Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వ్యాసఘట్టాల నారికేళాల నుండి నవీన వ్యాసాల నవనీతాల వరకూ.. డా. ఏల్చూరి గారి విశ్వముఖీనం

[ఏల్చూరి మురళీధరరావు గారి ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు ప్రొ. అయినవోలు ఉషాదేవి.]

ధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచీన కవిపండిత కాలపు మేధాసంపత్తితో, విద్వాంసులుగా గణించదగ్గ విశిష్ట సాహితీవేత్త, విద్వన్మణి డా. ఏల్చూరి మురళీధరరావు గారు. మొదట్లో నాకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదు. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా అనుకోకుండా విద్యాత్మక పరిచయం ఏర్పడింది.

ఈ ఉద్గ్రంథ వ్యాససంపుటికి సమీక్ష రాయమని అడిగినప్పుడు ముందుగా బృహత్ పుటలను చూసే భయపడ్డాను. తరువాత వ్యాసానుక్రమణిని చూసి, కొన్ని కొన్ని వ్యాసాలు కొన్ని కొన్ని పుటలు చదివి ‘అమ్మో’ అనిపించింది, నేను రాయలేనని చెప్పేశాను. కానీ మెల్లిగా చదవగా, చదవగా ‘ఉజ్జ్వలమతి’ యైన ఈ పండితుని నుండి కొంతలో కొంత ‘బోధశాలి’నై ‘నా నేర్చిన భంగి’ సమీక్షకు సిద్ధమయ్యా. ఏమంటే, నేను ప్రధానంగా భాషాశాస్త్ర విద్యార్థిని. సాహిత్యం నాకు అభిరుచే తప్ప లోతులు తెలియనిదాన్ని. అందుకే ఈ ప్రారంభం లోనే నా పరిమితులు చెప్తే విజ్ఞులు ఈ నా ప్రయత్నంలోని లోపాలు మన్నిస్తారని అనుకొంటున్నా.

సారస్వతం, సాహిత్యం, వాఙ్మయం అనే పదాలను పర్యాయ పదాలుగా నిఘంటువులు చెప్పినా, వీటి మధ్య భేదాలు ఉన్నాయి. ఈ గ్రంథవిషయంలో సాహిత్యం అనే మాటే ఈనాడు విస్తృత వినియోగంలో ఉండటం వల్ల నాకు మాత్రం గ్రంథశీర్షిక కింద ఉన్న ‘సాహిత్య వ్యాస సంపుటి’ అనేదే సరళంగా అనిపించింది. ‘వ్యాసఘట్టం’ అనే సాంకేతిక పదబంధాన్ని గురించి మొట్టమొదటి సారిగా తెలుసుకున్నా – అర్థంతో సహా ఇందులో వివరంగా.

ఈ ఉద్గ్రంథం మొత్తంగా చూస్తే ఒక్కొక్క వ్యాసఘట్టం ఒక్కొక్క సిద్ధాంత గ్రంథం అనుకుంటూ అట్టమీద చూద్దును కదా, నిజంగానే ఈ గ్రంథంలోని గణపవరపు వేంకటకవిపై కనిపించే వ్యాసఘట్టం ఆయన పిహెచ్.డి సిద్ధాంత గ్రంథభాగమే! ఆ కోణం నుండి చూస్తే ఒక్కో వ్యాసం ఒక్కొక్క సిద్ధాంతవ్యాసంగా గుర్తించాలి. అంటే ఈ వ్యాసరచన ఎంత సంక్లిష్టమో బోధపడుతుంది. ఈ ‘వ్యాస’ అన్న పదంలోనే శ్లేష స్ఫురిస్తుంది. వ్యాసఘట్టాలకు గ్రంథగ్రంథులు అని మరొక పేరట! ఇవన్నీ పండితులకు తెలుస్తాయి. కాస్తో కూస్తో సాహిత్యం చదివిన వాళ్ళు కుతూహలంతో కొత్తగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి.

ఈ వ్యాససంపుటిలోని మూడు వ్యాసాలు (పు. 250-300 లు) నేను వాటిని వేరే ఒక పుస్తకంగా పరిగణిస్తా. అసలైతే ఒకే సంపుటంగా వేసినా ఈ గ్రంథం నాలుగైదు విడి సంపుటాల సమీకరణమే.

వ్యాసఘట్టాలన్నీ గురుముఖతః సంస్కృత, తెలుగు కావ్యాలు చదువుకున్న పండిత కవులకు మాత్రమే అర్థమయ్యే ప్రౌఢమైన విషయాలు. అంటే, ఏల్చూరి మురళీధరరావు గారి మాటల్లోనే, “వ్యాకరణ పాండిత్యం, వ్యాఖ్యాన సాహాయ్యం” తప్పని సరిగా కావాలి. అందుకే తెలుగులోని కావ్యాలలో కొన్నిటికి అనేక వ్యాఖ్యానాలు చూస్తాము. ఆ శిక్షణ లేకుండా వీటిని చదవటం మొల్ల చెప్పినట్లు, “మూగ చెవిటి వారి ముచ్చట” అవుతుంది. అంటే గ్రంథకర్తే చెప్పినట్లు, “అప్రతీత పదప్రయోగాల వల్ల”, “అన్వయక్లేశం మూలాన”, “భావఫ్రౌఢత కారణవశాన” అర్థబోధ దుష్కరమౌతుంది.

ఇందులో నన్నయతో ప్రారంభమైన వివేచన నన్నెచోడుడు, శ్రీనాథుడు, పోతన, బొప్పన గంగన (భాగవత భాగస్వామి), ధూర్జటి, తెనాలి రామలింగ/కృష్ణుడు, గణపవరపు వేంకటకవి మొదలైన వారి కృతుల్లోని అసాధారణమైన అంశాలూ, కవితల్లోని సంక్లిష్ట అన్వయాలు, అసలు ఎవరెవరు ఏం రాశారు? అవి వాళ్ళ స్వీయ రచనా, కాదా? ఎవరెవరు ఎక్కడి నుంచి భావనలు, కల్పనలు ఛందస్సు, భాషాలంకారాలతో సహా “చౌర్యం” చేశారా? లేదా? వంటివన్నీ ఎక్కడెక్కడి నుండో వెలికితీసి అసలు నిగ్గు చూపారు. పూర్వపరిశోధనలలోని కొన్ని ప్రతిపాదిత అంశాలను సున్నితంగా పూర్వపక్షం చేశారు. అందుకోసం ఎంతో శ్రమతీసుకొని సమాచారం సేకరించారు. ఈ ప్రయత్నాలలో ఆయనకు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం ఉండటం వల్ల మద్రాసు నివాసం బాగా కలిసివచ్చింది. ఎంతో ప్రతిభతో వ్యుత్పత్తిని జోడించి తార్కిక, విశ్లేషణాత్మక వివరణలతో కావ్యతాత్పర్యాన్ని నిర్ధారించే తీరు ద్వారా తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసే, చేయాలనుకునే వారికి వివిధ శాస్త్రీయ పద్ధతులను పరోక్షంగా సూచించారు. తాము చదివిన కావ్యాలు, పద్యస్ఫురణలు వేరే కావ్యాలు చదువుతున్నప్పుడు కలగడం, వాటిని శోధించి మనకందించడం! ఇవి కేవలం తెలుగు కావ్యాలకే పరిమితం కావు; సంస్కృత కావ్యాల నుండి కూడా తెచ్చి సోపపత్తికం చేస్తారు. ఉదాహరణకు – వేణీసంహారం, ప్రచండ పాండవ నాటకాల లోని సన్నివేశాలే ‘నన్నయ విశాల వైదుష్య వాక్ప్రపంచం’ లోని, సినిమా ద్వారా ప్రాచుర్యం పొందిన రెండు పద్యాలు “ధారుణి రాజ్యసంపద..”, “కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్..” పద్యాలుగా రూపుదిద్దుకున్నట్లు తాను కనుగొన్న విశేషాన్ని మనకు అందించి ఆనందింపజేశారు.

సంస్కృత వేద వేదాంగ ఉపనిషత్ సాహిత్యాలతో ప్రాచీన కాలం నుండీ తెలుగువాళ్లకు ఎంతో సాన్నిహిత్యం. 19/20 శతాబ్దాలకు పూర్వం సాహిత్యశిక్షణ ముందు సంస్కృతంతోనే ప్రారంభ మయ్యేదని చారిత్రికంగా తెలిసినదే. ‘ఆంధ్ర’ పదం మూలాలు ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నాయని ఆంధ్రము – తెనుగు – తెలుగు మాటల చర్చలో పండితులు పేర్కొన్నారు (భద్రిరాజు కృష్ణమూర్తి, 1974). ఈ వ్యాసంలో “ప్రాణశక్తికి పరబ్రహ్మం ‘ఉపలక్షకం’ ఎట్లాగో, “అన్నమన్నాదం”గా ఎట్లా స్థితిమంతమవుతుందో, నిర్గుణమైన పరబ్రహ్మం నుండి సగుణమైన సృష్టి ఏర్పడిందని మహిదాసుడు ఎట్లా నిరూపించాడో వంటి వైవిధ్యవిషయాలతో ఆత్మస్వరూపం తెలిసే విధమూ, తద్వారా అమృతత్వం సిద్ధిస్తుందని, అదే బ్రహ్మవిద్య అనీ విస్తృతంగా ఆసక్తి జనించేలా వివరించారు.

‘గరుడ పురాణం’ అనగానే తెలుగువాళ్ళు “అదేదో ప్రేతకల్పమో, శ్రాద్ధక్రియాకలాపమో” అనుకుంటారనీ, కాని అట్లా అనుకోవాల్సిన అవసరం లేదంటూ సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఉన్న అనేక అంశాలను, భేదాలనూ వివరించారు. (ఇది చదవడం వల్ల పెద్దల నుండి ఏర్పడ్డ నా అపోహా తొలగిపోయింది).

భారతీయ సంస్కృతిలో నైమిశారణ్యం ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుసుకోవటం ద్వారా దాన్ని సందర్శించటమే ఒక చక్కటి అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుందని అర్థం అవుతుంది. పోతన వర్ణించిన ఈ అరణ్యవైభవం లోని పద్య వివరణ సరికొత్త ఆనందం కలిగిస్తుంది.

అట్లాంటివే మరెన్నో విశేషాలు తర్వాతి వ్యాసాలలోనూ కనిపిస్తాయి. ఎవరూ ఊహించలేని విధంగా పోతన, నన్నెచోడుల కావ్యాలలో చిత్రించిన ‘మన్మథుని రథనిర్మాణం’ గురించిన వ్యాసఘట్టం ఈ ఇద్దరి కవుల రథ నిర్మాణ వర్ణనల మధ్య సాదృశ్యాలను ఒక్కొక్క భాగాన్నీ దాని సాంకేతిక నిర్మాణంతో పోల్చి నన్నెచోడుని వర్ణన పద్యం వెలవెల గానూ, పోతన పద్యం అపరంజి బొమ్మ వలెనూ ఉన్నట్లు విశ్లేషించారు. అందుకు కారణం నన్నెచోడుని పద్యంలోని వస్తువులన్నీ రాశి పోసినట్లు ఒక పద్ధతంటూ లేకుండా ఉండటమే కాని, పోతన పద్యంలోని క్రమపరిణామం లేదన్నారు. రథానికి ముఖ్యమైన గొడుగు, జెండా వంటివాటిని నన్నెచోడుడు వర్ణించలేదని కూడా మనకు సూచన అందించారు. వేర్వేరు కాలాలకు చెందిన కవుల ఒకే వర్ణన పద్యాలు తట్టడం, వాటిని విశ్లేషించడం ఎందరికి సాధ్యం?

ఇక శ్రీనాథుణ్ణి చదివి, అర్థం చేసుకోవడమే కష్టం, అందులోనూ అన్నీ కావ్యాలు చదివే వాళ్లు తక్కువ. ఏల్చూరి గారు ‘తథ్యమిథ్యావివేచన’ చేస్తూ శ్రీనాథుని “ఆంధ్రీకరణశిల్పం, కవిత్వాదర్శం, శబ్దసంయోజనలో ఔచిత్యం“ ఇవన్నీ చర్చించారు. అనేక సంస్కృత గ్రంథాలలోని వ్యాకరణ, అలంకారాలు, ఇతర కావ్య లక్షణ పరిజ్ఞానం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

ఒక పరిశీలన, పరిశోధన అంశాన్ని నిర్ధారించడానికి కేవలం సమర్థించే అంశాలే వెదికితే చాలదు, పూర్వపక్షం చేసే వాదనలు కూడా వెతకాలి. దానికి భాషేతర తర్క, మీమాంసల వంటి అనేక శాస్త్రాల విజ్ఞానం కూడా కావాలి. వీటితో సహా రచయిత పేర్కొన్న దండి, భామహుడు, రాజశేఖరుడు, వామనుడు ఉద్భటుడు, రుద్రటుడు, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు వంటివారి రచనల పరిజ్ఞానం రచయితకు ఉన్నంత కాకపోయినా కనీస పరిజ్ఞానం అయినా లేకపోతే ఈ వ్యాసఘట్టాల సారాంశం బోధపడటం కష్టం, క్లిష్టం. ”ఊహ తెలియం గల” ‘సహృదయ’ పాఠకులు దొరకటం చాలా ఆనందకరం. అలాంటివాళ్లు ఈ గ్రంథానికి ఉన్నారని వివిధ అంతర్జాల, అచ్చు పత్రికలలో ఈ వ్యాసాలు ముద్రితమయినప్పుడే తెలిసింది.

తెలుగు సాహిత్యంలో ఏదేని ఒక కావ్యం చదివితే దానిలోని సొబగులు “పచ్చకప్పురపు వాసన తోడి ముఖారవింద తాంబూలపు మోవి” పరిమళాన్ని ఆస్వాదించినట్లు ఉండాలట! అదేంటో తెలియాలంటే హాలుడితో మొదలుపెట్టి కాళిదాసు, కాటయ వేముడు, శ్రీనాథుల వరకు ఏల్చూరి గారి వెంట సాహితీయానం చేయాలి. అప్పుడు మన తెలుగు కవులంతా అనువాదకులో, అనుసృజనకారులో, లేదా వస్తు భావ చోరులో, అంతేకాదు, నచ్చినదంతా యథేచ్ఛగా తమ స్వీయ కవిత్వంగా మార్చుకోగల నేర్పరులో తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు ఈ ప్రాచీన వ్యాసఘట్టాల నారికేళ రసాస్వాదన కోసం రచయిత “వరివస్య” లో తామూ చేరాల్సిందే! నిజంగా ఇంత శ్రమ తీసుకుని, ఇన్నిన్ని విషయాలు సేకరించి, విశ్లేషించి ఇలా కూర్చడం అనితరసాధ్యం.

ఇట్లా తెలుగు సాహిత్యంలోని చిక్కుముళ్లను ఏల్చూరి గారి సాయంతో విప్పుకుంటూ ముందుకు సాగుతుంటే, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యలో అకస్మాత్తుగా పాట ప్రత్యక్షమైనట్లు మనకు చైనీస్ సాహితీవేత్త ‘ఛు యువాన్’ ప్రత్యక్షమవుతాడు. సరే! ఎలా, ఎందుకు వచ్చినా – మనకు తెలియని ఒక ప్రపంచ మహాకవి తెలుస్తాడు. అందుకు మనం ఏల్చూరి గారిని అభినందించకుండా ఉండలేం. ఛు యువాన్ రాసిన కవిత ‘నదీతరణం’. అదొక అమోఘమైన కవిత అంటూ, “విజ్ఞానపు నిండైన వెలుగును అజ్ఞానాంధకారం ఆవరించి ధర్మం అధర్మంగానూ, అధర్మం ధర్మంగానూ మారిన రోజులలోని నైతిక పతనాన్ని చూడలేక తలవంచి తప్పుకొని పోవడమే కర్తవ్యమని..” అన్న సుదీర్ఘ వాక్యంలో వివరిస్తారు. ఇవి నిజంగా అక్షర సత్యాలే కదా! ఆయన కవితా వాక్యపు ఆంగ్ల అనువాదం

“A thousand miles away my heart doth yearn.. Oh soul return”

అన్న వాక్యాలు హృదయాలను బరువెక్కిస్తాయి. “తీయన్మెన్” గురించి “దానికున్న అనువాదాల సంఖ్య తక్కువేమీ కాదు” అనడం రవీంద్రుని గీతాంజలికి తెలుగులో వచ్చిన అనేక అనువాదాలను గుర్తుకు తెస్తుంది.

తెలుగు కవులలో “వాణి నా రాణి” అన్నాడని పేర్కొనే పిల్లలమర్రి పినవీరభద్రుని కావ్యాల గురించీ, ఆయన సాహిత్యిక, చారిత్రిక విశేషాలను చర్చించే వ్యాసాలున్నాయి (పు. 353-417 లు). పండితులూ కవులూ అయిన ఆయన పూర్వీకుల గురించి ఎన్నో ఆధారాలు వెదికి, వెలికి తీసి చర్చించారు. శాకుంతలంలోని చిల్లర వెన్నమంత్రి పద్యం ఆధారంగా పినవీరభద్రుని అలభ్యకృతులైన 1. అవతార దర్పణము 2. నారదీయము, 3. మాఘ మాహాత్మ్యము, 4. మానసోల్లాస సారము 5. మనువంశ పురాణము గ్రంథాలను గురించి తాను సేకరించిన సమాచారం చర్చించారు. అలాగే లభ్యమైన రెండు రచనలు – శృంగార శాకుంతలము, జైమిని భారతములపై రాసిన మరో వ్యాసంలో శాకుంతలంపై ఎవరెవరి ప్రభావాలున్నాయి అని సాకల్యంగా చర్చించి, రాఘవభట్టు ప్రభావం ఉందని చూపిస్తూనే కవి తనదైన ఇష్టానుసారం మార్పులు చేరుస్తూ రాశాడని నిర్ధారించారు. ఎలాంటి చోట్ల ఏయే మార్పులు చేశాడో చూపించారు (పు.385).

జైమిని భారతము గురించి రాస్తూ పిల్లలమర్రి అదే పేరుతో అనువదించినా (జైమిని రచనోదంతాన్ని ప్రస్తావించలేదన్నారు (పు.394). రాజనాథ డిండిముని సాళువాభ్యుదయములోని భావాలూ కల్పనలూ పినవీరనలో కనిపిస్తాయని చూపుతూనే ఆ కావ్యం ముద్రణ ఇంకా జరగాల్సి ఉందనటం వల్ల ఈ విషయాలు ఇతఃపూర్వం ఎవ్వరూ ప్రస్తావించలేదని తెలుస్తోంది. మూడవ వ్యాసంలోని చర్చను పరికిస్తే ఒక సాహిత్య చరిత్రకారుని నిశిత పరిశోధన ఏ విధంగా ఉంటుందో, ఉండాలో అర్థమవుతుంది. ఈ గ్రంథమంతటా కూడా ఇదే ప్రతిఫలిస్తుంది.

నన్నెచోడుడు అనగానే కుమారసంభవము మాత్రమే సాధారణ సాహిత్యవిద్యార్థికి స్ఫురిస్తుంది. ఏల్చూరి వారు ఈ కావ్యం లోని ‘అలిధమిల్ల’అనే ఆరవ ఆశ్వాస పద్యాన్ని తెనాలి రామకృష్ణకవి తన ‘కందర్పకేతు విలాసము’లో అర్థచౌర్యం చేశాడన్న మానవల్లి రామకృష్ణకవి గారి అభియోగాన్ని వివిధ సంస్కృత, తెలుగు కావ్యాల సందర్భసహిత అంశాలతో బేరిజువేసిన తీరు అనితరసాధ్యమైనది.

సాధారణ సాహిత్య పాఠకులకు తెలియని, తెలిసే అవకాశం లేని నన్నెచోడుని ‘కళావిలాసము’ లోని కొన్ని అంశాలను తీసుకొని కర్తృత్వ నిర్దేశనంతో సహా ఎంతో శ్రమతో సేకరించిన సమాచారంతో తులనాత్మకంగా చర్చించారు.

ఈ సంపుటిలోని ఒక ముఖ్యమైన వ్యాసం సుబంధుని ‘వాసవదత్తా కథ’ తెలుగు సాహిత్యాన్ని ఎట్లా ప్రభావితం చేసిందో వివరిస్తుంది. ఆఖ్యాయికా కథా ప్రక్రియల చర్చలో ముద్రణలో దొరకని అనేక విశేషాలను వాసవదత్తకు గల ఇరవైరెండు వ్యాఖ్యానాలను ఉదాహరిస్తూ విశదీకరించారు. ముద్రిత ప్రతులలోని వివరాలనూ పాశ్చాత్యుల ఉపపత్తులతో వివరించారు. ఒక విషయాన్ని గురించిన జిజ్ఞాసకోసం వీలయినంత సమగ్రపరిశీలన ఎట్లా చెయ్యాలో, దానికి వివరాలను ఎంత కష్టపడి సేకరించాలో ఈ వ్యాసం చదివితే తెలుస్తుంది. “చరిత్రలో అనేక మంది సుబంధులు, అనేక వాసవదత్తా కావ్యాలు కానరావడం పెక్కు వివాదాలకు కారణమైంది” అన్న వ్యాఖ్య గమనించదగ్గది. ఇంతా చెప్పి, ఇంకా చెయ్యాల్సిన పరిశోధన చాలా ఉందని అంటూ, “ఇక తెలుగు కవుల రచనలపై సుబంధుని మహాప్రభావాన్ని పరిశీలింపవలసి ఉన్నది” అని ఆసక్తి గల భవిష్యత్ పరిశోధకులకు పరిశోధనాంశం సూచించారు.

కానీ, ఈ వ్యాసాలన్నింటిలోనూ నాకు మరీ విశిష్టమైనదిగా అనిపించిన వ్యాసం ‘సాహిత్య చరిత్రలో కనీ వినీ యెరుగని పర్యాయ పద కావ్యం’ చర్చ. ఇది ఇప్పటివరకూ ఎవరికీ తెలియని గణపవరపు వేంకటకవికి ఆపాదింపబడ్డ చౌర్య కళంకాన్ని సవిస్తరంగా తెలుపుతూ ఆ కావ్యం సాహిత్యచరిత్రలో మునుపెన్నడూ లేని ‘ఒక అపూర్వమైన పర్యాయ పద కావ్యం’ అన్న విశేషాన్ని మనకు బోధ పరుస్తుంది.

ఈ సంపుటిలోని మొదటి వ్యాసంలో చర్చించిన తెలుగు సాహిత్యంలోని అత్యంత ప్రౌఢమైన పద్య చర్చా, అష్టాభాషా సీస పద్య చర్చా తెలుగులోని అవధాన విద్య వలె అపురూపమైనవి.

ఇట్లా ఇందులోని వ్యాసఘట్టాలన్నీ వేప ‘తినగ తినగ తియ్యగా’ అయినట్లు, చదవగా చదవగా మన అభిరుచీ, ఆస్వాదనా తియ్యనై , ‘మాధురీ భరిత’ మౌతుంది.

మంజరీ ద్విపదలలో అన్నమయ్య రాసిన ‘శృంగార మంజరి’ (పు.259) “కొండ కొమ్ముమీదినుంచి కిందికి దూకే నదీప్రవాహాన్ని పోలిన ఉరవడితో” సాగుతుందట. ఉదాహరణకు: “సర్వజ్ఞు సాకారు, సచ్చిదానందు, సర్వతోముఖరూపు సత్యస్వరూపు” మొదలుగా ఉన్న పంక్తులు. దీనికి ‘శృంగార మంజరి’ అని పేరు ఉన్నప్పటికీ దీనిలో ఉన్నది కేవల శృంగారమే కాదని, ఇది “ఒక భక్తి శృంగార నిర్ఝరి” అనీ, ఒక “యమక రత్నాకరం” అనీ నిర్ధారిస్తారు.

ధూర్జటి మహాకవి, తెనాలి రామలింగ/కృష్ణ కవుల పేరుతో కృష్ణదేవరాయలు సభలో ధూర్జటిపై సగం చెప్పిన పద్యం – “స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీమహిమ..” అన్న పద్యాన్ని రామలింగ కవి పూరించిన తీరు మొదట కేవలం హాస్యస్ఫోరకమైనదే అనిపిస్తుంది; కానీ, ధూర్జటి అన్ని మంచి లక్షణాలను గుర్తించిన రాయల వారి మాటలను చులకన చేయటం సరైనది కాదు కాబట్టి – దాని అసలు అంతరార్థాన్ని వేదాంతపరంగా (శైవం ప్రాధాన్యంగా) సామ్యభావంతో (పుట. 434) పూరించాడని మరో కోణం నుండి చేసిన వివరణ సమర్థనీయంగా ఉంది.

ఈ వ్యాసఘట్టాల వ్యాసాలన్నీ 740 పైచిలుకు పుటల్లో ఉన్నాయి. ఇవన్నీ సాహిత్య చరిత్రకారులకు, ప్రాచీన సాహిత్యంపై అభిరుచి గలవారికి, ప్రాచీన సాహిత్య పరిశోధకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించటమే కాక, భవిష్యత్పరిశోధకులకు మార్గనిర్దేశకంగా కూడా పనికొస్తాయి. ఈ వ్యాసాలు అచ్చైన పత్రికలను చూస్తే కూడా వీటి ప్రాచుర్యం సంగతి తెలుస్తుంది.

ఈ ఘట్టాల దుర్గమారణ్యాల మహావృక్షాల నిర్మాణాలు తెలుసుకుంటూ ముందుకు సాగితే, మనకు సెలయేళ్లతో అనేక ఫలపుష్పభరితమై, పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదపరిచే ఉద్యానవనం వంటి అనేకమంది ఆధునిక కవుల, సాహితీవేత్తల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ వ్యాససంపుటిలో ఆధునిక సాహిత్య విభాగాన్ని గురించిన కొన్ని విశేషాంశాలను ఇప్పుడు చూద్దాం.

ముందుగా నన్ను బాగా ఆకర్షించింది, “ ఆంధ్ర వాగ్గరిమకు నన్నపార్యుడు” అనే జూలూరి అప్పయ్య గారి కథనం. సి.పి. బ్రౌన్ మన్ననలు పొంది అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు రాసిన ఈయన ఆ రోజుల్లో అనేక గ్రంథాలను పరిష్కరించి, ప్రచురణ ప్రతులను తయారు చేశారు. గిడుగు రామమూర్తి పంతులు పదే పదే తమ రచనల్లోనూ ఉపన్యాసాలలోనూ వినిపించినట్లు కావ్యాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు అన్నీ వ్యవహార భాషలో ఉన్నాయన్న విషయం ఇందులోనూ నిర్ధారించబడింది. తరువాతి పండితులు వాటిలో చాలా వాటిని గ్రాంథికంలోకి మార్చి రాసినట్లు ఎందరో గుర్తించారు. జూలూరి అప్పయ “అర్థనిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు బహుళ ప్రమాణ ప్రదర్శనకు వెనుకాడలేదు.” (పుట. 548) అన్నారు. (వ్యాసఘట్టాలకు అక్కడి నుంచే స్ఫూర్తి లభించిందేమో!)

గమనించాల్సిన మరో ముఖ్యవిషయం – అప్పయ రాసిన మనుచరిత్ర వ్యాఖ్యకు అదనంగా విశేషార్థ తాత్పర్యాలను కూర్చి ప్రముఖ సాహితీవేత్త, వృత్తిరీత్యా వైద్యులయిన డా. కోడూరి ప్రభాకరరెడ్డి ఆ ప్రతిని పునఃప్రచురించారని!

“వేయిమంది వ్యక్తులూ, పదివేల సంస్థలూ సాధించలేని విద్యావిజయాలను ఒక్క జీవితకాలంలో సాధించిన” (పు.579) ప్రజ్ఞానిధి వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కృషి గురించి తెలుసుకున్నప్పుడు మహాశ్చర్యంతోపాటు సరికొత్త స్ఫూర్తి కూడా మనలో ఉత్తేజితం అవుతుంది. ఆ కాలపు పరిశోధకులు పాండిత్యంతోపాటు ఎంతటి నిబద్ధత కలవాళ్లో! వారిలో సంకుచిత భావవైషమ్యాలకు చోటు లేనేలేదు. ఆయన జీవితం నుండి అందరూ గుర్తించి ఆచరించాల్సిన విలువైన సమాచారాన్ని ఏల్చూరి వారు ఇందులో చేర్చారు: “తిరుపతి ఓరియంటల్ కళాశాలలో ముస్లిములకు ప్రవేశం లేకపోతే, తన యింటిలోనే ఉంచుకుని చదువు చెప్పి, షేక్ మస్తాన్ సాహెబ్ గారిని కవిని చేశారు” అని (పు.584). ఈనాటి సమాజం ఈ స్ఫూర్తిని గౌరవిస్తే సమకాలీన సమస్యలు సగం దూరమైపోతాయి.

రచయిత తండ్రిగారైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ప్రభావంతోపాటు ఇందులో పేర్కొన్న పెక్కుమంది ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగానే ఈ బృహద్గ్రంథం ఇలా రూపుదిద్దుకున్నదని కూడా భావించాలి.

అబ్బూరి రామకృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్ గా పనిచేశారు. ఎందరో తరువాతి కాలపు పేరుప్రఖ్యాతులు పొందినవారికి దిశానిర్దేశనం చేసిన వారు (వాళ్ళలో ప్రముఖ భాషాశాస్త్రవేత్త, మా గురువు గారు భద్రిరాజు కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు). ఆయన స్వయంగా కవి. మరో వ్యాసంలో ఈయన కావ్య పరిచయం కూడా ఉంది. కానీ ఈయననూ, శ్రీశ్రీని కలిపి “ఆ రెండు మహానగాలు” అని రాసిన వ్యాసంలో వారిద్దరూ “జన్యజనక రాగాలు” అన్నారు.

‘మహానగాలు’ అనే శీర్షికే మనలో కుతూహలం కలిగిస్తుంది. గురజాడ గురించి శ్రీశ్రీ ప్రకటించిన “అడుగుజాడ గురజాడ” అనడం అబ్బూరి ప్రభావమే అన్నారు. ఆ రోజుల్లో అలాంటి ప్రేమాదరాలు గల మహానుభావులు ఉండేవారు.

ఆ తర్వాత మరో వ్యాసంలో శ్రీశ్రీ ‘ఛందో బందోబస్తు’ లన్నింటినీ తెంచివేయడానికి గల కారణాలను శ్రీశ్రీ ఎక్కడా చెప్పకపోయినా, ఆ పదబంధాన్ని గురించి ఊహించిన తర్కం చాలా ఔచిత్యంతో కూడుకుని ఉంది. ఇదే సందర్భంలో శ్రీశ్రీ ఏల్చూరి గారి నాన్నగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారిని సంబోధిస్తూ ‘ఏసూ’ అనే మకుటంతో రాసిన పద్యాల గురించీ కూడా రాస్తే బాగుండేది.

భావకవిత్వాన్ని ఒక ఉద్యమంగా వ్యాపింపజేసి, ప్రేమను ప్రేమించి, ”ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను” అని ఆ రోజుల్లో యువత పాడుకునేలా చేసిన ప్రేమ మాంత్రికుడు, “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచపు బాధ” అని చలం గారి మన్ననలు అందుకున్న కృష్ణశాస్త్రిగారిపై రాసిన వ్యాసం మనల్ని ‘ఆర్ద్ర సంద్రం’ లో ముంచెత్తుతుంది.

తమ తండ్రి గారైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారితో సహా ఏర్పడ్డ ‘నయాగరా’ కవుల గురించీ, వారి కావ్యావిష్కరణ సందర్భంగా జరిగిన ఘటనల గురించీ వ్యాసకర్త వివరించిన తీరు మనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ముఖ్యంగా తన పెళ్ళికి ముందు అనిసెట్టి గారి అరెస్టూ, పెళ్లి ఆగినా ఆగని పుస్తకావిష్కరణ సభ, అందులో ఏ.సు గారు ఎవరి దేశభక్తి గురించి అయితే గానం చేశారో, ఆయనే అనుకోకుండా ఆ సభలో ఉండి, తెలుగు రాకున్నా అర్థం తెలుసుకుని కవిని గాఢంగా ఆలింగనం చేసుకోవడంకన్నా విలువైన పురస్కారం ఏ కవికైనా ఏముంటుంది? అభ్యుదయవాదులు అయిన తమ శిష్యుల సభకు ఆ రోజు అధ్యక్షత వహించి, ఎంతో జాగరూకతతో నిర్వహించిన విశ్వనాథ గారి వాత్సల్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

కొన్ని దశాబ్దాల క్రితం తెలుగు పాఠకులు ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా చదివిన డిటెక్టివ్ నవలల వివరాలు తెలియజేస్తూ, ఈనాటి వారికి కవీ, పరిశోధకుడుగా తెలిసిన ఆరుద్ర రాసిన, అంతగా వివరాలు తెలియని డిటెక్టివ్ నవలలు “ఆడదాని భార్య”, “ఆనకట్టపై హత్య”ల గురించి (అట్టపై బొమ్మలతో సహా) రాసిన సమీక్షా వ్యాసాలు ఎంతో కుతూహలాన్ని రేకెత్తించి చదవాలని అనిపించేలా ఉన్నాయి.

తెలుగు సాహితీవేత్తలు కొందరు ఎక్కువగా అభిమానించే కవి బైరాగి. బైరాగి కవిత్వంలోని ‘తీవ్ర అభినివేశాన్ని’ గుర్తించిన కొందరిలో ఏల్చూరి వారొకరు. అందువల్లనే “జీవితాన్ని, కవిత్వాన్ని అద్వైతంగా పండించుకున్న మహాదృష్టశాలి” అనగలిగారు. అంతేకాదు; ఆయన రుణాన్ని తీర్చుకోవలసిన బాధ్యత తెలుగుదేశంపై ఉందంటూ చేసిన వ్యాఖ్య “పృథివి ఎంత విపులమో (విపులా చ పృథ్వీ) వేచిచూడాలి” అనడమూ ఒక వేదనను కలిగిస్తుంది.

ఎన్నో బెంగాలీ నవలలను, రవీంద్రుని కథలను తెలుగులోకి అనువదించిన మద్దిపట్ల సూరి గురించిన వ్యాసంలో ఆయన అనువాదాల మూలకృతులు అనేకం సినిమాలుగా వచ్చాయని, వాటిలో ఎక్కువగా సాహిత్య అకాడమీ అవార్డు పొందినవే అని చెప్తూ సూరి గారు కూడా అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారని తెలపడం ఆనందదాయకం.

వచన కవితకు సరైన గుర్తింపుకోసం కృషిచేసిన ‘నయాగరా’ కవుల్లో కుందుర్తి గారి కృషి ప్రత్యేకమైనదీ, విశిష్టమైనదీ. ఆయన రాసిన ‘నగరంలో వాన’, ‘తెలంగాణ’, ‘నాలోని నాదాలు’ వంటి రచనలు ఆనాటి సాహిత్యపాఠకులు ఆనందించినా, క్రమక్రమంగా వాటిలో కనబడని లయబద్ధత, శబ్దాడంబరం వల్ల అవి ఈనాటి వారి దృష్టిని ఆకర్షించడం లేదేమో అన్నది ఏల్చూరి వారి అంచనా. ఈ విషయం పైమరింత పరిశోధన జరగాలేమో!

చాలా మంది ‘నాకు నచ్చిన పుస్తకం’ పేరిట పరిచయ వ్యాసాలు రాస్తుంటారు. ఏల్చూరి గారు తాను కళాశాలలో పనిచేస్తున్నప్పుడు విద్యార్థులకు ఈ శీర్షికతో పోటీ పెట్టారు. అప్పుడు ఒక విద్యార్థి ఆయనను, “మాష్టారూ! మీ అభిమాన గ్రంథం పేరేమిటి?” అని అడుగుతాడు. బాల్యం నుండి అనేక గ్రంథాలను చదివి ఉండటం వల్లనేమో, ఆయన ఆ విద్యార్థికి వెంటనే ఏమీ సమాధానం చెప్పలేకపోయారట. తర్వాత ఆలోచించగా ఎంతో కాలానికి స్ఫురించింది, తనను బాగా ప్రభావితం చేసిన ఒకానొక పుస్తకం – ఒక ఆత్మకథ – ఆచంట జానకీరామ్ గారి ‘సాగుతున్న యాత్ర’ అని. అందులో ఆయన రాసిన కొన్ని విషయాలతో తనకు కూడా సారూప్యం కనిపించింది. ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంతో ఉద్వేగంగా రాసిన ఈ వ్యాసం ఏల్చూరి గారే చెప్పినట్లు ముందు తరాలను ముందుకు నడిపించాలి.

ఆధునిక కవులకు, పాఠకులకు ఇష్టమైన గొప్ప కవి బోయి భీమన్న గారు. “రసభావ పుష్కలమైన కవితా సౌందర్యానికి పరాకాష్ఠ” (పు.677) ఆయన ‘పైరు పాట’. దానినే ఏల్చూరి గారు ‘ప్రణయతత్త్వ ప్రతీకీకరణ’ అన్నారు.

ఇందరు సాహిత్యకారుల గురించిన విశేషాంశాల వ్యాసాలలో నన్ను అమితంగా ఆకర్షించింది పి.బి. శ్రీనివాస్ గారిపై వ్యాసం. ఆయన బహుభాషా పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మహా సంగీత విద్వాంసుడు. బహుభాషల్లో నేపథ్య గాయకుడు. ఏల్చూరి వివరించిన ఆయన ‘డైమండ్ కీ’ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా పెట్టతగ్గది. (ఆయన్ని నేను ఒకే ఒకసారి మద్రాసులోని వుడ్ లాండ్స్ హోటల్లో చూశాను. దీక్షగా రాసుకుంటూ కూర్చున్న ఆయన్ని చూసినప్పుడు, కౌంటర్లో అడిగితే – ఆయన ఎన్నో ఏళ్లుగా అక్కడే కూర్చుని రాసుకుంటారని చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగింది.) తెలుగువాళ్లకు తెలియని ఎన్నో పి.బి. గారి విషయాలు తెలిపినందుకు వ్యాసకర్తను అభినందించాల్సిందే.

గుంటూరు శేషేంద్రశర్మ గారి గురించిన వ్యాసంలో ఆయనను “ఒక ప్రాచ్య మహా విమర్శకునిగా, గొప్ప కవిగా” వర్ణించారు. ఆయన కళాత్మకతనూ, అనల్పమైన కల్పనా శిల్పాన్ని వివరించారు. ‘కవిసేన మేనిఫెస్టో’కు బాజా భజంత్రీల ఆర్భాటం వల్ల ఆ గ్రంథంలోని కొత్తదనం కొంత మరుగున పడింది అన్నారు (ఈ విషయాన్నే నేనూ కవిసేనపై నా వ్యాసంలో మరో విధంగా చెప్పాను).

మరో వ్యాసం ముళ్ళపూడి వారి మీద. చాలా ఆత్మీయతా, గౌరవమూ కలసిన నిండైన రచన.

కోరాడ రామచంద్రశాస్త్రి గారి గురించిన వ్యాసంలో ఆ పండిత కుటుంబంలోని వారందరి భాషా సాహిత్య సేవలనూ వ్యక్తిగతసమాచారంతో కలిపి అందించారు. వాళ్ళలో చారిత్రక భాషా శాస్త్రంలో కృషిచేసిన కోరాడ రామకృష్ణయ్య, ఆయన కుమారుడు కోరాడ మహదేవశాస్త్రి గార్ల సేవ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

ఆధునిక పద్యకవులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుమాండ్ల భూమయ్య గారి కావ్యం “కైవల్య” గురించి అది ఒక భక్తి మధుర కావ్యమని చెప్తూనే, దానిలోని తాత్త్విక చింతనను వివరించారు. ఇదే కాదు, భూమయ్య ఇతర కావ్యాలు కూడా ఇదే విధంగా కవితాత్మకంగా ఉంటాయి.

చివరగా – ఈ గ్రంథాన్ని అంకితం ఇచ్చిన, ఈ గ్రంథాన్ని ముద్రించిన అప్పాజోస్యుల సత్యనారాయణ గారిపై వ్యాసమూ (‘అంతరిక్షం ప్రపద్యే’), అంకితం పద్యాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పాజోస్యులు గారు రచించిన “తారావళి“ ప్రక్రియ గురించి అనేక కొత్త విషయాలను వివరించారు.

ఇట్లాంటి విలువైన సాహిత్య వ్యాసాల మధ్య అంతే విలువైన, మనకు మరో విధంగా తెలిసే అవకాశం లేని ఆహ్లాద కథనాలూ కొన్ని ఉన్నాయి. వాటిలో విశ్వనాథ ‘వివాహాశీస్సులు’, ‘అపస్వరంలో ఆత్మీయ సందేశం’ అంటూ రాసినవి మనల్ని అలౌకిక ఆనందంలోకి తీసుకువెళ్తాయి.

ఈ వ్యాసాలన్నీ ఈయన ఎట్లా రాయగలిగారు? అని మనం ఆలోచించకుండా ఆయనే అసలు విషయాలు అక్కడక్కడా చెప్పినా గ్రంథం చివర చెప్పిన మాటలు చాలా విలువైనవి. అంటే ఇవన్నీ రాయడానికి తన ఢిల్లీ నివాసం, ఢిల్లీ సాహిత్య సంఘటనల, జ్ఞాపకాల, అనుభవాల “ఆత్మీయ భావగేహళి”తో సాధ్యపడిందన్నారు.

ఇట్లాంటి కృషి ఈ రోజుల్లో అనితర సాధ్యం. డా. ఏల్చూరి మురళీధరరావు గారికి నా మనఃపూర్వక అభినందనలు, నమస్సులు.

***

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు
రచన: ఏల్చూరి మురళీధరరావు
ప్రచురణ: అజో-విభొ- కందాళం ఫౌండేషన్
పేజీలు: 800
వెల: ₹ 1,000/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/products/vangmayacharitralo-konni-vyasaghattalu-marikonni-visheshamshalu

Exit mobile version