Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-5

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

ఆ తరం న్యాయమూర్తులు:

1960వ దశాబ్దికి చెందిన నెల్లూరీయుల ప్రస్తావన వచ్చినపుడు న్యాయమూర్తులుగా సుప్రీం కోర్టులోను, హైకోర్టులలోను ఖ్యాతిగడించిన వ్యక్తుల వివరాలను లోతుగా పరిశీలించాను. ప్రాతఃస్మరణీయులు జస్టిస్ పలగాని చంద్రారెడ్డి (1904). ఆయన మదరాసు హైకోర్టు జడ్జిగా 1949 జూలైలో నియమితులయ్యారు. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఏర్పడినపుడు 1954 జులైలో బదిలీ అయ్యారు. 1958లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రథాన న్యాయమూర్తి. ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక గవర్నరుగా 1963న నవంబరులో కొంత కాలం వ్యవహరించారు. 1964 నవంబరులో మదరాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నరుగా వున్నారు.

జస్టిస్ యం. యన్. రావు (1936) జిల్లా జడ్జిగా 1973లో డైరక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికై తర్వాత 1979-83 మధ్య ఆంధ్ర ప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా 1986లో నియమితులై 1997లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదలీ అయి 1998లో రిటైరయ్యారు. దరిమిలా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్ అయ్యారు.

జస్టిస్ పొణకా వెంకట్రామిరెడ్డి (1940) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా 1990లో పదవీ బాధ్యతలు చేపట్టారు. పది సంవత్సరాల తర్వాత 2000లలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2001-2005 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నో క్రియాశీలక తీర్పులు వెలువరించారు. 19వ లా కమిషన్ ఛైర్మన్‌గా (2010-2012) వ్యవహరించారు.

జస్టిస్ సన్నపురెడ్డి దశరథరామిరెడ్డి (1935) కోవూరువాసి. లాయరుగా ప్రసిద్ధులు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జిగా 1993 ఏప్రిల్ నుండి 1997 ఫిబ్రవరి దాకా పని చేశారు. వీరి కుమారులు ద్వారకనాధరెడ్డి అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా పని చేస్తున్నారు.

నెల్లూరు ఎంపి శీ ఎం. శ్రీనివాసులురెడ్డి, జె. చెన్నయ్య గార్లతో రచయిత

జస్టిస్ జి. కృష్ణమోహన రెడ్డి (1951) డిస్ట్రిక్ట్ మునిసిఫ్‌గా 1981లో ఎంపికై  1996లో జిల్లా జడ్జి అయ్యారు. 2012 నవంబరు 2013 ఫిబ్రవరి మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి.

న్యాయశాస్త్ర కోవిదులు, కావలి వాసి పవని పరమేశ్వరరావు (1933-2017) సుప్రీం కోర్టులో నాలుగు దశాబ్దాలు సీనియర్ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. లోక్‌పాల్ ఎంపిక కమిటీ జ్యూరీ సభ్యులు. వీరికి 2006లో పద్మభూషణ్ ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పులను లోకానికి తెలియజేస్తూ ‘ద హిందూ’ దినపత్రిక లీగల్ కరెస్పాండెంట్‌ టి. పద్మనాభరావు (గూడూరు) ప్రసిద్ధులు.

పాతతరం నెల్లూరు పత్రికలు:

1900 ప్రాంతంలో నెల్లూరు నుండి దంపూరు నరసయ్య ‘ఆంధ్ర భాషా గ్రామవర్తమాని’ అనే పత్రికను నంబెరు మార్లయ్య సహకారంతో నడిపారు. 1865లో ‘నెల్లూరు పయోనీర్’ పత్రికను, అంతకు ముందు మదరాసు నుండి ‘నేటిల్ అడ్వకేట్ పత్రికను,’ 1882లో ‘పీపుల్ ఫ్రెండ్’ అనే పత్రికను వెలువరించారు. ఆయన కలెక్టరాఫీసు ఉద్యోగి. 1885 జూన్‌లో పూండ్ల రామకృష్ణయ్య అనే 24 ఏళ్ల యువకుడు ‘అముద్రిత గ్రంథచింతామణి’ మాస పత్రికను ప్రారంభించారు. 1904 వరకు నడిపారు. 44వ ఏట అతి చిన్న వయస్సులో మరణించాడు. అముద్రిత గ్రంథాలు పత్రికలో ప్రచురించబడేవి. ఆ  యజ్ఞంలో ఆయనకు వేదం వెంకటరామశాస్త్రి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి సహకరించారు. త్ర్యర్థికావ్యమైన యాదవ రాఘవ పాండనీయము ప్రచురించారు. నెల్లూరును ‘హరిపురి’ (సింహపురి) అని ప్రకటించారు.

1895లో ‘వర్తమాన తరంగిణి’ అనే సాహిత్య మాసపత్రికను బెజవాడ పట్టాభి రామిరెడ్డి, బాలకృష్ణారెడ్డి గారలు నడిపారు. పట్టాభిరామిరెడ్డి గోపాలరెడ్డి తండ్రి. 1896లో బుచ్చిరెడ్డి పాళెం నుండి ‘శ్రీశారద’ అనే పత్రికను దొడ్ల వెంకటరామిరెడ్డి ప్రచురించారు. ఎడవల్లి కామశాస్త్రి సంపాదకులు. 1916లో  వావిళ్ల వారు  ‘త్రిలింగ’ పత్రికను నడిపారు.

1930లో నెల్లూరు వెంకటరామనాయుడు ‘జమీందారీరైతు’ పత్రికను రాజకీయ పత్రికగా మొదలెట్టారు. మార్చి 2న అది వారపత్రికగా మొదలై నేటికీ ‘జమీన్ రైతు’గా కొనసాగుతోంది. నెల్లూరు శ్రీరామమూర్తి చాలా కాలం సంపాదకులు. ఆయన శాసనమండలి సభ్యులుగా పని చేశారు. ప్రస్తుతం డోలేంద్ర ప్రసాద్ సంపాదకులు.

వి.ఆర్. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ భాస్కర్ గారితో పద్మనాభరావు దంపతులు

1921లో స్వాతంత్ర సమరయోధులు పాటుూరి సుబ్బరామయ్య ‘సింహపురి’ సైక్లోస్టయిల్ పత్రికను పంచారు. 1923లో ముద్రణాలయం ఏర్పడింది. 1930లో దేశిరెడ్డి శేషురెడ్డి ‘స్వతంత్రరైతు’ పత్రికను నడిపారు. 1931లో మరుపూరు  కోదండ రామిరెడ్డి ‘రంధ్రాన్వేషి’ పత్రికను, 1954లో ‘మందాకినీ’ పత్రికను ప్రచురించారు.

గోడ పత్రిక:

స్వాతంత్ర్యోద్యమ సమయంలో నెల్లూరు ట్రంకురోడ్డు మీద తిప్పరాజు వారి సత్రం గోడ మీద తుములూరి పద్మనాభయ్య చాక్‌పీస్‌తో ఏరోజు కారోజు ప్రధాన వార్తలు వ్రాసేవాడు. సాయంకాలం పూట జనం గుమిగూడి చూసేవారు. తరువాతి కాలంలో ఇంద్రగంటి సుబ్రమణ్యం ఆ పత్రికను నడిపాడు. అది బి.బి.సి వార్తల కెక్కింది.

యల్.వి. కృష్ణారెడ్డి సంపాదకత్వంలో యూత్ కాంగ్రెస్ పత్రిక 60వ దశకంలో నడిచింది. లాయర్ పత్రికను తుంగా రాజగోపాల రెడ్డి ప్రారంభించారు (1980). తుంగా శివప్రభాత రెడ్డి ప్రస్తుత సంపాదకులు. నెల్లూరు నగారా, సింహపురి వారపత్రికలు కూడా కొనగాగాయి. ఆంగ్ల దినపత్రిక హిందూ సంపాదక వర్గంలో ప్రముఖలైన జి.కె.రెడ్డి నెల్లూరీయుడే. ఖాసా సుబ్బారావు (1896) ఆంధ్రప్రభ దిన పత్రిక తొలి సంపాదకులు (కావలి వాసి). గన్నవరపు సుబ్బరామయ్య భారతి మాసపత్రిక సంపాదక వర్గంలో ప్రముఖలు (1890-1963).

నెల్లూరు ఉత్సవాలు

నెల్లూరు జిల్లా నుండి వెలువడిన మరి కొన్ని పత్రికలు:

  1. ఆంధ్రి – పల్లెపాళం
  2. వాగ్వల్లి – ఆత్మకూరు (కలువాయి) మాసపత్రిక (1899-1902) కె.వి. రామనుజశర్మ
  3. వార్తాదర్శిని – తూములురు వేంకటరమణయ్య (1893) సంపాదకులు.
  4. వినోదిని – మాసపత్రిక
  5. న్యాయబోధని – బెజవాడ పణ్ణాభిరామిరెడ్డి (సంపా) 1896 వరకు.
  6. ఆనందదాయిని – జై.నరసింగరావు (సంపా)1899
  7. వర్ణశ్రమ ధర్మసంస్థాపనము – పిన్నమరాజు వెంకటసుబ్రమణ్యశర్మ, కావలి. 1926.
  8. హిందూబాంధవి – చతుర్వేదుల వెంకట రాఘవయ్య -1903.
  9. వైశ్యాలయ – సుంకు నారాయణ శెట్టి (1906)
  10. నీతి దర్పణం – 1895.
  11. విద్యార్థి కల్పభూజం – ఉల్లిగొండం రామచంద్రరావు 1882-83
  12. మందారమంజరి – ఒంగోలు వెంకటరమణారావు.
  13. రోమన్ కాథలిక్ పేపరు – కాథలికమిషన్ వారి వారపత్రిక
  14. శ్రీభారతి – వావిలకొలను సుబ్బారావు (1900 -1901)
  15. భవాని – మంగు వేంకట రామనుజరావు.
  16. స్టూడెంట్స్ మగజైన్ – బిరుదవోలు ప్రసాదరావు (1912-13) హైస్కూలు విద్యార్థుల పత్రిక.
  17. క్రైస్తవ వర్తమానము – రెవరెండ్ జాన్ ఎలెర్.
  18. వీరశైవప్రచారిణి – గురుదేవ సుబ్రహణ్యశర్మ -1929.
  19. దక్కన్ వైశ్య – జవ్వాది సుబ్బరాయగుప్త
  20. విద్యాభివర్థని – నెమలి సుబ్బారావు, వెంకటగిరి.
  21. అరుణరేఖ – నారపపెడ్డి.

(ఈ విధంగా నెల్లూరు జిల్లాలోని బిన్న ప్రాతాల నుండి భిన్న పత్రికలు వెలువడిన బోగట్టాను నేను కేంద్ర సాంస్కృక శాఖ వారి నేషనల్ ఠాగురు స్కాలర్‌షిప్ (2015 – 17) సమయంలో సేకరించి ‘తెలుగు పత్రికల సాహిత్య సాంస్కృతిక సేవ’ అనే గ్రంథంలో ప్రచురించాను.)

సినీరంగ ప్రముఖులు:

చలన చిత్రరంగంలో నెల్లూరీయులు పలువురు ఖ్యాతి గడించారు. హాస్య నటులలో తొలితరానికి చెందిన టి.వి.రమణారెడ్డి (1912-1974) విలక్షణనటులు. రేలంగి, రమణారెడ్డి హాస్యాన్ని పండించారు. ఆ తరం నటులలో వంగరవెంకట సుబ్బయ్య, టి.వి.యస్.శర్మ ప్రముఖులు. సినీ రచయితగా, పాటల రచయితగా ఆత్రేయది ప్రత్యేక శైలి. ‘పాటలు వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించే వాడని’ ఆయనకు పేరు. ఫహిల్వాన్ నెల్లూరు కాంతారావు, విలన్‌గా సుప్రతిష్టితులైన రాజనాల ఇక్కడి వారే. విలక్షణ నటుడు నాగభూషణం నటదిగ్గజం. ఇంకెందరో.

తరువాతి తరంలో వాణిశ్రీ, కాంచన (కరవది గ్రామం) నణీమణులుగా రెండు దశాబ్దాలు రాజ్యమేలారు. తండ్రిగారి వృత్తి రీత్యా నెల్లూరు వాసియైన చిరంజివి, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆధునిక చలన చిత్ర సీమలోనే గాక, వర్తమాన రాజకీయాల లోనూ అగ్రశ్రేణిలో నిలిచారు. జయమాలిని నటీమణి.

సినీ నిర్మాతలుగా పొన్నలూరి బ్రదర్స్ (బుచ్చిరెడ్డి పాళెం) – యం.యస్.రెడ్డి (గూడూరు), టి.సుబ్బరామి రెడ్డి (నెల్లూరు) ప్రసిద్ధులు. ప్రసిద్ధ నేపథ్య గాయకులు యస్.పి.బాలసుబ్రమణ్యం అమరగాయకుడు. వారి తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి హారి కథకులుగా పేరు గాంచారు.  60వ దశకంలో ఆయన ఉంఛవృత్తిలో నెల్లూరు నగర వీధులలో విరాళాలు సేకరించి త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిపేవారు. నేఫ్జా (నెల్లూరు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్) నాటక పోటీలు నిర్వహించేది.

ఎం. రామచంద్ర ప్రసాద్ గారికి సన్మానం

పొన్నాల రామసుబ్బారెడ్డి రంగస్థల నటులుగా వన్నెకెక్కారు. ఫన్ డాక్టరు చంద్రశేఖరం జాతీయ స్థాయిలో పేరు గడించారు. ఆయన కోడలు గాయన యస్. జానకి, పి. పుల్లయ్య, సింగీతం శ్రీనివాసరావు, ఏ.కోదండరామిరెడ్డి, పి.సి.రెడ్డి దర్శకులుగా చిరస్మరణీయులు.

ఆలయ సంపదలో నెల్లూరు జిల్లా తీసిపోలేదు. నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి, పెంచలకోన, నరసింహులు కొండలలో నృసింహాలయాలు, జొన్నవాడ కామాక్షీదేవి, సూళ్ళూరి పేట చెంగాళమ్మ, కందుకూరు జనార్ధనస్వామి ఆలయాలు ప్రసిద్ధాలు.

1971లో ప్రారంభమైన శ్రీహరి కోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం ఆధునిక దేవాలయం. సమీపంలోని నేలపట్టు (పులికాట్ సరస్సు) పక్షులు దూరప్రాంతాల నుండి ఏటా అక్టోబరు నెలలో రావడం పర్యాటకులకు ఆకర్షణ. ఇక్కడ ‘బర్డ్ శాంక్చురీ’ 459 హెక్టార్ల విస్తీర్ణంలో వుంది. 186 పక్షి జాతులకు నిలయం. ఈ రీతిగా నెల్లూరు ప్రశస్తి దశదిశలా విస్తరించింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version