Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వరద

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి ‘వరద’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

నాలుగు రోజుల నుంచీ ఒకటే ముసురు.

బంగాళాఖాతంలో వాయుగుండం అట.. తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

ఇంతలో ముసురు కాస్తా పెద్దవానగా మారింది.. ఆకాశానికి పెద్ద రంధ్రమేదో పడ్డట్టు భోరున ఎడతెరిపి లేకుండా ఒకటే వాన. వాగులు, చెరువులు, నదులు నిండుకుండల స్థితినీ దాటి పాలపొంగుల్లా మారి పొర్లిపోవడం, గట్లు దాటి జనావాసాల మీదికి ప్రవహించడం మొదలుపెట్టాయి.

రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక అయిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా తరలివచ్చింది. దాంతో, కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. క్రింది ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు.

సముద్ర తీరప్రాంతం కావడంతో వర్షాకాలం వచ్చిందంటే.. దాదాపు ప్రతి సంవత్సరం ఇలా ఉరుకులు పరుగులే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలు బతుకు బితుకుమంటూ గంటలు, పూటలు, రోజులు గడపక తప్పడం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడే ‘ఇట్టా తీర ప్రాంతాలలో ఇల్లు, పొలం, పుట్రా, గొడ్డు, గోదా పెట్టుకొని భయం బతుకు బతకకూడదు. హాయిగా తట్టాబుట్టా సర్దుకొని ఏ పట్టణమన్నా ఎల్లిపోతే నిచ్చింతగా బతకొచ్చు’ అనుకుంటారు అక్కడి ప్రజలు. కానీ వాన వెలిసి ఆ వరదవైరాగ్యం తొలిగిపోయాక మళ్లీ అంతా మర్చిపోయి – ఆ, సొంత ఇల్లు, కొంపా గోడూ వదిలిపెట్టి ఎక్కడికి పోతాం. అలవాటయిన ఊరు, చిన్నప్పటి నుంచే అలవాటయిన బతుకు! అయినా మనం ఒక్కళ్ళమేనా – ఎంతమంది ఇక్కడ ఉండటం లేదూ’ అనుకుంటారు. అంతే! మళ్లీ వానాకాలం వచ్చేవరకూ ఆ ఆలోచనలు మారకుండా అలాగే ఉంటాయి.

కానీ ఈసారి వాన, తుఫాను అట్లాంటి ఇట్టాంటి తేలికైన వ్యవహారంలా అనిపించటం లేదు.

పాముల్లా బుసలు కొడుతూ నీళ్లు సరఫరా పాక్కుంటూ ఊళ్ళలోకి వస్తున్నాయి. పాములు విషం చిమ్మినట్టు వరద పాయలు అట్నించొకటి, ఇట్నుంచొకటి అన్నట్టు నురగలు కక్కుతూ వచ్చి వీధులన్నింటినీ కమ్మేసాయి, దాంతో రోడ్లు కనిపించటం మానేసాయి. చుట్టూ ఎటు చూసినా నీళ్ళు – నీళ్ళు – మోకాళ్ళ లోతు నుంచి నడము లోతు వరకూ నీళ్లు, అది చూసి – ‘వామ్మో, వాయ్యో’ అనుకుంటూ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి జనం డబ్బు, దస్కం, బంగారం, ముఖ్యమైన పేపర్లు, ఖరీదయిన వస్తువులు వీటిన్నింటినీ ఎత్తైన ప్రదేశాలయిన అటకలు, ఇంటి కప్పుల కింద భద్రపరచటం చేసుకుంటున్నారు. ఎన్నని అలా దాస్తారు? ఎంత సామానని మోస్తారు? సంసారం సాగరం అన్నారు. ఆ సాగరం ముంచుకొస్తోంది ముంపులా అని ఈ సంసారాన్ని ఆంజనేయుడు సంజీవనీ పర్వతాన్ని ఎత్తుకొని ఆకాశంలో ఎగురుకుంటూ పోయినట్టు ఎత్తుకొని పోగలరా? గడ్డను పెకిలించి, సామాన్లు, ఆస్తిపాస్తులు సర్దుకుంటూ కూర్చుంటే ప్రాణాలకు ముప్పు వస్తే, ఆ సాగరుడికి ఇంకా కోపం వస్తే అకస్మాత్తుగా ఇంకా పెద్ద వరదని ఊరి మీదికి తోలి చూస్తూ చూస్తుండగా అంతా ముంచెయ్యడూ? ముంపు అంటే మాటలా? నిముషాల్లో ముంచేస్తుంది. ‘ఇప్పుడు అంతా బాగానే ఉంది – ఫరవాలేదు, ఊరంతా మునిగినా మన ఇల్లు మునగదు’ అనుకుంటారు ఎవరికి వారే. ఏ అర్ధరాత్రో కన్ను కాస్త మలిగినప్పుడో అదును చూసి కొంప ముంచదని గారంటీ ఏముంది – వరద ఉధృతి అంటే మాటలా, ప్రకృతి శక్తి ముందు మనిషి శక్తి ఎంతనీ!

దాని బలం ముందు పిట్టలాంటి అరడుగుల మనిషి బలం ఎంతనీ? ఒక్క నెట్టు నెట్టితే అమాంతం కిందపడి వరదలో కొట్టుకపోడూ. వచ్చినప్పుడు చూసుకుందాం అంటే కుదరదు. వచ్చాక చూసుకోవటానికి అక్కడేమీ మిగలదు – బురద తప్ప. ముందుజాగ్రత్తగా తట్టాబుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లిపోవలసిందే.

ఇప్పటికే ఊళ్లో చాలామంది అలా వెళ్లిపోయారట. పోమని అక్కడే మొండికేసుకొని కూర్చున్నేవాళ్ళు మాత్రమే మిగిలారు. వీధులన్నీ నీటి మడుగులయ్యాయి – ఇంతకు ముందు పాదచారులు నడిచిన ఆ చోట ఇప్పుడు పడవలు, మరబోట్లు నడుస్తున్నాయి. సేఫ్ జాకెట్ వేసుకున్న సురక్షిత దళాలు, గజఈతగాళ్లు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, చుట్టుపక్కలవున్న గ్రామప్రజలను హెచ్చరిస్తూ, గట్టునో, చెట్టునో పట్టుకొని వేలాడుతూ ప్రమాదం అంచున ఉన్నవాళ్ళను రక్షిస్తూ వాన తప్పరలో, వరద ప్రవాహంలో అలాగే పహారా కాస్తున్నారు. అయినా, వరదల్లో పడి కొట్టుకపోయేవాళ్ళు పోతున్నారు- బైక్‌లు, కార్లు సైతం చక్రాలు చేతులెయ్యటంతో బోట్లలా నీళ్ళ మీద తేలుతూ పల్లానికి కొట్టుకుపోతున్నాయి. అందులో ఉన్న జనం ఆర్తనాదాలు చేస్తూ చూస్తూ చూస్తుండగానే జలసమాధి అవుతున్నారు. అలాంటి చావును ఈ జీవితంలో వాళ్లు ఏనాడూ ఊహించను కూడా ఊహించి వుండరు. భార్యాభర్తలు, తండ్రికూతుళ్లు, తల్లి బిడ్డలు ఒకరికి ఒకరు తెలియకుండా ఎవరు ఎటు కొట్టుకపోయారో తెలియదు. జీవితమంతా ఒకరికొకరంగా ఉందామని అనుకున్నవాళ్ళ జీవితాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కోవైపు కొట్టుకపోయారు. ఎప్పుడో ‘ద్వారక’ సముద్రంలో మునిగిపోయిందని చరిత్ర చెబితే అది పుక్కిటి పురాణం అనుకున్న జనానికి ఆ ప్రళయం, ఆ బీబత్సం కళ్ళముందు కనిపిస్తుంటే ‘ఇంత భయంకరంగా ఉంటుందా యుగాంతం అంటే’ అని అనిపిస్తోంది. నిజంగా అది యుగాంతం లాగే ఉంది. పల్లె పల్లె మొత్తం అక్కడో పెంకు, ఇక్కడో తడిక, ఇంకెక్కడో అక్కడ కొయ్య అన్నట్టు నీటి మీదుగా కన్పిస్తూనో, నీటిమీద తేలుతూనే ఊరి ఆనవాలును రవ్వంత పట్టి ఇస్తున్నాయి. మిగతాదంతా జలసమాధి అయి ఏ వీధి ఏదో, ఎవరిల్లు ఎక్కడుందో ఏ మాత్రం గుర్తు దొరకడం లేదు. పెద్దల గోడు పట్టని బాల్యం, అసలు ఏం జరుగుతోందో అర్థం కాని పసితనం మాత్రం ఆ వరద నీళ్ళలో ఈతలు కొడుతూ, కాగితం పడవలు వదులుతూ ఊళ్లోకి నీళ్ళు రావడాన్ని చిరునవ్వు ముఖాలతో చూస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటోంది. జీవితం ఒక ఆట అని తెలియని వయసు. ‘మా ఆటలు ఇవే..’ అని అమాయకంగా పెద్దలకు చాటిచెపుతూ వాళ్ళు ఈర్ష్యపడేలా చేస్తోంది. ఊళ్ళు ఊళ్ళన్నీ ఖాళీ అయిపోతున్నాయి.

మొలలోతు నీళ్ళలో నెత్తిన మూటలు పెట్టుకొని కొంతమంది – పడవల మీద ఎక్కి మరికొంత మంది కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ ‘అయ్యో మా ఊరు – మళ్ళీ చూస్తామో లేదో’ అని వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తూ తరలిపోతున్నారు.

ఇంకా ఇంటికప్పుల మీదా, ఇంటెనక ఉన్న రాళ్ళ కుప్పల మీదా చిక్కుకొనిపోయినవాళ్లు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టా లేక ఆకాశం వంక దీనంగా చేతులు చాస్తూ చూస్తూ ఏ హెలికాఫ్టరయినా వచ్చి పాల పాకెట్లు, అన్నం పాకెట్లు, నీళ్ళ సంచులు విసిరేస్తారేమోనని ఆశగా చూస్తున్నారు.

చుట్టూ నీళ్లు – కానీ గుక్కెడయినా తాగటానికి ప్రాప్తం లేదు. నీళ్లతోనైనా కడపు నింపుకుందామంటే అవీ కరువే. అంత చల్లదనం లోనూ గొంతెండి పోతోంది. ఆకలితో పొట్టలో పేగులు ‘అన్నమో రామచంద్రా’ అని ఆర్తనాదాలు చేస్తున్నాయి.

అప్పుడే వెళ్ళనందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు కొందరు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కానీ కొందరికి జ్ఞానోదయం కాదేమో. పైకి ఏ హెలికాప్టరో వచ్చి ఏ తాడో కిందికి వేస్తే దాన్ని పట్టుకొని పైకి ఎగబాకి ప్రాణాలు రక్షించుకోవటం తప్ప కిందికి వెళ్ళి ఏ పడవలోనో పునరావాస కేంద్రానికి చేరుకునే పరిస్థితి లేదు.

***

పునరావాస కేంద్రాలు అంటే అవో అండమాన్ జైలు లాంటివి. జాగా పట్టని జనంతో, అపరిశుభ్ర వాతావరణంలో కంపుకొట్టే టాయిలెట్లతో, ప్రాణాలతో బతికుండటం మాత్రమే ధ్యేయం అన్నట్లుగా, కంటితుడుపు సౌకర్యాలతో తిరిగి ఎప్పుడు మన ఆవాసానికి మనం చేరుకుంటామా అని అనిపించేటంతంటి సహనపరీక్షను పెడుతున్నట్లుగా ఉంటాయి.

ప్రజల సంక్షేమం కోసం అంటూ ప్రభుత్వాలు చేసే ఏ పనిలో నయినా అంతే – ఎటు చూసినా నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ వుంటుంది. నాసిరకం అనేది నీ బతుకింతే అన్నట్టు వెక్కిరిస్తూ వుంటుంది.

వరదలు వచ్చాయంటే – ప్రకృతి కన్నెర్ర చేసి బీభత్సాన్ని సృష్టించిందంటే మధ్యతరగతి మనిషి పని, పేదోడి పని కనాకష్టంగా మారిపోతుంది.

వ్రాపారస్థుల పని శవాల మీద డబ్బులు ఏరుకునే నీచ సంస్కృతికి దిగజార్చి మానవత్వాన్ని వరదలో కొట్టుక పోయేలా చేస్తుంది. ఒడ్డున కూర్చున్న వాళ్ళు.. కోట్ల సంపాదనతో డబ్బు దండిగా వున్న వాళ్లు సేవాభావంతో ఇచ్చే లక్షల రూపాయల విరాళాలూ, బియ్యం పప్పులు, బట్టలు చేరవల్సిన వాళ్ళకి చేరుతున్నది ఎంత, మధ్యలో హుష్ కాకి అవుతున్నదెంత, రాజకీయ నాయకుల జేబుల్లోకి దూరుతున్నదెంత అన్నది లెక్కలకందని వ్యవహారం అదంతా! రేపు రాబోయే ఎలక్షన్లలో ఓటు బ్యాంకు నిండి తిరిగి తమకే పదవి దక్కడానికి అధికార పార్టీకి ఇదో మంచి అవకాశం. అందుకే ప్లాంట్లు పైకి కూడా మడుచుకోకుండా మోకాలు లోతు బురద నీళ్ళలో నిలబడి – వానలో తడుస్తూ ఎంతో చేస్తున్నట్టు పత్రికల కెమారాలకు, టీవీ వీడియో కెమెరాలకు పోజులిస్తూ ‘ఎంతటి బీభతాన్నయినా ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేసాం. ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉంది. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు’ అని జనానికి భరోసా ఇస్తున్నట్టు బరువైన డైలాగులు చెపుతారు. అది పైపై బరువే నని లోపలంతా డొల్ల అని గ్రహించడానికి రాజకీయాల్లో లేని రాజకీయ పండితులకే సాధ్యం అయ్యే పని, పరిపాలనా పక్షం ఏదో చేసేసి ప్రజల అభిమానాన్ని ఏదో కొల్లగొట్టేస్తోందన్న భయం ఆ మర్నాడు విపక్షం వాళ్ళు కూడా ఫాంట్లు మడతెయ్యకుండా బురదలో దిగి ‘వాళ్ళదంతా ఒక డ్రామా ఆ మాటలు నమ్మకండి’ అని విమర్శలు గుప్పించే ప్రయత్నం చేసారు. అది చూసి ‘చూడండి ప్రజలూ ప్రతిపక్ష నాయకులు మా సేవాకార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. వాళ్ళు చెప్పేవన్ని పచ్చి అబద్ధాలు నమ్మకండి’ అని ఆవేశపడుతూ మాట్లాడుతుంటారు, దాంతో ‘మీవి బురద రాజకీయాలంటే – మీవి బురద రాజకీయా’లంటూ ఒకళ్ళ మీద మరొకళ్ళు కాకుల్లా అరుచుకుంటారు. అదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకుల తల బొప్పి కడుతుంది. అసలే నడ్డి సగం విరిగినట్టున్న పేదవాడి బతుకు ఆ గోలతో పూర్తిగా విరిగిపోతుంది.

“మీరు తర్వాత అసెంబ్లీలో పోట్లాడుకుందురుగాని – మా కూడు, గూడు, గుడ్డ సంగతి ఎవరో ఒకరు చూడండి మహాప్రభో” అంటూ చేతులు పైకెత్తి దండాలు పెడుతుంటాడు మధ్యతరగతి మనిషి.

వరదొచ్చి ఎంత పని చేస్తుందో చూడండి.

అడుసులోనే వుంది అంతా – అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్ని పాత సామెత బురద రాజకీయాలకు వర్తించదు. వరదంటేనే బురద – బురద అంటేనే రాజకీయాలు. అందుకే ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకున్నవాళ్లు వరదలు వచ్చినప్పుడు ఏ చుట్టాల ఇళ్ళకు వెళ్ళడమో, గుట్టల మీదకి చెంబూ టప్పాలతో సహా చేరి అక్కడే వంటలూ వార్పులు చేసుకొని వరదొచ్చి తరిమేసినా గుండెధైర్యంతో ఉంటుంటారు. అక్కడే వరద లోకాభిరామాయణాలూ చెప్పుకుంటుంటారు.

చినుకు పడగానే “అసలు ఈ వరదలేంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని నీళ్లు” అని ఒకరు వరదను విసుక్కుంటే, లోకజ్ఞానం కూసింత వున్న మరో పెద్దమనిషి “వరదనేమీ అనకు – కళ్ళు పోతాయి.. అదేం చేసింది పాపం – నోరు లేని ప్రకృతి కన్నెర్ర చేసిందంటే కారణం బడాబాబులైన ఈ కబ్బాకోరులే – వీళ్ళ బాబు సొత్తేదో ఇక్కడ దాచిపెట్టినట్లు కనబడ్డ భూమిని కబ్జా చేసింది చాలక చెరువుల్లో కూడా దూరి కొంపలు కట్టుకుంటున్నారు మనవళ్లు, మునిమనవళ్ళు ఇలా ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులను సంపాదించి పెట్టడం కోసం. దాంతో వర్షపు నీటితోపాటు పొంగిపొర్లే వాగులు, చెరువుల నీళ్లు కూడా ఊరి మీద పడుతున్నాయి” అంటాడు అతను. కాస్త అక్షరజ్ఞానం, పుస్తకజ్ఞానం ఉన్న మరో పెద్దమనిషేమో.. “ఈ భూమి మీద మూడొంతులు నీళ్ళు, ఒకవంతు భూమి ఉన్నాయంటారు. ఆ ఒక వంతుకుండా జలమయిపోతే పీడా పోద్ది, మనకుండటానికి జాగా లేకపోయినా ఫరవాలేదు గానీ ఈ కబ్బాకోర్ లకు కబ్జా చేయటానికి సెంటు భూమి కూడా లేకుండా పోతుంది” అన్నాడు కసిగా పళ్లు బిగబడుతూ – కోపంతో భూమి మీద బలంగా కాలుపోటు వేస్తూ.

వరద వచ్చిందంటే ఇలా అందరి నోటా వరద కబుర్లే. అవి వున్నంత కాలం, ఉన్నంత కాలమే ఏంటి వరదలు తగ్గి పునరావాస కేంద్రాల నుంచి – కొండలు, గుట్టల మీద నుంచి జనం ఎవరిళ్లకు వాళ్లు చేరుకున్న తర్వాత కూడా ఆ కబుర్లు ఆగవు. నిజానికి అప్పుడే ప్రారంభం అవుతాయి అనాలేమో! వచ్చింది వరదా మజాకా.

***

ఆరు రోజుల తర్వాత వరద ఉరవడి కాస్త తగ్గి పై చినుకు కూడా వెలవడంతో ‘హమ్మ.. ఇంక ఇంటికి వెళ్లొచ్చు’ అని గుండెలనిండా ఊపిరి పేల్చుకున్నారు ఊరిజనాలు. ఆ స్థలమహత్యం ఏమిటో గానీ ఎవరిల్లు వారికి అది పూరిగుడిసె అయినా, పెంకుటిల్లయినా, బంగళా అయినా స్వర్గతుల్యంగా అనిపిస్తుంది. రెండు కోట్లు పెట్టి కొన్ని డీలక్స్ ఫ్లాట్‌లో డన్లప్ పరుపుల మీద పడుకోబెట్టినా ‘ఛత్.. ఇక్కడ బాగోలేదు. నా ఇల్లే నాకు సుఖంగా, సంతోషంగా హాయిగా అనిపిస్తుంది’ అంటూ లేచి చక్కాపోతాడు. కోట్ల ఖరీదు చేసే లగ్జురియస్ ప్లాట్ కన్నా తన గుడిసే అతనికి నచ్చుతుందంటే అది ఆ స్థలమాహాత్యం కాక మరేమిటి? రాయబడని స్థల చరిత్రలు అవి. అందుకే అందరి ముఖాలూ ఆనందంతో వెలిగిపోతున్నాయి. నవ్వటం మర్చిపోయినట్టు మూతి బిగించి కూర్చున్న ముఖాల్లో ముప్పయి రెండో పళ్లూ ముప్ఫయి రెండు మల్లెమొగ్గల్లా విరబూసాయి. ‘పదండి పోదాం, మనింటికి మనం – ఈ వానకు, వరదకు కొంపాగోడూ ఎట్టా వున్నాయో ఏమో’ అనుకుంటూ మూటలు నెత్తిన పెట్టుకొని మగాళ్లు, బట్టల సంచిని భుజానికేసుకొని. పసిపిల్లను చంకనేసుకొని ఆడాళ్ళు ఒకరి వెంట ఒకరిగా ఇంటి బాట పట్టారు.

వీధుల్లో ఎక్కడ చూసినా బురద, బురద – జర్రుజర్రుమంటూ జారుతోంది కాలేస్తే – అన్ని రోజులు అంత బీభత్సాన్ని సృష్టించిన వరదలు తోకముడిచిన పాముల్లా – ఏమీ ఎరుగని నంగనాచుల్లా వచ్చినంత వేగంగా సర్రున వెనక్కి జారిపోయాయి. తన ఆనవాలు అయిన మట్టిని అక్కడే వదిలేసి. కాళ్ళు లాక్కుంటూ పీక్కుంటూ, జారి కింద పడకుండా భద్రం చెప్పుకుంటూ మొత్తానికి ఊరికి చేరుకున్నారు జనం. అది తమ ఊరే అని గుర్తు పట్టడానికి వాళ్ళకు చాలా సమయం పట్టింది. ఊరయితే గుర్తుపెట్టారు గానీ ఎవరిల్లు ఏదో, ఎక్కడో ఆనవాళ్ళు మాత్రం దొరకటం లేదు. గోడలు కొంచెం బలంగా మున్న పెంకుటింటి అయితే ఆసాములు, భవంతి ఇళ్ళ పెద్ద రైతులు మాత్రం ఇళ్ళల్లోకి వెళ్ళీ వెళ్ళగానే ఆ వరద మిగిల్చిపోయిన బీభత్సాన్ని ఆ శిధిలమైన మొండి గోడలను, సగం జారిన పైకప్పును చూసి బావురుమన్నారు. ఎప్పుడూ అలికి ముగ్గులు పెట్టి, గడపలకు పసుపు కుంకాలు పెట్టి అందంగా తీర్చిదిద్ది కళకళలాడుతూ వుండేలా ఉండే లక్ష్మీనివాసాల్లాంటి ఆ ఇళ్లు – ఇప్పుడు చిందరవందరై బురదలో పడి దొర్లుతున్నాయి. మంచాలు, పరుపులు, చెంబూ తెప్పేలాలు అన్నీ బురదలో పడి కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. కింద నేల, పైన కప్పు సరిగాలేని ఆ ఇల్లును తిరిగి బాగు చేసుకోవటం ఎలాగో – ఎప్పుడు ఎంత మంది శ్రమిస్తే ఆ ఇల్లు ఒక కొలిక్కి వస్తుందో అర్థం కాలేదు. ‘ఇదేం ఇల్లు ఇదేం వాలకం’ అని ఆ వీధిలోని ఆడంగులంతా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మగవాళ్ళు మాత్రం పైకి ఏడ్వలేక లోపల ఏడుస్తున్నారు.

ఇదేమి తెలియని పిల్లలు “అమ్మా- మనిల్లు ఎక్కడే?” అని అడుగుతున్నారు అమాయకంగా. ఇంటిగోడల మీద ఇంతెత్తున బురద ఎగబాకడంతో గోడలన్నీ మట్టిమయం అయిపోయాయి. ఇల్లంతా అదో విధమైన దుర్గంధం. భరించశక్యం కాకుండా ఉంది. ముక్కలు మూసుకొని ఎవరికివారే తప్పనిసరి పనులకు తిరుగుతున్నారు

వరద వస్తోందంటే భయం – వచ్చివెళ్ళాక అది మిగిల్చిపోయిన మురికిని, ముక్కులు బద్దలయ్యే వాసనను భరించటం అన్నది అనుభవించిన వాడికే అర్థమయ్యే విషయం. ఎన్ని బకెట్ల నీళ్ళూ సరిపోవడం లేదు ఆ బురదను కడగటానికి – కడిగి కడిగి ఎన్నిసార్లు కడిగినా ఆ దుర్గంధం పోవటం లేదు. ఎన్ని పాయిఖానాలోనుంచి ఎన్ని డ్రయినేజీ మ్యాన్‍హోల్స్ నుంచి నానా ఛండాలాన్నీ, అశుద్ధాన్ని మోసుకుంటూ తీసుకొచ్చిందో ఈ వరద. ముక్కులు బద్ధలయిపోతున్నాయి, ఎంత ముక్కులకు బట్టలు కట్టుకొని ఇల్లు శుభ్రం చేసుకుంటున్నా ఆ వాసన ముక్కు రంధ్రాల్లో దూరి కడుపులో చేరి భళ్ళున వాంతి అయిపోయే పరిస్థితి ప్రతొక్కరిది

“పాడు వరద. ఎంత పని చేసింది. కడిగి కడిగీ చేతులు పడిపోతున్నాయి. ఎప్పటికి బాగుపడేను ఈ కొంప? దీన్ని శుభ్రం చేసుకోవటం కన్నా వదిలిపెట్టి పోవటం మంచిది” అని గొణుగుతున్నారు ఆడవాళ్లు.

అలా అంటారుగానీ ఆ పనిచేయగలరా..?

ఇంటి మీద కోపం చంటి పిల్లల మీద కోపం లాంటిది. అంటే ఇలా ఒక దెబ్బేసి అలా దెగ్గరికి తీసుకోవటం అన్నమాట. నిజానికి జీవితంలో అప్పుడప్పుడయినా కోపం వస్తుండాలి. కష్టం వచ్చినప్పుడే కోపం వస్తుంది గనుక జీవితం అంటే ఏమిటో తెలిసివస్తుంది.

మధ్య మధ్య చేదు, కారం ఉంటేనే కదా – తీపికి విలువ పెరిగేది. లేకుంటే తీపే కాదు, సుఖమయ జీవితమూ విసుగొస్తుంది.

ఊరు వూరంతా ఇంట్లోని బురదను, దుర్గంధాన్ని బయటకు చీపుర్లతో వూడ్చేసి మళ్ళీ నివాసయోగ్యం చేసుకుంటున్నారు. తడిసి ముద్దయి ఎందుకూ పనికి రాకుండా పోయిన బట్టలు, ధాన్యం, మిషన్లలోకి నీళ్లు పోయి, పాడైపోయిన ప్రిజ్‌లు, ఏసిలు – మట్టి ముద్దల్లా మారిన పరుపులూ అన్నీ ట్రక్కుల కెక్కుతున్నాయి డంపింగ్ ఏరియాకు తరలిపోవటానికి. ఆ రోజు ఆ వీధి వీధంతా ప్రతి ఇంటి ముందూ, ఒక ట్రక్కు ఆగివుంది. అందరూ కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు. ఒక్కోక్క వస్తువు గురించీ ఒక్కరికి నోటంట దానికి సంబంధించిన చరిత్ర, భూగోళాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. వరదలో కొట్టుకొచ్చిన పాముల గురించి సాహసకథలు కొంతమంది నోట వెలువడుతున్నాయి, ‘ఫలానా వాళ్ళ ఇంటికి పాము కొట్టుకొచ్చిందట’ అన్న అద్భుతం ఆ నోటా, ఈ నోటా పడి ఊరంతా వ్యాప్తి చెందుతోంది. వరద నీళ్లు వెనక్కీ, ఇంకా వెనక్కి వెళ్ళి ఏరు నోరు మూగబోయి ఏమీ ఎరగని నంగనాచిల బుద్ధిగా కాళ్లు ముడుచుకొని పడకొని వుంది. ఇదేనా. అప్పుడు అంత ఉగ్రరూపం ధరించి బెబ్బులిలా పంజా విప్పి పేదవాడి బతుకు మీద చావు దెబ్బ వేసిన ఏరు – అని ఆశ్చర్యపోతున్నారు జనం

మొత్తానికి వరదొచ్చి మనుషులందరికీ ఒక జీవిత పాఠం నేర్పిపోయింది. జీవితం అన్న తర్వాత అకస్మాత్తుగా వచ్చి మీద పడే కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఎంత వేగంగా అది దూసుకొని వచ్చిందో అంత వేగంగా అని తొలిగిపోయే అవకాశాలూ ఉంటాయి అన్న ఆశావాదంతో మనిషి జీవించాలి తప్ప – అది శాశ్వతం అన్నట్టు క్రుంగిపోకూడదు.

కష్టాలు మనిషిని రాటు దేలుస్తాయి. ఎంతటి సమస్య నయినా ఎదుర్కోగల గుండె దిటవును ఇస్తాయి.

సాలెపురుగు చెదిరిన గూడును మళ్ళీ మళ్లీ ఎన్నిసార్లయినా – ఎంత ఓపికగా కట్టుకుంటుందో అలాగే మనిషి జీవితంలో వచ్చే నష్టాలు పునరుద్ధరణ దిశగా మనిషిని ఆలోచించేలా చేస్తాయి.

చెరువుకు గండి పడి వరద ఊళ్ళల్లోకి వస్తే ఊరిజనం ఆ గండిని పూడ్చి.. నీటి ప్రవాహాన్ని అక్కడే ఆపరూ. జీవితం అయినా అంతే. గండి పడకుండా చూసుకోకుంటే మునక తప్పదు. వరదైనా జీవితం అయినా అప్రమత్తంగా ఉంటేనే – బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే అదుపులో ఉండి అంతా బాగుంటుంది; అందులో మనమూ ఉండేలా చోటు కల్పిస్తుంది.

Exit mobile version