దేశంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.
~
పుణ్య భారతదేశమందున
పుణ్యక్షేత్రాలు ఎన్నో!
ఆది శంకరాచార్య స్థాపన
నాల్గు పీఠాల్ పవిత్రములు.
దేశమందున నాల్గు దిక్కులు
దివ్యమౌ పీఠములున్నవి.
కేరళ, కన్యాకుమారి నుండి
కాలినడకన బయలుదేరగ
కాశ్మీరము దాటి చార్‍ధాం
హిమాలయములు కలియదిరిగెను.
***
దేవదూతలు ఇతరదేశము
లోకి దిగివచ్చారు గాని
పవిత్రమ్మగు వేదభూమిన
దేవతలె అవతరించారు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
ధ్యేయముగ పోరాడినారు.
మతములెన్నో యున్న గానియు
ధర్మమొక్కటె భారతమున.
ఆది శంకరాచార్య బోధ
మతములన్ని మాయదారివి.
***
దేశ సంస్కృతి సంప్రదాయం
ఆదరణ పౌరులందరికి
తన మతమ్మే గొప్పదనుచు
ఇతర మతముల నిందించుట
దేశ ప్రజలకు దౌర్భాగ్యము
సమత మమతలు మాసిపోవు.
వేల వత్సరముల చరిత్రను
తెలిసి కొనియు మసలుదామా!
కృణ్వంతో విశ్వమార్యమని
కలిసిమెలిసి సాగుదామా!
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.