Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-2

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

బుచ్చిరెడ్డిపాళెం (1955-1960)

ఆంధ్రప్రదేశం లోనే బుచ్చిరెడ్డిపాళెం రాజకీయ నాయకులకు ప్రసిద్ధి. సంపన్నల కుటుంబాలు – బెజవాడ, దొడ్ల, మేనకూరు వంశీకులు వున్న ఊరు. అందుకనే ‘రిచ్’రెడ్డి పాలెం అంటాను. 1955లో దొడ్ల లక్ష్మి నరసారెడ్డి దాతృత్వంతో నిర్మించబడిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నేను సెకండ్ ఫారంలో చేరి 1960లో S.S.L.C ప్యాసయ్యాను. నా బాల్యదశ 5 సంవత్సరాలు జ్ఞాపకాలు మధురం. ఆ పాఠశాల స్వర్ణోత్సవాలు అప్పటి ప్రిన్సిపాల్ యం. బి. సుబ్బారావు 1996లో వైభవంగా జరిపారు. పూర్వ విద్యార్థులమైన సి. ఆంజనేయరెడ్డి IPS (డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు); అనంత పద్మనాభరావు (ఆకాశవాణి – విజయవాడ డైరక్టరు) ప్రభృతులను ఆ సందర్భంగా సత్కరించారు. ఆ పాఠశాలలో 1962, 63 సంవత్సరాలలో ముప్పవరపు వెంకయ్యనాయుడు చదివారు. నెల్లూరు జిల్లాపరిషత్ ఛైర్మన్‌గా పనిచేసిన నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి పూర్వ విద్యార్థి. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్స్‌లర్ విశ్వేశ్వర రావు అక్కడి విద్యార్థి, వారి నాన్నగారు రామస్వామిరావు అప్పట్లో హెడ్మాష్టరు. వారి తర్వాత వరదరాజులునాయుడు, చిదంబరం గారలు హెడ్‌మాస్టర్లు. అద్యాపకులలో నేలనూతల గోపాలకృష్ణయ్య, బి.వి. నరసింగం, కొండయ్య, శేషయ్య, రామిరెడ్డి నారాయణరెడ్డి, రాఘవరెడ్డి చిరస్మరణీయులు. అక్కడ ప్రభుత్వ/ ప్రైవేటు డిగ్రీ కళాశాల 1990ల వరకు లేకపోవడం బాధాకరం, పార్లమెంటు సభ్యురాలు మాగుంట పార్వతమ్మ ఆ హైస్కూలు విద్యార్థిని.

నేలనూతల గోపాలకృష్ణయ్య విగ్రహం

రాజకీయ యోధులు:

బుచ్చిరెడ్డిపాళెం 1980లవరకు మేజర్ పంచాయతీ. రాజకీయ భీష్ముడైన బెజవాడ గోపాలరెడ్డి అక్కడ జన్మించారు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం తర్వాత గోపాలరెడ్డి 1953లో ఆ పదవిని అధిష్ఠించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో గోపాలరెడ్డి ఆర్థిక మంత్రి. 1958లో నెహ్రు మంత్రివర్గంలో కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రి అయ్యారు. 1967-72 మద్య ఆయన ఉత్తర ప్రదేశ్ గవర్నరు. సాహిత్య రాజకీయ రంగాలలో సమ ప్రతిభ గలవారు. బుచ్చిలో ఒక సాధారణ మేడ తప్ప ఆయనకు ఎక్కడా ఇల్లు లేదు, గవర్నరుగా రిటైరయ్యే నాటికి. మరో ప్రముఖ రాజకీయ నాయకులు – బెజవాడ రామచంద్రరెడ్డి (1894 – 1972). వీరిది జమీందారీ కుటుంబం. ఆయన జస్టిస్ పార్టీకి నాయకత్వం వహించారు. 1924లోనే మదరాసు రాష్ట్ర శాసనసభ సభ్యులు. 1930-37 మధ్య మదరాసు శాసనమండలి అధ్యక్షులు. 1952లో నెల్లూరు నియోకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా తొలి పార్లమెంటు సభ్యులు. స్వతంత్ర పార్టీ అద్యక్షులు అయ్యారు (1959). ‘స్వతంత్ర’ పత్రిక సంపాదకులు. వీరి కుమారులు బెజవాడ పాపిరెడ్డి. ఆయన చట్ట సభలు నాల్గింటిలోను సభ్యులు (MLC, MLA, రాజ్యసభ, లోక్‌సభలో సభ్యులు). తెలుగు దేశం పార్టీ తొలి ఉపాధ్యక్షులు,

బుచ్చిరెడ్డిపాళెంలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగేవి. దొడ్ల – మేనకూరు వంశీకుల మధ్య తీవ్ర పోరాటం కొనసాగేది. జిల్లా పరిషత్ ఎన్నిక్లలో బుచ్చిరెడ్డిపాళెం నుండి మేనకూరు గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. సమితి ప్రెసిడెంటుగా (బుచ్చి) వారి తమ్ముడు బాలకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. కనిగిరి రిజర్వాయరు ఈ ప్రాంత వ్యవసాయానికి జీవనాదారం. ముక్కారు పంటలు పండేవి.

1962 సార్వత్రిక ఎన్నికలలో సోదరతుల్యులైన బెజవాడ రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కావలి లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశారు. కాంగ్రెసు పార్టీ పక్షాన 1 లక్షా 67 వేల ఓట్ల తో గోపాలరెడ్డి గెలిచారు. మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.

200 ఏళ్లనాటి భవనం:

బుచ్చిరెడ్డిపాళెంలో కోదండరామస్వామి ఆలయ అర్చకులైన లక్ష్మణాచార్యుల వారి విశాలభవనం 1950ల నాటికి 100 సంవత్సరాల చరిత్ర గలది. 2025 నాటికి కూడా ఆ భవనం చెక్కు చెదరలేదు; ఆ భవనంలో ‘యమగోల’ సినిమా షూటింగు జరిగింది, టి.వి. సీరియళ్లలో కూడా కన్పించింది. ప్రస్తుతం ఆలయ పేష్కార్ అనంతాచార్యులు ఆ పురాతన శిథిల భవనాలలో నివసిస్తున్నారు. అధునాతన రీతులతో ఆ భవననిర్మాణం కొయ్యతో చేశారు.

సినీ ప్రముఖులు:

పొన్నలూరి బ్రదర్స్ పేర పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా 1959లో ‘దైవబలం’ చిత్రం నిర్మించారు. శోభన్ బాబుకు అది తొలి చిత్తం, ఈస్ట్‌మన్ కలర్ చిత్రంలో యన్.టి. రామారావు, జయశ్రీ నటించారు. ఆ బ్యానర్ మీద ‘శోభ’ చిత్రం కూడా విడుదలైంది. 1960లో ఇదే వసంతకుమార రెడ్డి ‘కాడెద్దులు ఎకరా నేల’ వెలువడింది. ఆ చిత్రం పూర్తి అయ్యే సమయానికి ఆ రెడ్డిగారికి ఎకరం నేల మిగిలిందనే ఛలోక్తి కూడా ప్రచారంలో వుంది.

‘బుచ్చి’ గా పిలవబడే బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి సమీపంలో ఇసుకపాళెం గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన శంకరరెడ్డి ‘లవకుశ’ చిత్రం 1963లో నిర్మించారు. అది హిట్ అయింది. సి. పుల్లయ్య, సి.ఎస్.రావులు దర్శకులు. తంగిరాల ప్రభాకర్ దానికి ‘ఆర్ట్’ సమకూర్చారు. రంగస్థల నటుడిగా స్త్రీపాత్రదారణకు ప్రసిద్ధికెక్కిన రేబాల రమణ బుచ్చి గ్రామానికి చెందినవాడే. గిరిజా టాకీసు ఒక్కటే సినిమా హాలు ఆ రోజుల్లో.

వాకాటి పెంచలరెడ్డి అనే కవి ఈ ప్రాంతంలో 1950వ దశకంలో సుప్రసిద్ధ కవి. అన్నారెడ్డిపాళెం గ్రామంలో యోగి రామయ్య ఆశ్రమం పురాతనం. ఈ ఆశ్రమానికి 2010 ప్రాంతంలో ‘ప్రజ్ఞానంద స్వామి’గా పేరుగాంచిన స్వామిజీ సారథ్యం వహించి కాలం చేశారు. వీరు లోగడ నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో 1960 లలో బాటనీ లెక్చరర్‌గా పాఠాలు దశాబ్దికి పైగా పాఠాలు చెప్పారు. తర్వాత సన్యసించి ‘PROTO PLASAM’ అనే పేర ఋషీకేశ్‌ఓ యోగాభ్యాసం చేసి ఎందరినో యోగా శిష్యులను తయారు చేశారు.

 

యోగి రామయ్య ఆశ్రమం:

యోగి రామయ్య అరుణాచల రమణమహర్షి శిష్యులు, పెద్దగా చదువుకోలేదు. అన్నారెడ్డి పాళెం గ్రామానికి చెందిన రామిరెడ్డికి విద్యాభ్యాసం పెద్దగా లేదు. సంపన్న కుటుంబంలో జన్మించారు. 18వ ఏట ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడింది. ఒక బ్రాహ్మణ గురువు ఆయనకు రామతారక మంత్రం ఉపదేశించి 5వేల సార్లు జపించమని చెప్పారు. “ఒక వేళ ఆ సంఖ్య మించితే?” అని అడిగాడు కుర్రవాడు. “శుభం” అన్నాడు గురువు. “నిరంతరం అదే జపిస్తే ఏమవుతుంది?” అని ప్రశ్నించాడు శిష్యడు. గురువు యొక్క ఆశర్వాదం లభించింది. రాత్రింబగళ్లు రామ నామ జపంలోనే నిమగ్నమయ్యాడు. కొంతకాలానికి వైరాగ్యభావం కలిగి ఉత్తరదేశంలోని కాశి తదితర ప్రదేశాలు సందర్శించాడు.

ఒకనాడు గురువుగారు శిష్యుని సందర్శించి “నీ మాతృమూర్తి అనుజ్ఞ పొంది నీ గ్రామంలోని నీ తోటలోనే తపస్సు చేసుకో” అని ఉపదేశించారు. శిరసావహించిన శిష్యుడు తపోనిష్ఠలో ఎన్నో అనుభూతులు పొందాడు. జీవాత్మకు పరమాత్మను తేడా తెలుసుకోవాలనే తపనతో 1923లో  అరుణాచలమలైలోని రమణాశ్రమం వెళ్ళాడు. అక్కడ కావ్యకంఠ గణపతి మునిని తన సందేశం నివృత్తి చేయమని కోరారి. అక్కడ రమణ మహర్షి మౌనంలో ప్రశాంతత ఆయనకు సమాధానంగా లభించింది. తిరిగి అన్నారెడ్డిపాళెంలో తన తోటలో నివసించి ధ్యాననిష్ఠలో నిలిచేవాడు. తరచూ రమణాశ్రమం వెళ్లి వచ్చేవాడు.

రమణమహర్షి యోగి రామయ్య కోసం ఉపదేశ సారాన్ని తమిళం నుండి తెలుగులోకి అనువదించారు. 1922లో అన్నారెడ్డిపాళెంలో యోగి రామయ్య తన ఆశ్రమం ప్రారంభించారు. అక్కడే రామయోగి సమాధి అయ్యారు.

ప్రజ్ఞానంద గొప్ప తపస్వి. 1952 నుండి 1962 వరకు ఆయన యోగి రామయ్య శిష్యరికం చేశారు. 1992లో ప్రజ్ఞానందస్వామి ఉత్తర కాశీలో గుహలో సాధన చేసి తృప్తి చెందారు. ఋషీకేశ్‌లో నిర్వాణాశమంలో యోగా క్లాసులు, క్యాంపులు నిర్వహించారు. ఆ తర్వాత బెంగుళూరులో S-VYASA యోగ విశ్వవిద్యాలయం సాధకులకు యోగ తరగతులు జరిపారు. రామయోగి ఆశ్రమంలోనే వారు కాలధర్మం చెందారు. ఈ విధంగా బుచ్చిరెడ్డిపాళెం పరిసరాలు ఆధ్యాత్మిక సంపదకు నిలయమ్ములు. 2013లో శ్రీ ప్రజ్ఞానంద స్మారకంగా ‘వందే కృష్ణ ఫౌండేషన్’ స్థాపించబడింది.

‘బుచ్చి’ కోదండరామస్వామి దేవాలయం:

1765 సంవత్సరంలో బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెంచిన దొడ్ల రామిరెడ్డి శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. ఆయనను ‘బంగారు రామిరెడ్డి’ అని పిలిచేవారు. 1784 లో గాని ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. ఒకే కుటుంబం దాతృత్వంతో ఈ ఆలయం నిర్మించబడింది. ఇప్పటికీ వంశపారంపర్య ధర్మకర్తగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆ కుటుంబసభ్యులే ఆలయ నిర్వహణ చేస్తున్నారు. ప్రస్తుతం దొడ్ల మురళీకృష్ణారెడ్డి ధర్మకర్త. ప్రతి ఏటా శ్రీరామనవమితో మొదలుపెట్టి నవాహ్నిక బ్రహ్మత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

విశాలమైన స్వామి పుష్కరిణికి, ఎత్తైన రథం ప్రత్యేక ఆకర్షణ. కోనేటిలో తెప్పోత్సవాలలో తెప్పలపై రామలక్ష్మణులు విహరిస్తారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించబడింది. ముఖద్వారానికి ఎదురుగా అంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాలనుండి భక్తులు విచ్చేస్తారు.

 

రామిరెడ్డికి స్వప్నంలో శ్రీరామచంద్రుడు కనిపించి ఆలయ నిర్మాణం చేయనని చెప్పినట్లు ఐతిహ్యం. వంద అడుగుల ఎత్తువ రాజుగోపురం సుదూర ప్రాంతాల వారికి కూడా కనిపిస్తుంది. ఏడు అంతస్తులు, 9 కలశాలతో శిల్పకళాశోభతో ఆకర్షణీయంగా వుంటుంది. పురాణేతిహాసాలలోని ప్రసిద్ధి ఘట్టాలను ఈ గోపురంపై శిల్పులు చెక్కారు. సువిశాలమైన ప్రాకారము ముఖపండపం శిల్పశోభితం.

50 అడుగుల ధ్వజస్తంభం. ప్రాకార మండపం విశిష్టం. అంతా రాతి కట్టడం. రాతిస్తంభాలకు చేతనత్వం కల్పించారు శిల్పులు, అంతరాలయములో రాఘవుడు కోదండరాముడిగా దర్శనమిస్తాడు. కుడివైపున సీతాదేవి, ఎడమన లక్ష్మణ స్వామి కొలువై ఉండి మోక్ష ప్రాప్తితో బాటు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. నిత్యపూజాది కైంకర్యాలు శ్రద్ధాభక్తులతో అర్చకస్వాములు కొనసాగిస్తున్నారు. స్నపన బేరానికి నిత్యాభిషేకం చేస్తారు. లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆండాళ్ దేవి, లక్ష్మీదేవి విగ్రహాలు విడిగా ఉన్నాయి. వరదరాజస్వామి సన్నిధి ప్రత్యేకం. ముకుళిత హస్తాలలో ఉన్న హనుమంతుని ఆలయం ఎదురుగా వుంది.

ఈ విధంగా ఆ తరం నాటి బుచ్చిరెడ్డిపాళెం మధురస్మృతులు రమణీయం, కమనీయం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version