొన్నాళ్లు తలదాచుకోవడానికి ఉపయోగించుకుంటారు. వీరికి ప్రత్యాయమాన మార్గాలు చూపకుండా రైలు భోగీలు ఖాళీ చేయించాలనుకుంటారు అధికారులు. ప్రకృతితోనూ, నాగరికులతోనూ నిత్యం యుద్ధం చేస్తూ జీవించే ఈ వరుణ పుత్రుల జీవిత సంఘర్షణను అత్యంత వాస్తవికంగా చిత్రీకరించారు రచయిత. రైతు సంఘాలలో వీరంతా చేరేటప్పుడు తాము రైతులం కాదు మరి తమకెందుకు ఆ సంఘం అన్న అనుమానం వీరిలో కలుగుతుంది. కాని రైతు సంఘాలు కేవలం పొలం దున్నే వారి కోసం కాదని, మట్టిపని చేసే ప్రతి ఒక్కరి హక్కుల కోసం అవి పని చేస్తాయని మోహన్ మంఝీ వీరికి వివరిస్తారు. శ్రామికులందరు కలిసి సంఘటిమయితే తప్ప తమ హక్కులు సాధించుకోలేరని, అందరి పోరు భూస్వాములపైనే కాబట్టి శ్రామికులందరూ ఒక గూటి క్రింద నిలిచి ఐకమత్యంతో ఒకరికొకరు సహకరించుకోవాలని, వారికి రాజకీయ అవగాహన కలిగిస్తాడు ఆ నాయకుడు.

రాజకీయంగా ఎదగడానికి ఆ ఊరిలో సమావేశాలు, అందులో చర్చలు క్రమబద్దంగా జరుగుతుంటాయి. జనాన్ని ఆలోచింపజేయటానికి ఇలాంటి పాఠశాలలు, సమావేశాలు అవసరం అని నాగార్జున్ నమ్మేవారు. ఈ పుస్తకంలో ఇలాంటి సమావేశాల శక్తిని పరోక్షంగా ఆయన ప్రస్తావించిన విధానం ఆలోచింపజేస్తుంది.

ప్రాంతీయ నవలలు ఆ ప్రాంతపు సాంస్కృతిక జీవితాలని కూడా ప్రతిబింబిస్తాయి. ఈ నవల దానికి గొప్ప ఉదాహరణ. నవలలో కథను నడిపిస్తూ జాలరుల సాంస్కృతిక పాటలు నృత్యాలను కూడా రచయిత వర్ణిస్తారు. ఇందులో జాలరుల వేట సమయంలోనూ, వారి వివాహాది ఉత్సవాలలోనూ వారు పాడుకునే జానపద గేయాలను యథాతథంగా ఉదహరిస్తారు రచయిత. సముద్రంలోకి వెళుతూ వారు పాడే పాటల ద్వారా జాలర్ల సంస్కృతిని రికార్డు చేసారు ఆయన.

అలాగే వారి వేట వ్యక్తిగతం కాదు. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకుని పని చెస్తే తప్ప సురక్షితంగా ఒడ్డుకి చేరలేరు. అందుకే వారిలో పరస్పర ప్రేమలు ఎక్కువ. ఒకరి బలహీనతలు మరొకరికి తెలుసు. అందుకే వేటకు వెళ్ళేటప్పుడు ఎవరు ఏ పని చేయాలో ఎవరిని ఎవరు కనిపెట్టుకుని ఉండాలో వాళ్లకు ఓ లెక్క ఉంటుంది. ఒకరిని ఒకరు పట్టించుకుంటూ పని చేసుకుంటూ ఉండడం వారికి అవసరం. ఇది వారిని ఒకరితో ఒకరిని దగ్గర చేసి అందరినీ ఒక తాటి మీద నిలుపుతుంది. ఇది చదువుతునప్పుడు సామూహిక జీవితంలోని అందం అర్థం అవుతుంది.

‘వరుణ్ కే బేటే’ 116 పేజీల లఘు నవల. కాని హిందీ సాహిత్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. ప్రాంతీయ నవలగా ఇది ఓ గొప్ప ఉదాహరణ. బహుజన జీవితాలను అత్యంత వాస్తవికంగా వారి సంస్కృతి, సాంప్రదాయ, రాజకీయ స్థితి గతులను వర్ణిస్తూ రాసిన గొప్ప నవల. అలాగే బలమైన స్త్రీ పాత్రను చిత్రించిన స్త్రీవాద నవల. దీన్ని చదవడం అహిందీ ప్రాంతీయులకు కొంత కష్టమే కాని మంచి సాహిత్యాన్ని ఇష్టపడేవారికి ఈ నవలా పఠనం ఓ చక్కని అనుభవం.

***

వరుణ్ కే బేటే (నవల)
రచన: నాగార్జున్
ప్రచురణ: రాధాక్రిషన్ ప్రకాశన్
పేజీలు: 116
వెల: ₹ 125/-
ప్రతులకు:
ఆన్‍లైన్‌లో
https://www.amazon.in/-/hi/Nagarjun/dp/812670182X

Exit mobile version