[డా. ఏల్చూరి మురళీధరరావు గారి ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. రేవూరు అనంత పద్మనాభరావు.]
పాండిత్యప్రకర్ష, పరిశోధనాపటిమ, ప్రతిభాధిషణల త్రివేణీసంగమం మా మురళీధర్. అందులో సరస్వతీ నది ప్రతిభ. రాజధాని ఢిల్లీలో దూరంగా వుండిపోయి ఆంధ్రదేశ సాహితీరంగానికి చెందినవారికి అంతగా పరిచితుడు కాదు. ప్రాచీనాధునికాంధ్ర సాహిత్యప్రక్రియ లన్నింటిపైనా సాధికారికంగా ప్రసంగించగల ధిషణ వుంది. తండ్రిగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం నయాగరా కవులలో ప్రసిద్ధులు. బాబాయి విజయరాఘవరావు సంగీతప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులు. నాలుగు దశాబ్దులు అకుంఠితసేవాదృక్పథంతో పనిచేసిన కళాశాల శ్రీ వేంకటేశ్వరాంకితం. ఇన్ని వారసత్వాలు సంక్రమించిన మురళీధర్ మూడేళ్ళపాటు పూర్వాశ్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేశారు. మాదృశులం సహచరులం అప్పుడు.
ఆధునిక కవిపండితలోకమంతా ఆయనకు సుపరిచితులు. విశ్వనాథ, దేవులపల్లి, ఆరుద్ర, కుందుర్తి ప్రభృతుల సాన్నిహిత్యం లభించింది. మద్రాసులో ప్రసిద్ధ రచయిత ‘క్రాంతి ప్రెస్’ ధనికొండ హనుమంతరావు గారి బాంధవ్యం దానికి రంగులు దిద్దింది. భీమవరంలో కళాశాలాధ్యాపకులు వెంకట్రాజు గారి శిష్యరికంలో అబ్బిన సాహితీసుగంధం ఢిల్లీలో మలయమారుతసమీరంలా వ్యాపించింది. రామవరపు గణేశ్వరరావు ‘తెలుగు సాహితి’, ‘ఆంధ్రా అసోసియేషన్’ తదితర సంస్థలకు వెన్నెముక మురళీధర్.
1978-’80 మధ్య ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా నేను పనిచేస్తున్న రోజుల్లో నూనూగు మీసాల నవయౌవనపు పొంగులు ఆయనలో కనిపించాయి. నా పిహె.డి థీసిస్ ‘కందుకూరి రుద్రకవి’ మద్రాసు క్రాంతి ప్రెస్‌లో ముద్రణ జరుగుతున్న సమయంలో ప్రూఫ్ రీడింగ్ చేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మిత్రుడు మురళీధర్. ఈ నేపథ్యంలో నా సమీక్షను ఆరంభిస్తాను.
సప్తశత పుటల గ్రంథగ్రంథులు
ఏల్చూరి మురళీధర్ సప్తతి పూర్తిచేసుకున్నారు. సాహితీగుణగ్రహణపారీణులైన డా. అప్పాజోస్యుల సత్యనారాయణ గారి సౌజన్యంతో ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ 2024 జులైలో వెలుగుచూసింది. ఈ గ్రంథం చదివేవారికి నాదొక మనవి. ఇవి సాధారణ వ్యాసాలు కావు. పాండిత్యప్రకర్ష మెండుగా నిండిన పరిశోధనాత్మక వ్యాసాలు. ప్రాచీన సాహిత్యాన్ని, సంస్కృత సాహిత్యాన్ని క్షోదక్షమంగా అవలోడనం చేసిన మురళీధర్ ఆంధ్రసాహిత్యంలోని యుగానుక్రమణికను అనుసరించి వ్యాసాలను కూర్చారు. దీనిని అధ్యయన దృష్టితో చదవాలి.
నన్నయ, నన్నెచోడులు తెలుగు సాహిత్యంలో మణికిరణాలు. నన్నయను గూర్చి మనకు తెలుసు. కాని నన్నయ భారతానికి సంస్కృతానువాదం ఎవరు చేశారో తెలియదు. చంద్రశేఖర భట్టు 15-వ శతాబ్ది చివరివాడు. ఆయన నన్నయ ఆంధ్రీకరణకు సంస్కృతానువాదం చేశారు. ఆ సమాచారం ఎలా సేకరించారో మురళీధర్. వ్యాసభారత శ్లోకాలు, నన్నయ పద్యాలు, చంద్రశేఖరుని సంస్కృతశ్లోకాలు తులనాత్మకంగా గ్రంథంలో పొందుపరిచారు. అప్పాజోస్యుల వారు సామాన్యంగా మెచ్చుకోరు. మెచ్చుకొంటే భుజాలకెత్తుకొంటారు. అందుకే 778 పుటల గ్రంథాన్ని వ్యయప్రయాసలకోర్చి ముద్రించారు. ఇది మురళీధర్ విజ్ఞానసర్వస్వం.
సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, ఆంగ్లం – ఇలా ఎన్నో గ్రంథాల పరిశీలనలో వివిధపత్రికలలో మురళీధర్ పంచుకొన్న గ్రంథగ్రంథుల సమాచారమిది. ఈనాటి పరిశోధకులు పైపైన నాలుగు మాటలు నాలుగు చోట్ల నుండి ఉదాహరించి సిద్ధాంతవ్యాసాన్ని ‘మమ’ అనిపిస్తారు. మురళీధర్ బాట ముళ్ళబాట. లోతుగా పరిశోధించి దాని అంతు తేలుస్తారు. గణపవరపు వెంకటకవిపై ఆయన చేసిన పరిశోధనాసారాన్ని ‘సాహిత్యచరిత్రలో కనీ వినీ ఎరుగని పర్యాయపదకావ్యం’ అనే వ్యాసంలో గమనిస్తాం. ప్రబంధరాజ పద్యాలను నరసభూపాలీయం, రసికజనమనోభిరామం, హంసవింశతిలలోని పద్యాలతో పోల్చిచూపడం ఈయన ప్రతిభకు తార్కాణం.
పరిశోధనాపరమేష్ఠి
మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి ఆ తరం పరిశోధనా పరమేశ్వరులు. నేటి తరంలో అంత లోతుగా పరిశీలించే ఓపిక, కోరిక, తీరిక సన్నగిల్లాయి. కొర్లపాటి శ్రీరామమూర్తి, జి.వి.యస్.ఆర్. కృష్ణమూర్తి ప్ర్రభృతులు 20-వ శతాబ్దంలో ప్రసిద్ధులు. ఈ కోవలో లబ్ధప్రతిష్ఠులు. వారి వారసులా? అన్నట్లు ఈ వ్యాస పరిశోధనలు చదివిన పిమ్మట మురళీధర్ సాహితీకృషి భాసించింది. నన్నెచోడుని కుమారసంభవ కావ్యాన్ని ఆంధ్రసాహితీలోకానికి పరిచయం చేసినవారు రామకృష్ణకవి. దానిని గురించి అప్పట్లో ‘భారతి’లో వాదప్రతివాదాలు జరిగాయి. నన్నయకు పూర్వుడనే వాదన బలంగా కొనసాగింది. ఆ తర్వాత సద్దుమణిగింది. ఈ గ్రంథంలో మురళీధర్ నన్నెచోడుని “అలిధమ్మిల్ల” పద్యవివాదాన్ని సోదాహరణంగా వింగడించారు.
శ్రీనాథుని మీది వ్యాసాలు దాదాపు 80 పుటలు చోటుచేసుకొన్నాయి. కుంతకుని వక్రోక్తిజీవితాన్ని శ్రీనాథుని పద్యానుసరణంలో విమర్శించడం మురళీధర్ కే సాధ్యం. సంస్కృత భాషాసాహిత్యాలపై ఆయనకున్న పట్టు చాలా వ్యాసాలలో తొంగిచూస్తుంది. సాహిత్యం మీద దృఢమైన అవగాహన కలిగినవారికే ఈ వ్యాసాలు కొరుకుడుపడతాయి. సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు అర్థం చేసుకోవడానికి శ్రోత స్థాయి పైమెట్టులోది కావాలి. అలానే ఇందులో వ్యాసాలు చదివేవారి స్థాయి తెలుగు ఎం.ఏలతో సరిపోదు. నైమిశారణ్య వ్యాసం ఇందుకు ఉదాహరణ.
పిల్లలమఱ్ఱి పినవీరన ‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పిన కవిశేఖరుడు. ఆయన జైమిని భారతం గూర్చి వివరిస్తూ ఆనాటి సాహిత్యిక, చారిత్రిక విశేషాలను ప్రస్తావించారు. ‘సాహిత్యిక’ అనే పదబంధం కల్పించడంలోనే ఆయన భాషాపటిమ ద్యోతకమవుతుంది. చేమకూర వేంకటకవి విజయవిలాస కావ్యవిశ్లేషణ అద్భుతం. ఆ వ్యాసానికి ‘వసంత చంద్రుల కూర్పు’ అని నామకరణం చేయడం ఆయన ప్రతిభకు తార్కాణం. ఈ సందర్భంగా ఇటీవలే వెలువడిన డా. కోడూరి ప్రభాకరరెడ్డి గారి జూలూరి అప్పయ్య గారి వ్యాఖ్యతో ఉన్న ‘మనుచరిత్ర’కు ప్రభాకర వ్యాఖ్యను ప్రస్తావించారు. ఆ సందర్భంగా అయన వాడిన పదజాలం అర్థం చేసుకోవాలంటే నిఘంటు సహాయం కావాలి. “ఇటువంటి రసజ్ఞ విద్వన్మణి కైసేత మూలాన ఐదంయుగీనులకు విస్మృతప్రాయమై అలభ్యమైన యీ వ్యాఖ్యకు సూర్యాలోకభాగ్యం కలగటం నిజంగా సహృదయభాగధేయమే” అంటారు. ఇది పాండిత్యస్ఫోరకవ్యాఖ్య.
ఆధునికులకు పట్టం
తండ్రి ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి సాహితీవ్యాసంగాన్ని సన్నిహితంగా పరిశీలించిన మురళీధర్ సమకాలీన ఆధునిక కవుల రచనలను గూర్చి, విస్మృత కవుల రచనలను గురించి పలువ్యాసాలు ప్రచురించారు. ఆధునికపండితులలో మండపాక పార్వతీశ్వరశాస్త్రి కవిలోకమూర్ధన్యుడు. ఆయన ఆశుధారగా చెప్పిన ఒక పద్యం 256 విధాలుగా చదువదగినదని విశ్లేషించడానికి పాండిత్యప్రతిభతోపాటు విశ్లేషణాసామర్థ్యం కావాలి. అది మురళీధర్ కు పుష్కలం.
అనాదృత కవిపండితులపై మరికొన్ని వ్యాసాలు చిరస్మరణీయాలు. కూచి నరసింహకవిని గూర్చి చాలామందికి తెలియదు. ప్రజ్ఞాప్రభాకరుడైన వేటూరిపై వ్యాసం మణిపూస. విశ్వనాథ వారు వివాహాశీస్సులు అందించిన మూడు పద్యాలను ముచ్చటగా ముద్రించారు. దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, కుందుర్తి, ఏల్చూరి కవుల గ్రంథావిష్కరణ సభను వివరంగా విశ్లేషించారు. అనిసెట్టి ‘అగ్నివీణ’ కవితా సంకలన ప్రస్తావం సముచితం.
అన్నింటి కంటె ప్రధానం ఆరుద్ర గారి రెండు అపరిచిత నవలల ప్రస్తావన. ఈ రెండు నవలలపై విశ్లేషణ ఎం.ఫిల్ / పిహెచ్.డి పట్టాకు అర్హం. ‘ఆడదాని భార్య’, ‘ఆనకట్ట మీది హత్య’ – ఆరుద్ర నవలలు. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్తగా ఆరుద్ర పరిచితులు. కూనలమ్మ పదాల సృష్టికర్తగా ప్రసిద్ధులు. సినీ గేయరచయితగా సమర్థులు. కాని, ఈ రెండు నవలల ప్రస్తావన వల్ల ఆరుద్ర సృజనాత్మక సాహిత్య వివరణ లభించింది.
అభ్యుదయ కవితాస్రవంతిలో కుందుర్తి మార్గదర్శి. ఆయన ప్రతిభకు మురళీధర్ అద్దం పట్టారు. ఆచంట జానకీరామ్ ఆత్మకథ సమకాలీన రచనలలో మణిపూస. దానిమీద వ్యాసంలో మురళీధర్ తనపై ఆ గ్రంథం ఎంత ప్రభావం చూపిందో అద్భుతంగా వివరించారు.
ఏవంవిధ రచనా వ్యాసంగం దశాబ్దులుగా కొనసాగించిన ఈ భాషాతపస్వికి కీర్తికిరీటంగా అప్పాజోస్యుల వారు ఈ సంపుటిని వెలువరించినందుకు సాహితీలోకం వారికి ఋణపడివుంది.
తపస్వీ! యశస్వీ! వచస్వీ! శుభమస్తు.
***
రచన: డా. ఏల్చూరి మురళీధరరావు
ప్రచురణ: అజో-విభొ- కందాళం ఫౌండేషన్
పేజీలు: 800
వెల: ₹ 1,000/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/vangmayacharitralo-konni-vyasaghattalu-marikonni-visheshamshalu
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.