[బాష్వతి గోష్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Bashvathi Gosh’s poem ‘Kitchen’ by Mrs. Geetanjali.]
~
బాష్వతి గోష్
మీరు నమ్మరు కానీ..
మా అమ్మమ్మకి దాదాపు
ఒక ఏడాదిన్నర కాలం పాటు వంటిల్లే లేదు.
ఆమె అప్పటికి ఇంకా నాకు అమ్మమ్మ కాలేదు మరి.
పదవీ విరమణ పొందిన భర్త
అతి తక్కువ జీతంతో..
కొత్తగా అద్దెకి తీసుకున్న
ఒకటే గది ఉన్న ఇంట్లోకి కొన్న
గిన్నెలు.. కుండలు ఇవే ఉండేవి.
ఆమె వండే కూరలోకి చూరు లోంచి
వాన నీరు కారి కలిసిపోయేది.
మరుసటి రోజు కోసం
ఆమె దాచి పెట్టుకున్న
కన్నీళ్లు కూడా పదిలంగానే ఉండేవి.
ఆమెకింకా తను మాత్రమే
పూర్తి చేయాల్సిన రేపటి కలలున్నాయి.
కానీ ఎందుకో
ఆమె తన వంటగదిని కోల్పోయింది.
అయితే యుగాల తరువాత..
ఆమె తన స్వంత ఇంటిని కట్టుకున్నప్పుడు కూడా
చాలానే కోల్పోయింది..
తనవైనవే అయిన కొన్ని
భవిష్యత్తు లోని రేపటి ఘడియలు కొన్ని..
ఈరోజుల్లోకి పోగుబడి పోయి.,
ఆమె ఎండిపోయిన కళ్ళ గుంటలను భయంతో నింపేసేవి.
కానీ., తరువాత్తరువాత ఆమెకి ఒక వంటిల్లు దొరికింది.
ఎండ పొడే పడని ఆమె 160 గజాల భూమి చెక్కలో..
ఆమెకి తనదైన ఒక ఒక స్వంత వంటగది ఉండేది.
ఆమె.. అంటే మా అమ్మమ్మ
నా బాల్యాన్నంతటినీ
తన స్వంత రుచులతో నింపేసింది.
కొన్ని తీయనైనవి, మరికొన్ని భగ్గుమని మండించే కారపు రుచితో..
ఇంకొన్ని నాలుకని జివ్వు మనిపించే
పచ్చి ఉసిరికాయల పుల్లని రుచితో..
ఇంకా అమ్మాయిలకుండే
చిలిపి తనంతో ఉంటూ
ఉండేవి అమ్మమ్మ చేతి రుచులు!
ఇంతకీ ఆ వంట గది ఎంత ఉండేది అనుకుంటున్నారు?
సరిగ్గా చెప్పుల బాక్స్ అంత ఉండే
ఆ వంటగదిలో ఆమె ఎన్నెన్ని చరిత్రల్ని
సన్నగా పొరలు పోరలుగా తరిగిందని?
ఎన్నింటిని తిరిగి జాగ్రత్తగా
కుదురుగా ఆ చోటనే అమర్చిందని?
పోపు గిన్నెలో అట్లాస్ లేని ఎన్ని భూగోళాలను తిప్పేసేదని?
ఇంకా..పెరట్లో కురుస్తున్న
వాన నీరంత స్వచ్చంగా ఉండే
పోపెట్టిన పులుసనే సముద్రాన్ని
గిన్నెలో చెంచాతో గిర్రున కలియ బెట్టిందని?
మా అమ్మమ్మ వంటిల్లెప్పటికీ
మాలిన్యమే లేని వాన నీరంత స్వచ్ఛ మైనది.
నా బాల్యాన్ని కమ్మని రుచులతో నింపిన
నా అమ్మమ్మ ప్రత్యేకమైన వంటిల్లు
నాకెప్పటికీ ప్రియమైనదే!
~
మూలం: బాష్వతి గోష్
అనుసృజన: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964