[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
తరాల అంతరం:
1938లో మదరాసు నుండి తొలి తెలుగు ప్రసారాలు ఆరంభం.
1948 డిసెంబరు 1న విజయవాడ కేంద్ర ఆవిర్భావం. 1975 జూన్ నుండి కడప, విశాఖపట్టణం కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రసారాలు మొదలెట్టాయి. సారాంశంగా 1938 నుండి 1975 దాకా దాదాపు నాలుగు దశాబ్దులు తొలి తరం. 1975 నుండి 2005 వరకు మూడు దశాబ్దులు ఆధునిక తరం (మా తరం) అని వింగడిస్తున్నాను. ఈ కాలంలో ప్రతిభావంతులైన వ్యక్తులు శ్రవ్యమాధ్యమంలో రిక్రూట్ అయ్యారు. దృశ్యమాధ్యమం బీజావాపన జరిగి కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో మదరాసు, హైదరాబాదు, విజయవాడ, కడప, విశాఖపట్టణ కేంద్రాల ప్రసారరథ సారథులలో ప్రముఖులను ప్రస్తావించే ప్రయత్నమిది. అధిక శాతం మందిని కలిపితే అది ‘ఓటర్ల లిస్టు’ అవుతుందని భయం.
హైదరాబాదు కేంద్ర అతిరథ మహారథులు:
స్టేషన్ డైరక్టర్లుగా లీలా బవ్‌డేకర్, జి.సెల్వం, గణేశన్ వంటి ఆంధ్రేతరులున్నారు. ఆ తర్వాత వి.వి.శాస్త్రి (1992-94). కబీర్ అహమ్మద్ (1994-99), శ్రీమతి దుర్గా భాస్కర్ (1999-2005), పి.యస్. గోపాలకృష్ణ (2005-2009), యం.ఆదిత్యప్రసాద్ (2012-2014), వి. ఉదయ శంకర్ (2014-2019), శ్రీమతి శైలజా సుమన్ (2019-2021) డైరక్టర్లు. హైదరాబాదు కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాల కేంద్రాలను సమన్వయం చేసింది. జిల్లా కేంద్రాలు కూడా 1990లోనే ఆరంభమయ్యాయి. 1986లో ఆదిలాబాదు, 1989లో కొత్తగూడెం, 1990లో నిజామాబాద్, వరంగల్ కేంద్రాలు వెలశాయి. 1991లో అనంతపురం, తిరుపతి, 1992లో కర్నూలు, 1993లో మార్కాపురం ప్రసారాలు మొదలుపెట్టాయి, జిల్లా కళాకారులకు అవకాశాలు హెచ్చాయి.
1977లో కడప స్టూడియోలో, అప్పటి ఎపి నాటక అకాడమీ అధ్యక్షురాలు జమునగారితో
హైదరాబాదు కేంద్ర కార్యక్రమ రూపశిల్పులలో అఖండ ఖ్యాతిని ఆర్జించిన వ్యక్తి – మాతో కలిసి పని చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత – రావూరి భరద్వాజ. అంతకుముందు మదరాసు కేంద్ర ప్రొడ్యూసర్ అఖిలన్‌కు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సైన్సు రచయిత డా. కె.బి. గోపాలం 1993లో చేరారు. ఆర్. విశ్వనాథం, యన్.సి. గోవర్ధన్, యమ్.సి. నరసింహచార్యలు, బి.జి.యస్. రావు, చల్లా ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, వై. రాఘవులు, పి. పాండురంగారావు, కె. వి. హనుమంతరావు, వై. హనుమంతరావు, జీడిగుంట రామచంద్రమూర్తి, సుధామ, ఉషారాణి దంపతులు.. కలగా కృష్ణమోహన్, శేషం రామాచార్యులు, మంత్రవాది మహేశ్వర్, వసుమతి దంపతులు, శైలజా మూర్తి, యస్. అనంతపద్మనాభరావు, రాంబాబు, విజయరాఘవరెడ్డి సత్యనారాయణ, కృష్ణమాచారి, పరిమళ, ఏ.బి. రావు చౌదరి, పి.వి. శారద, వినయమణి, డా.కె. విజయ, పి.వి. శారద.. ఇదో చైతన్య రథయాత్ర. తమ ప్రతిభావ్యుత్పత్తుల చేత శ్రవ్యమాధ్యమాన్ని శ్రోతలకు చేరువ చేసిన సంకల్పయాత్ర.
అనౌన్సర్లుగా ప్రతిభామూర్తులు శ్రోతల మెప్పు పొందారు. రతన్ ప్రసాద్ రేడియో చిన్నక్కగా గుర్తింపు పొందారు. పండా శమంతకమణి, జ్యోత్స్న, ఇలియాస్ అహమ్మద్ దంపతులు, వట్టం సత్యనారాయణ, మట్టపల్లి రావు, గోపి, కపర్ది, ఇందిర, ఉమాపతి బాలాంజనేయశర్మ, ఇందిరా బెనర్జీ, రాజ గోపాల్, ఈతరం అమృతం అయినంపూడి శ్రీలక్ష్మి – వీరంతా స్వర సుధాకరులు. మడిపల్లి దక్షిణామూర్తి, అంబటిపూడి మురళీకృష్ణ విశిష్టులు.
హైదరాబాదు కేంద్ర వార్తా విభాగంలో పలువురు పేరు గడించారు. ఆ తరం వారిలో తురగా కృష్ణమోహన్ దురదృష్టవశాత్తు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రథమ ప్రయాణ సందర్భంగా ప్రమాదానికి గురై చనిపోయారు. వారి సతీమణి జానకీరాణి, కుమార్తె న్యూస్ రీడర్ ఉషారమణి. ఢిల్లీ వార్తలు చదివిన అద్దంకి మన్నార్ కుమారుడు అద్దంకి రామకుమార్.
పన్నాల రంగనాథరావు, కొత్తపల్లి సుబ్రమణ్యం, జి.నళినీమోహన్ – జె.బి. రాజు, రామచంద్రరావు, నర్రావూరి సుబ్బారావు, మల్లాది రామారావు, ఆర్. సి. ఆర్. కృష్ణారావు, ఆకిరి రామకృష్ణారావు, సుజాత అలీ, అశోక్ రావు, యం.వి.యస్. ప్రసాద్, లక్ష్మి వార్తా విభాగ దర్శకులు, దివి వెంకట్రామయ్య, జ్యోత్న వార్తలందించిన ఘనులు, ఆకాశవాణి వార్తలకు నిబద్ధత వుందని ఋజువు చేశారు.
1988లో కొత్తగూడెం కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా అప్పటి కేంద్ర పారిశ్రామిక శాఖామాత్యులు జలగం వెంగళరావు గారితో
మదరాసు కేంద్రం:
1938 జూన్‌లో తెలుగు ప్రసారాలు ప్రారంభించిన రేడియో తాతయ్య మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (సోమశేఖర శర్మ సోదరులు). అక్కడ కార్యక్రమ రూపశిల్పులు – యస్. యన్. మూర్తి, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట జానకీరామ్, రజనీకాంతరావు, బుచ్చిబాబు, ప్రయాగ నరసింహశాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, గుర్రం జాషువా తొలి తరం వ్యక్తులు. మలి తరం అతిరథులలో యస్. వేణుగోపాలరెడ్డి అగ్రగణ్యులు. శంకరనారాయణ (బాపు సోదరులు), వి. చంద్రమాళి, దుర్గా భాస్కర్, గొల్లపూడి మారుతీరావు, వింజమూరి లక్ష్మి; కలివేలు, వార్తా విభాగం. డి. ఆంజనేయులు కార్యక్రమ నిర్వాహకులు. జనమంచి రామకృష్ణ, యం.యమ్. శ్రీరామ్ (సినీ నిర్మాత) మదరాసు కేంద్ర దివిటీలు.
కనకదుర్గ కాలి అందెలు (విజయవాడ కేంద్ర నిర్వాహకులు):
ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయవాడ. సాహిత్య సాంస్కృతిక సంగీత కళావైభవాలను తెలుగువారికి చవిచూపిన ఘనత ఆకాశవాణిది. విజయవాడ అనగానే ఋషితుల్యులు రజనీకాంతరావు గుర్తుకు వస్తారు. శతవసంతాల యుగపురుషుడుడాయన. ధర్మసందేహాలతో భారత భాగవత రామాయణాలను కంచు కంఠంతో వినిపించి శ్రోతలను ముగ్ధులను చేసిన ఉషశ్రీ ఇక్కడివారు. అమరావతి కథల అపురూప సంపద నందించినవారు శంకరమంచి సత్యం. రేడియో నాటకాలతో శ్రోతలను అలరించిన ఘనులు నండూరి సుబ్బారావు, డి.రామమోహనరావు. వీరి మార్గదర్శి బందా కనకలింగేశ్వరరావు. సూక్తి ముక్తావళికి సుందరతను చేకూర్చిన పింగళి లక్ష్మీకాంతం ప్రవచన గురువు. కర్ణాటక హిందూస్తానీ సంగీతాల ఘనాపాఠి – వోలేటి వేంకటేశ్వర్లు. వారి సరసన సంగీతవిభావరులు సృష్టించిన శతవర్ష చిరంజీవి అన్నవరపు రామస్వామి, దండమూడి రామమోహనరావు, యన్.సి. హెచ్. కృష్ణమాచార్యులు, జగన్నాథాచార్య సోదరులు, శ్రీరంగం గోపాలరత్నం, వి. బి కనకదుర్గ, సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఎల్లా వెంకటేశ్వరరావు, అంపోలు మురళీకృష్ణ, క్రొవ్విడి సీతారాం, రామవరపు సుబ్బారావు ప్రభృతులు చిరస్మరణీయులు. అదివో అల్లదివో హరివాసము అని లలిత గీతాలను స్వరపరచిన మల్లిక్ ఇక్కడ వారు. మల్లాది సూరిబాబు తనయులు మల్లాది సోదరులు అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అఖండ ప్రతిభాసంపన్నులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక్కడ కొలువుతీరారు. సాహితీలత ‘లత’; ‘శంకరాభరణం శ్రీగోపాల్, సుత్తి వీరభద్రరావులు ప్రముఖులు,
వింజమూరి శివరామారావు, వినోదాల వీరయ్య, ప్రయాగ నరసింహ శాస్త్రి, జరుక్ శాస్త్రి, జి.వి.కృష్ణారావు, రాచకొండ నరసింహమూర్తి, గుమ్మలూరి సత్యనారాయ విజయవాడ కేంద్ర జయ పతాకలు. పన్నాల సుబ్రమణ్యభట్టు చెణుకులు విసిరారు.
డైరక్టర్లుగా పి.శ్రీనివాసన్, పి.ఆర్.రెడ్డి, జె. కులకర్ణి. పి.యు.అము, అనంతపద్మనాభరావు, దుర్గా భాస్కర్, ప్రయాగ వేదవతి, ఆదిత్య ప్రసాద్, యం. కృష్ణకుమారి దిశానిర్దేశకులు. శ్రీరంగం గోపాలరత్నం, సంధ్యావందనం శ్రీనివాసరావు, కౌతా ప్రియంవద, విష్ణుభొట్ల సోదరీమణులు, వింజమూరు లక్ష్మి సంగీత సారథులు,
ఆమంచర్ల గోపాలరావు, కందుకూరి రామభద్రరావు పేరెన్నికగన్న ప్రముఖులు. స్వర సుధాకరులు – ఏ.బి. ఆనంద్, వాసుదేవమూర్తి యస్. బి. శ్రీరామమూర్తి (జాతీయ రూపక శిల్పి), విజయకుమారి, కృష్ణశాస్త్రి, మాడుగుల రామకృష్ణ, కామేశ్వరి, జయప్రకాష్, శారద సుపరిచితులు.
2002లో తన పుస్తకావిష్కరణ సభలో శ్రీ అరుణ్ జైట్లీతో రచయిత
తెలుగు నేల నాలుగు చెరగులా..
ఆకాశవాణి విశాఖపట్టణం, కడప తదితర కేంద్రాల ప్రసార రథ సారథుల గమనాన్ని స్పృశించకపోతే ఆకాశం వెలవెలబోతుందని భయం. విశాఖపట్టణ కేంద్రానికి దిశానిర్దేశం చేసిన ప్రాచీనులలో రతన్ సింగ్, నోరిన్ నక్వీ ఔత్తరాహులు. విజయలక్ష్మీ సౌందరరాజన్, దేవళ్ల బాలకృష్ణ, దుర్గా భాస్కర్, డి. ప్రసాదరావు, వై గంగిరెడ్డి ఆధునిక తర వారసులు. ప్రాచీనులలో ఏ. యస్.యన్. మూర్తి, యన్. రమణమ్మ తొలి తరం. కాకరపర్తి సత్యనారాయణ సుప్రతిష్ఠితులు.
విజయభాస్కర శర్మ ప్రసంగశాఖ ప్రయోక్త. రాజభూషణరావు, సూర్యనారాయణ, సలాది కనకారావు కార్యక్రమ రూపశిల్పులు.
కడప కేంద్ర తొలి సారథి బి. ఆర్. రెడ్డి. ఆ తర్వాత రథ చోదకులు – జి.కె. మరార్, పి. ఆర్. రెడ్డి, గంగిరెడ్డి, అనంతపద్మనాభరావు, మాచిరెడ్డి, ఆరవేటి శ్రీనివాసులు, సుమన్ విశిష్టులు.
ఆదిలాబాదు కేంద్రం 1983లో ప్రారంభమైన వేళ సి.రాజగోపాల్ నియమితులయ్మారు. కొత్తగూడెం కేంద్ర ప్రారంభకులు ఆర్. అనంత పద్మనాభరావు (1989). నిజామాబాద్‌కు నిత్యానందరావు దిశానిర్దేశకులు పాండురంగారావు తర్వాత చేయూత. వరంగల్ కాకతీయ సామ్రాజ్య దీపకులు పి.ఆర్.రెడ్డి; ఆర్. వెంకటేశ్వర్లు (తొలి తెలుగు డైరక్టరు జనరల్), పి. మధుసూదనరావు, మంగళగిరి ఆదిత్య ప్రసాద్.
అనంతపురం కేంద్రానికి ఆద్యులు అనంతపద్మనాభరావు (1991). తిరుమలేశుని సేవించే తిరుపతి కేంద్ర వైభవ దీప్తి వి. వి. శాస్త్రి. తరువాత హైదరాబాదు డైరక్టరు. కర్నూలుకు గోవర్ధన్, మార్కాపురానికి వై. హనుమంతరావు తెలుగు దివ్వెలు.
అప్పటి రాష్ట్రపతి శ్రీ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారితో ఓ కార్యక్రమంలో వేదికపై రచయిత
తెర మరుగున స్వరసుధాకరులు (అనౌన్సర్లు) మూడు దశాబ్దులు పనిచేసిన విశిష్ట వ్యక్తులు. వారిని స్మరించడం ధర్మం – ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి దంపతులు, రూప్‌లాల్, పుష్పలత (హైదరాబాదు); కూచిమంచి కుటుంబరావు, వాసుదేవమూర్తి, లత, శ్యామసుందరి, కమలకుమారి, పేరి కామేశ్వరరావు, కోకా సంజీవరావు, వెంపటి రాధాకృష్ణ, లింగరాజు శర్మ, సి. రామమోహనరావు, సీతారత్నమ్మ (విజయవాడ) ప్రసిద్ధులు. ఈ చిరస్మరణీయులలో ఎందరినో మరచిపోవడం స్థలాభావమే. శ్రోతల మనః ఫలకాలపై వారంతా పెద్దపీట వేసుకున్న మహనీయులు. నేను క్షంతవ్యుడను.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
