[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
(అధ్యయన అధ్యాపన దశాబ్ది 1965-1975)
1965 జులై. వి.ఆర్. కాలేజీ, నెల్లూరులో బి.ఏ.స్పెషల్ తెలుగు డిగ్రీ పూర్తి చేసుకొని, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు కోర్సులో చేరాను. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఏ.నీలకంఠం, తెలుగు హెడ్ జి.యన్.రెడ్డి గారలు నన్ను ఇంటర్వ్యూ చేసి అడ్మిషన్ ఇచ్చారు. మా బ్యాచ్‍లో నలుగురు అమ్మాయిలు, 10మంది అబ్బాయిలు, మొత్తం 14 మంది 1965-67 బ్యాచ్. మా ముందు బ్యాచ్‌లో తక్కువ సంఖ్యలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. యూనివర్శిటీ ఆర్ట్స్ బ్లాక్ కొత్తగా నిర్మించారు. ఇంకా బాత్ రూంలు కూడా పూర్తి కాలేదు. ఇంగ్లీషు, తెలుగు, సంస్కతం, హిందీ, హిస్టరీ తదితర శాఖలు ఈ బ్లాకులోకి తరలించారు.
తెలుగు శాఖ దిగ్గజాలు:
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ప్రాచీనమైంది. భూపతి లక్ష్మీనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, పింగళి లక్ష్మీకాంతం ప్రముఖ ఆచార్యులుగా ఖ్యాతి గడించారు. మేం చేరే నాటికి 1965 జూన్ లోపు పింగళి వారు రిటైరయ్యారు. జి.యన్. రెడ్డి శాఖాధ్యాక్షులు. ఆయన అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో పని చేశారు. రీడర్లుగా జీరెడ్డి చెన్నారెడ్డి, కోరాడ మహదేవశాస్త్రి, జాస్తి సూర్యనారాయణ గార్లున్నారు. అధ్యాపకులుగా తిమ్మవజ్ఞాల కొదండరామయ్య, పంగనమల బాలకృష్ణమూర్తి పాఠాలు బోధిస్తున్నారు. జి.యన్. రెడ్డిగారు పాశ్చాత్య విద్యావిధానాన్ని జీర్ణించుకొన్న వ్యక్తి. సెమినార్లు ప్రవేపెట్టారు. టూర్లు తీసుకెళ్లారు.
తొలి సంవత్సరం సాతనూరు డ్యామ్, అరుణాచలం టూర్ వెళ్లాము.
అరుణాచలంలో గుడిపాటి వెంకటచలం అధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. వారితో విద్యార్థుల ముఖాముఖీ జరిగింది. చలం మ్యూజింగ్స్ గూర్చి నేను ప్రస్తావించాను. ఆయన సంతోషించారు. మరుసటి సంవత్సరం మామంజూరు ఫారెస్ట్ కెళ్లాము. అక్కడ సాహిత్యప్రియుడు కె.రాజశేఖరరెడ్డి ఫారెస్ట్ ఆఫీసరు. ఆయన సతీమణి నవలా రచయిత్రి. మా బ్యాచ్ నలుగురు మహిళలు – ఉదయిని, భాస్కర శేషరత్నం తిరుపతిలోని పద్మావతీ మహిళా కళాశాల అధ్యాపకురాండ్రుగా చేరి పదవీ విరమణ చేశారు. మనోజ, ఉషారాణిలు మద్రాసు కళాశాలల్లో పని చేసి రిటైరయ్యారు.
భూమన కరుణాకరరెడ్డి గారితో రచయిత
మా సహచర మిత్రులలో వయసులో పెద్దవాడు బండ్లమూడి సత్యనారాయణ. ఆయన ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో ట్యూటర్‌గా పని చేస్తూ ఎం.ఏ పూర్తి చేసి అదే కళాశాలకు వెళ్లారు. వయసులో చిన్నవాడిని నేనే. కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా 1967లో చేరి 1975లో ఆకాశవాణి, కడపలో ప్రొడ్యూసర్‌గా చేరేవరకు పాఠాలు చెప్పాను. మిత్రుడు ఉప్పలపాటి శ్రీరామమూర్తి అనంతపూరు తదితర కళాశాలల్లో పని చేసి హైదరాబాదులో హయ్యర్ ఎడ్యుకేషన్‌లో అకడెమిక్ డైరక్టర్‍గా రిటైర్యయాడు. హాస్టల్లో నా రూమ్‌మేట్ ఏ.వి.సుబ్బారావు శాతవాహన కళాశాలలో రిటైరయ్యాడు. మిగతా మిత్రులు నారాయణ, రంగరాజు, కృష్ణారెడ్డి, గుర్రెడ్డి ప్రభృతులు ప్రభుత్వ కళాశాలాధ్యాపకులై విశ్రాంత జీవనం గడుతున్నారు.
పరిశోధన విద్యార్థులు:
1965-67 మధ్య మేం ఎం.ఏ చదువుతుండగా ఐదుగురు పరిశోధకులు తెలుగు శాఖలో యు.జి.సి ఫెలోషిప్‌పై పరిశోధనలు చేస్తున్నారు. తర్వాతి కాలంలో వీరు మదరాసు, బెంగుళూరు విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పేరుగాంచారు. సానికొమ్ము అక్కిరెడ్డి ట్యూటరు. తరువాత మదరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు. అదే రీతిలో వి. రామచంద్ర చౌదరి అదే విశ్వవిద్యాలయ శాఖాధిపతి. లింగమనేని బసవశంకరరావు మదరాసులో అనుబంధ కళాశాల ఆచార్యులు. పి.వి.ప్రసాదరావు తర్వాత ప్రసాదరాయ కులపతిగా గుంటూరు హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అయ్యారు. ప్రస్తుతం వారు కుర్తాళం పీఠాధిపతి. తంగిరాల వెంకట సుబ్బారావుకు అప్పటికే వివాహమైంది. జానపద సాహిత్యంపై పరిశోధన చేశారు. బెంగుళూరు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ వ్యవస్థాపకులు. 2025 జనవరిలో అప్పాజోశ్యుల విష్ణుభట్ల సాహిత్య పురస్కారం అందుకొని గతించారు. కందుకూరు ప్రభుత్వ కళాశాలలో నేను అద్యాపకుడిగా పని చేస్తూ జాస్తి సూర్యనారాయణ పర్యవేక్షణలో కందుకూరు రుద్రకవి రచనలపై 1976లో పి.హెచ్.డి సాధించాను. ఈ కళాశాల విద్యార్ధుల్లో ఏ.వి.యస్ రెడ్డి, ఏ విద్యాసాగర్, పి.సుబ్రమణ్యం ప్రభృతులు ఐఎఎస్ అధికారులుగా ఆంధ్రా క్యాడర్‌లో పదవులధిష్టించారు.
విశ్వవిద్యాలయ పాలక వర్గం:
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1954 సెప్టెంబరులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో ఏర్పడింది. తొలి వైస్ ఛాన్సలర్‌గా దక్షులైన యస్.గోవిందరాజులు నాయుడు నియమితులై 1964 వరకు దశాబ్ది కాలం కొనసాగి విశ్వవిద్యాలయ పునాదులు పటిష్టం చేశారు. రిజిష్ట్రార్‌గా రామనుజుల నాయుడు వ్వవహరించారు. 1964-69 మధ్య పి. వామనరావు ఉపాధ్యక్షులు. ఆయన హైదరాబాదులో విద్యాశాఖ డైరెక్టరుగా ప్రసిద్ధులు. వారి తర్వాత వైద్యశాఖ డైరెక్టరు డా. డి. జగన్నాధరెడ్డి 1969-75 మధ్య వి.సి. అతి చిన్న వయస్సులో వి.సి అయిన వ్యక్తి ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి (1975-78).
తిరుమల ప్రవచనంలో డా. అనంతపద్మనాభరావు దంపతులు
అదే విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్లను వి.సిలుగా నియమించడం 1980లో మొదలైంది. ఆంగ్ల శాఖాధిపతి యం. వి. రామశర్మ(1980-84), తెలుగు శాఖాధిపతి జి.యన్. రెడ్డి(1984-87) వరసగా వి.సి.లు అయ్యారు. రిజిష్ట్రారుగా వై. విశ్వనాధం, యం.కె. రామకృష్ణన్, జయదేవ రెడ్డి, కె.వి.సుబ్బరాజులు ప్రసిద్ధులు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా యం.కుటుంబరావు నిక్కచ్చి మనిషి. తిరుపతికి చెందిన ఏ. బలరామిరెడ్డి సిండికేట్ సభ్యులుగా కొనసాగారు.
1967లో అనంతపురం పోస్టు గ్రాడ్యుయేట్ సెంటర్ ప్రారంభమైంది. స్పెషన్ ఆఫీసరుగా ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి పునాదులు వేశారు. డా. యన్. శ్రీదేవి డైరెక్టరుగా 1981 వరకు పని చేశారు. తొలి వైస్ ఛాన్సలర్ యం. ఏబెల్ (1981-87) శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంగా అది గత ఆరు దశాబ్దాలుగా ప్రసిద్ధికెక్కింది.
ప్రసిద్ధ విద్యావేత్తలు:
తిరుపతిలో ఆ తరానికి చెందిన ప్రముఖ అధ్యాపకుల ప్రస్తావన వచ్చినపుడు కొందరిని స్మరిస్తాను. చరిత్ర విభాగంలో మరేమండ రామారావు, ఆ తర్వాత శాఖాధిపతి వి.యం.రెడ్డి, ఎకనామిక్స్ హెడ్ డి.యల్.నారాయణ, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి పి.కమలనాధన్, యన్.వి.రామశర్మ, రాళ్లపల్లి రామమూర్తి, లైబ్రరీసైన్సు శ్రీపతినాయుడు ఫిజికల్ విభాగంలో జయరామిరెడ్డి, కె.జె.లక్ష్మణ్.
ఇలా ఎందరో మహానుభావులు. అందరికీ వందనం. ఇక్కడి ఆచార్యులు పలువురు ఇతర విశ్వవిద్యాలయాల వి.సి.లుగా వెళ్లారు.
తిరుమల ఆలయ ప్రాంగణంలో డా. అనంతపద్మనాభరావు దంపతులు
దేవస్థానం వారి శ్రీవెంకటేశ్వర ఆర్ట్స కళాశాల ఆ రోజుల్లో పాత భవనాలలో నడిచేది. డబ్బారేకుల కాలేజీ అని పిలిచేవారు. తర్వాత నూతన భవనాలు వెలశాయి. యూనివర్శిటీ లైబ్రరీ కూడా 1965 నాటికే నూతన భవనాలలోకి చేరుకొంది.
పద్మావతీ మహిళాకళాశాల:
వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలతో బాటు మహిళల కోసం ప్రత్యేకంగా తి.తి.దే. సహకారంతో పద్మవతి మహిళా కళాశాల స్థాపించారు (1952) ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా రాజేశ్వరి మేడం క్రమశిక్షణకు మారు పేరు. 1983లో యన్.టి.రామారావు (ముఖ్యమంత్రి) సంకల్పంతో ఆ సంస్థ మహిళా విశ్వవిద్యాలయంగా రూపొందింది. ప్రముఖ విద్యావేత్త వనజా అయ్యంగార్ తొలి రోజులలో దిశానిర్దేశం చేశారు.
ఓరియంటల్ కళాశాల:
దేవస్థానం నిర్వహించే యస్.వి.ఓరియంటల్ కళాశాల అతి ప్రాచీనం. 1884 ప్రాంతాలలో పాఠశాలగా ప్రారంభమై కళాశాలగా రూపొందింది. 1965 ప్రాంతంలో గోవింద రాజస్వామి ఆలయ సమీపంలోని మ్యూజియంలో క్లాసులు నడిచేవి. కళాశాల ప్రిన్సిపాల్‌గా నాగయ్య చాలా కాలం వ్యవహరించారు. అద్యాపకులుగా గౌరిపెద్దరామ సుబ్బశర్మ, సముద్రాల లక్ష్మణయ్య, సింగరాజు సచ్చిదానందం, ప్రభృతులు ప్రముఖులు. ఇప్పుడు కపిల తీర్థం రోడ్డులో నూతన భవనాలు వెలశాయి.
తిరుమల ఆలయ ప్రాంగణంలో డా. అనంతపద్మనాభరావు
శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల:
విద్యారంగంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని తి.తి.దేవస్థానం అర్ట్స్ కళాశాలకు తోడు ఈ కళాశాలను 1969 సెప్టెంబరులో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ పి.వి.నరసింహారావు ఈ కళాశాలని ప్రారంభించారు. 1987లో నూతన భవనాలలోకి ప్రవేశించింది. యన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా భవన ప్రారంభోత్సవం చేశారు. దేవస్థానం వారు ఢిల్లీలో 1961లో ఆర్ట్స్ కళాశాల ఆరంభించారు. ఈ కళాశాల తెలుగు శాఖాధిపతి ఏల్చూరి మురళీధర రావు ప్రముఖ రచయిత. దుర్గాబయ్ దేశముఖ్ చొరవతో ఈ కళాశాల ఏర్పడింది. ఉపరాష్ట్రపతి రాధకృష్ణన్ ప్రారంభించారు. తొలినాళ్లలో వి.కృష్ణమూర్తి ఒక దశాబ్ది కాలం ప్రిన్సిపాల్‌గా కళాశాలకు మార్గనిర్దశనం చేశారు.
శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యపరిశోధనా కేంద్రం:
అతి ప్రాచీనమైన శ్రీవెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1939లో ఆరంభమైంది. హిందూ మతము, సంస్కృతులకు సంబంధించి సంస్కృతాంధ్ర గ్రంథాలపై పరిశోధన కొనసాగిస్తూ తాళపత్రాల పరిరక్షణ కొనసాగిస్తోంది. మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి ప్రభృతులు అక్కడ పరిశోధనలు కొనసాగించారు. అన్నమాచార్య సంకీర్తనల సంపుటులు వెలువరించడంలో కృషి చేశారు. 1956 నవంబరులో దేవస్థానం వారు ఈ సంస్థను శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీకి అప్పగించారు. శంకర నారాయణ డైరక్టురుగా ప్రసిద్ధులు. ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి ఈ సంస్థకు 1968 ప్రాంతంలో అధిపతి. వి. వెంకటరమణా రెడ్డి ఈ సంస్థ అధిపతిగా ఎన్నో సెమినార్లు జరిపారు. నేషనల్ మాన్యుస్క్రిప్టు మిషన్ ‘నమామి’ డైరక్టరుగా ఢిల్లీలో రెండేళ్లు పని చేశారు. ప్రస్తుతం డా. పి. సి. వెంకటేశ్వర్లు డైరక్టరు. ముదివేడు ప్రభాకరరావు మంచి పరిశోధకులు. ఈ సంస్థ త్రైమాసిక పత్రిక నడుపుతోంది.
స్విమ్స్ డైరక్టర్ డా. ఆర్. వి. కుమార్ గారితో డా. అనంతపద్మనాభరావు దంపతులు
వ్యవసాయ కళాశాల – తిరుపతి:
తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో తిరుపతిలో వ్యవసాయ కళాశాలకు అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముత్యులు నూకల రామచంద్రారెడ్డి 1961 అక్టోబరు 27న శంఖుస్థాపన చేశారు. 1962మే నుండి కళాశాల ప్రారంభమైంది. పశు వైద్య కళాశాల కూడా ఏర్పడింది. 1964లో ఓ. పుల్లారెడ్డి వ్వవసాయ విశ్వవిద్యాలయం, హైద్రాబాదు తొలి వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆ విశ్వవిద్యాలయానికి ఈ కళాశాల, బాపట్ల కళాశాల అనుబంధంగా చేరాయి. తెలంగాణా విభజనకు పూర్వం యన్.జి.రంగా విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది. విభజన తర్వాత గుంటూరు సమీపంలోని ‘లాం’ లో ఆంధ్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడింది. ప్రస్తుతం డా. ఆర్. శారదా జయలక్ష్మిదేవి వైస్ ఛాన్సలర్. తిరుపతి పశువైద్య కళాశాల ఆధ్యాపకులు నెల్లుట్ల వెంకటేశ్వరరావు ప్రముఖ రచయిత.
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం:
కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 1961లో తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆవిర్భవించింది. 1962లో అప్పటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాపీఠంకు శంఖుస్థాపన చేశారు. 1971లో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనుబంధ సంస్థ అయింది. 1987లో డీమ్డ్ యూనివర్శిటీగా ప్రకటించారు. 2000 మార్చిలో నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంగా పార్లమెంటుకు ఆమోదం లభించింది. యన్. గోపాల స్వామి ప్రస్తుత ఛాన్సలర్. జి.యన్.ఆర్. కృష్ణమూర్తి ప్రముఖ వైస్ ఛాన్సలర్. యస్.బి.రఘునాథాచార్య శతపథి మురళీధర శర్మ ఇక్కడి వి.సి.గా ప్రసిద్ధులు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.