Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-4

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

నెల్లూరు కవి పండితులు

నెల్లూరు అనగానే కవిత్రయ కవులలో తిక్కన, ఎర్రనలు వెంనటనే స్ఫురిస్తారు. ఆంధ్ర మహాభారతాంధ్రీకరణలో సింహభాగం పూర్తి చేసిన తిక్కనామత్యుడు పాటూరి వాసి. తిక్కన వ్రాసిన ‘ఘంటం’ భద్రపరచబడి వుంది.  తిక్కన తిరునాళ్ల పేరతో ఉత్సవాలను మరుపూరు కోదండరామిరెడ్డి 1995లో నెల్లూరులో ఘనంగా జరిపి ప్రత్యేక సంచికను ప్రచురించారు. తిక్కన గ్రంథాలయం ప్రసిద్ధం. తిక్కవరపు రామిరెడ్డి (బెజవాడ గోపాల రెడ్డి మామగారు) దశాబ్దాలుగా కవిత్రయ జయంతులు ఫిబ్రవరి మాసంలో మూడు రోజులు నిర్వహించి పండితులచే ఉపన్యాసాలిప్పించి సత్కరించారు. 1991లో ఆ గౌరవం నాకు లభించింది.

మహాభారత అరణ్య పర్వ శేషపూరణ, హరివంశ రచనలు చేసిన ఎర్రాప్రగ్గడ గుడ్లురు నివాసి. అక్కడి నీలకంఠేశ్వర స్వామికి అంకితంగా కావ్యాలు వెలయించాడు. ఎర్రన స్మారక గ్రంథాలయం అక్కడ నడుస్తోంది. ఒంగోలులో డా. ధారా రామనాధ శాస్త్రి ఎర్రన కళాపీఠం స్థాపించి ఎర్రన జయంతులను నిర్వహించారు. 1994లో నేను ఎర్రన కావ్యాలపై ప్రసగించి సత్కారం పొందాను. గుడ్లూరు నెల్లూరు జిల్లాలోనిది. కంకంటి పాపరాజు ఇక్కడి వాడు.

ఆధునిక కాలంలో ఎందరో కవి పండితులు తెలుగు సాహిత్య జయకేతనాన్ని ఎగరవేశారు.

అల్లు భాస్కరరెడ్డి, వెల్దండ నిత్యానందరావు, పెరుగు రామకృష్ణ గార్లతో

దువ్వూరి రామిరెడ్డి (1895-1947):

దువ్వూరి ఇక్కడి పెమ్మారెడ్డి పాళెం వాసి. వీరి రచనలలో పానశాల, కృషీవలుడు, వనకుమారి, పలితకేశం, నలజారమ్మ అగ్ని ప్రవేశం ప్రసిద్ధాలు. ‘కవికోకిల’ బిరుదాంకితులు. రైతు బిడ్డ. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు పదివేల రూపాయల నిధిని ఏర్పరచారు. సినిమా దర్శకత్వం వహించారు. దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి (ఉలవపాడు) సాహిత్య పరిశోదకులు.

వేదం వెంకటరామ శాస్త్రి:

ప్రతాపరుద్రీయ నాటక రచనతో ప్రశస్తి కెక్కిన వేదం వెంకటరామ శాస్త్రి గొప్ప పండితులు (1853-1929). 1899లోనే ‘తెలుగు భాషాభిమాని’ నాటక సమాజం స్థాపించారు. 1886 నుండి మదరాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండిత పదవిని 25 సంవత్సరాలు నిర్వహించారు. ఈయన గ్రాంధిక భాషావాది. ఉషానాటకం, నాగానందము, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఉత్తరరామ చరిత్ర, విక్రమౌర్వశీయం, రత్నావళీ, బొబ్బిలియుద్ధం – వీరి ప్రసిద్ధ నాటకాలు. ఆముక్తమాల్యద, శృంగార నైషధ వ్యాఖ్యానములు ప్రామాణికం. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వారి కళా ప్రపూర్ణ (1927) లభించింది.

దీపాల పిచ్చయ్య శాస్త్రి (1894-1983):

దీపాల పిచ్చయ్య శాస్త్రి నెల్లూరు, వి.ఆర్. హైస్కూలులో తెలుగు పండితులుగా 19 సంవత్సరాలు బోధించారు. 1954లో పదవీ విరమణ చేశారు. వీరి గురువులు తిరుపతి వెంకటకవులు. గుర్రుం జాషువాతో కలిసి జంటకవులుగా వుండాలని ప్రయత్నం చేశారు.  ‘జాషువా పిచ్చి’ లేదా ‘పిచ్చ జాషువా’ అనే జంట పదాలు అమరక విడివిడిగా రచనలు చేశారు. చాటుపద్యాలను గుర్రం పై తిరుగుతూ సేకరించి చాటుపద్య రత్నాకరం ప్రచురించారు. మేఘదూతము, రఘువంశము, దశకుమార చరిత్ర వీరి రచనలు. వీరి కుమారులు దీపాల రాధాకృష్ణమూర్తి కావలి జవహర్ భారతి ప్రిన్సిపాల్‍గా, రెక్టారుగా పని చేసి కాలధర్మం చెందారు. దీపాల పిచ్చయ్య శాస్త్రికీ, వేదం వెంకట రాయశాస్త్రికి మధ్య సాహితీ స్పర్ధలు చాలా కాలం కొనసాగాయి. వివిధ సాహిత్య పత్రికలలో వీరు, వీరి శిష్యులు వాదోపవాదాలు, విమర్శలు చేసుకొన్నారు.

విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ శ్రీ వీరయ్య

వావిళ్ల రామస్యామి శాస్త్రులు:

1854లో చెన్నైలో హిందూ భాషా సంజీవని పేరుతో ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి వందలాది ఆంధ్ర ప్రాచీన కావ్యాలను నిర్ధుష్టంగా ప్రకటించిన వావిళ్ల రామస్యామి శాస్త్రులు (1812- 1891) చిరస్మరణీయులు. 150 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర గల వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ సంస్థ తెలుగు సాహిత్యానికి చేసిన ఘన సేవ ప్రశంసార్హం. వావిళ్ల ప్రెస్‍౬గా అది ప్రసిద్ధం. అల్లూరుకు సమీపంలోని వావిళ్ల గ్రామం వారిది. ఆయన కుమారులు వెంకటేశ్వర శాస్త్రులు తండ్రి బాటలోనే నడిచారు. వారిది తొలి తెలుగు ప్రెస్ (ఆది సరస్వతీ నిలయం).

చదలవాడ సుందరరామశాస్త్రి:

వావిళ్ల కుటుంబంతో బంధుత్వం గల చదలవాడ సుందరరామశాస్త్రి (1865-1925) శారదాంబావిలాస ముద్రాక్షరశాలను మదరాసులో, నెలకొల్పి గ్రంథాలు ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి ‘స్వర్ణకంకణం’ బహుమతిగా పొందారు. చదలవాడ జయరామశాస్త్రి బహు గ్రంథ రచయిత. నెల్లూరు ట్రంకు రోడ్డులో 1960 దశకంలో పుస్తకాల షాపు నిర్వహించారు.

గుంటూరు శేషేంద్ర శర్మ (1927-2007):

యుగకవిగా ప్రసిద్ధులు గుంటూరు శేషేంద్ర శర్మ. వీరిది తోటపల్లి గూడూరు. మునిసిపల్ కమీషనరుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పని చేశారు. శేషేంద్ర ‘నా దేశం – నా ప్రజలు’ విశిష్ట రచన. 2004లో వీరి పేరు నోబెల్ బహుమతికి నామినేట్ చెయ్యబడింది. పోడశి – రామయణ విమర్శ గ్రంథం. స్వర్ణ హంస – హర్ష నైషధ విమర్శనం. కాలరేఖ వ్యాస సంపుటి. 1976లో వీరి పద్య సంకలనం  ‘నీరై పారిపోయింది’  –  ఉభయభాషాలలో ప్రచురింతమైంది. తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ 1994లో లభించింది. 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌తో సత్కరించబడ్డారు.

ఇతరులు:

న్యాయవాదిగా వుంటూ మోచర్ల రామకృష్ణయ్య పలు గ్రంథాలు రచించారు. మద్దాళి మల్లికార్జున రావు (న్యాయవాది) నెల్లూరు జిల్లా రచయితల సంఖ అధ్యక్షులు యన్.యస్. కృష్ణ మూర్తి నెల్లూరి మండల సర్వసం తయరలో సహకరించారు. సురభి నరసింహం నవలా నాటక రచయిత, గోసుకొలుడ వెంకటసుబ్బయ్య కవిత్రయ జయంతుల కార్యదర్శి.

మరుపూరు కోదండరామిరెడ్డి:

‘హాలికుడు’ కలం పేరుతో రచనలు చేసిన మరుపూరు కోదండరామిరెడ్డి (1902-1994) బందరు జీతీయ కళాశాలలో విద్యనభ్యసించారు. మందాకిని పత్రిక సంపాదకులు. వీరి సోదరి పొణకా కనకమ్మ స్వాతంత్ర్య సమర యోధురాలు. నెల్లూరులో ప్రభుత్వ ప్రెస్ నిర్వహించారు. తమిళ శిలప్పదికారం నవలను తెలుగులోకి అనువదించారు. కర్ణుడు నవల ప్రసిద్ధం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం పక్షన వీరి కంఠస్వరాన్ని ఇంటర్యూ రూపంలో నేను రికార్డు చేసి భద్రపరచాను.

అదే సమయంలో దీపాల పిచ్చయ్య శాస్త్రిని కూడా ఇంటర్వూ చేసి ఆర్కైవ్స్‌లో  భద్రపరచాము. విరసం రచయిత కె.వి.రామణారెడ్డిని కూడ స్టూడియోలో రికార్డు చేసి వారి నియమం ప్రకారం వారి మరణానంతరం ప్రసారం చేసే ఏర్పాటు చేశాం. రమణారెడ్డి కావలి జవహర్ భారతిలో చరిత్ర ఆధ్యపకులు. అలానే ప్రసిద్ధ చారిత్రిక పరిశోధకులు వకుళభరణం రామకృష్ణ కూడా అక్కడే చరిత్ర విబాగంలో పని చేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యలుగా పదవీ విరమణ చేశారు.

మామిడిపూడి వెంకట రంగయ్య:

చారిత్రక పరిశోధనలో పితామహులు మామిడిపూడి వెంకట రంగయ్య (1889-1982).  చరిత్రను సశాస్త్రీయంగా ఆవిష్కరించన ఘనులు. వీరిది పురిణి గ్రామం. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలతో ప్రభావితులయ్యారు. కాకినాడ, విజయనగరం, నెల్లూరు కళాశాలల్లో అధ్యాపకత్వ బాధ్యతలు చేపట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో రీడర్ గా చేరారు. బొంబాయిలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి. ‘ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమం’ నాలుగు సంపుటాలుగా ప్రచురించారు. వీరి మనుమరాలు శాంతా సిన్హా తాతగారి పేర యం.వి. పౌండేషన్ నిర్వహిస్తున్నారు. రామన్ మేగససే అవార్డు (2003) గ్రహీత ఆమె.

మాజీ లెక్చరర్ సి. సంజీవరావు

రావిప్రోలు సుబ్రమణ్యం:

పల్లెపాడు గ్రామానికి చెందిన రావిప్రోలు సుబ్రమణ్యం (1923-1984) పురావస్తు పరిశోధకులుగా జాతీయ స్థాయి ఖ్యాతి గడించారు.1954లో నాగార్జున కొండ వద్ద కృష్ణానదిపై డ్యామ్ నిర్మించాలని నిర్ణయించినప్పుడు సుబ్రమణ్యం అక్కడి బౌద్ధ మత సంపదను వెలికి తీసి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌చే అభినందనలందుకొన్నారు. ద్వీప పురావస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు. శ్రీశైలం డ్యామ్ విషయంలోను విశేష ప్రతిభ కనబరచారు. సూపరింటిండెంట్ ఆఫ్ ఆర్కియాలజీగా పలు ప్రాంతాలలో పురావస్తు సంపదను వెలికి తీశారు. జీవితకాలం చరిత్రకే అంకితమయ్యారు.

ఆధునిక కవులు:

ఆధునిక కవులలో నెల్లూరీయులలో తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి (పఠాభి) తన ఫిడెల రాగాల డజన్‌తో ఖ్యాతి గడించాడు. ఆయన తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు. బెజవాడ గోపాలరెడ్డి వీరి బావగారు. బెంగుళూరులో స్థిరపడ్డ ‘పఠాభి’ భార్య స్నేహలతారెడ్డి ఎమర్జన్సీ సమయంలో బాధలను అనుభవించి మృతి చెందారు.

సినీరంగంలో నిర్మతగా ప్రసిద్ధి కెక్కిన యం.యస్. రెడ్డి సుందర రామాయణం పద్య కావ్యంగా రచించారు. వీరిది గూడూరు. అదే పట్టణానికి చెందిన ముదివర్తి కొండమాచార్యులు సుప్రసిద్ధి కవి. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో 30 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. భారత భాగవత పరిష్కరణలో సంపాదకత్వం వహించారు.

అల్లూరుకు చెందిన ఉండేల మాలకొండారెడ్డి పద్యకవి. హైదరాబాదులో చైతన్య భారతి ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు. బహుగ్రంధకర్త. ‘శివారెడ్డి పద్యాల’తో జనజాగృతిని కలిగించి ‘జమీన్ రైతు’లో ధారావాహిక నిర్వహించిన శివారెడ్డి ప్రముఖులు. ఇటీవలే స్వర్గస్థులైన యం. రామచంద్ర ప్రసాద్ పద్య సారస్వత స్థాపించి సభలు – సమావేశాలు నిర్వహించారు.

వి. ఆర్. కాలేజి తెలుగు శాఖాధిపతిగా పని చేసిన మద్గువర్యులు పోలూరి హనుమజ్జానకీ రామశర్మ రామాయణ తరంగిణి, భాగవత కథా సుధ తదితర గ్రంథాల రచయిత. ముప్పవరపు వెంకటయ్య నాయుడు వీరి శిష్యులు. గురువు గారి పేర వెంకయ్య నాయుడు తెలంగాణా సారస్వత పరిషత్‌లో 6 లక్షల రూపాయలతో శాశ్వత నిధి ఏర్పాటు చేసి, ఏటా 25 వేల రూపాయల నగదుతో ఒక పండితుని సత్కరించే ఏర్పాటు చేశారు. 2023లో ఆ సత్కారం నాకు లభించింది.

వి.ఆర్. కాలేజ్ మాజీ అధిపతి శ్రీ వేణుగోపాలయ్య

ప్రస్తుతం నెల్లూరులో పెరుగు రామకృష్ణ ఆంగ్లాంధ్రాలో కవి. 2024 సంవత్సరానికిగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం గంగిశెట్టి శివకుమార్‍కు లభించింది. పెళ్లకూరు జయప్రద నవలా రచయిత్రిగా ప్రసిద్ధురాలు. కోట రాజశేఖర్ పద్యకవి. ఇలా తరాల అంతరాలు కవితా సుగంథాలను  వెదజల్లుతూనే వున్నాయి. ఈతకోట సుబ్బారావు జర్నలిస్టు, రచయిత. టేకుమళ్ల వెంకటప్పయ్య రచనలకు పలు పురస్కారాలు లభించాయి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version