ఒకే దేశము, ఒకే చట్టము
ఒకే జీవన విధానమున.
మతములన్నీ సమానమ్మని
మంచి మార్గము చూపినారు.
సిద్ధాంతము కాగితాలకే
రాద్ధాంతము చేసినారే!
జనాలంత సమానమన్నరు
జల్దిజల్దిగ మరిచినారు.
ఆచరణలో మైనార్టీల
మతాచారము వేరన్నరు.
***
షరియతే తమ మతాచారము
తప్పమందురు కొందరిచట.
శ్వేతాంబరము, దిగంబరము
మరో మతమున ప్రాధాన్యము.
ఇతర మతముల ఆచారములు
మాకు వద్దని పోరాడిరి.
పౌర చట్టము వేరు వేరై
పరిహసించెను ప్రజావళిని.
మత మౌఢ్యము మాయజాలము
మానవుల దానవుల జేసె.
***
విభిన్నత్వములోని ఏకత
భారతీయత ప్రత్యేకత.
సర్వమతముల సదాచారము
ఏరికూర్చుట జాతీయత.
అందరొకటే ఆచరించుట
ఒకే ధర్మమ్మొకే సంస్కృతి.
ఉమ్మడి పౌరసత్వాచరణ
ఉత్తమము మన దేశానికి.
దేశ భవితకు దివ్యౌషధము
తరతరాలకు శుభప్రదము.
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.