Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీలి నీడలు – ఖండిక 1 – వరకట్నం

నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది మొదటి ఖండిక ‘వరకట్నం‘.

రకట్నం – ‘నీలి నీడలు” ఖండకావ్యంలోని మొదటి ఖండిక.

***

భారతదేశ సద్యశము బండలు చేయగ మానవుండుదా
ధీరతగోలుపోయి కడు తేజము గోల్పడి దుర్వినీతుడై
మేరను మీరు కోర్కెలతో మేదినిలో, ఘన మానవత్వమున్
దూరముజేసికొంచు తమితోడ దురాశను తాండవించుగా.                     1

 

విలువలను వీడి మనుజుడు పలువిధాల
ధనమునార్జించుటే గొప్పతనమటంచు
అడ్డదారుల ద్రొక్కుచు  నందుకొఱకు
తా దురాచారపరుడయ్యె ధాత్రియందు.                                    2

 

అన్ని దురాచారాలను
మిన్నయునై యణచబడకమేయంబగుచున్
ఎన్నో వ్యథలకు దండై
ఇన్నేలను కట్నభూత మెంతయొ యొసగెన్.                               3

 

కన్నె సుంకంబులిచ్చెడి కాలమరిగి
మంచికాలంబు వచ్చెన్ మగువలకిక,
నంచుముదమందు చుండంగ నవనిజనులు
వింత వరకట్నముదయించి వేచసాగె.                                           4

 

వరకట్నంబది యంటురోగమగుచున్ వారాశి పర్యంతమున్
కరమున్బాధ రగిల్చి మానవులకున్ కష్టాల నందించియున్
వరకళ్యాణములందు ముఖ్యమగుచున్ వర్ధిల్లుచున్నిచ్చలున్
ధరలో స్త్రీలకు ఖేదమిచ్చి సతముందాపంబు గూర్చెన్ గదా!                  5

 

ధనము కోట్ల కొలది ఘనముగా గలవారు
కాంక్ష యల్లురకును కాన్కలిచ్చు
నట్టి సంప్రదాయ మయ్యెను దుష్టమౌ
వరుని శుల్కముగను వసుధయందు.                                          6

 

ధనికులింట బుట్టి దర్జాల బొందుచు,
కట్న భూత మిపుదు కరుణ లేక
తినగ తిండి లేని జనముల యిండ్లలో
పాద మిడుచు, మిగుల బాధ గూర్చె.                                            7

ఉన్నవారి యిండ్లనుద్భవించియునిద్ది
మిన్నగాను మేర మీర వెలిగి
కలిమిలేము లనక కులమతమ్ములన్క
ధాత్రియంత కరము తాండవించె.                                                 8

 

ధనవంతులకిది గొప్పవ
ధనహీనులకిదియు కరము తద్భిన్నమునై
మనముల బాధ రగుల్చుచు
ననయము దుస్సంప్రదాయమయ్యె ధరిత్రిన్.                                    9

 

ఆడపిల్ల కలుగనాది లక్ష్మియుబుట్టె
నంచు ప్రజలు మోదమొందసాగ
వసుధలోన దుష్టవరశుల్కముదయించి
ఆడజాతికెంతో కీడు జేసె.                                                          10

 

వరకట్నమే లేక పరిణయంబొనరింప
పరువుండదని యెంచి పలుకుచుండె
పెళ్ళిచూపులనాడు పిచ్చివౌ ప్రశ్నలు
విరివిగా వేయుచు వేచుచుండె
తమపిల్లవానికి తద్దయు కట్నంబు
కుదరదీయకటంచు కొసరుచుండె
మగపెళ్ళి వారెల్ల మండి దేవతలుగ
ఆత్మలంభావించి యలుగుచుండె
అత్తగారాడబడుచులు అతివలయ్యు
సాటివారి కన్యాయంబు సలుపుచుండె
క్రౌర్య కౌటిల్య వరశుల్క కాలమందు
వధువులకు మేలుగలదె ప్రపంచమునను?                                     11

 

ఈ దేశమందున నెందరో బాలికల్
ఉద్వాహములు గాకనుస్సురనెడు
ఈ మాతృభూమిపై నెందరో కన్నియల్
పెద్దల మాటపై పెండ్లియాడు
ఈ భారతావని నెందరో ముగ్ధలు
కోర్కెలందెలుపకే కుందుచుండు
ఈ ధారుణీస్థలి నెందరో యువతులు
మనము విప్పగలేక మనువునాడు
అట్టి దురవస్థ నందుచు నహరంబు
కన్నవారల పరువును కాచుకొఱకు
జీవితంబులు త్యాగముల్ జేసిరనగ
వరలు వరశుల్క దౌష్ట్యంబు వలనగాదె!                                         12

 

మొలతాడు గట్టిన మొఱకు కుఱ్ఱకునైన
వరశుల్కమిమ్మంచు బలుకువరు
అక్షరంబులు రాని యన్నయ్యకైనను
అరలక్ష కట్నంబునడుగువారు
అంగవైకల్యంపు టబ్బాయిలకునైన
గొప్పగా శుల్కముంగోరువారు
మందంబుగానున్న అందహీనునకైన
పెద్దగా కట్నముంబెంచువారు
పెచ్చురేగుచు సంఘాన హెచ్చుగాను
కనికరంబింతలేకను కఠినవృత్తి
తాండవించుట జూడ నీధరణి జనుల
దుష్ట వరకట్న జాడ్యంపు దుష్ప్రభావ
మెంత బాధించుచునెండెనో యెంచగలమె?                                      13

 

ఎందరో వంతజెందుచును నెందరో కుందుచు తీవ్రవేదనన్
ఎందరో యార్తి నందుచును నెందరరో మ్రగ్గుచుమానుషంబునన్
ఎందరో యాస్తులూడ్చుచును నెందరో నిచ్చలు దైన్యమూర్తులై
కుందుచునుండిరిట్టి వరకట్న పిశాచము చేతజిక్కియున్.                     14

మగబిడ్డ జనియింప నగణితంబుగ కట్న
మేతెంచు తమకని యెంచువారు
కట్నాల కోసమే కాలేజి చదువుకు
తమ పిల్లలను అంపదలచువారు
విద్యలో తమవాడు పెరిగెడి స్థాయికిన్
తగు కట్నమడుగంగ దరలు వారు
వరకట్నముంబెంచ వసుధనుద్యోగుల
గుఱ్ఱవాండ్రకు కొనగోరువారు
స్థాయికొక రేటు చొప్పున జంకులేక
పెచ్చు కట్నంబు వాంఛించు పెద్దవారు
బుద్ధిగోల్పోయి సంఘాన హద్దుమీరి
సంచరించుత వరకట్న జాడ్యమెకద?                                            15

 

కాటక బాధచే గర్భస్త శిశువును
చంపగాయత్నంబు సలుపుచుంట
దారిద్య్ర వేదనన్న్ తమకన్నబిడ్డల
వైద్యశాలల యందె వదలుచుంట
కరము కట్నపు భీతి పురిటిలో పాపల
జంకేమియునులేక జంపుచుంట
ఆడపిల్లలగన్న అయ్యలు నిరతంబు
కడలేని యిడుములు పడచునుంట
ఎంత తిరిగిన కూతుకు నిజ్జగాన
వరుని తేలేని దుస్థితి న్వగచుచుండి
తనువులంబాయు తరిలోన తండ్రులుంట
అరువు లేకను సతతంబునడ్డులేక
వరలు వరకట్న భూతంబు వలనగాదె.                                          16

 

వరకట్నమే లేని పెండ్లియో పెండ్లియా
అని నవ్వుచును పల్కిచనెడువారు
వరసుంకమీలేని వాడు పురుషుడౌన
అప్రయోజకుడాతడనెడువారు
వరశుల్కమందని వరుడేమి వరడంచు
అవహేళనము చేసియరుగువారు
కట్నమే లేకను గౌరవమెట్లబ్బు
పరిణయంబునకంచు పలుకువారు
అపరిమితమైన సంఖ్యలో నవని ప్రజలు
కానుపించుచు శుల్కమున్ గౌరవింప
కన్నెలంగన్న తండ్రుల కష్టములకు
అవధియనునది యుండునా? యరసి చూడ.                                   17

 

ఎన్ని కుటుంబాలు నెద్దానిచేనల్గె
అప్పుల బాధచే ననుదినంబు
ఎందరు తండ్రులు నెందుచే ప్రాణాలు
కోల్పోవుచుండిరీ కువలయమున
ఎందరు యువతులు నే కారణంబుచే
కోర్కెలన్విడనాడి కుందుచుండ్రి
ఎందరో కోడండ్రు ఏ ప్రభావంబున
అత్తల యాగడాలనుభవించ్రి
అరయ పెట్రోలు దహనాలననుదినంబు
నందుచుండిరి యెందుచేనాడవారు
ఆ దురాచారమికపైన నడ్డకున్న
మనుజ జాతికి గల్గదు మహిత శుభము.                                       18

 

ఇట్టి దుష్టమైన యీదురాచారమున్
సమయజేయుటకును జగతిప్రభుత
సాహసించి యొండు చట్టంబుజేసిన
వనితలకును దొలగువంతలెల్ల.                                               19

 

వనితలు వారి తన్వులను భర్తల మాటున వెళ్ళదీయుయో
చనలను మాని సత్వరమె సాగుచు ముందుకు విద్యలందునన్
అనితరలీల బెంపుగని యార్థికవృద్ధిని బొంది తాముగా
అనిశము జీవయాత్రల నహ! యన సల్పుటమేలు కార్యమౌ.                 20

 

యువతీ యువకులునెల్లరు
అవమానముగూర్చునిట్టి యపమార్గంబున్
జవమరికట్టగబూనుట
అవసరమగు చర్యయిప్పుడవనీ స్థలిలోన్.                                       21

Exit mobile version