Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-3

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

నెల్లూరు ముచ్చట్లు (1960-65)

1960 – 1965 మధ్య కాలంలో నేను నెల్లూరు వి.ఆర్. కాలేజిలో పి.యు.సి, బి.ఏ.లు చదివాను. వెంకటగిరి రాజాగారి ఔదార్యంతో ఆ కళాశాల 1920 జూలైలో మదరాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా స్థాపించబడింది. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడినవుడు ఆ విశ్వవిద్యాలయానికీ, 1956లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది. ప్రస్తుతం ఈ కళాశాల ప్రభుత్వాధీనంలోకి మారింది. ఆ కళాశాలలో 1947 ప్రాంతాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేసిన పి.సి. అలెగ్జాండర్ తర్వాత కాలంలో ఐఎఎస్ అధికారిగా, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కార్యదర్శిగా, ఆపైన మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశారు. ఆ కళాశాలలో బి.ఏ. డిగ్రీ చదివిన ముప్పవరపు వెంకయ్యనాయుడు 2017-22 మధ్య భారత ఉపరాష్ట్రపతి.

కళాశాల గురు పరంపర:

మాథమేటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ జగన్మోహనరావు కళాశాల ప్రిన్సిపాల్‌గా కొద్ది కాలమే పనిచేశారు. ఆ తర్వాత 1960 నుండి ఆర్. సుబ్బారెడ్డి దశాబ్దికి పైగా ప్రిన్సిపాల్‌గా పాలన చేశారు. తర్వాతి కాలంలో జువాలజీ సుబ్బారావు మేస్టారు, తెలుగు శాఖ యస్.వి.కృష్ణారెడ్డి – ఇలా 60-90 దశకాలలో ప్రిన్సిపాళ్ళు. అధ్యాపకవర్గంలో స్మరణీయులైన వ్యక్తులు పలువురు. ఆంగ్ల శాఖలో దుర్గా రామమూర్తి, వేదం వెంకట్రామన్, తెలుగు శాఖలో దర్భా వేంకట కృష్ణమూర్తి, పోలూరి హనుమజ్జానకీ రామశర్మ, పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి, కోట సుబ్రమణ్య శాస్త్రి, బడి గురవారెడ్డి (గైడ్ల బ్రహ్మ), మద్దూరి సుబ్బారెడ్డి, వి. నారాయణరెడ్డి ప్రభృతులు. బాటనీ లెక్చరర్ సి. పద్మనాభరావు తర్వాతి రోజుల్లో ప్రజ్ఞానంద స్వామిగా ఖ్యాతి గడించారు.

పద్మనాభరావు గారి తొలి అష్టావధానానికి అధ్యక్షత వహించిన అప్పటి వి.ఆర్. కాలేజీ లెక్చరర్ శ్రీ కోట సుబ్రహ్మణ్య శాస్త్రి

అప్పట్లో నెల్లూరు జిల్లా అంతటికీ, వి.ఆర్. కళాశాల, కావలిలో జవహర్ భారతి కళాశాల (1951) డిగ్రీ చదువులకు ఆధారం. దొడ్ల రామచంద్రరెడ్డి దూరదృష్టితో కావలి కళాశాల వృద్ధి చెందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా పని చేసిన కె.వి. గోపాలస్వామి ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహారించారు. అధ్యాపకులుగా యస్. వి. భుజంగరాయశర్మ, కె.వి.రమణారెడ్డి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ ప్రభృతులు విద్యాగంధం విస్తరింపజేశారు.

1965లో నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ముందుచూపుతో విద్యానగర్‌లో (వాకాడు) NBKR డిగ్రీ కల వెలసింది. నేదురుమల్లి జనార్దనరెడ్డి (మాజీ ముఖ్యమంత్రి) ప్రోత్సాహంలో అది దినదినాభివృద్ధి చెందింది. ఈ మూడు కళాశాలలు ప్రైవేటు రంగంలో ముందుకు నడిచాయి.

1966 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కళాశాలలను ప్రభుత్వపరంగా స్థాపించడంలో భాగంగా నెల్లూరు జిల్లాలో విడవలూరు, గూడూరు, కందుకూరులలో ఒకే సంవత్సరం మూడు ప్రభుత్వ కళాశాలలు వెలశాయి. తిక్కవరపు రామిరెడ్డి రెండు లక్షల విరాళంతో కందుకూరు కళాశాల ప్రారంభమైంది. 1967-75 మద్య ఆ కళాశాలలోనే తెలుగుశాఖలో పనిచేస్తే అవకాశం నాకు లభించింది.

ప్రిన్సిపాల్ శ్రీ ఆర్. సుబ్బారెడ్డి, లెక్చరర్ శ్రీ హనుమజ్జానకి రామశర్మ ప్రభృతులతో పద్మనాభరావు గారు

నెల్లూరులో బి.ఇడి కళాశాల పురాతనమైంది. 1955లో స్థాపితం, పాత రోజుల్లో హైస్కూలు అద్యాపకులనుగా తీర్చిదిద్దే వ్యవస్థ ఈ కళాశాలలో ఉండేది. దీనికి అనుబంధంగా ఒక మోడల్ స్కూలు నడిపేవారు. చారిత్రక పరిశోధకులు శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, టి. ఆర్. దీనదయాళ్, యన్. వెంకట స్వామి (తర్వాతి కాలంలో పార్లమెంటు సభ్యులు) ఆ కళాశాల ప్రిన్సిపాళ్లు.

దొడ్ల సుబ్బారెడ్డి దాతృత్వంతో 1964 జూన్ నెలలో దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్థాపించబడింది. కేవలం మహిళలకే ప్రవేశం. 26 ఎకరాల భూమినీ, 3 లక్షల రూపాయల విరాళాన్ని సుబ్బారెడ్డి అందించారు. ప్రస్తుతం ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి గల కళాశాల. పి.జి. కోర్సులు కూడా నడపుతున్నారు. తర్వాత కాలంలో వెలసిన కళాశాలలు ప్రస్తావించడం లేదు.

నెల్లూరు లోని వేద సంస్కృత కళాశాల అతి ప్రాచీనమైనది. శతాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకొంది. ఉడాలి సుబ్బరామ శాస్త్రి, చాలాకాలం ఈ కళాశాల అధ్యక్షులు. వారి కుమారులు ఉడాలి నరసింహ శాస్త్రి, మరి కొంత కాలానికి ప్రిన్సిపాల్ అయ్యారు. ప్రాచ్య విద్యల పట్ల ఆసక్తిని పెంచి ఎందరో తెలుగు పండితులను తయారు చేసింది ఈ కళాశాల.

డా. బెజవాడ గోపాలరెడ్డి ప్రభృతులు

శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ డిగ్రీ కళాశాలలు అన్నీ పని చేశాయి. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 2008లో ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1972లో కావలిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఆరంభమైంది. తర్వాత విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారింది. ఆ విశ్వవిద్యాలయ వైస్ వైన్సలర్ ఆచార్య సి. ఆర్. విశ్వేశ్వరరావు. వారు లోగడ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ ఆచార్యులుగా మూడు దశాబ్దులు బోధించారు.

‘నెల్లూరు నెఱజాణలు’:

ఈ నానుడి ఎప్పటి మాటో తెలియదు. రాజకీయ నెఱజాణలు, స్వాతంత్ర సమరయోధులు ప్రభవించిన ప్రదేశం నెల్లూరు జిల్లా. విక్రమసింహపురి అని నామాంతరం. రాష్ట్రావతరణ కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు పేర జిల్లాకు నామకరణం చేశారు. ఇద్దరు గవర్నర్లు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ జిల్లానుండి పేరెన్నికగన్నారు. 1955లో ఆంధ్ర రాష్ట్రానికి (కర్నూలు) రెండో ముఖ్యమంత్రి డా. బెజవాడ గోపాలరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం వారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి. ఉత్తర ప్రదేశ్ గవర్నరు కె.వి.రఘునాథరెడ్డి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మిక మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలు మూడింటికి గవర్నరు, పరిపాలనాదక్షుడుగా పేరుగాంచిన నేదురుమిల్లి జనార్దనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన వాకాడు నివాసి. శాసనమండలి, శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభలు నాలుగింటిలోనూ సభ్యలు. వీరి సతీమణి రాజ్యలక్షి మంత్రిగా వ్యవహరించారు.

‘కోట’కు చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పలు మార్లు పనిచేశారు. వీరి అగ్రజులు చంద్రశేఖరరెడ్డి జిల్లా పరిషత్ అధ్యక్షులు. రాష్ట్ర శాసనసభ స్పీకరుగా వ్యవహరించిన రేబాల దశరథరామరెడ్డి కోవూరు నుండి గెలిచారు. అక్కడి వాడే అయిన పెళ్లకూరు రామచంద్రారెడ్డి పి.వి.నరసింహారావుకు సన్నిహితులు. ఎం.ఎల్.ఏ.గా; IFFCO చైర్మన్‌గా నియమితులయ్యారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా తోటపల్లి గూడూరు వాస్తవ్యులు వంగల్లు కోదండ రామరెడ్డి ప్రసిద్ధులు.

ఒక కుటుంబం నుండి నలుగురు రాష్ట్రమంత్రులుగా ఉండడం విశేషం. ఆనం కుటుంబీకులైన ఏ.సి. సుబ్బారెడ్డి, ఆనం వెంకరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి (దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి) మంత్రులుగా భిన్న సమయాలలో దక్షులని అనిపించుకొన్నారు. ఆనం వివేకానందరెడ్డి ఎం.ఎల్.ఏ. ఈ కుటుంబాన్ని ఎదుర్కుని జనసంఘ్ పక్షాన అన్నదాత మాధవరావు నెల్లూరు ఎం.ఎల్.ఏ.గా గెలిచారు.

సి.పి.ఐ మార్క్సిస్ట్ పార్టీ జాతీయ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య (1915–85) ఆ పార్టీ వ్యవస్థాపకులు. అలగానిపాడు గ్రామవాసి. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తొలి ప్రతిపక్ష నాయకుడు. 1952-55 మధ్య రాజ్యసభ సభ్యులు.

నెల్లూరు ఆకాశవాణి కేంద్రం శిలాఫలకం వద్ద

ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్ర శాసన సభాపక్ష నాయకులు, కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ (2000-2002), పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార మంత్రిత్వశాఖలు (2014-17) మధ్య నిర్వహించారు. 2017-22 మధ్య ఉపరాష్ట్రపతి.

ఇతర కేంద్ర మంత్రులు:

డా. చింతా మోహన్ – రసాయనాలు, పెట్రోలియం శాఖ మంత్రి. డా. పనబాక లక్ష్మి – ఆరోగ్యశాఖ (2004 – 2009), జౌళి శాఖ (2009-12). తిక్కవరపు సుబ్బరామ రెడ్డి – గనులశాఖ (2006-2008).

ఈ రీతిగా కేంద్రంలోను, రాష్ట్ర స్థాయి లోను పలువురు ఖ్యాతి గడించారు.

లోక్‌సభలో నెల్లూరీయులు:

తొట్టతొలి లోకసభలో స్వతంత్ర అభ్యర్థిగా కావలి నియోకవర్గం నుండి బెజవాడ రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. 1952 నుండి వరుసగా మూడూ పర్యాయాలు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా అనంతపురం వాసి భజన అంజనప్ప నెల్లూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1971లో కాంగ్రెసు పక్షాన ఆత్మకూరుకు చెందిన డి. కామాక్షయ్య దేశంలోనే అత్యంత మెజారిటీ సాధించి గెలిచారు. 1977 లో కూడా ఆయనే గెలిచారు. వారి కుమార్తె వి. రాజేశ్వరమ్మ 1999 లో తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. గరిమిలా ఎన్నికైన వారిని ప్రస్తావించలేదు.

రాజ్యసభలో కూడా పలువురు నెల్లూరీయులు – బెజవాడ పాపిరెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, బి. సుబ్బరామిరెడ్డి ఆ రోజుల్లో ఎన్నికయ్యారు.

ముగ్గురు పద్మవిభూషణులు – ముగ్గురు పద్మభూషణులు:

స్వాతంత్ర్య సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య (1897-1981) గిరిజన గాంధీగా ప్రసిద్ధులు. 21 నెలలు జైలు శిక్ష సహాయనిరాకరణోద్యము సమయంలో అనుభవించారు. నెల్లూరు నియోజక వర్గం నుండి రెండు మార్లు మదరాసు రాష్ట్ర శాసన సభకు ఎన్నికై 1946లో టంగుటూరి ప్రకాశం వద్ద పార్లమెంటరీ కార్యదర్శిగా వున్నారు. 1973లో వీరికి పద్మభూషణ్ లభించింది. మామిడిపూడి వెంకటరంగయ్యకు పద్మభూషణ్ వచ్చింది. నెల్లూరీయుడైన పార్మా దిగ్గజం డా. కె. ఐ. వరప్రసాదరెడ్డికి 2005లో పద్మభూషణ్ లభించింది. 2024 లో ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీనటులు చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ ప్రకటించారు. నేదురుమిల్లి బాలకృష్ణారెడ్డికి సంఘసేవారంగంలో పద్మశ్రీ (1969) వరించింది. సినీ గాయకులు యస్. పి. బాల సుబ్రహ్మణ్యంకు మరణానంతరం 2021లో పద్మవిభూషణ్ లభించింది.

జొన్నవాడ కామాక్షి దేవి మందిరంలో పద్మనాభరావు దంపతులు

నెల్లూరు జిల్లా కలెక్టర్లు:

1906లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆవిర్భవించింది. ఐసిఎస్ అధికారి అయిన జె. జె. కాటన్ దొర 1906-1907 మధ్య జిల్లా కలెక్టరు. తెలుగువారైన మరో ఐసిఎస్ ఆధికారి ఆర్. రామచంద్రరావు 1911-13 మధ్య కలెక్టరు. మదరాసు రాష్ట్రంలో ప్రముఖ పాలనాదక్షులు శొంఠి రామమూర్తి ఈ జిల్లా కలెక్టరు (1921). ఆయన ఐసిఎస్ అధికారి.

స్వాతంత్య్రానంతరం తొలి కలెక్టర్ S.V. అయ్యంగార్ (1947-49). ఆ తర్వాత వచ్చిన కలెక్టర్లలో 1962 – 64 మధ్య పరిపాలన కొనసాగించిన M.V. రాజగోపాల్ టపూలమాలల కలెక్టర్’ గా పేరుబడ్డారు. ఆయన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరక్టరుగా 1951లో పనిచేశారు. ఆంధ్రా యూనివర్శిటీ రిజిస్ట్రారు. 1964-66 మధ్య కలెక్టరుగా నెల్లూరులో పనిచేసిన శ్రవణకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్ళి హోదాకు ఎదిగారు. S. R. శంకరన్ 1968-69 మధ్య ప్రజాసేవా కలెక్టరుగా ప్రశంసలందారు. కె. యల్. రావుగారి కుమార్తె సుజాతారావు 1982-85 మధ్య కలెక్టరు. 1988-92 మధ్య కలెక్టరు కొప్పుల రాజు తర్వాత పదవికి రాజీనామా వేసి కాంగ్రెసు అభ్యర్థిగా లోకసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఇదే గత చరిత్ర.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version