[08 ఆగస్టు 2025న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ‘వరలక్ష్మీవ్రత వైశిష్ట్యం’ అనే రచనని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైః భూషితాం
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్సే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః
అని ప్రతినిత్యము లక్ష్మీదేవిని ప్రార్థిస్తే సకల సంపదలు ఇంట కొలువై ఉంటాయని, సకలశుభాలు భక్తుల నమ్మకం. తెలుగు వారికి ఉగాది నుండి పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాడ మాసంలో వచ్చి తొలి ఏకాదశి మొదటి పండుగ. ఆ తరువాత శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం అత్యంత విశిష్టమైన పండుగ. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేది, దక్షిణాయణంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం అత్యంత శుభదాయకం.
ప్రతి శుక్రవారం శ్రేష్ఠమైనదే కానీ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అత్యంత విశిష్టమైనది. ఆ రోజున వరలక్ష్మి దేవిని పూజించి, భక్తిశ్రధ్ధలతో ఆ దేవిని వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మి దేవి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అని అర్థం. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవి ఎనిమిది అవతారాలలో వరలక్ష్మిదేవి రూపం ఒకటి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి పెద్దగా నియమ, నిష్ఠలు అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. ఆ తల్లి కృపాకటాక్షాలు పొంది సంపద, సౌభాగ్యము, దీర్ఘసుమంగళీత్వము కలుగుతుందని భక్తుల విశ్వాసము.
సంపద అంటే ధనం మాత్రమే కాదు పాడి, పంట, జ్ఞానము, విద్యా సంపదలు అని అర్థాన్నిస్తాయి. ఈ వ్రతాన్ని వర్ణవివక్షత కానీ, ధనిక, పేద, భేదం లేకుండా స్త్రీలందరూ చేసుకుంటారు.
శ్రావణమాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసి, ఈశాన్య భాగాన గోమయంతో శుధ్ధిచేసి, మండపారాధన చేసి, లక్ష్మీదేవి పటం గానీ, రూపును గాని ఉంచవలెను. ముందుగా గణపతి ఆరాధనం చేసి అర్ఘ్య, పాద్య, ఆచమన, ఆభరణ, వస్త్ర, కుంకుమ, చందన, ధూపాది షోడశోపచారములతో వరలక్ష్మీదేవిని పూజించాలి. ఆ తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన చారుమతి కథను చదువుకోవాలి.
పూర్వం మగధ దేశంలో గల కుండిన నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె సాధుశీలి వినయ విధేయతలు, భక్తి, గౌరవాలు కలిగిన ఇల్లాలు. భర్త, అత్తమామలను భక్తితో సేవించే పతివ్రత. ఒకనాటి తెల్లవారు జామున వరలక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి శ్రావణమాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే సకలసంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని చెపుతుంది. ఆమె తాను ఒక్కదానిని మాత్రమే కాక తోటి వారందరితో కలిసి చేసుకుని ఆ లక్ష్మీ సౌభాగ్యం అందరికి కలిగించాలనుకున్నది. నిస్వార్థమైన మనసుతో తన తోటి వారందరికీ లక్ష్మీదేవి తనకు కలలో చెప్పిన వ్రతాన్ని గురించి చెప్పింది. వారందరూ ఆమె చెప్పిన మాటకు సరేనని అందరూ చారుమతి చెప్పినట్లుగా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రత పూజ చేసుకుందామనుకున్నారు. సకల సౌభాగ్యాలను, ఐశ్వర్య సంపదలను పొంది ధన్యులైనారు. అయితే ఈ వ్రతా చరణములో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇందులో తొమ్మిది పోగులతో చేసిన తొమ్మిది ముడులతోరమును చేతికి ధరించి ధరించవలెను. తొమ్మిది అంటే నవ అని కదా పరమార్థము. నవా అంటే నూతనము, శ్రేష్ఠము అని అర్థం. తోరమును సిద్ధం చేసుకుని అమ్మవారిని నవనామాలతో పూజించి చేతికి ధరించవలెను. తొమ్మిది రకాల పిండి వంటలుచేసి ఆ తల్లికి నివేదన చేయవలెను. ఈ కథను కాత్యాయని కోరిక మేరకు పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించినట్లుగా స్కాంధ పురాణంలో ఉన్నది.
ఈ వరలక్ష్మీ వ్రతమును స్త్రీలందరూ భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. నైవేద్యమును, తీర్థ ప్రసాదాలను అందుకుంటారు. ఈ వ్రతంలో స్త్రీలందరూ పాలుపంచుకొని, వరలక్ష్మి దేవి కృపకు పాత్రులవుతారు. మన గృహంలో పూజ చేసుకునే దానికన్నా అందరూ కలిసి సామూహికంగా చేసుకునే పూజలో ఫలితం ఎక్కువ ఉంటుందని పండితవాక్కు. మన క్షేమం మాత్రమే కాక సమస్త జాతి క్షేమము, దేశ శ్రేయస్సు కోసము సంకల్పంతో ఈ పూజను నిర్వహిస్తారు. పూజావిధి పూర్తయిన తర్వాత స్కాంద పురాణాంతర్గత వ్రతకథ భక్తులకు బ్రాహ్మణుడు వినిపిస్తారు. భవిష్యత్ పురాణంలో కూడా మనకు ఈ కథ కనిపిస్తుంది. ఏ పురాణంలో ఎవరు ఎలా చెప్పినా ఆ తల్లిని త్రికణ శుద్ధితో అర్చిస్తే సకల సౌభాగ్యాలతో విలసిల్లగలమని భక్తుల విశ్వాసము.
వ్రతము పూర్తయిన తర్వాత చేయించిన వేదపండితులకు దక్షణతాంబూలాదులను, వాయనమునుఇచ్చి వారి దీవెనలు అందుకోవాలి. అంతేకాకుండా సంగీత వాద్య సేవలతో అమ్మవారిని సేవించవలెను. తిరుచానూరు ఆలయంలో కూడా వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో పూజించడం ఇక్కడి విశిష్టత. అదే భాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, భూలక్ష్మి, ప్రీతిలక్ష్మి, కీర్తిలక్ష్మి, శాంతిలక్ష్మి, తుష్టిలక్ష్మి, పుష్టిలక్ష్మి అను పేర్లతో అష్ట లక్ష్మలను ఏర్పాటు చేస్తారు. ఇలా అర్చించినందువల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం.
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణీ
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే
ఈ శ్రావణమాసం అందరం ఆ తల్లిని పూజించి, ఆమె చల్లని దీవనలను పొందుదాం.