[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
కందుకూరు జ్ఞాపకాలు (1967-1975)
40 ఏళ్ల నా ఉద్యోగ జీవితంలో పునాది కందుకూరు ప్రభుత్వ కళాశాలలోనే. 1967 జూన్ లో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నుండి ఎం.ఏ. పాసయ్యాను. తిక్కవరపు రామిరెడ్డి గోల్డ్ మెడల్ అందుకొన్నాను. యాదృచ్ఛికంగా తిక్కవరపు రామరెడ్డి వదాన్యతతో ఏర్పడ్డ కందుకూరు ప్రభుత్వ కళాశాలలో 1967 డిసెంబరు 16న తెలుగుశాఖలో అధ్యాపకుడిగా చేరాను. అప్పుడు ట్యూటర్ స్కేలు రూ. 250-15-400 బేసిక్. డి.ఎ. 105 రూపాయలు. వెరసి 355 రూపాయల జీతం. అక్కడే ఎనిమిదేళ్లు స్థిరోభవ. శోభాదేవితో పెండ్లి (1969), పిల్లలు ముగ్గురు కందుకూరులోనే.
కందుకూరు జనార్దన స్వామి ఆలయం
రాయల వారి స్కందావారాలు అక్కడ విడిది చేశాయి గాబట్టి అది స్కందపురి. కాలక్రమేణా కందుకూరు అని జనాలు పిలిచారు. అక్కడ జనార్దన స్వామికి అంకితంగా కందుకూరి రుద్రకవి (క్రీ.శ.1480-1560) సుగ్రీవ విజయ తొలి యక్షగానం, జనార్దనాష్టకం; సోమేశ్వర స్వామికి అంకితంగా నిరంకుశోపాఖ్యాన ప్రబంధము రచించాడు. రుద్రుకవి రచనలపై నేను పరిశోధన చేసి 1976లో పి.హెచ్.డి పొందాను. రుద్రకవి చింతలపాళెం వాస్తవ్యుడు. గోల్కొండ నవాబు మల్కిభరామ్ ఆ గ్రామాన్ని ఆయనకు దానమిచ్చినట్లు శాసనం (రాగిరేకు) చెబుతోంది.
కందుకూరు ప్రభుత్వకళాశాల:
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో 1966లో ప్రభుత్వ కళాశాల ఏర్పడింది. తొలి ప్రిన్సిపాల్‌గా ప్రజ్ఞాశాలి అయిన టి.కె కృష్ణస్వామి వచ్చారు. ఆయన తిరుమలలో ప్రథమ తీర్థం అందుకొనే వైష్ణవ కుటుంబీకులు. హైస్కూలు ప్రాంగణంలో రేకుల షెడ్లలో కాలేజిలో బి.ఏ, బి.యన్.సి., బికాం కోర్సులు ప్రారంభమయ్యాయి. తెలుగు శాఖలో జంధ్యాల లక్ష్మీనారాయణ శాస్త్రి హెడ్. ఆర్. యస్. సుదర్శనాచార్యులు, కేతు విశ్వనాథరెడ్డి, జి.వి. నారాయణ, పి. వెలుగొండయ్య భిన్న సమయాలలో లెక్చరర్లు. నేను, నడిపినేని సూర్యనారాయణ ట్యూటర్లం. నేను పని చేసిన కాలంలో ముగ్గురు ప్రిన్సిపాళ్లు మార్గనిర్దేశనం చేశారు. కృష్ణస్వామి రామాయపట్నం సముద్రతీరంలో స్నానం చేస్తూ అకాల మరణం చెందారు. తర్వాత ఆర్. కృష్ణమూర్తి రెండేళ్లు ప్రిన్సిపాల్. వారి తర్వాత బి. సుబ్రమణ్యం ప్రిన్సిపాల్. 300 మంది దాకా విద్యారులుండేవారు. స్పెషల్ తెలుగు బి.ఏ.లో ఆరుగురు విద్యారులు.
తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం
అక్కడ చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులలో IAS సాధించిన ఐ.వై.ఆర్. కృష్ణారావు (1979 బ్యాచ్ IAS) చీఫ్ సెక్రటరీ గారి రిటైరయ్యారు. పి. హరి కుమార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. వారి నాన్నగారు పి వెలుగొండయ్య, నేను తెలుగుశాఖలో సహాధ్యాపకులం. సింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వీరయ్య, ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడి విద్యార్థులే. గత నాలుగు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్‍గా పని చేస్తున్న రవికుమార్ కళాశాలకు NAAC లో A+ అక్రెడిషన్ తెప్పించారు. మేజర్ పంచాయుతీగా వున్న కందుకూరు మునిసిపాలిటీ అయింది. మా విద్యార్థి దివి లింగయ్య నాయుడు, తర్వాత కోటేశ్వరరావులు చైర్మన్లు కావడం ముదావహం.
తెలుగు శాఖాదిపతులుగా యల్లంరాజు శ్రీనివాసరావు, రంగారెడ్డి భిన్న సమయాలలో పనిచేశారు. అప్పజోడు వెంకట సుబ్బయ్య, మొవ్వ వృషాద్రిపతి తెలుగును పరిపుష్టం చేశారు. అక్కడనే నేను అష్టావధాన ఆరంగేట్రం 1968లో చేశాను.
కందుకూరు ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులు
కందుకూరు సమీపంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సుప్రసిద్ధం. ‘మాల్యాద్రి స్థల వైభవం’ అనే పేర నా సంపాదకత్వంలో ఒక గ్రంథం వెలువరించాం. శనివారాలు అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. సమపంలోని మొగిలిచర్లలో దత్తాత్రేయ సంప్రదాయంలో అవధూత ఆలయం భక్తులకు కొంగుబంగారం. కందుకూరులో అంకమ్మతల్లి ఆలయం ప్రసిద్ధం.
కందుకూరుకు 16 కిలోమీటర్ల దూరంలో గుడ్లూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయం పురాతనం. శృంగార శాకుంతలం, జైమినీభారతం రచించిన పిల్లలమర్రి పినవీరభద్రుడు సోమరాజు పల్లెవాసి. కవిత్రయ కవులలో ఒకరైన ఎర్రాప్రెగ్గడ ఈ స్వామికి అంకితంగా కావ్యాలు వెలయించారు. ఎర్రన గ్రంథాలయం ప్రాచీనం. త్యాగరాజు, శ్యామశాస్త్రి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రకాశం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించిన వినోదరాయుడి పాళెం చారిత్రక ప్రదేశము. 1970 ఫిబ్రవరి 2న గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో కొన్ని ప్రాంతాలను విభజించి కొత్తగా ఒంగోలు జిల్లా ఏర్పరచారు. తర్వాత ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. తొలి జిల్లా కలెక్టరు పి.కె. దొరస్వామి, తర్వాత ఒంగోలుకే చెందిన కె. చంద్రయ్య కలెక్టరు (1971-72). వారి కుమార్తె రత్నప్రభ కర్ణాటక చీఫ్ సెక్రటరీగా చేశారు. ఇక్కడ కలెక్టరుగా పనిచేసిన వి.యస్. సంపత్ ప్రధాన ఎన్నికల అధికారి అయ్యారు. మరో కలెక్టరు జయప్రకాష్ నారాయణ రాజీనామా చేసి ఎన్నికలలో గెలిచి ఎం.ఎల్.ఏ. అయ్యారు. వైద్యనాథ అయ్యర్ (1972-78) కేంద్రంలో సాంస్కతిక కార్యదర్శి ఆయ్యారు. ప్రస్తుతం ఈ జిల్లా జాయింట్ కలెక్టరు రోణంకి గోపాలకృష్ణ 2016లో IAS పరీక్షలో దేశం మొత్తం మీద మూడవ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం కందుకూరు డివిజను మళ్లీ నెల్లూరు జిల్లాలో భాగమైంది.
చదలవాడ మల్లన, వెన్నెలకంటి సూరన గుడ్లూరుకు చెందిన కవులు.
కందుకూరు మండల కవిపండితులు:
గుడ్లూరుకు చెందిన ఎర్రన, కందుకూరికి చెందిన రుద్రకవి ప్రాచీనకవులు, రుద్రకవి రాయల ఆస్థానంలో శ్రీ భువన రాజయ అష్టదిగ్గజ కవులలో ఒకడని ప్రతీతి. ఆధునిక కాలంలో కలికివాయకు చెందిన విక్రాల కుటుంబం తరతరాలుగా పండితవంశం. విక్రాల రాఘవాచార్యలు కాళహస్తి సంస్థాన ఆస్థాన పండితులు. వారి కుమారులు రామచంద్రాచార్యులు ముత్యాలపాడు సంస్థాన కవి. ఆయన కుమారుడు విక్రాల శేషాచార్యులు ‘సంస్కృతాంధ్ర పదార్ణవము’ అనే పర్యాయపద నిఘంటుకర్త, ఆయన సతీమణి శ్రీదేవమ్మ రచయిత్రి. ఈ దంపతులిరువురు 1973లో నేను స్థాపించిన రచయితల సంఘం గౌరవాధ్యక్షులు.
మొగిలిచర్లకు చెందిన పవని నిర్మల ప్రభావతి ప్రముఖ నవలా రచయిత్రి. ‘ఇయం గేహే లక్ష్మీ’ అనే పేర ధారావాహిక నడిపారు. వారి భర్త శ్రీధరరావు కందుకూరు రచయితల సహకార సంఘం వ్యవస్థాపకులు. అప్పటి రాష్ట్ర సహకారశాఖ మంత్రి బత్తిన సుబ్బారావును కందుకూరుకు ఆహ్వానించి, వారిచే సహకార సంఘం ప్రారంభం జరిపించారు.
కందుకూరు రచయితల సహకార సంఘాన్ని ప్రారంభిస్తున్న అప్పటి సహకార శాఖ మంత్రి బత్తిన సుబ్బారావు
ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయల సబ్సీడీతో ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి గ్రంథాలు ప్రచురించాము. వీరి సోదరులు పి. పి. రావు (1933) ఢిల్లీలో సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది. పద్మభూషణ్ 2006లో అందుకున్నారు. 1991లో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు. లోక్‌పాల్ ఎంపిక కమిటీ సభ్యులు (2014). శ్రీధరరావు కుమార్తె గాయత్రి (పూనా) కవయిత్రి.
ఆ ప్రాంత రచయితలలో వాసా లక్ష్మీనారాయణరెడ్డి (పాకాల), సోమరాజుపల్లె చెంచయ్య పాత తరం వారు. ఎలిమెంటరీ స్కూలు అధ్యాపకులైన అలంకారం కోటంరాజు, గుడి నారాయణబాబు, హైస్కూలు అధ్యాపకురాలు ఆవుల ప్రమీలాదేవి, కళాశాల అధ్యాపకులు బి.వి. ప్రసాదరావు, కరణం సుబ్బారావు, అన్నాప్రగడ లక్ష్మీనారాయణ ప్రముఖులు. భవన విజయ ప్రదర్శన అధ్యాపకులం నిర్వహించాం.
కనిగిరిలో కోట సోదర కవులు అవధానులు. అగస్త్యరాజు సర్వేశ్వరరావు శివానంద మూర్తి పురస్కార గ్రహీత. కనిగిరిలో టీచర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎందరో అధ్యాపకులను రాష్ట్రానికి అందించింది. బద్దెపూడి శ్రీనివాసరావు ప్రిన్సిపాల్‌గా ప్రముఖులు. బి.డి.ఓగా పని చేసిన అబ్బరాజు వెంకటేశ్వరరావు హరికథకులు. తెలుగు అధ్యాపకులు చీమలమర్రి వెంకట్రామయ్య పండితులు.
కందుకూరు కళాశాలకు ఆ యా సందర్భాలలో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, నండూరి రామకృష్ణమాచార్య, ఆరుద్ర, వి.ఎ.కె. రంగారావు, శంకరమంచి సత్యం, దువ్వూరి వెంకట రమణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాస్తి సూర్యనారాయణ, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు ప్రభృతులు విచ్చేసి ప్రసంగించారు. దాశరథి, నేనూ నగరంలో ఒక బహిరంగ సభలో పాల్గొన్నాము.
శతజయంతి ఉన్నత పాఠశాల:
కందుకూరులో హైస్కూలును మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో ప్రారంభించారు. తొలి హెడ్మాస్టరు శ్రీనివాసన్. ప్రముఖ జర్నలిస్టు ‘స్వతంత్ర’ పత్రిక సంపాదకులు ఖాసా సుబ్బారావు 1920-21 మధ్య హెడ్మాస్టరు. ఇతర హెడ్మాష్టర్లలలో ప్రముఖులు – వరదరాజులు నాయుడు (1953-56), గుర్రం రాధాకృష్ణయ్య, చిదంబరం, భుజంగరావు, వారి కుమారుకు ఇప్పగుంట మల్లికార్జున రావు (1992-99), అక్కడే చదివి హెడ్మాష్టరయిన హనుమంతరావు (1973-74), సుబ్బారావు, పెట్లూరు కొండయ్య, వెంకటసుబ్బయ్య. శతజయంచిని అనూరాధ హెడ్‍మిసెస్‌గా వుండగా వైభవంగా జరిపారు.
కందుకూరు ప్రభుత్వ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ శ్రీ రవికుమార్
రాజకీయ చైతన్యం:
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరు అనగానే నల్లమోతు చెంచు రామానాయుడు, దివి కొండయ్య చౌదరి గుర్తుకు వస్తారు. కందుకూరి రుద్రకవి జన్మించిన చింతలపాలెం వాస్తవ్యులు చెంచురామానాయుడు (1914), 1949-52 మద్య నెల్లూరు జిల్లా బోర్డు అధ్యక్షులు. 1952-72 మధ్య శాసనసభ్యులు. 1965-72 మధ్య రాష్ట్ర పురపాలక, అటవీశాఖల మంత్రి. ప్రకాశం జిల్లా ఏర్పాటుకు విశేష కృషి చేశారు. కందుకూరులో ‘దివి’ వారు రాజకీయ చతురులు, దివి కొండయ్య చౌదరి తన 73 ఏళ్ల జీవితంలో 45 సంవత్సరాలు ప్రజా జీవితంలో గడిపారు. శాసనసభ స్పీకరుగా (1978-80); రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన తమ్ముడు పిచ్చయ్య చౌదరి అడ్వకేటు. పంచాయితీ అధ్యక్షులు. కొండయ్య 1955, 1978 లలో శాసన సభకు ఎన్నికయ్యరు. ఆయన కుమారుడు డా. దివి శివరాం 1984, 1999 ఎన్నికలలో శాసనసభకు గెలిచారు. దివి లింగయ్యనాయుడు కందుకూరు మునిసిపల్ చైర్మన్.
కందుకూరు శాసనసభకు 1972, 1983, 1985లలో యం. ఆదినారాయణరెడ్డి (మాచవరం) ఎన్నికయ్యారు. అదే కుటుంబానికి చెందిన మహీధరరెడ్డి (1957), 1989, 2004, 2009, 2019 ఎన్నికలలో శాసనసభకు గెలిచారు. కిరణ్ కుమారరెడ్డి మంత్రివర్గంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి. అంకమ్మ దేవాలయం (కందుకూరు) పునరుద్ధరణ చేశారు.
కందుకూరు డివిజన్ కావలి లోకసభ నియోజక వర్గంలో భాగం. కనిగిరికి చెందిన పులి వెంకటరెడ్డి (1934 జూలై) లోక్‌సభకు 1971, 1877, 1979లో ఎన్నికయ్యారు. వెలిగండ్ల పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మికశాఖ డిప్యూటీ మంత్రి (1980 అక్టోబరు -1982 జనవరి). సౌమ్య స్వభావి.
ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీ రామయ్య, తదితరులతో
కందుకూరు నుండి శాసనమండలికి పట్టభద్రుల నియోజక వర్గం నుండి కంచర్ల శ్రీకాంత్ (1980) 2023 లో గెలుపొందారు. ఈయన తండ్రి రామయ్య ‘ఈనాడు రామయ్య’ ప్రసిద్ధులు. శ్రీకాంత్ విప్‌గా నియమితులయ్యారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజిని రామయ్య 2001లో స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశారు.
కందుకూరు కళాశాల విద్యార్థి జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు హైదరాబాదులో ప్రముఖ ఛార్టరెడ్ ఎకౌంటెంట్. వీరి కుమార్తె జె. స్నేహజ 2016లో ఇండియన్ ఫారిన్ సర్వీసుకు ఎంపికై హైదరాబాదు రీజినల్ పాస్‌పోర్టు అధికారిగా పని చేస్తున్నారు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.