Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వంట గది

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘వంట గది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

న్ని కోట్ల యోజనాల పొడవు లోతుల మైదానం
ఎన్ని చేతులు వండినా
అమ్మ తిప్పిన గరిట ముందు బలాదూర్!
జీవితమంత ప్రేమ వంటగది ఆమె

కోడి కూతల కాళ్ళ గజ్జెలు గలగల
అమ్మ పాట చెవుల తీపితీపి రాగాలు
కీర్తన పాడిందా రామదాసాది కృతులు

బిడ్డకు తినిపించే ముద్దముద్దలో
జిహ్వ తడిసిన తీపి కుండ నెనరు
కూరలే కాదు సుమా పచ్చడి మెతుకులు
అమ్మ చేతి వంట అమృతం
పాకశాస్త్రంలో ఆమె సాటిలేరు

అమ్మమ్మగారి అమ్మ నుండి
పాకశాస్త్ర వారసత్వం ఆమెలోంచి అమ్మకు ప్రవహించే
మాటల చేతలు అమ్మ
రెక్కల కింద దాచుకున్న పిల్లలకు ప్రేమ మీర నేర్పింది
మమతలు తరాలు మారినా
మారని గొప్పది ఆమె మనసు వంట.

అమ్మ లేని జీవి ప్రపంచాన లేదు
ఆమె
మమతలు పలికే స్వరం
గోరుముద్దల చందమామ పాటల పాల బువ్వ

వేడి సెగలు వండిన చిటపటల గటుక కూడా
పుష్టినిచ్చే అమ్మ చేతిదే

నడిచే వంటగదిలో పచారు
కూరలో కరివేపాకు తీరు
ఆరోగ్య పరిరక్షణలో తొలిమెట్టు

ఆమె చేతివంట ఏ అవార్డులూ కోరని ప్రియ ప్రేమ
అమ్మా! కడుపు నిండిందే అనే కొడుకు మాటకు
ఎగిరి గంతేసే, ఎగిరే కురుల కాలర్ సరిచేసే మనసు
నాకైతే ఆమె ఎనలేని బతుకు ఛాయ

Exit mobile version