Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-9

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

కడప గడపలో.. (1975-1995)

ఘనాపాఠీలు:

రాయలసీమ నాలుగు జిల్లాలలో కడపది అగ్రస్థానం. ప్రాచీన కవులలో అల్లసాని పెద్దన్న, తాళ్లపాక కవులు ఆంధ్ర సాహిత్య వైభవ కవులు. ఆధునికులలో వావిలికొలను సుబ్బారావు, దుర్భాక రాజశేఖర శతావధాని, జనమంచి శేషాద్రి శర్మ, గడియారం వెంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు ఆద్యులు. శివభారతకర్త అయిన గడియారం వారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు. శివతాండవ రచనా దురంధరులు పుట్టపర్తివారు జనప్రియ రామాయణకర్తలు. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని రచయిత్రి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో మూడు దశాబ్దులు పనిచేశారు. శతావధాన జైత్రయాత్రలు చేసిన సి.వి. సుబ్బన్న, నరాల రామారెడ్డి సుప్రసిద్ధులు. సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ కడప రామకృష్ణా జూనియర్ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా చేశారు. తి.తి.దే ధర్మచార పరిషత్‌లో మార్గనిర్దేశనం చేశారు. అధికారభాషా సంఘం అధ్యక్షులు.

ఆధ్యాత్మిక రంగంలో యల్లంరాజు శ్రీనివాసరావు ప్రసంగాలకు మంచి పేరు. కందుకూరు, ప్రొద్దుటూరు ప్రభుత్వ కళాశాలల్లో అద్యాపకులు. అధ్యాపకులలో ఆర్.యస్. సుదర్శనాచార్యులు, కేతు విశ్వనాథరెడ్డి. సి. రంగారెడ్డి, నల్లపాటి రామప్పనాయుడు, ఆవుల నారాయణ, సి.వి. గుర్రెడ్డి ప్రభృతులు చిరస్మరణీయులు. యన్. రాజన్న కవి రెవిన్యూ ఇన్‌స్పెక్టరు. వసుచరిత్ర పద్యాల గానంలో ఆంధ్రదేశానికి సుపరిచితులు.

ప్రొద్దుటూరు కవుల నిలయం. అక్కడ ఓరియంటల్ కళాశాల ప్రాచీనం. అవధానం చంద్రశేఖరశర్మ, బండ్ల సుబ్రమణ్య కవి, షడ్దర్శనం సుదర్శన శర్మ, గంటి కృష్ణవేణమ్మ, పుట్టపర్తి వారి సతీమణి కనకమ్మ తలమానికాలు. పిల్లల వైద్యులే అయినా డా. కోడూరి ప్రభాకరరెడ్డి ప్రాకృత గ్రంథానువాదం చేశారు. ప్రతిష్ఠాత్మక అప్పాజోశ్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ సాహిత్య పురస్కారం 2024లో నంద్యాలలో అందుకున్నారు. వీరి అగ్రజులు కోడూరి పుల్లారెడ్డి సాహితీ విమర్శకులు.

ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రొడ్యూసర్‍గా

జానపద గాయకులుగా ఆరవేటి శ్రీనివాసులు, మునెయ్య, గిరిజ ప్రసిద్ధి పొందారు. గానుగపెంట హనుమంతరావు మొల్ల కళాపీఠం స్థాపించారు. భూతపురి సుబ్రమణ్యశర్మ పెద్దన కళాపీఠాన్ని డా. బెజవాడ గోపాలరెడ్డిచే 1996లో ప్రారంభం చేయించారు. కడప జిల్లా రచయితల సంఘం 1975 నాటికే ప్రసిద్ధం. వైద్యులైన డా. మల్లెమాల వేణుగోపాలరెడ్డి అధ్యక్షులుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి కార్యదర్శిగా మూడు దశాబ్దాలు సాహితీ సభలు జరిపారు. బ్రౌన్ లైబ్రరీ స్థాపకులుగా హనుమచ్ఛాస్త్రి చిరపరిచితులు. మూల మల్లికార్జునరెడ్డి బ్రౌన్ లైబ్రరీ వికాసానికి దోహదం చేశారు. కట్టా నరసింహులు ఈ సంస్థలో పరిశోధనలకు ఊతమిచ్చారు. ఆంగ్లోపన్యాసకులు  వై. హరే రామమూర్తి, సి. జానకీరాం, కె. పద్మనాభరెడ్డి, సంజీవమ్మ (ప్రిన్సిపాల్) ఈ జిల్లా రచయితలు. రామకృష్ణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రామమూర్తి, కరస్పాండెంట్ ఆర్. రంగనాథం విద్యారంగాభివృద్ధికి కృషి చేశారు. పాలా వెంకట సుబ్బయ్య (ఎం.ఎల్.సి), మైనంపాటి వెంకట సుబ్రమణ్యం, జింకా సుబ్రమణ్యం, సి.జానకిరాం, సుబ్బరాయుడు తమదైన ధోరణిలో రచనలు కొనసాగించారు. ఇక్కడ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, మహిళల డిగ్రీ కళాశాలలు దశాబ్దాలుగా ఎందరో అధ్యాపకులకు నిలయాలు.

ఆకాశవాణి పరిమళాలు:

1963 జూన్‌లో హైదరాబాదు కేంద్రానికి అనుబంధంగా (రిలే కేంద్రం) కడప ఆకాశవాణిని అప్పటి కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రి డా. బెజవాడ గోపాలరెడ్డి ప్రారంభించారు. విశాఖపట్టణం రిలే కేంద్రం విజయవాడకు అనుబంధంగా వారే ప్రారంభించారు. అదే సమయంలో, 1975 జూన్‌లో కడప కేంద్రం స్వయంప్రతిపత్తి గల కేంద్రంగా ప్రకటించబడింది. ఆంధ్రప్రదేశ్ మహిళాసంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి లక్ష్మీదేవమ్మ ప్రారంభించారు. తొలి డైరక్టరుగా మదనపల్లికి చెందిన టి. ఆర్. రెడ్ది నియమితులయ్యారు. కార్యక్రమ రూపకర్తలుగా బి. ఆర్. పంతులు, ఆర్. విశ్వనాధం, డా. ఆర్. అనంత పద్మనాభరావు నడుం కట్టారు.

కడపలో ప్రదర్శితమైన ‘ఆడది’ నాటకంలో (1981) పాత్రధారిగా

గొల్లపూడి మారుతీరావు 1979లో కడపకు బదలీ అయి వచ్చారు. దేవళ్ల బాలకృష్ణను ప్రమోషన్ మీద బదిలీ చేయడంతో మారుతీరావు కేంద్ర మార్గనిర్దేశనం చేశారు. 1981లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో కోడి రామకృష్ణ కోరిక మేరకు ప్రధాన పాత్రను పోషించి రేడియోకు రాజీనామా చేశారు.

కడప కేంద్ర ప్రసార శక్తిని 100 కిలోవాట్ల శక్తిని పెంచే కార్యక్రమాన్ని అప్పటి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య 1983లో నిర్వహించారు. కడప కేంద్రానికి స్టేషన్ డైరక్టర్లుగా ఉన్న జి. కె. మరార్ తర్వాత దూరదర్శన్ (హైదరాబాదు)లో డైరక్టరుగా రిటైరయ్యారు. పి.ఆర్. రెడ్డి, అనంత పద్మనాభరావు, వై. గంగిరెడ్డి, మంగళగిరి ఆతిద్యప్రసాద్ ప్రభృతులు ఆ యా కాలాల్లో డైరక్టర్లు. వోలేటి పార్వతీశం 1978లో ఈ కేంద్రంలో డ్యూటీ ఆఫీసరుగా చేరి హైదరాబాద్ దూరదర్శన్‌కు బదిలీ అయి రిటైరయ్యారు. సంగీత ప్రయోక్త కలగా కృష్ణ మోహన్ వీరి సహచరులు. నాగసూరి వేణుగోపాల్, ఆకుల మల్లేశ్వరరావు, ఆరవేటి శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, వి.వి. సుబ్బన్న, శైలజా రావు, యం.యస్. శ్రీరామ్ ఆ కేంద్ర దిశానిర్దేశకులు.

అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణరావుగారిని ఇంటర్వ్యూ చేశాకా

పాత తరం అనౌన్సర్లలో గుర్రం కోటీశ్వరరావు, గాడిచర్ల శ్రీనివాసమూర్తి, యం. గోపి, కపర్థి, మంజుల, సుభాన్, వనజారెడ్డి, పార్వతి, రమణ మోహన్, రాజగోపాల్ ప్రభృతులు తమ కంఠస్వరాలతో శ్రోతలను రంజింపచేశారు,

రాయలసీమ నాలుగు జిల్లాలకు కడప కేంద్రం సాంస్కృతిక వారధి.

తరువారి కాలంలో 1990లో తిరుపతి, 1991లో అనంతపురం, కర్నూలు రేడియో స్థానిక కేంద్రాలు వెలశాయి. కర్ణాటక సంగీతానికి కడప కేంద్రం చేసిన సేవ అమోఘం. నిలయ కళాకారులుగా మోదుమూడి సుధాకర్, దర్భముళ్ళ శేషగిరిరావు, భాస్కరభట్ల కృష్ణమూర్తి, కౌతా ప్రియంవద, పి. జయభాస్కర్, నేలభట్ల రంగనాయక శర్మ, వి. గోపాలకృష్ణ, బి. యస్. నారాయణ. కొక్కొండ సుబ్రమణ్యశర్మ వాద్య సహకారం అందించి తర్వాత కాలంలో ఘనకీర్తి వహించారు.

పుష్పగిరి పీఠం:

కడపకు 11 కి. మీ దూరంలో వెలసిన పుష్పగిరి క్షేత్రం విశిష్టం. ఇక్కడి చెన్నకేశవాలయం అతి ప్రాచీనం. ఆంధ్ర దేశంలో వెలసిన ఒకే ఒక్క శంకరాచార్య పీఠం పుష్పగిరి పీఠం. శ్రీశ్రీ విద్యా నృసింహ భారతీస్వాములవారు 1957 ఫిబ్రవరి 4న పీఠారోహణం చేశారు. 18వ శతాబ్దికి చెందిన తరిగొండ వెంగమాంబకు, అప్పటి పీఠాధిపతికి మధ్య జరిగిన వాగ్వాదం ఒక ఐతిహ్యం. 1965వ సంవత్సరంలో ప్రధాని లాల్ బహదూరు శాస్త్రికి పుష్పగిరి పీఠాధిపతి స్వయంగా పీఠానికి చెందిన ఆభరణాలను బాండ్ల రూపంలో దేశరక్షణ నిధికి సమర్పించారు. భాగ్యనగరంలో బేగంపేట వద్ద ఆశ్రమం నెలకొల్పారు. 2015 సెప్టెంబరు 27న స్వామి హైదరాబాదులో కాలధర్మం చెందారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యాశంకరభారతిస్వామివారు, 49వ పీఠాధిపతిగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు.

భువనవిజయంలో (1982) తిమ్మరసుగా

కడప జిల్లాలో ఇతర ప్రసిద్ధ క్షేత్రాలలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ప్రాచీనం. ఫ్రెంచి యాత్రీకుడు ‘తవర్నియర్’ ఇక్కడి ఆలయ శిఖరం భారతదేశంలో ప్రసిద్ధంగా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనుబంధాలయంగా పోషిస్తున్నారు. భద్రాచలంలో మధ్యాహ్నం వేళ సీతారామ కల్యాణం జరగడం ఆనవాయితీ. ఒంటిమిట్టలో రాత్రి వేళ జరుగుతుంది. కారణం లక్ష్మీదేవి సోదరుడైన చంద్రుడు తన సోదరి వివాహం చూడాలని విష్ణువును కోరడమేనని పండితుల చతురోక్తి.

దేవుని కడపలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం తి.తి.దే. అనుబంధ ఆలయం. తిరుపతి వెళ్లే యాత్రికులకు ఇది గడప. నందలూరి సౌమ్యనాథాలయం బాహుదా నది సమీపంలో వుంది. 1913లో జరిపిన త్రవ్వకాలలో ఇక్కడ బౌద్ధ విహారాలు, గుహలు బయుటపడ్డాయి. కలియుగ భవిష్యవాణిని కాలజ్ఞాన రూపంలో ప్రకటించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సమాధి పొందిన స్థలం బ్రహ్మంగారి మఠం.

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు జన్మించిన తాళ్లపాకలో 2007లో 100 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి డా. వై. యస్. రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు. మూడు రోజుల సాంస్కతికోత్సవాల నిర్వహణ బాధ్యతలు పంచుకొన్న అధికారులలో నేనూ ఒకడిని కావడం అదృష్టం. అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలను 2007లో అప్పటి తి.తి.దే. చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి డా. కె. వి. రమణాచారి, కడప జిల్లా కలెక్టరు యం.టి. కృష్ణబాబు ఘనంగా నిర్వహించారు.

అప్పటి కడప జిల్లా కలెక్టర్, డా. కె.వి. రమణాచారి గారితో

గండి ఆంజనేయస్వామి ఆలయం పాపాఘ్ని నదికి పడమట పర్వతపాదంలో వెలసింది. రెండు కొండల మధ్య నది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. చెయ్యేరు నది ఒడ్డున హత్యరాల క్షేత్రం వెలసింది. ఇలా పుణ్యక్షేత్రాల నిలయం కడప జిల్లా.

కడపలో తొలుత పి.జి. సెంటరు (1977) స్థాపించారు. తర్వాతి కాలంలో యోగి వేమన విశ్వవిద్యాలయం (2006) నెలకొల్పబడింది. కందుల ఓబుల్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, రాజంపేట లోని అన్నమయ్య ఇంజనీరింగు కాలేజీ సాంకేతికరంగ విద్యాభివృద్ధికి దోహదం చేస్తున్నాయిు.

రాజకీయ రథసారథులు:

కడప జిల్లా ఆంధ్ర రాజకీయాలలో నాటి నుండి నేటి వరకు ప్రాధాన్యం సంతరించుకొంది. ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో 1946లో కడప కోటిరెడ్డి మంత్రి. అతి చిన్న వయసులో ఆయన శాసనసభ్యులు. 1953లో ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడినపుడు కోటిరెడ్డి ప్రకాశం మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆయన సతీమణి కడప రామసుబ్బమ్మ దేశంలోనే తొలిగా ఎన్నికైన జిల్లా బోర్డు మహిళా చైర్మన్. వీరి కుమారుడు జయభారతరెడ్డి ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో 1952-53 మధ్య పి.డబ్ల్యూ.డి. మంత్రిగా నారు రంగారెడ్డి (1896-1974) నియమితులయ్యారు. అనేక బృహత్ ప్రణాళికలకు రూపకల్పన చేశారు రంగారెడ్డి.

కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఎద్దుల ఈశ్వరరెడ్డి 1952, 62, 67, 71 సంవత్సరాలలో కడప లోక్‌‍సభకు జరిగిన ఎన్నికలలో గెలిచారు. వి.రామిరెడ్డి 1957-62 లోక్‌సభ సభ్యులు. వారి తర్వాత కందుల ఓబుల రెడ్డి లోక్‌సభ సభ్యులు. వై.యన్. రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి, ఏ. సాయి ప్రతాప్ (కేంద్రమంత్రి), పి. పార్థ సారధి (కేంద్రమంత్రి) – 1967, 71, 77, 80 లలో గెలిచారు. టి. యన్. విశ్వనాథ రెడ్డి (1957-62), సి. ఎల్. నరసింహారెడ్డి (1962-67) రాజంపేట నుండి గెలిచారు. ఆ తరం రాజకీయ చతురులు.  రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఆర్. రాజగోపాలరెడ్డి (లక్కిరెడ్డిపల్లి) పాత తరానికి చెందిన ప్రముఖులు. ఉపాధ్యాయ నియోకవర్గ శాసనమండలి సభ్యులుగా పి. భుజంగరావు, విజయరామరాజులు మండలి చర్చలలో పాల్గొన్నారు. తి.తి.దే. బోర్డు అధ్యక్షులుగా ఆకేసాటి చెంగల్ రెడ్డి సౌమ్య స్వభావి (రాజంపేట). అదే పట్టణానికి చెందిన పార్థసారథి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి (1970-71). జిల్లాపరిషత్ అద్యక్షులుగా 1995 ప్రాంతంలో ఆర్. సూర్యనారాయణ రెడ్డి పరిపాలన కొనసాగించారు. ఆయన సొదరుజు రాజగోపాలరెడ్డి రాష్ట్ర మంత్రి.

రాజుగోపాలరెడ్డి అనే పేరుతో ‘మా సీమ’ రాజగోపాలరెడ్డి అని మరొకరు ప్రసిద్ధులు. ‘మా సీమ’ వారపత్రిక నడిపారు. వైశ్య ప్రబోధిని మాస పత్రికను నడిపిన పాలాది లక్ష్మీకాంతరెడ్డి సంపాదకులే గాక రచయిత. వీరు స్థాపించిన కళాపీఠాన్ని ఆర్థికమంత్రి కె. రోశయ్య ప్రారంభించారు (2007).

శ్రీ డి. బాలకృష్ణ, ఆకాశవాణి కడప కేంద్రం డైరక్టర్ (1980)

సెంట్రల్ చర్చి ఆఫ్ ఇండియాకు చెందిన వైభవోపేతమైన చర్చి 2001లో ఆరంభమైంది. దక్షిణదేశంలోనే ఇది ప్రసిద్ధ చర్చి.

సినీరంగ ప్రముఖులైన బి.యన్.రెడ్డి కడప జిల్లా కొత్తపేటలో జన్మించారు. 1975లో దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహించారు. హాస్యనటులు పద్మనాభం ఈ ప్రాంతంవారే.

వెల్లాల చంద్రశేఖరం పాతతరం సినీనటులు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version