[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
తిరుపతి ముచ్చట్లు
60 ఏళ్ల క్రితం తిరుపతి ఎస్.వి. యూనివర్శిటీలో ఎం.ఏ. తెలుగు చదివే అదృష్టం కలిగింది (1965-67). మళ్లీ 40 ఏళ్ల తర్వాత 2005-10 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే భాగ్యం కలిగింది. రిటైరయి ఖాళీగా హైదరాబాదులో విశ్రాంత జీవనం గడపవలసిన సమయంలో అవిశ్రాంతంగా స్వామి సేవలో ఐదేళ్లు తరించాను. నేను పాత జ్ఞాపకాల దొంతర నుండి కొన్ని పంచుకొంటాను.
తిరుపతి రాజకీయ నేతలు:
ఆధ్యాత్మక కేంద్రంగానే గాక రాజకీయ చైతన్య కేంద్రంగా చిత్తూరు జిల్లా వాసికెక్కింది. అవిభక్త మదరాసు రాష్ట్రంలో అదొక భాగం, తమిళ వాసనలు అధికం. రాయలసీమ జిల్లాలలో అది ఒకటి. తిరుపతి అనగానే ఆ తరం రాజకీయవేత్తలలో భీష్మపితామహుల వంటి మూడభూషి అనంతశయనం అయ్యంగార్ స్ఫురిస్తారు. కడప ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా నేను వారిని తిరుపతి లోని వారి స్వగృహం గంగుంట్ర మండపం వీధిలో రికార్డు చేసి ప్రసారం చేశాను, ‘సభాపతిగా నా అనుభవాలు’ అనే అంశంపై ఎన్నో విశేషాలు శ్రోతలతో పంచుకున్నారు. అనంతశయనం గారు (ఫిబ్రవరి 1891 – మార్చి1978) తిరుచానూరులో వైష్ణవ కుటుంబంలో జన్మించారు. మదరాసు లా కాలేజ్ నుండి పట్టభద్రులయ్యారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1934లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు. జైలుకెళ్లారు రెండు సార్లు. 1952లో తిరుపతి నుండి, 1957లో చిత్తూరు నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలి లోక్‌సభలో 1952 నుండి డిప్యూటీ స్పీకరు. 1956 నుండి 62 వరకు స్పీకరు, 1962-67 మధ్య బీహారు గవర్నరు. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరి కృషి ఫలితమే. వీరికి నలుగురు కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు. కుమార్తె పద్మా సేఠ్ – జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు (1992-1996). తిరుపతికే చెందిన కె. శాంతారెడ్డి కూడా మహిళా కమిషన్ సభ్యురాలు (2000-2003). పద్మాసేఠ్ బాలల సంక్షేమం కోసం అవిరళ కృషి చేశారు. ‘Infant Mortality and Maternal Morality’ అనే గ్రంథం రాశారు.
తిరుమలలో జెఇవో వెంకయ్య చౌదరి గారితో
1952లో చిత్తూరు ద్విసభ్య స్థానాలకు (రెండు) ఎన్నికలు జరిగాయి. ఒకటి ఎస్.సి. తరగతులకు చెందిన యం.వి. గంగాధర శివ; మరొకటి జనరల్ అభ్యర్థిగా మదనపల్లి వాసి టి.యన్. విశ్వనాథరెడ్డి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1962, 1967లలో సి.దాస్ లోక్‌సభ సభ్యులు (తిరుపతి). 1967లో స్వతంత్ర పార్టీ పక్షాన జాతీయ నాయకుడు యన్.జి. రంగా చిత్తూరు నియోజక వర్గం నుండి పోటీ చేశారు. కాంగ్రెసు అభ్యర్ధి యన్. పి. చెంగల్రాయ నాయుడు గెలుపొందారు. ఆ ఎన్నికల ప్రచారానికి స్వతంత్ర పార్టీ కార్యదర్శి మినూ మసానీ తిరుపతి గోవిందరాజ స్వామి పుష్కరిణి సమీపాన వేదిక మీది నుండి అనర్గళంగా ప్రసంగించి కాంగ్రెసు పాలనను దుయ్యబట్టడం విద్యార్థిగా నేను ప్రత్యక్షంగా నిన్నాను. యన్.జి.రంగా ఓడిపోయాడనే వార్తను రేడియోలో విని ఒక శ్రోత రేడియో పగలగొట్టాడని మరునాడు పేపర్లో వచ్చింది.
సహస్రదీపాలంకరణ సేవ
‘రాజన్న’గా ప్రసిద్ధికైన పి. రాజగోపాలనాయుడు (1920-1997) చంద్రబాబునాయుడికి రాజకీయ గురువు. రాజగోపాలనాయుడు రంగా శిష్యుడు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. 1955లో ‘తవనంపల్లి’ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1962లో అదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎం.ఎల్.ఏ. 1973లో శాసనమండలి సభ్యులు. 1977, 1979 లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం నుండి గెలుపొందారు. సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల అభినివేశంతో 1953లో చిత్తూరు జిల్లా కళా పరిషత్ స్థాపించారు. చిత్తూరు జిల్లా రచయితల సంఘాధ్యక్షులు. వీరి కుమార్తె గల్లా అరుణకుమారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ లోక్‌సభ సభ్యులు.
మదనపల్లికి చెందిన టి. యన్. విశ్వనాధ రెడ్డి (1919–1989) 1952లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1957లో రాజంపేట నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా లోకసభకు ఎన్నికయ్యారు. వీరి కుటుంబానికి చెందిన టి.యన్. అనసూయమ్మ శాసన సభ్యురాలు. అధికారభాషా సంఘం అద్యక్షురాలు (1977-78). వీరి సోదరి లక్ష్మీకాంతమ్మ బెజవాడ గోపాలరెడ్డి సతీమణి.
తిరుపతి రాజకీయాలలో, అగరాల ఈశ్వరరెడ్డి (1933-2020) ప్రముఖులు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకరుగా, స్పీకరుగా (1981-83) ప్రసిద్ధులు. తిరుపతి లోక్‌సభకు 1984, 89, 91, 2004, 2009 ఎన్నికలలో ఐదుసార్లు గెలిచిన డా. చింతా మోహన్ – పి.వి. మంత్రివర్గంలో సహాయమంత్రి. ఇటీవలి కాలంలో భూమన కరుణాకరరెడ్డి 2019లో ఎం.ఎల్.ఎగా తిరుపతి నుండి గెలిచారు.
సంస్కృత విశ్వవిద్యాలయం సమావేశంలో
తిరుపతి కవి పండితులు:
1970 దశకం మాట. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా మద్దూరి సుబ్బారెడ్డి, జి. నాగయ్య, తమ్మారెడ్డి నిర్మల, కె. సర్వోత్తమరావు ప్రభృతులు భావి ఉపన్యాసకులను తీర్చిదిద్దారు. పరిశోధనలకు ఒరవడి పెట్టారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ సమర్పించిన శంకరంబాడి సుందరాచారి పట్టణంలో విశ్రాంత జీవనం గడిపారు. జిల్లాలో మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, పులికంటి కృష్ణారెడ్డి, పణతుల రామచంద్రయ్య, కె. సభా, బి.భాస్కర చౌదరి, యం. ఆర్. చంద్ర, కె.వి.యన్. ఆచార్య, నూతలపాటి గంగాధరం ప్రభృతులు ప్రసిద్ధులు. చిత్తూరు జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార సంఘం వారు – రాజగోపాలనాయుడు (యం.పి) ప్రోత్సాహంతో గ్రంథ ప్రచురణలు చేశారు.
దేవస్థానం ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు త్రిపురనేని మధుసూదనరావు, భూమన్ తనదైన పంథాలో నడిచారు. యూనివర్శిటీ అధ్యాపకులు వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల’ సృష్టించారు.
కరుణాకరరెడ్డి గారిచే సత్కారం
తి.తి.దే.లో పలువరు పండితులు ఆయా విభాగాలలో సేవలందించారు ఆకాశవాణిలో ప్రసారభీష్ములు బాలాంత్రపు రజనీకాంత రావు శ్రీ వెంకటేశ్వర పీఠం స్పెషల్ ఆఫీసరుగా 1990 నుండి నాలుగేళ్లు వ్యవహరించారు. విద్వాన్ విశ్వం, కరుణశ్రీ, నండూరి రామకృష్ణమాచార్య, ముదివర్తి కొండమాచార్య వివిధ ప్రాజెక్టులలో పనిచేశారు. హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శులుగా ధూళిపాల అర్కసోమయాజి, సముద్రాల లక్ష్మణయ్య ఆ రోజుల్లో స్వామి సేవలో తరించారు. అప్పజోడు వెంకట సుబ్బయ్య, మాడుగుల నాగఫణిశర్మ ధర్మ ప్రచార రథసారథులు. క్రాంతదర్శి అయిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పి.వి.ఆర్.కె. ప్రసాద్ దూరదృష్టితో ఏర్పడిన అన్నమాచార్య ప్రాజెక్టు డైరక్టరుగా కామిశెట్టి శ్రీనివాసులు, మేడసాని మోహన్ సంకీర్తనా ప్రచార యజ్ఞానికి ఋత్విక్కులు. గాయనీగాయకులిగా శోభారాజు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, పారుపల్లి రంగనాధ్ కీర్తనల వ్యాప్తికి దోహదం చేశారు. అన్నమాచార్య సంకీర్తనల ప్రచురణలో గౌరిపెద్ది రామసుబ్బశర్మ కృషి ప్రశంసనీయం. స్వరపరచడంలో నేదునూరి, నూకల, శ్రీపాద పినాకపాణి ప్రభృతులు ఆద్యులు. మహాభారత్ ప్రచురణ సంపాదక బాధ్యతలు జి. నాగ సిద్దారెడ్డి, జి.వి. సుబ్రమణ్యం చేపట్టారు. ఆంధ్ర భాగవత పరిష్కరణలో రవ్వా శ్రీహరి, ముదివర్తి కొండమాచార్యలు శ్రమించారు.
తితిదె ప్రజాసంబంధాల అధికారిగా చిరకాలం పనిచేసిన రావుల సూర్యనారాయుణ మూర్తి స్వర్ణోత్సవ సంచిక ప్రచురణలో తోడ్పడ్డారు. ప్రచురణల విభాగం డైరక్టరుగా యస్. బి. రఘునాథాచార్య పలు గ్రంథాలతో బాటు బాల సాహిత్య ప్రచురణలు వందల సంఖ్యలో వెలువరించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో చెలికాని అన్నారావు అగ్రగణ్యులు. ఆయన పాలకమండలి ఛైర్మన్ కూడా అయ్యారు. పి.వి.ఆర్.కె. ప్రసాద్, చంద్రమౌళిరెడ్డి, ఏ.పి.వి.యన్. శర్మ, కె.వి. రమణాచారి ప్రభృతులు ఈవోలుగా స్వామి సేవలో తరించారు. అందరినీ పేర్కొనడం కష్టం.
సంగీతవేత్తలు:
తిరుపతి దేవస్థానంవారి సంగీత నృత్య కళాశాల అతి ప్రాచీనం (1960). తొలి ప్రిన్సిపాల్‌గా సాంబమూర్తిగారు విశేష కృషి చేశారు. నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన్న సత్యనారాయణ, ద్వారం భావనారాయణ, పుద్దక్కొటై ఆర్. కృష్ణమూర్తి, ప్రభావతి, అరవేటి ప్రభావతి, పద్మావతి, సింహాచల శాస్త్రి ప్రభృతులు భిన్న సమయాలలో ప్రిన్సిపాళ్లు. ఇక్కడ సంగీతం, నృత్యం, నాదస్వరం, మృదంగం కోర్సులతో బాటు హరికథ శిక్షణ కూడా లభిస్తోంది. వి.యల్. జానకీరామ్, పుదుక్కొటై రామనాధన్, పుల్లెల పేరి సోమయాజులు, వంగల పట్టాభి భాగవతార్, మృదంగం సధాకర్, వందన, కొమాండురి కృష్ణ ప్రభృతులు అధ్యాపకులుగా పేరుగాంచారు. వీరందరూ ఆకాశవాణి కళాకారులుగా గ్రేడ్లు సంపాదించారు. మదనపల్లి రిషీ వ్యాలీ స్కూల్‌లో కొంతకాలం పనిచేసిన యం.యల్. వసంతకుమారి కడప ఆకాశవాణి కేంద్రం నుండి కచేరీలు ప్రసారం చేశారు. పద్మావతీ విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో ఆచార్యులు ద్వారం లక్ష్మి. ఈమె ద్వారం వెంకటస్వామి నాయుడుగారి మనుమరాలు. ఆమె ఎందరో విద్యార్థినులను తీర్చిదిద్దారు.
ప్రొఫెసర్ కుప్పా విశ్వనాథ శర్మ గారితో నాదనీరాజనం వేదికపై
పాత్రికేయులు:
చిత్తూరు జిల్లా పాత్రికేయులకు ప్రసిద్ధం. తిరుపతి ప్రధాన కేంద్రంగా అన్ని దినపత్రికల రిపోర్టర్లు తిరుమల దర్శనానికి విచ్చేసిన ప్రముఖుల వార్త అందించేవారు. దేవస్థానం కార్యకలాపాలు కూడా వార్తలకెక్కెది. హిందూ విలేఖరిగా చాలాకాలం పనిచేసిన వరదాచారి ఈ బృందానికి ద్రోణాచార్యులు. కధారచయిత పులికంటి కృష్ణారెడ్డి దినపత్రిక విలేఖరిగా తిరుపతిలో ప్రసిద్ధులు. వీరి ప్రింటింగ్ ప్రెస్ ముందు సాయంకాలాలలో శంకరంబాడి సుందరాచారి సేద తీరేవారు. పాత్రికేయుల పక్షాన సిహెచ్. సంతోషమ్మ, యన్. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎం.యల్.సి.గా నామినేట్ అయ్యారు.
‘ప్రజావాహిని’ అనే పేర సిద్ధయ్య నాయుడు 1965 ప్రాంతంలో వార పత్రిక నిర్వహించారు. ఎం.ఎ. విద్యార్థిగా నేను ‘ప్రహ్లాదుని భక్తిభావం’ అనే వ్యాసం వారి వద్దకు పట్టుకెళ్ళాను. 19 ఏళ్ల కుర్రవాడిని – నన్ను ఎగాదిగా చూచి నేనే వ్రాశానని నిర్ధారించుకున్న తర్వాత సుదీర్ఘ వ్యాసాన్ని రెండు భాగాలుగా ప్రచురించారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ సమావేశంలో
త్యాగరాజ ఆరాధనోత్సవాలు – త్యాగరాజ మండపంలో ఏటా వైభవంగా జరిగేవి. అన్నమాచార్య జయంతులు కూడా అక్కడే దేవస్థానం నిర్వహించేది. సినీనటి జమున తన భర్త – యూనివర్శిటీ లెక్చరర్ రమణారావుతో బాలాజీ కాలనీలో తరచూ కనిపించేది. యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫీసరుగా కె.సి. నారాయణ యువతకు మార్గదర్శి. తర్వాత కాలంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టరుగా ఆయన రిటైరయ్యాడు. తిరుపతి అనగానే భీమాస్ హోటల్ గుర్తుకొస్తుంది. భీమాస్ రఘు త్యాగరాజ ఆరాధనోత్సవాలలోను, కంచి కామకోటి తిరుపతి మఠం విషయంలోను క్రియాశీలక వ్యక్తి. ఎందరో మహానుభావులు. కొందరినే స్మరించాను.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.