[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’.]
పొద్దున్న పొద్దున్నే పంకజం పిన్ని దగ్గర్నించి ఫోన్. పొద్దున్నే వచ్చే వదిన ఫోన్లతోనే చిరాకు వస్తుంటే ఈ పంకజం పిన్ని కూడా పొద్దున్నే మొదలెట్టిందా యేవిటీ అనుకుంటూ ఫోనెత్తేను.
నేను “హలో పిన్నీ” అనగానే, “మీ వదిన ఇలా చేస్తోందేవిటే!” అనేసింది పిన్ని.
నాకు వదిన ఏ చేయరాని పని చేసిందోనని హడిలిపోయేను.
“ఏం చేసింది పిన్నీ!” అనడిగేను.
“అంటే నిన్నింకా అడగలేదా!” ఆశ్చర్యంగా వినిపించింది అవతల్నించి పిన్ని గొంతు.
వదిన పిన్నిని డబ్బేమైనా అడిగిందా అనుకుంటూ, “ఏవడగాలి పిన్నీ!” అనడిగేను అసహనంగా.
“అదేనే, నాకు చేసింది. వరలక్ష్మికి చేసింది. సుందరమ్మొదినకి చేసింది. బంగారింటికి కూడా చేసిందిట..”
“దేనికోసం పిన్నీ.. ఏవైనా డబ్బు లడిగిందా!”
“ఛ.. ఛ.. మీ వదినకి డబ్బు లవసర మేవుందే! తనే ఇస్తుందో పదిమందికి”
పిన్ని మాటలు వింటున్న నాకు సహనం నశించిపోయింది.
“మరెందుకు చేసిందీ ఇంతమందికీ!” కోపంగా అడిగేను.
“అదికాదే, మీ వదిన ఏ ఊరైనా వెడుతోందా!”
అసలు సంగతి చెప్పకుండా అఖ్ఖర్లేని ప్రశ్నలు వేస్తున్న పిన్నిని గట్టిగా అడిగేను.
“ఆ మాటేదో, మా వదిన్నే అడగొచ్చుగా మీకందరికీ ఫోన్ చేసినప్పుడూ. నన్నడిగితే నాకేం తెలుస్తుందీ!”
పిన్ని గొంతు శృతి కాస్త తగ్గింది.
“అహా.. అది కాదే. పొద్దున్నే మీ వదిన మా అందరిళ్ళకీ ఫోన్ చేసి మీ అన్నయ్య ఓ వారం రోజులపాటు భోంచెయ్యడానికి వస్తాడని చెప్పింది. ‘ఏవమ్మా, ఊరేవైనా వెడుతున్నావా’ అనడిగితే లేదంది. వాడికి భోజనం పెట్టడానికి మనిళ్ళల్లో ఇబ్బందేం వుంటుంది కానీ, తను ఊళ్ళో ఉండి కూడా మీ అన్నయ్యని ఇంకోళ్ళింటికి భోంచెయ్యమని ఎందుకు పంపుతోందో మా కర్థం కాలేదు. నీకు మీ వదిన విషయాలు తెలుస్తాయి కదాని నిన్నడుగుతున్నాను.”
పిన్ని మాటలు విన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
అసలు వదిన ఏ పని చేస్తున్నా ముందు నాకే చెపుతుంది. అలాంటిది, నాకేవీ చెప్పకుండా వీళ్ళందరితో మాట్లాడిందంటే ఏదో నాకు నచ్చని విషయవే అయ్యుంటుంది అనుకుంటూ, ఆ మాట పిన్ని దగ్గర దాచేస్తూ, “ఇప్పుడే చూసేను పిన్నీ, పొద్దున్నించీ వదిన దగ్గర్నించి రెండు మిస్డ్ కాల్సున్నాయి. ఇప్పుడే సంగతేవిటో కనుక్కుని చెప్తాను.” అంటూ ఫోన్ పెట్టేసేను.
వెంటనే వదినకి ఫోన్ చేద్దామనుకున్నదానిని ఆగిపోయేను. పని చేసుకుంటూ ఆలోచించేను. నాకు కాకుండా వదిన వీళ్ళందరికీ ఫోన్ చేసిందంటే వదిన నా దగ్గర ఏదైనా దాస్తోందా అనుకుని ఫోన్ చెయ్యబోయి మళ్ళీ ఆగిపోయేను. నా దగ్గర దాచవలసిన విషయమైతే నేను అడిగినంతలో చెప్పదు కదా అనిపించింది.
మరి వీళ్ళందరూ నాకు చెప్పకుండా ఉండరని వదినకి తెల్సు కదా! అసలు తను ఊళ్ళోనే ఉంటూ వీళ్లందరిళ్ళకీ అన్నయ్య భోజనాని కొస్తాడని చెప్పడమేవిటీ వదినా! ఎంత ఆలోచించినా నా బుర్ర కేవీ తట్తలేదు. ఇంక టెన్షన్ భరించలేక వదినకి ఫోన్ చేసేను.
ఫోన్ ఎత్తుతూనే, “ఎప్పుడో చేస్తావనుకున్నాను, ఇంతాలస్యం చేసేవేంటీ!” అంటూ నవ్వుతూ అన్న వదిన మాటలకి చిర్రెత్తుకొచ్చింది.
నాకు తెలీకుండా చుట్టాలందరికీ ఫోన్లు చేసేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు నన్ను చూసి నవ్వుతుందా! నేనేవైనా తక్కువ తిన్నానా.. అనుకుంటూ, “అహా ఏం లేదు.. అన్నయ్యని భోజనానికి పంపించడానికి నీకు మా ఇల్లు గుర్తు రాలేదేవిటా అని అడగడానికి చేసేను.” అన్నాను అసలు విషయం నాకు తెలిసిపోయిందన్నట్టు.
“మీ ఇంటికి అస్సలు పంపకూడదు మీ అన్నయ్యని, ఎందుకంటే మీ అన్నయ్యకి ఎంచక్క ఎలా కావాలో అలాగ ఎంతో ప్రేమగా చేసి పెడతావ్.” అంది.
“అసలు సంగతేవిటో చెప్పు వదినా, ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను.”
“సరే విను. నీకు మీ అన్నయ్య సంగతి తెల్సుకదా.. ఏం చేసినా దానికి ఏదో ఒక వంక పెట్టకుండా తినరు. పెళ్ళైన కొత్తలో ఆ కామెంట్లన్నీ నిజవే ననుకుని, ఎంతో కష్టపడి మీ అన్నయ్యకి ఇష్టమయేవన్నీ రుచిగా చెయ్యడం నేర్చుకున్నాను. ఎంతలా చేసినా సరే, దానికి వంక పెట్టే కారణం లేకపోతే ‘మొన్న చేసినట్టు లేదోయ్’ అంటారే తప్పితే ఏ పూటా కంచం ముందు కూర్చుని తినేదాన్ని ఎంజాయ్ చేస్తూ తినడమనేది లేదు. కొన్నాళ్ళు ఉడుక్కునేదాన్ని, ఇంకొన్నాళ్ళు దెబ్బలాడేదాన్ని.. అన్నీ చేసి ఇంక ఈయనగారి స్వభావమే ఇదనుకున్నాక నా మనసు శాంతపడింది. అప్పట్నించీ తింటున్నప్పుడు మీ అన్నయ్య ఏ కామెంట్ చేసినా పట్టించుకోవడం మానేసేను. అప్పట్నించీ నాకెంతో మనశ్శాంతిగా ఉంది.
కానీ, నిన్న ఏ మూడ్‌లో ఉన్నారో వంకలు పెట్టడం మరీ ఎక్కువైపోయింది. ఆ పిన్నిని చూడూ, ఈ వదిన్ని చూడూ ఎంత బాగా చేస్తారో అంటూ పోలికలు కూడా మొదలెట్టేరు. ఇంక నాకూ విసుగొచ్చేసింది. ‘అలాగైతే వాళ్ళింటికే వెళ్ళి తినండీ’ అన్నాను. ‘చక్కగా వెడతాను, హాయిగా కడుపునిండా తింటాను.’ అన్నారు.
అంతే, ఇవాళ లేస్తూనే ఆయనముందే వాళ్ళందరికీ ఫోన్లు చేసేసి మీ అన్నయ్య వాళ్ళింటికి ఓ వారంపాటు భోజనానికి వస్తారని చెప్పేసేను.”
“దానివల్ల నీకేంటి లాభం! అన్నయ్య వాళ్ళిళ్ళల్లో ఎంచక్క తిని నీ వంటకి ఇంకా వంకలు పెట్టొచ్చుకదా! అయినా నువ్వు ఊళ్ళో ఉండగా అన్నయ్య వాళ్ళింటికి భోజనానికి రావడవేంటో అర్థం కాక వాళ్ళు నన్నడుగుతున్నారు.”
“నువ్వేం చెప్పేవూ!”
“నిన్నడిగి చెపుతానన్నాను.”
“ఉండుండు.. మీ వరలక్ష్మి ఫోన్ చేసింది. ఇప్పుడే మళ్ళీ చేస్తాను.”
ఈసారి నేను ఉగ్గబట్టుకుని కూర్చున్న ఓ పావుగంట దాటేక వదిన దగ్గర్నించి ఫోన్ వచ్చింది.
ఫోన్ ఎత్తగానే తెరలు తెరలుగా వదిన నవ్వు. అలా నవ్వుతూనే ఉంది. ఆపదే ఎప్పటికీ..
“ఏవైంది వదినా, ఎందుకు నవ్వుతున్నావ్!”
వదిన బలవంతంగా ఆపుకున్నట్టుంది నవ్వుని, “సరిగ్గా నేననుకున్నట్టే అయింది. మీ వాళ్లందరికీ తెల్సుగా మీ అన్నయ్య సంగతి. ఏదైనా మొహమ్మీదే అనేస్తారు, అస్సలు చాటూమాటూ లేదు. అల్లాగే ఇదివరకు కూడా వాళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వంటల గురించి ఏదో అన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ మీ అన్నయ్య భోజనానికి వస్తున్నాడంటే అవన్నీ గుర్తొచ్చుంటాయి. ఏదో ఓ పూటయితే ఊరుకుంటారు కానీ, వారం పాటు ఈయన్ని భరించడం వాళ్ళ వల్ల కాదనుకున్నారో ఏవో.. ఒక్కొక్కరూ ఫోన్ చేసి, ఊరు వెడుతున్నావనొకరూ, ఈ మధ్య ఒంట్లో బాగులేక వాళ్ళే చప్పిడితిళ్ళు తింటున్నావని ఇంకోరూ, మధ్యమధ్యలో పెళ్ళిళ్ళూ అవీ ఉన్నాయని మరొకరూ ఇలాగ ప్రతివాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి మీ అన్నయ్యని వాళ్ళింట్లో ఓ వారంపాటు భోజనం పెట్టలేకపోయినందుకు విచారం వెలిబుచ్చేరు.”
“అందరి ముందరా అన్నయ్యని చిన్నబుచ్చడానికి కాపోతే అసలు ఇదంతా నువ్వెందుకు చేసినట్టూ!”
“హబ్బో మహా దిగొచ్చిందమ్మా ముద్దుల చెల్లెలూ. ఏదో ఓసారి వంట కుదరకపోతే బాగులేదంటే ఊరుకోగలను కానీ, ప్రతి పూటా ఎంతో శ్రధ్ధగా ఆయనకి కావల్సినవి కావల్సినట్టు చేసిపెడుతుంటే, చక్కగా తినకుండా.. మెచ్చుకోకపోవడం మాటటుంచి లేని వంకలు కూడా గుర్తు చేసుకుని మరీ సతాయిస్తారా! అసలు అన్నం ముందు కూర్చుని, అన్నపూర్ణలా వడ్డించిన ఇల్లాలి మనసు తెలుసుకోకుండా, ప్రతిదానికీ రంధ్రాన్వేషణ చేసే వాళ్లకి ఇలాగ ఒకసారి చేస్తే కానీ తెలిసిరాదు.
ఇన్నాళ్ళూ మా పిన్నీ, మా వదినా అంటూ మురిసిపోయిన మీ అన్నయ్య వాళ్ళ మాటలు వినగానే సైలెంటయిపోయేరు. ఇంకేం మాట్లాడుతార్లే! ఆయన అనేది పడేది నేనొక్కదాన్నేనని తెలిసేక మాట్లాడకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయేరు. మీ అన్నయ్యకి ఈ సంగతి తెలియాలనే ఇలా చేసేను.
ఒక్క మీ అన్నయ్యకే కాదు స్వర్ణా, ఇంట్లో వాళ్లందరూ కడుపునిండా తినాలని కమ్మగా వండిపెట్టే భార్యల్ని చిన్నచూపు చూసే మగవాళ్లందరికీ ఇలాగే చెయ్యాలి.
ఇంక కొన్నాళ్లపాటు మీ అన్నయ్య నా వంటకి వంకలు పెట్టరనే అనుకుంటున్నాను. ఏవంటావ్!” అంటున్న వదిన మాటలకి ఏవనాలో నాకు తోచలేదు. కానీ అవునేమోనని మటుకు అనిపించింది.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.